కథ

ఇంతేనా ఈ జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక బహుమతి రూ.2,000
పొందిన కథ
---

‘జానకీ! మంచినీళ్లివ్వు’ అంటూ లోపలికి వచ్చి నీరసంగా కుర్చీలో వాలాడు ఆనంద్.
టీవీలో సీరియల్ చూస్తున్న జానకి గభాల్న లేచి లోపలికి వెళ్లి చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చింది.
ఆయన తాగిందాకా ఉండి ఖాళీ గ్లాసు తీసుకుని రెండు క్షణాలు ఆయన వైపు చూసి వౌనంగా అక్కడి నుంచి కదిలి వంట గదిలోకి వెళ్లిపోయి కాఫీ కలపసాగింది జానకి.
ఈ మధ్య ప్రతిరోజూ ఆనంద్ అలాగే నీరసంగా వస్తున్నాడు. ఆ విషయం గమనిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయత.
అరవై ఏళ్లు వచ్చిందాకా సర్వీసు చేసి, బాధ్యతలు పూర్తి చేసుకున్నా ఇంకా ఆయన ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేయాల్సి రావడం విషాదం... ఇలాంటి విషాదం ఇంకోటి ఉందా అనిపిస్తుంటుంది ఆవిడకి.
కాఫీ కలిపి తీసుకొచ్చి ‘కాఫీ తీసుకోండి’ అంది. ఆనంద్ కళ్లు తెరిచి కాఫీ కప్పు అందుకున్నాడు.
ఆవిడ టీవీ వాల్యూమ్ తగ్గించి కుర్చీ ఆయన దగ్గరగా జరుపుకుని కూర్చుంది. ఆయన కళ్లు వాల్చుకుని కాఫీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు.
ఆయన ఆలోచిస్తున్నాడని తెలిసి ఏం ఆలోచిస్తున్నారు అని అడగాలనిపించినా అడగలేదు. కారణం ఆవిడకి తెలుసు కనుక.
ఆయనైనా, ఆవిడైనా ఆలోచించేది ఒకటే... ఈ జీవితం ఇంతేనా? సమాధానం లేని ప్రశ్న అయినా ఆ ప్రశ్న వాళ్ల గుండెల్లోంచి పదేపదే ఓ బుల్లెట్‌లా దూసుకురావడం మాత్రం మానదు...
ఖాళీ కప్పు భార్య చేతికిచ్చి తిరిగి వెనక్కి వాలుతూ అన్నాడు ‘నీరసంగా ఉంది జానకీ’
జానక్కి బాధగా అనిపించింది. దుఃఖం కూడా వచ్చింది కానీ, ఏం మాట్లాడకుండా వౌనంగా ఉండిపోయింది.
ఉద్యోగం మానేయండి అనాలనిపిస్తుంది.. మానేసి ఏం చేయను? అప్పెలా తీర్చను అని ఆయన నవ్వే నవ్వు గుర్తొస్తోంది. ఆ నవ్వు ఆవిడ చూడలేదు.. చూసి సహించలేదు. నిజమే అప్పెలా తీరుతుంది?
ఒకటి కాదు, రెండు కాదు పదిహేను లక్షలు.
ఉన్న ఇద్దరాడపిల్లల్ని పెద్ద చదువులు చదివించాలన్నది ఆయన ఆశయం... అందుకే ఇద్దరినీ బి.టెక్ చదివించాడు.
ఎంఎస్ చేస్తే కానీ, అమెరికాలో మంచి జాబ్ రాదు ఎంహ్ చేస్తామంటే వాళ్లకి ఉద్యోగాలు వచ్చాక తీర్చుకునే కండిషన్ మీద బ్యాంకు రుణం తీసుకుని మరీ అమెరికా పంపించాడు.
ఎంఎస్ అయిపోయిన రెండేళ్ల దాకా ఇద్దరికీ మంచి ఉద్యోగాలు దొరకలేదు. తండ్రిగా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా ష్యూరిటీ ఇచ్చినందుకు వడ్డీ కడుతూ వచ్చాడు.
ఈలోగా గ్రీన్ కార్డ్ ఉన్న కుర్రాడిని పెళ్లి చేసుకుంటే అక్కడ సెటిల్ అవచ్చని ఆయనకి నచ్చజెప్పి వాళ్లు ప్రేమించిన కుర్రాళ్లనే పెళ్లి చేసుకుంటామంటే ఇద్దరికీ ఏడాది తేడాతో ఇంటి మీద లోన్ తీసుకుని ఘనంగా పెళ్లి చేశాడు.
అనుకున్నట్టే పెద్దమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య అనుకున్నాడు. ఆ పిల్ల కోసం చేసిన అప్పు తనే తీర్చుకుంటుందిలే అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.. కానీ తనది కాంట్రాక్ట్ ఉద్యోగం అనీ, క్లయింట్ కమిషన్ పోగా చాలా తక్కువ చేతికి వస్తుందని, మంచి ఉద్యోగం వచ్చాక తీరుస్తాను అంది.
మరి కొంతకాలానికి చిన్నమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చింది. అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగమే రావడంతో పెద్దమ్మాయి పాడిన పాటే పాడింది.
ఆనంద్‌కి రిటైర్‌మెంట్ వయసు దగ్గరకు వస్తుంటే టెన్షన్ పెరిగిపోసాగింది. వాళ్ల చదువు కోసం చేసిన అప్పు, ఇంటి మీద పెళ్లిళ్లకు చేసిన అప్పు వడ్డీ కడుతున్నా ఎక్కడా తరుగుతున్న ఆనవాలు కనపడలేదు. ఐదేళ్లు దాటినా ఎంత అప్పు తీసుకున్నాడో అంతా అలాగే కనిపిస్తోంది.
