కథ

గీతాసారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోటీలో ప్రథమ బహుమతి రూ.10,000
పొందిన కథ

--

ఆ రోజు ఓ ప్రముఖ కాలేజీ జరుపుకుంటున్న వార్షికోత్సవ సభలో ప్రసంగించాల్సి ఉంది. వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయితగా మాత్రమే కాక మంచి వక్తగా నాకు పేరుంది.
ఢిల్లీలోని ట్రాఫిక్ మహా సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్లాలంటే కనీసం రెండు గంటల ముందుగా బయల్దేరటం మంచిదన్న ఉద్దేశంతో సన్నద్ధమవుతున్న సమయంలో ఫోన్ మోగింది. ఏదో కొత్త నంబర్. నా పుస్తకాలు చదివిన వాళ్లలో కొంతమంది అభిమానంతో ఫోన్ చేసి అభినందనలు తెలుపుతుండటం అలవాటే కాబట్టి ఫోన్ రిసీవ్ చేసుకుంటూ ‘హలో.. రాంప్రసాద్ హియర్’ అన్నాను.
‘నేను సుధాకర్ని. గుర్తున్నానా?’ అని విన్పించింది.
‘ఏ సుధాకర్?’
‘కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో నీ రూమ్మేట్‌ని. ఇప్పటికైనా గుర్తొచ్చానా? చాలా పెద్ద రచయితవైనావు కదా. పాత రోజులు, పాత స్నేహితులు మరుగున పడిపోవటం సహజం. నీ కాళ్ల కింది కార్పెట్ ఎత్తి చూస్తే అక్కడ పేరుకుపోయిన దుమ్ములో ధూళిలో నా జ్ఞాపకాలెక్కడో కన్పిస్తాయి చూడు’
చప్పున నాకు సుధాకర్ గుర్తొచ్చాడు. బియ్యేలో నా క్లాస్‌మేట్... హాస్టల్లో నా రూమ్మేట్. చాలా బాగా పాడేవాడు. అతని గొంతులో ఘంటసాల గారి పాటలకన్నా ఎస్పీ పాడిన పాటలు బాగా ఒదిగిపోయేవి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సందడిగా ఉండేవాడు. నాకో సంఘటన బాగా గుర్తుండి పోయింది. హాస్టల్లో చేరిన పది రోజులకే విపరీతమైన జ్వరం బారిన పడ్డాను. నీరసంతోపాటు మగత.. సుధాకర్ రాత్రికి మెస్ నుంచి పాలూ బ్రెడ్ తెచ్చి తిన్పించాడు. తిన్న పది నిమిషాలకే కక్కున్నాను.

గదంతా వాసన... నిస్సత్తువతో కళ్లు మూసుకుని పడుకున్నాను.
సుధాకర్ ఓ బకెట్ నిండా నీళ్లు నింపుకొచ్చి చీపురు పట్టుకుని గదంతా శుభ్రం చేశాడు. ఎవరు చేస్తారలాంటి పనులు... మన అమ్మో అక్కో తప్ప పరాయి వాళ్లు చేయలేరు. అప్పటి నుంచి సుధాకర్ నాకు ఆత్మీయ మిత్రుడైనాడు. డిగ్రీ పూర్తయ్యాక అతను శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఎం.ఏలో చేరాడు. మా నాన్నకు ఢిల్లీకి బదిలీ కావడంతో నేను ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఎం.ఏ.లో చేరాను. తరచూ ఉత్తరాలు రాసుకునేవాళ్లం. సుధాకర్ ఆదోని కాలేజీలో లెక్చరర్‌గా చేరాడు. నేను డాక్టరేట్ కోసం అమెరికా వెళ్లాను. ఆ తర్వాత మా మధ్య ఉత్తరాలు బాగా తగ్గాయి. కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంలో గ్రీటింగులు పంపుకోడానికి పరిమితమయి మెల్లగా అదీ ఆగిపోయింది.