రోజులు గడిచిపోతున్నా ఇద్దరిలో ఎవరూ కూడా వాళ్ల చదువుల కోసం తీసుకున్న బ్యాంకు రుణం గురించి మాట వరసకు కూడా ప్రస్తావన తీసుకురాకపోవడం ఆనంద్‌కి బాధకన్నా, ఆశ్చర్యాన్ని కలుగజేయసాగింది. చూసిచూసి తనే ఓసారి గుర్తు చేశాడు ‘ఏమ్మా మీ చదువుల కోసం చేసిన అప్పు తీర్చాలి గుర్తుందా? నేను వడ్డీ కడుతున్నాను ప్రతినెలా!’
‘తీరుద్దాం నాన్నా. ఏంటో మా సంపాదనంతా టాక్సులు కట్టడానికి, క్రెడిట్ కార్డు కట్టడానికి సరిపోతోంది. జీతాలు సరిపోవడం లేదు. అందుకే ఇంకా ఫ్యామిలీ కూడా ప్లాన్ చేసుకోలేదు’ అంది పెద్దమ్మాయి.
దాదాపు చిన్న కూతురు కూడా అదే అంది. అవునేమో దేశం కాని దేశంలో వాళ్ల సమస్యలేంటో నాకేం తెలుసు అనుకున్నాడు.
సరేలే ముందు అప్పు తీర్చేస్తే తరువాత సంగతి వాళ్లే చూసుకుంటారు. లేకపోతే ఈ వడ్డీ చక్రవడ్డీ అయి అసలుని మించిపోయేలా ఉంది అనుకుంటూ ఇల్లమ్మి వచ్చిన డబ్బుతో రెండు అప్పులు తీర్చేశాడు. మరి కొంత అప్పు ఉన్నా దాదాపు తీరిపోడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
అప్పు తీరింది... అద్దె ఇంట్లో బతకాల్సి వచ్చిన దురదృష్టానికి అసంతృప్తి మిగిలింది. అయినా కూతుళ్లు తనకి ఇల్లు కొనిస్తారన్న ఆశ, నమ్మకం ఆయన్ని వదలలేదు. ఈలోగా రిటైర్ అయిపోయాడు.
ఆ సందర్భంగా కూతుళ్లు, అల్లుళ్లు వచ్చారు అమెరికా నించి. ఆడంబరంగా పెద్దఎత్తున షష్టిపూర్తి, రిటైర్‌మెంట్ ఫంక్షన్ చేశారు. తల్లిదండ్రులకి ఖరీదైన బట్టలు, బంగారు ఉంగరాలు కొనిచ్చారు.
బంధుమిత్రులంతా అదృష్టవంతుడివోయ్ పిల్లలు రత్నాలు అన్నారు. పొంగిపోయాడు. నా పిల్లలు నిజంగానే రత్నాలు అనుకున్నాడు.
పది రోజుల్లో ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతూ ఇద్దరమ్మాయిలు తండ్రితో చిరాగ్గా అన్నారు. ‘ఇదేం ఇల్లు నాన్నా. అసలు బాగాలేదు. పాత ఇల్లు... ఈ బాత్రూమ్‌లేంటి? ఈ పెచ్చులూడిపోతున్న గోడలేంటి? ఇలాంటి ఇంట్లో ఉండడం ఏంటి అసహ్యంగా. ఇల్లు మారండి. మంచి ఫ్లాట్‌లోకి వెళ్లండి’
నిజమే అమెరికా పిల్లలుండే ఇల్లు కాదు.. అమెరికా పిల్లల తల్లిదండ్రులంటే ఇల్లు అంతకన్నా కాదు అనుకున్నాడు. ఇంత బతుకు బతికీ ఇంటెనకాల చచ్చినట్టు గెజిటెడ్ ఆఫీసర్‌గా రిటైర్ అయి, పైగా పుట్టిన దగ్గర్నించీ ఏనాడూ అద్దె ఇంట్లో ఉండని ఆనంద్‌కి ఇప్పుడు ఇలాంటి అద్దె ఇంట్లో ఉండడం నామోషీగా అనిపించింది. వెంటనే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌లో రుణ శేషం పోగా మిగిలిన పాతిక లక్షలకి పెన్షన్ మీద మరో పదిహేను లక్షలు అప్పు చేసి రెండూ కలిపి ఒక అపార్ట్‌మెంట్ తీసుకున్నాడు.
‘్ఫలానా అపార్ట్‌మెంట్ తీసుకుంటున్నాను మీకు నచ్చిందా’ అంటూ పిల్లలిద్దరికీ బ్రోచర్స్, ఫొటోలు పంపించాడు.
‘చాలా మంచి పని చేస్తున్నావ్ నాన్నా. తప్పకుండా తీసుకో’ అన్నారిద్దరూ.
‘నెలకి ఇరవై వేలు ఇఎంఐ కట్టాలి ఎలా తీరుస్తారు?’ ఆయన నిర్ణయానికి విస్తుపోతూ అడిగింది జానకి.
‘బంగారంలాంటి ఇద్దరాడపిల్లల్ని అమెరికాలో పెట్టుకుని ఈ అనుమానం ఏంటి పిచ్చిదానా?’ అన్నాడు దర్పంగా.
‘అంటే వాళ్లు కడతారని మీ ఆశా? వాళ్లు సరే అన్నారా? వాళ్లలో ఎవరు కడతారు? పెద్దదా? చిన్నదా? ఏమీ తెలుసుకోకుండా మీరింత సాహసం చేయడం బాగాలేదు. ముందు వాళ్లతో మాట్లాడండి’ అంది జానకి.
‘అబ్బా నీకన్నీ అనుమానాలే జానకీ... ఉన్న ఇల్లు వాళ్ల చదువులు, పెళ్లిళ్లు తాలూకు అప్పు తీర్చడానికేగా అమ్మేశాను. ఆ విషయం వాళ్లకి తెలీదా? మనం అద్దె ఇంట్లో ఉంటే వాళ్లకి మాత్రం బాధగా ఉండదా?’ అన్నాడు ఎంతో నమ్మకంగా.
‘బాధ ఉండడం వేరు, బాధ్యత తీసుకోవడం వేరు. నా మాట విని రాత్రికి వాళ్లిద్దరితో మాట్లాడండి’ అంది కచ్చితంగా.
ఆవిడ పోరు పడలేక ఆ రాత్రే ఫోన్ చేసి ‘మీ అమ్మ ఇట్లా అంటోంది. మీ సమాధానం ఏంటమ్మా’ అనడిగాడు పెద్దమ్మాయిని.
‘అదేంటి నాన్నా అసలా అనుమానం ఎందుకొచ్చింది అమ్మకి?’ అంది పెద్దమ్మాయి.
‘చూశావా నా కూతురు’ అన్నట్టు గర్వంగా చూశాడు భార్యవైపు. మర్నాడు చిన్నమ్మాయితో కూడా మాట్లాడి కన్‌ఫర్మ్ చేసుకుని రెండు రోజుల్లో లోన్‌కి అప్లై చేయడం, ఉన్న డబ్బులో కొంత అడ్వాన్స్ ఇవ్వడం చేశాడు. త్వరలోనే ఇల్లు కొనడం, గృహ ప్రవేశం చేయడం జరిగింది. కూతుళ్లకి, అల్లుళ్లకి కొరియర్‌లో ఫొటోలతోపాటు ఖరీదైన కానుకలు కూడా పంపించాడు.
అప్పటికి బ్యాంక్ బాలెన్స్ లక్షా ముప్పై వేలుంది... నెలకి ముప్పై వేలు చిల్లర పెన్షన్.. మొదటి రెండు నెలలు ఇరవై వేల ఇఎంఐ తనే కట్టాడు. లక్షా ముప్పై వేలు కాస్తా ఎనభై నాలుగు వేలకి చేరింది.
మూడో నెల పెద్దమ్మాయికి ఫోన్ చేశాడు. ఒక నెల నువ్వు, ఒక నెల చెల్లాయి కడతారా? లేక ప్రతినెలా చెరిసగం కడతారా? నేను ఇప్పటికే రెండు నెలలు కట్టేశాను’ అనడిగాడు.
‘చెప్తాను నాన్నా.. ఓసారి చెల్లాయితో, ఆయనతో కూడా మాట్లాడి చెప్తాను’ అంది.
నెల దాటినా ఇద్దరి దగ్గర నుంచీ ఎలాంటి సమాధానం లేదు. మరో ఇరవై మూడు వేలు తగ్గాయి.
మళ్లీ ఫోన్ చేశాడు. ‘సారీ నాన్నా. చాలా బిజీగా ఉన్నాను. ఆయనతో మాట్లాడలేదు’ అంది పెద్దమ్మాయి.
‘అక్క నాతో ఈ విషయం డిస్కస్ చేయలేదు నాన్నా... నేను మాట్లాడి చెప్తాలే’ అంది చిన్నమ్మాయి.
మరో నెల గడిచింది. బ్యాంకు బాలెన్స్ చిక్కిపోతోంది.. ఆనంద్‌లో ఆందోళన మొదలైంది. ఉండబట్టలేక భార్యతో తన ఆందోళన వ్యక్తం చేశాడు.
‘వాళ్లు ఆడపిల్లలండి’ అంది జానకి.
‘అయితే’ అన్నాడు.
‘పెళ్లయ్యాక ఆడపిల్లలు మన పిల్లలు కాదు... వాళ్ల మీద మనకేమీ హక్కులుండవు. మనకి ఏం చేయాలన్నా వాళ్ల భర్తల అనుమతి కావాలి’ అంది.
‘కానీ, వాళ్లు ఆధునిక యువతులు జానకీ’ అన్నాడు.
‘అమ్మాయిలు ఆధునికులు అయినా సంప్రదాయాలు, ఆచారాలు ఆధునికం కాదు కదా’
విస్తుబోయాడు ఆనంద్. అంతేనా? జానకి అన్నట్టే జరిగింది.
‘మేము కూడా ఇక్కడ ఇల్లు కొనాలనుకుంటున్నాం నాన్నా... మేమూ లోన్ తీసుకోవాలిగా... పైగా మా అత్తగారు వాళ్లు వాళ్ల ఇల్లు రీమోడల్ చేయాలనుకుంటున్నారు. వాళ్లకి డబ్బు పంపాలి. ఇన్ని ఖర్చులంటే కష్టం నాన్నా... చూద్దాంలే మెల్లిగా నేనూ, చెల్లాయి మా వాళ్ళకి తెలియకుండా అంతో, ఇంతో పంపిస్తాం. ఈలోగా నువ్వు కడుతూ ఉండు’ అంది పెద్దమ్మాయి.