నేను ఢిల్లీ తిరిగొచ్చాక కొన్నాళ్లు కాలేజీలో పాఠాలు చెప్పాను. దాంతోపాటు ఇంగ్లీషులో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాయడం ప్రారంభించాను. నా మొదటి పుస్తకానికే మంచి పేరొచ్చింది. ఆ సంవత్సరం అది బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఉద్యోగం మానేసి పూర్తిగా పుస్తకాల రచనకే అంకితమై పోయాను. దాంతోపాటు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంలో శిక్షణ ఇవ్వటం కూడా మొదలైంది.
‘ఇంకా గుర్తు రాలేదా?’ నేను కొన్ని క్షణాలు వౌనంగా ఉండటంతో మళ్లా విన్పించింది.
‘నినె్నలా మర్చిపోతాను సుధాకర్? మన మధ్య చాలా సంవత్సరాలు విరామ చిహ్నాలుగా అడ్డుపడ్డాయిగా. అందుకే వెంటనే గుర్తు పట్టలేక పోయాను’ అన్నాను కించిత్ అపరాధ భావనతో.
‘నేను మాత్రం నీ ప్రతి పుస్తకాన్ని వదలకుండా చదువుతాను తెలుసా. అందులోని ప్రతి వాక్యం చదువుతూ నువ్వు నాతో మాట్ల్లాడుతున్నట్టే అనుభూతి
చెందుతాను. అందుకే నువ్వెప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉన్నావు. అది సరే. ప్రస్తుతం ఏం రాస్తున్నావు?’
‘దుఃఖ సముద్రాన్ని ఒంటి చేత్తో ఈదుతూ కూడా ఎలా సంతోషంగా ఉండవచ్చో తెలియజెప్తూ పుస్తకం రాయాలన్న సంకల్పం. మొదట దానిక్కావల్సిన ముడిసరుకుని సమకూర్చుకోవాలిగా. ఆ పనిలో తలమునకలై ఉన్నా. నువ్వు ఢిల్లీ రాకూడదూ... కలిసి చాలా రోజులైంది’
‘నేను నీకు ఫోన్ చేసిన ఉద్దేశమే నిన్ను మా కాలేజీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి. మా కాలేజీలో కూడా నీ అభిమానులు చాలామంది ఉన్నారు తెలుసా. నీ పుస్తకాల్ని నేను చదివేశాక నా విద్యార్థుల చేత కూడా చదివిస్తుంటానులే. మరో ఏడాదిలో రిటైర్మెంట్ ఉంది. ఆ లోపల మా కాలేజీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంలో నీ ప్రసంగం ఏర్పాటు చేయాలన్న కోరిక. దాంతోపాటు నీతో ఒకట్రెండు రోజులు గడిపి, మన పాత జ్ఞాపకాల్నీ మధురమైన ఆ అనుభూతుల్ని తిరగదోడుకోవాలన్న బలమైన కోరిక. ప్లీజ్ కాదనకు’
నాకూ సుధాకర్ని కలుసుకోవాలని ఆ క్షణంలో బలంగా అన్పించింది. ‘ప్రస్తుతం ఓ పని మీద బైటికెళ్తున్నా. తిరిగొచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం. ట్రావెల్ ఏజెంట్‌తో మాట్లాడి రిజర్వేషన్ చేయించుకుంటాను. మీ కాలేజీ వార్షికోత్సవానికి రెండ్రోజుల ముందే వచ్చేస్తాను. సరేనా’ అన్నాను ఉత్సాహంగా.
* * *
రైలు దిగగానే సుధాకర్ ఎదురొచ్చి కౌగిలించుకున్నాడు. ఎనే్నళ్లయిందో చూసి... మనిషి బాగా మారిపోయాడు. అతను నన్ను గుర్తు పట్టబట్టి సరిపోయింది కానీ నేనైతే గుర్తుపట్టేవాడిని కాదు. ఉండాల్సిన దానికన్నా ఓ పది కేజీల బరువు ఎక్కువ ఉండి ఉంటాడు. పొట్ట ముందుకు పొడుచుకొచ్చింది. జుట్టు తెల్లబడింది.