‘నిన్ననే మేము కూడా అగ్రిమెంట్ సైన్ చేశాం నాన్నా... బోలెడంత అప్పు... దాదాపు మూడు కోట్లు మన ఇండియన్ కరెన్సీలో. ఆయన ఇప్పటికే వాళ్ల పేరెంట్స్‌కి కారు కొన్నారు. అపార్ట్‌మెంట్ కొన్నారు. ఇంకా నీకు పంపించడం అంటే కష్టం. ఆయన కూడా ఒప్పుకోరు’ అంది.
స్థాణువై పోయాడు. అవమానంతో దహించుకు పోయాడు. వాళ్ల భర్తలు వాళ్ల తల్లిదండ్రులకి ఇల్లు కొనొచ్చు. కార్లు కొనచ్చు.. కానీ, వీళ్లు మాత్రం తనకి డబ్బు పంపడానికి భర్తల అనుమతి కావాలా? వాళ్లు ఒప్పుకోరా? ఏంటి ఈ దౌర్భాగ్యం. తనేం పాపం చేశాడు?
అదే అన్నాడు భార్యతో ‘ఇదేంటి జానకీ. మగ పిల్లల తల్లిదండ్రులు కొడుకుల దగ్గర హక్కుగా అన్నీ పొందచ్చా? మనకి ఆ హక్కు లేదా? ఇదేం న్యాయం?’
‘న్యాయాన్యాయాల సంగతి నాకు తెలీదుగానీ, ఇదే లోకరీతి.. ఆడపిల్లలు పెళ్లయేవరకే మన పిల్లలు. పెళ్లయాక వాళ్ల సంసారం, వాళ్ల జీవితం అంతా వేరు.. వాళ్లు పరాధీనలు’ అంది జానకి.
‘అదేంటి జానకీ వాళ్లు కూడా వాళ్ల భర్తలతో సమానంగా లక్షలు సంపాదిస్తున్నారు. మనం వాళ్లని అప్పు చేసి, అన్నీ కోల్పోయి మరీ చదివించాం... ఇవాళ మనం వాళ్లకి పరాయి వాళ్లమా? అందుకా నేను వాళ్లని అంత కష్టపడి ఉన్నత స్థితికి తీసుకొచ్చింది?’
ఓదార్పుగా అతడిని దగ్గరకు తీసుకోడం తప్ప జానకి ఏమీ చేయలేకపోయింది.
ఇంతేనా, ఇదేనా జీవితం... తట్టుకోలేని మనోవేదన, భరించలేని ఆర్థిక సమస్యలు, ఆనంద్ యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు.
నెలకి ఇరవై వేల జీతంతో ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం దొరికింది. కానీ చాలా దూరం వెళ్లాలి. అయినా తప్పదు.
వద్దనాలనుకుంది జానకి. కానీ, కళ్ల ముందు అప్పులు కనిపిస్తుంటే ఎలా అనగలదు.
ఏడు నెలలైంది.. మనోవేదన, వయసు అనుమతించని శారీరక శ్రమ, ఆనంద్ ఆరోగ్యంలో మార్పొస్తోంది. రోజురోజుకీ నీరసిస్తున్నాడు. మధ్యమధ్య ఆగని దగ్గు, నడుం నొప్పి.
అతని పరిస్థితి చూస్తుంటే జానక్కి కన్నీళ్లాగలేదు. బలవంతంగా దుఃఖం అణచుకుని ‘నడుంకి ఏదన్నా బామ్ రాయనా’ అంది మృదువుగా.
ఆయన ‘ప్చ్’ అంటూ పక్కకి తిరిగాడు.
‘రండి కుర్చీలో ఎందుకు? లోపల పడుకుందురుగాని’ అంది.
‘ఓపిక లేదు జానకీ... కాసేపు ఇలాగే ఉండనీ. ఒకేసారి డిన్నర్ అయాక లోపలికి వస్తాను’ అన్నాడు.
జానకి లోపలికి వెళ్లి చపాతీలకి పిండి తడిపింది. ఫ్రిజ్‌లో తరిగి ఉంచిన ఆకుకూర తీసి కూర పోపేసింది. రాగి జావ కాచింది. మధ్యమధ్య భగవంతుడా నా భర్తని కాపాడు అని వేడుకుంటూ వంట పూర్తి చేసింది.
సమయం ఎనిమిదిన్నర. ఆనంద్ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో అతని దగ్గరకు వచ్చేసరికి గాఢనిద్రలో ఉన్నాడు.
లేపాలనిపించలేదు. ఈయనకి తిండికన్నా విశ్రాంతి ముఖ్యం అనుకుంది. కానీ, తిరిగి తెల్లవారి ఆఫీస్‌కి వెళ్లాలి కాబట్టి తిండి కూడా ముఖ్యమే అనుకుంది.
అంతలో జానకి అన్నగారు నారాయణ లోపలికి రావడంతో ‘రా అన్నయ్యా’ అంటూ ఆహ్వానించింది.
అక్కడికి కొంచెం దూరంలో అతని ఇల్లు. వారానికి రెండుసార్లు వచ్చి ఆప్యాయంగా పలకరించి మంచీ చెడూ మాట్లాడి వెళ్తుంటాడు.
‘ఏమ్మా వేళగాని వేళ పడుకున్నాడేంటి బావ’ అడిగాడు.
‘ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు. పడుకున్నారు’ అంది జానకి.
‘ఏం ఆఫీసో... ఇంతకాలం చేసింది చాల్లేదా? ఎందుకమ్మా ఈ వయసులో కృష్ణా, రామా అంటూ కాలక్షేపం చేయక’.