తన కార్లో ఇంటికి పిల్చుకెళ్లాడు.
‘అదిగో బాత్‌రూం. గీజర్ వేసి ఉంచాను. స్నానం చేయి. నీకు వేడివేడిగా దోసెలు వేసి పెడ్తాను’ అన్నాడు నవ్వుతూ.
‘ఏంటీ ఇంట్లో నువ్వొక్కడివే ఉన్నావా? చెల్లాయి పిల్లలూ ఏరి? ఊరెళ్లారా? అయ్యో... రాకూడని సమయంలో వచ్చి నిన్ను ఇబ్బంది పెడ్తున్నానా? ముందుగా చెప్పి ఉంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకునేవాడినిగా’ అన్నాను.
‘మీ చెల్లాయి లేదని కాలేజీ వార్షికోత్సవం ఆగదుగా. నువ్వు ముందు వెళ్లి ఫ్రెషప్ అయి రా. నా వంట బాగానే ఉంటుందిలే. భయపడకు’ అన్నాడు మళ్లా నవ్వుతూ. చదువుకునే రోజుల్లో ఎంత హాయిగా నవ్వేవాడో ఇప్పుడూ అదే నవ్వు... పసిపిల్లాడి అమాయకమైన నవ్వు.
స్నానం చేసి వచ్చేప్పటికే డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు అమర్చి దోసెలు, వాటితోపాటు వేరుసెనగ పప్పు పచ్చడి తెచ్చి పెట్టాడు. ఎంత రుచిగా ఉన్నాయో... ‘చెల్లాయి కంటే నువ్వే వంట బాగా చేసేట్టున్నావే. ఇంతకూ చెల్లాయి ఏ ఊరెళ్లింది? ఎప్పుడు తిరిగి వస్తుంది? నేను తిరిగి వెళ్లే లోపల వస్తుందా’ అని అడిగాను.
‘ఆ వివరాలన్నీ తీరిగ్గా చెప్తాను కానీ మొదట నీ గురించి చెప్పు. పిల్లలెంత మంది? ఏం చేస్తున్నారు?’
‘నాకిద్దరు పిల్లలు. అబ్బాయి సిఏ చేశాడు. బ్యాంక్‌లో ఉద్యోగం. అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. పిల్లలు కూడా. ఐదేళ్ల క్రితమే నేను తాతనయ్యాను తెలుసా. జీవితం సాఫీగా సాగుతోంది అనే కంటే చాలా సంతోషంగా సంతృప్తిగా సాగుతోంది అని చెప్పగలను. చీకూ చింతాలేని అద్భుతమైన జీవితం అనుభవిస్తున్నందుకు కించిత్ గర్వపడ్తుంటాను’
‘అలా వింటుంటే ఎంత సంతోషంగా ఉందో’
‘మరి నీ గురించి చెప్పు’
‘నేనూ సంతోషంగానే ఉన్నాను. చూస్తున్నావుగా.. దిగులూ విచారమూ లేని జీవితం కాబట్టే సుష్ఠుగా తిని ఇలా బొజ్జ పెంచుకుంటున్నాను’ అంటూ పెద్దగా నవ్వాడు.
‘పిల్లలెంతమంది? ఏం చేస్తున్నారు? వివరంగా చెప్పు’ అన్నాను.
‘తొందరేముంది. ఇంకా రెండ్రోజులుంటావుగా. బోలెడు సమయం ఉంది కబుర్లు చెప్పుకోడానికి. మొదట నీకు వేడివేడిగా కాఫీ చేసుకుని వస్తానుండు’ అంటూ లేచి కిచెన్‌లోకి వెళ్లాడు. రెండు కప్పుల్లో పొగలు కక్కుతున్న కాఫీలు తెచ్చి నా చేతికొకటిచ్చి తనొకటి తీసుకున్నాడు.