అదోలా నవ్వింది జానకి. ‘నువ్వలా నవ్వకు. నాకు ఒళ్లు మండుతుంది. ఏమైందిట వాళ్లకి ఎందుకు డబ్బు పంపడం లేదు. అడగందే అమ్మైనా పెట్టదు.. అడిగి వసూలు చేయండి.’
‘వాళ్లకుండే సమస్యలు వాళ్లకున్నాయి. పోనీలే అన్నయ్యా’ అంది జానకి.
‘ఏం సమస్యలమ్మా వాళ్లకి? ఇళ్లు కొనుక్కోడమేగా... వాళ్ల అప్పులు కోట్లలో ఉంటాయి. దానిముందు మీ అప్పెంత? తిప్పి తిప్పి కొడితే ఏడాదిపాటు చెరో ఐదొందల డాలర్లు పంపిస్తే ఎంతలో తీరుతుంది?’
‘అంత ఎక్కడి నుంచి తెస్తారన్నయ్యా ఆడపిల్లలు...’
‘ఏంటమ్మా ఆడపిల్లలు... ఆడపిల్లలని చదువులు చెప్పించకుండా వదిలేసావా? నీ రెండో అల్లుడు తల్లిదండ్రులకి ఇన్నోవా కారు కొనిచ్చాడు. ఆ మధ్య భువనగిరి దగ్గర ఐదొందల గజాల స్థలం కొన్నారు. ఆయనా రిటైర్ అయ్యాడు. మీ అయనకన్నా చిన్న ఉద్యోగమే ఇవన్నీ ఎలా వస్తున్నాయి వాళ్లకి?’
‘అవన్నీ మనం అడగగలమా అన్నయ్యా. మన సంస్కృతీ సంప్రదాయాలు ఆడపిల్లల సొమ్ము తినకూడదనిగా చెబుతున్నాయి.’
‘గాడిద గుడ్డేం కాదూ... ఏం ఆడపిల్లని వాళ్లని సరిగా పెంచలేదా? ఏం లోటు చేశారు? ఈ రోజుల్లో ఆడా, మగా తేడాలేం లేవు. హక్కులు ఇద్దరికీ ఉన్నపుడు, బాధ్యతలు కూడా ఇద్దరూ పంచుకోవాలి... అయినా కొడుకైనా, కూతుళ్లైనా మీకు ఉన్నది వాళ్లే... మీ కష్టసుఖాలు వాళ్లుగాక ఎవరు చూస్తారు? అంతా మీ చేతకానితనంలే. ఫోన్ నెంబర్ ఇవ్వు జాడిస్తానిద్దరినీ... ఏం ఈ ఇల్లు మీరు కరిగించుకుని తింటారా? కట్టుకుపోతారా? మీ తదనంతరం వాళ్లకేగా దక్కేది. ఆ జ్ఞానం వాళ్లకన్నా ఉండాలి... వాళ్ల భర్తలకన్నా ఉండాలి’ ఆవేశంగా అంటున్న నారాయణ వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ నెమ్మదిగా అంది జానకి.
‘పోనీ అన్నయ్యా.. వదిలెయ్.. రేపు శనివారం తీరుబడిగా ఉంటారుగా అప్పుడు నేను మాట్లాడతాలే. ఆయనసలే మనోవ్యాధితో ఉన్నారు. ప్లీజ్..’ రెండు చేతులూ జోడించిన చెల్లెలి వైపు బాధగా చూశాడు నారాయణ.
‘సరేలే వెళ్లొస్తాను మరి’ అంటూ లేవబోతున్న నారాయణ ఆనంద్ ఆవలిస్తూ లేవడంతో తిరిగి కూర్చున్నాడు.
‘ఎంతసేపైంది నారాయణా వచ్చి?’ అడిగాడు.
‘పది నిమిషాలేలే. ఏంటి ఎటూగాని వేళ పడుకున్నారు?’ అడిగాడు నారాయణ.
‘బాగా అలసిపోయాను. చాలాసేపు పడుకున్నానా జానకీ’ అడిగాడు.
‘లేదులెండి.. లేచి మొహం కడుక్కోండి కాస్త అలసట తీరుతుంది’ అంది జానకి.
‘వెళ్తున్నా’ అంటూ లేచిన నారాయణతో ‘్భంచేసి వెళ్లన్నయ్యా’ అంది.
‘లేదులేమ్మా. మీ వదిన వంట చేసి ఉంటుందిగా తినకపోతే గొడవ చేసేస్తుంది. వస్తాను మరి, వస్తాను బావగారూ’ అంటూ నారాయణ వెళ్లిపోయాడు.
జానకి నిట్టూర్చింది... ఆడపిల్లలకి పుట్టింటి మీద ఎప్పటికీ సర్వాధికారాలుంటాయి. కానీ పుట్టింటి వారి పట్ల బాధ్యతలుండవు. ఆడపిల్లల సంపాదన పుట్టింటి వాళ్లు ఆశించకూడదు. ఇది న్యాయమేనా అన్న ఆలోచన కూడా ఆడపిల్లల తల్లిదండ్రులకి రాకూడదు.
మరో పది రోజులు గడిచాయి. ఆనంద్ ఆ రోజు ఆఫీసు నుంచి నూట నాలుగు డిగ్రీల టెంపరేచర్‌తో వచ్చాడు. జానకి ఆందోళనకి అంతులేకుండా పోయింది.
వడలిపోయి వచ్చిన భర్త వొంటిమీద చేయేసేసరికి అప్పుడే అట్లు వేసిన పెనంలా మండిపోతోంది.