‘మా కాలేజీ స్ట్ఫాంతా నువీ రోజు వస్తావని ఎదురుచూస్తున్నారు. మనం మొదట కాలేజీకెళ్దాం. ఓ గంట స్ట్ఫాకి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మీద క్లాస్ తీసుకో. ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకున్నాలే. మా ప్రిన్సిపల్ కూడా నీ అభిమానే. నిన్ను కల్సుకోవడం కోసం చాలా ఆత్రుతగా ఉన్నాడు. నువ్వు సెలబ్రిటీవి కదా’ అంటూ నవ్వాడు.
కాఫీ తాగుతూ పక్క గోడ మీదున్న ఫొటోని చూశాను. టెన్నిస్ రాకెట్ చేతిలో పట్టుకుని వయ్యారంగా నిలబడిన ఇరవైయేళ్ల అమ్మాయి... తెల్లటి డ్రెస్‌లో దేవకన్యలా ఉంది.
‘నీ కూతురా? ఎంతందంగా ఉందో? ఇపుడేం చేస్తోంది?’ అని అడిగాను.
‘కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది. ప్రస్తుతం పూనెలో ఉద్యోగం చేస్తోంది’
‘పెళ్లయిందా?’
‘అయింది. ఓ పాప కూడా’
‘మరి చెప్పవేం. కంగ్రాట్స్. నువ్వు కూడా తాతయ్య ప్రమోషన్ కొట్టేశావన్నమాట’ అంటూ అతని భుజాన్ని ఆప్యాయంగా తట్టాను.
వసంతం వరించిన వనంలా నవ్వాడు. గాలికి ఊగే విరబూసిన పున్నాగ చెట్టులా కదిలి కదిలి నవ్వాడు.
‘ఆ పక్క ఫొటోలో ఉన్న పద్దెనిమిదేళ్ల కుర్రాడు నీ కొడుకై ఉంటాడు. పోలికలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. ఆ వెనక కన్పిస్తున్న బిల్డింగ్ అతను చదివిన కాలేజీ క్యాంపసా?’ అని అడిగా.
‘అవును. మద్రాస్ ఐఐటి క్యాంపస్. కెమికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పటి ఫోటో’
‘చూశావా... నువ్వు చెప్పకున్నా గోడమీది ఫొటోలు నీ పిల్లల గురించి చెప్పేశాయి. బావుంది. నా జీవితంలానే నీ జీవితం కూడా సుఖ సంతోషాలతో నిండి, పూలతో ఫలాలతో విరబూసిన తోటలా ఉందన్నమాట. నీ మొహంలో నిరంతరం కదులాడే చిర్నవ్వు చూసినపుడే అనుకున్నా. సంతృప్తికరమైన జీవితం నీదని’
సుధాకర్ ఈసారి పెద్దగా నవ్వాడు. ‘మన ముచ్చట్లు తర్వాత చెప్పుకుందాం. కాలేజీకెళ్దాం పద. ఇప్పటికే ఆలస్యమయింది’ అన్నాడు.
‘ఇంతకూ చెల్లాయి ఫొటో ఏది?’ గోడలన్నీ కలియజూస్తూ అడిగాను.
‘నా గుండెల్లో పదిలంగా ఉందిలే. అందుకే గోడల మీద పెట్టాల్సిన అవసరం రాలేదు’ అంటూ నా చేయి
పట్టుకుని ఆ గదిలోంచి బైటికి లాక్కెళ్లాడు.
నన్ను ప్రిన్సిపల్ చాలా సాదరంగా ఆహ్వానించాడు. లెక్చరర్లందరూ సమావేశ మందిరంలో ఆసీనులైనాక నన్నాగదికి సగౌరవంగా తోడ్కొని వెళ్లాడు. నా గురించి పరిచయంలో సుధాకర్ నన్ను ఆకాశానికెత్తేశాడు. విద్యార్థుల భవిష్యత్తు బాగు చేయడంలో లెక్చరర్ల బాధ్యత గురించి గంటన్నరసేపు మాట్లాడాను. అందులోనే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాల్ని జోడించి మాట్లాడాను. అందరూ మెచ్చుకున్నారు. నాలాంటి గొప్ప వ్యక్తి తన స్నేహితుడు కావటం అదృష్టం అంటూ సుధాకర్ని కూడా పొగిడారు.
దాంతోపాటే ‘సుధాకర్ లాంటి వ్యక్తితో పరిచయమే గొప్ప వరం. అతను మా కాలేజీ మొత్తానికి ఓ ఉత్సాహం... ఓ ఉత్తేజం.. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ జీవితంలోని ప్రతి క్షణాన్ని పసిపిల్లాడిలా ఉత్సుకతతో ఆస్వాదిస్తూ ఆనందంగా బతకటం అతనికే చాతనయింది. మాకూ మా విద్యార్థులకు అతనో ప్రేరణ శక్తి. ఎంత చదివినా ఇంకా మిగిలిపోయే గొప్ప పుస్తకం అతను. మీకతను స్నేహితుడు కావడం మీ అదృష్టం కూడా’ అన్నారు చాలామంది.
మధ్యాహ్నం హోటల్లో భోంచేశాక ఆదోని కోట చూడటానికి వెళ్లాం. అక్కడి నించి మహాలక్ష్మమ్మ గుడికి పిల్చుకెళ్లాడు. పాలరాతితో కట్టిన చాలా పెద్ద గుడి. ‘ఆదోని ప్రజలకు ఈవిడంటే చాలా భక్తి తెలుసా. ఈమెని అవ్వ అని పిల్చుకుంటారు’ అన్నాడు సుధాకర్. మొగలారుూల కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం కట్టించిన వెంకన్న బావిని కూడా చూపించాడు. చాలా పెద్ద బావి. దాదాపు వందడుగుల విస్తీర్ణం ఉన్న బావి. ప్రస్తుతం ఎండిపోయి ఉంది. ‘మా ఆదోనిలో చూడదగ్గ స్థలాలు ఇంతే. మీ ఢిల్లీలా కదా కదా... చాలా చిన్న ఊరు’ అంటూ నవ్వాడు సుధాకర్.
అప్పటికే సాయంత్రం ఆరు కావస్తోంది. ఇద్దరం తిరిగి ఇంటికి చేరుకున్నాం. మరోసారి కాఫీ చేసి ఇచ్చాడు.
‘రాత్రికి భోజనంలో ఏమేం తింటావో చెప్పు. కూరగాయలు ఫ్రిజ్‌లో ఏమున్నాయో చూసుకోవాలి. అవసరమైతే మార్కెట్‌కెళ్లి కొనుక్కు రావాలి’ అన్నాడు.
‘ఎందుకు శ్రమ... హోటల్ కెళ్లిపోదాం’ అన్నాను.
‘వద్దు. మధ్యాహ్నం తిన్నాంగా. గడ్డి నమిలినట్టు లేదూ. నువ్వు నా అతిథివి. నలభీమ పాకం రుచి చూపించకున్నా కనీసం సుధామధురమైన కమ్మటి భోజనం పెట్టాలిగా. ఏం వండమంటావో చెప్పు’ అన్నాడు.
‘నీ ఇష్టం. ఎక్కువేం చేయకు. ఓ చారూ ఓ కూరా ఉంటే చాలు’ అన్నాను.
దోసకాయ పప్పు, బంగాళాదుంప వేపుడు, మిరియాల చారు, మీగడ పెరుగు... నా భార్య కూడా ఇంత రుచిగా వండలేదు.
‘వంటలో బాగా ప్రావీణ్యం సంపాయించినట్టున్నావే’ అన్నాను తృప్తిగా త్రేన్చుతూ.
‘నువ్వు చేయి తిరిగిన రచయితవయితే నేను చేయి తిరిగిన చెఫ్‌ని’ అంటూ నవ్వాడు. ‘పదేళ్లుగా స్వయం పాకమేగా. ఇంగ్లీష్ సాహిత్యాన్ని రుబ్బినట్టు పాకశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాలే’ అంటూ మరోసారి నవ్వాడు.