గబగబా నారాయణకి ఫోన్ చేసి డాక్టర్‌ని తీసుకురమ్మని, ఆనంద్‌ని పడుకోబెట్టి తడిగుడ్డతో ఒళ్లు తుడిచింది.
నారాయణ డాక్టర్‌ని తీసుకొచ్చాడు. వైరల్ ఫీవర్ అని ఇంజక్షన్ చేసి మందులు రాసిచ్చాడు డాక్టర్.
నారాయణ మందులు, గ్లూకోజ్ వగైరా తీసుకొచ్చి ఇచ్చి ఆనంద్ పరిస్థితికి కళ్లంబడి నీళ్లు తిరుగుతుంటే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మూడు రోజులు దాటినా జ్వరం తగ్గలేదు. జానకి నిద్రాహారాలు మాని చూసుకుంటోంది భర్తని. నారాయణ రోజూ రెండు పూటలా వచ్చి చూసి వెళ్తున్నాడు.
నాలుగో రోజు ఆనంద్ మూసిన కన్ను తెరవలేదు. అప్పటి వరకూ గంభీరంగా ఉన్న జానకి గట్లు తెగిన గోదావరి అయింది.
నారాయణ అంబులెన్స్ తీసుకొచ్చి ఆనంద్‌ని హాస్పిటల్‌కి తీసికెళ్లాడు.. పరిస్థితి సీరియస్‌గా ఉందని ఐసియులో పెట్టారు.. నారాయణ ఆ రాత్రే మేనకోడళ్లిద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ఇద్దరూ ఫోన్‌లోని భోరుమన్నారు. ‘మావయ్యా, నాన్నని మంచి హాస్పిటల్లో చూపించు’ అన్నారు ఏడుస్తూ.
తెల్లారేసరికి ఆనంద్ శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు.
కన్నీళ్లకి ఆకారం వస్తే జానకిలా ఉంటుందేమో అనిపించింది.
పిల్లలకి ఫోన్లు వెళ్లాయి. మూడో రోజుకి అందరూ వచ్చారు.
యధావిధిగా జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి.
వాళ్లు వెళ్లే రోజు దగ్గరకు వచ్చింది. నారాయణ మేనకోడళ్లని, వాళ్ల భర్తల్ని సమావేశపరిచాడు.
‘మీ నాన్న మీ చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు ఇల్లమ్మి తీర్చాడు తెలుసా?’ అడిగాడు.
ఆడపిల్లలు మాట్లాడలేదు. కళ్లు తుడుచుకున్నారు. అల్లుళ్లు తల పంకించారు.
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ బ్యాంకులో వేసుకుని ఆ వడ్డీతో, తన పెన్షన్‌తో చీకూ చింతా లేకుండా బతకాల్సిన వయసులో ఉన్న డబ్బుకి మరింత అప్పు చేసి ఇల్లు కొనుక్కుని ఆ అప్పు తీర్చడం కోసం మళ్లీ ఉద్యోగం చేశాడు తెలుసా?’ అడిగాడు నారాయణ సూటిగా చూస్తూ.
‘అవును అదే. చాలా తప్పు చేశాడు నాన్న. తొందరపడ్డాడు’ అంది పెద్దమ్మాయి.
‘అసలీ వయసులో మళ్లీ ఉద్యోగం చేయడం ఏంటి నాన్న... అమ్మైనా ఒద్దని చెప్పాల్సింది’ అంది చిన్నమ్మాయి.
‘మావయ్యగారు తప్పు చేశారు. హాయిగా వడ్డీ, పెన్షన్ కలిపి మంచి ఇల్లు అద్దెకు తీసుకుని ఎంజాయ్ చేయాల్సింది. అనవసరంగా ఈ వయసులో లోన్ తీసుకోవడం, అది తీర్చడానికి అవస్థ పడటం రాంగ్ డెసిషన్’ అన్నారు అల్లుళ్లు.
‘అయిందేదో అయింది.. మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు.. ఆయన పోయాడు మీ అమ్మకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఆవిడ తిండీ, బట్టా గడిచిపోతాయి. మరి ఇంటి మీద అప్పెలా తీరడం? మీలో ఎవరు తీరుస్తారు?’ సూటిగా విషయంలోకి వచ్చాడు నారాయణ.
‘ఇప్పుడెందుకండి ఆ ఇల్లు అమ్మేసేయండి’ అన్నాడు చిన్నల్లుడు.
‘అదేంటి బాబూ ఇల్లమ్మి ఆవిడ ఎక్కడుంటుంది? అయినా రేపు ఆవిడ తదనంతరం మీ భార్యలకేగా వచ్చేది.
‘ఆ.. ఇప్పుడా ఇల్లు మాకు రావడం కోసం ఎదురుచూస్తామా? మా డైనింగ్ ఏరియా అంత లేదు ఇల్లంతా కలిపినా... మేమేం చేసుకుంటాం? అయినా మీ మేనకోడలికి ఐదో నెల వచ్చింది. ఎలాగా తన డెలివరీకి అత్తయ్యగారిని పిలిపించాలనుకున్నాం.. బాడ్‌లక్ ఈ ఇన్సిడెంట్ జరిగింది... సరే జరిగేదాన్ని ఆపలేం అనుకోండి.. కాకపోతే ఆవిడ మరో రెండు నెలల్లో మా దగ్గరకి రావాల్సిందేగా.’
‘అన్నయ్య చెప్పేది నిజమే. మేము కూడా ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నాం. అత్తయ్యగారు ఏడాదికి కనీసం ఆర్నెల్లు మాలో ఎవరో ఒకళ్ల దగ్గర ఉండాల్సిందేగా... అంచేత ఇల్లమ్మి లోన్ తీర్చేసి, ఆవిడకి ఏదన్నా సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ చూడండి రెంట్‌కి... జస్ట్ చిన్న షెల్టర్ కోసమేగా’ అన్నాడు చిన్నల్లుడు.
నారాయణ రక్తం మరిగింది.. చెల్లెలి వైపు చూశాడు. చలనం లేనిదానిలా ఎటో చూస్తూ కూర్చుంది జానకి.
‘అవును మామయ్యా.. అమ్మ ఇంక ఇక్కడుండి ఏం చేస్తుంది? మనవళ్లు, మనవరాళ్లను చూసుకుంటూ మా దగ్గరే ఉంటుంది. గ్రీన్ కార్డ్ వచ్చిందనుకో. అక్కడే ఉండచ్చు. అప్పుడప్పుడు ఇక్కడకు వస్తుంటుంది... హాయిగా కాలక్షేపం అయిపోతుంది.. మాక్కూడా అమ్మ ఉండి వండిపెడుతూ, పిల్లల్ని చూసుకుంటుంటే నిశ్చింతగా ఉంటుంది కూడా’ అంది పెద్దమ్మాయి.
కళ్లు తుడుచుకుంటూ అంది చిన్నమ్మాయి ‘నాన్న ఎక్కడికీ వెళ్లలేదమ్మా.. నా కడుపునో, అక్క కడుపునో మళ్లీ పుడతాడు. ఆ రకంగా నువ్వు నాన్నని చూసుకోవచ్చు’
‘వెళ్లగానే పేపర్స్ పంపిస్తాం అత్తయ్యా... వీసా వచ్చేస్తుంది మీరేం వర్రీ అవకండి’ అన్నారు అల్లుళ్లు.
‘నువ్వేం అంటావు జానకీ’ అడిగాడు నారాయణ.
‘అమ్మ ఏమంటుంది మామయ్యా.. మనం నిర్ణయించాల్సిందే తనకేం తెలుసని’ అంది పెద్దమ్మాయి.
‘ఇల్లు అమ్మేటప్పుడు మళ్లీ వీళ్లిద్దరూ సంతకాలకి రావాలేమో.. ఇప్పుడే ఆ సంతకాలేవో తీసుకోండి బాబాయిగారూ’ అన్నాడు చిన్నల్లుడు.
‘నిజమే తండ్రి ఆస్తి కదా. అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చేయాలి. అందులో వీళ్లకీ భాగం ఉంటుందిగా’ అన్నాడు పెద్దల్లుడు.
‘అలా అయితే డాక్యుమెంట్స్ తెప్పించు మావయ్యా ఓ పనైపోతుంది’ అన్నారు కూతుళ్లిద్దరూ.
నారాయణ జానకి వైపు చూశాడు. ఆమె నిశ్చలంగా అలాగే కదలకుండా కూర్చుంది.
చేసేది లేక నారాయణ మర్నాడు లాయర్‌ని కలిసి పరిస్థితి తెలియజేశాడు. ఇల్లు అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చేయాలండి’ అన్నారాయన.
డాక్యుమెంట్స్ రెడీ చేయించి ఆయన్ని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు నారాయణ.
మళ్లీ అందరూ సమావేశమయ్యారు.
‘ఏమ్మా ఈ నిర్ణయం మీకంగీకారమేనా’ అడిగాడు లాయర్ జానకిని ఉద్దేశించి.
ఆవిడ ఏం మాట్లాడకుండా కూతుళ్ల వైపు చూసింది.
‘ఇల్లు అమ్మడం ఇన్‌ఎవిటబుల్, అదే సొల్యూషన్’ అంది పెద్దకూతురు.
‘ఆవిడ కూడా ఓ మాట చెప్పాలమ్మా’ అన్నాడు లాయర్.
‘చెప్పమ్మా’ మృదువుగా అంది పెద్దకూతురు మళ్లీ.
ఆల్లుళ్లు ఆవిడ వైపు అసహనంగా చూశారు ఈవిడ మాట్లాడదేం అన్నట్లు.
జానకి నెమ్మదిగా అంది ‘ఇల్లు అమ్మద్దన్నయ్యా’
ఒక్కసారి పెద్ద విస్ఫోటనం జరిగినట్టు చూశారు కూతుళ్లు, అల్లుళ్లు.
‘ఏమ్మా’ ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ ‘ఎందుకని?’ ఒక విధంగా ఆయనకి ఆవిడ మాట చెప్పలేనంత ఆనందం కలిగించింది. ఈ పిచ్చిది కూతుళ్లు ఏం చెబితే అదే చేసేస్తుందేమో అని టెన్షన్ పడ్డాడు.
‘అవునన్నయ్యా ఇల్లు అమ్మద్దు’ మరోసారి నెమ్మదిగా అయినా దృఢంగా అంది.
‘అప్పెలా తీరుస్తావమ్మా? అయినా ఏం చేసుకుంటావా ఇల్లు? నువ్వేం ఇక్కడ ఉండిపోతావా? ఎలాగా రెణ్ణెల్లలో నా దగ్గరకు రావాలిగా’ అంది పెద్ద కూతురు అసహనంగా.
తల అడ్డంగా ఊపుతూ అంది జానకి ‘లేదమ్మా.. నేనెక్కడికీ రాను. ఇక్కడే ఉండాను.. ఈ ఇంట్లోనే ఉంటాను. అప్పు ఎలా తీర్చాలి అనేది నా సమస్య కాబట్టి దాని గురించి తరవాత ఆలోచిస్తాను’
‘ఏంటి మా దగ్గరకు రావా. మరి మా పిల్లల్ని ఎవరు చూస్తారు?’ విస్తుబోతూ అడిగారు కూతుళ్లు.
ఆవిడ అదోలా నవ్వింది.
‘మీ దగ్గర బోలెడు డబ్బుంది. డబ్బు ఇస్తే ఎంతోమంది ఆయాలు దొరుకుతారు. ఇండియా నుంచి కేర్ టేకర్స్‌గా చాలామంది మీ దేశాలకు వస్తున్నారని విన్నాను. పిలిపించుకోండి నేను మాత్రం రాను.. చాలు ఇప్పటిదాకా చేసింది చాలు.. మీ కోసం బతికాం.. మీ కోసం నవ్వాం.. మీకోసం ఏడ్చాం.. అన్నీ మీ కోసమే చేశాం.. అలా చేసిచేసి ఆయన వెళ్లిపోయారు’ ఆవిడ స్వరం వణికింది. ‘కానీ, నేను ఈ రోజు నుంచీ, కాదు ఈ క్షణం నుంచీ నా కోసం బతుకుతాను.. సమస్య నాది, పరిష్కారం కూడా నాది... మీరెవ్వరూ నా కోసం బాధపడకండి...’
‘ఆడపిల్లలైనా ఉన్నత చదువులు చదువుకుని, ఆత్మవిశ్వాసంతో, ఆత్మాభిమానంతో, స్వతంత్ర భావాలతో, ఉన్నతమైన వ్యక్తిత్వంతో బతకాలని నా భర్త మిమ్మల్ని శక్తికి మించి చదివించారు. మీ మీద నమ్మకంతో మీరు తీసుకున్న అప్పుకి తనే సెక్యూరిటీ సంతకం చేశారు. ఆ అప్పు తీర్చే బాధ్యత మాది అని మీరు బ్యాంకు అధికారులతో చెబితే అందుకు నేను హామీ అంటూ భరోసా సంతకం చేశారు.. అదే ఆయన పాలిట శాపం అయింది.’
కళ్లు తుడుచుకుంటూ లాయర్ వైపు తిరిగింది జానకి.. ‘లాయర్‌గారూ ఆస్తి హక్కులో ఆడపిల్లలకు కూడా సమభాగం ఉండాలనే మీ చట్టం, బాధ్యతల్లో సమానత్వం ఉండాలని చెప్పలేదా?’
లాయర్ తెల్లబోయి చూశాడు.
ఒకవేళ అలాంటి చట్టం ఉంటే అదేమిటో, ఐపిసి సెక్షన్‌తో సహా వీళ్లకి చెప్పండి. నాకోసం కాదు భవిష్యత్తులో వీళ్లకి అవసరం వస్తుందేమో అందుకే దయచేసి చెప్పండి...’ వెక్కిళ్లు అడ్డుపడగా రెండు చేతుల్లో మొహం దాచుకుని లోపలికి వెళ్లిపోయింది జానకి.
తన మొహంలో, కళ్లల్లో వెల్లివిరుస్తున్న వెలుగు ఎవరికీ కనిపించకుండా మొహం తిప్పుకున్నాడు నారాయణ.
నిర్ఘాంతపోయి చూస్తున్న ఆడపిల్లల చేతుల్లోంచి డాక్యుమెంట్స్ తీసుకుని బైటకి నడిచాడు లాయర్.
*

నలభై ఏళ్లుగా సాహితీ సేద్యం చేస్తున్న అత్తలూరి విజయలక్ష్మి ఏ ప్రయోగం చేసినా అది పాఠకజనరంజకంగానే ఉంటుంది. కవిత, కథ, నాటిక, నాటకం, వీధినాటకం ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్రవేసిన ఆమె రేడియో, టీవీ కార్యక్రమాల్లోనూ రాణించారు. ఆమె రాసిన వాటిలో ఇప్పటివరకు పదహారు నవలలు, నాలుగు కథా సంపుటాలు, మూడు నాటక సంపుటాలు ప్రచురితమయ్యాయి. మరో రెండు నవలలు ముద్రణకు సిద్ధమవుతున్నాయి. ‘ఆ గదిలో’, ‘మహావృక్షం’ నవలలు కన్నడంలోకి, మరికొన్ని కథలు కన్నడ, హిందీ, ఇంగ్లీషు, తమిళ భాషల్లో అనువాదానికి నోచుకున్నాయి. 1975లో తొలి రెండు కథలు అటు ఆకాశవాణి, ఇటు ప్రముఖ వార పత్రికల్లో వచ్చింది మొదలు ఇప్పటివరకు ఆమె రచనా వ్యాసంగాన్ని వదిలిపెట్టిందిలేదు. ‘నివేదిత’ టీవీ ధారావాహికకు యునిసెఫ్ అవార్డు వరించగా మరెన్నో ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్న ఆమె కాలమిస్టుగానూ తెలుగువారికి సుపరిచితమే. ‘సరసిజ’ పేరుతో ఏర్పాటు చేసిన మహిళావేదిక ఆధ్వర్యంలో కళాకారిణుల నాటక ప్రదర్శన తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెబుతున్న విజయలక్ష్మి జలమండలిలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉన్నారు.
--
అత్తలూరి విజయలక్ష్మి
ఇం.నెం.1-4-880/2/11, ఎస్‌బిహెచ్ కాలనీ,
గాంధీనగర్, హైదరాబాద్- 500 080
9951250144

-అత్తలూరి విజయలక్ష్మి