‘అదేంటి? సిస్టర్ ఏమయ్యింది?’
‘దానికెప్పుడూ తొందరెక్కువే. రాత్రి పదింటి రైలు కోసం ఎనిమిదింటికే వెళ్లి స్టేషన్లో కూచునే రకం. పదేళ్ల క్రితమే చావుని వెతుక్కుంటూ వెళ్లిపోయింది’ అన్నాడు. అతని మొహంలో విషాద ఛాయలేవీ కన్పించలేదు.
‘అంతటి బాధాకరమైన విషయాన్ని చల్లటి కబురేదో చెప్తున్నట్టు చెప్తున్నావేమిటి?’ అన్నాను ఆశ్చర్యంగా.
‘ఏం చేయమంటావు చెప్పు. చనిపోయిన వాళ్లతో మనమూ పోలేంగా. శ్వాస ఆడుతున్నంత కాలం బతకాలిగా. ఆ బతికేదేదో సంతోషంగా బతకొచ్చుగా. పోయిన వాళ్ల గురించో మన జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనల్ని తల్చుకుంటూనో మిగిలిన కాసింత జీవితాన్ని దుఃఖమయం చేసుకోవటం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏముంది? నేను రోజూ పడుకోబోయే ముందు చదివే భగవద్గీతలో చెప్పింది అదేగా’ అన్నాడు.
‘పదేళ్ల క్రితం అంటే తనకు నలభై ఐదేళ్లు మించి ఉండవు. ఏమైంది? ఏమైనా అనారోగ్యం కారణమా?’
‘అనారోగ్యమే.. మానసిక అనారోగ్యం. దానికి మందు లేదుగా’
‘వివరంగా చెప్పు’
‘అమ్మాయికి పెళ్లయిన రెండేళ్లకే విడాకులు. మంచి ఉద్యోగం, మనిషి చూట్టానికి బాగున్నాడని పెళ్లి చేశాం. వాడు పెళ్లాన్ని పీక్కుతినే శాడిస్ట్ వెధవని గుర్తించలేక పోయాం. దానికప్పటికే ఏడాది బాబు. నా కూతురు ధైర్యంగానే ఎదుర్కొంది. తను చేసే ఉద్యోగంలో, బాబు ఆలనా పాలనలో మనశ్శాంతిని వెదుక్కుంది. కానీ నా భార్యే తట్టుకోలేక పోయింది. బాగా మానసికంగా కుంగిపోయింది. అదే సమయంలో ఐఐటిలో మూడో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న మా అబ్బాయి హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయాడు. నేను వద్దంటున్నా వినకుండా నాతోపాటు మద్రాస్ వచ్చింది. బాబుని విగతజీవిగా చూసి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. దాంతర్వాత ఆర్నెల్లు కూడా బతకలేదు. చనిపోతే బాబుని ఆ లోకంలో కలుసుకోవచ్చనుకుందో ఏంటో... పిచ్చిది’
నాకు నోట మాట రాలేదు. గడ్డకట్టిన ఇంతటి విషాదంలో కూడా అప్పుడే విచ్చుకున్న లేత పువ్వులా నవ్వుతూ ఎలా బతగ్గలుగుతున్నాడు? భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞత ఇతనికెలా పట్టుబడింది? దాని కోసం సాధన చేశాడా... మునులు తపస్సు చేసినట్టు..
‘ఏంటలా మొహం పెట్టావ్? దిగులుకి పర్యాయపదంలా... బైటికొచ్చేయి. మనం ఇలా నష్టపోయిన ఏ నిమిషమూ మళ్లా తిరిగి రాదు. జీవితం దేవుడిచ్చిన అపురూపమైన వరం. అలాగని నాకు బాధ లేదనుకునేవు. గుండె లోతుల్లో ఘనీభవించిన దుఃఖం పదునుగా గుచ్చుకుంటూనే ఉంటుంది. కానీ అది నా దైనందిన జీవితానికి అడ్డు రాకుండా చాలా పొరల మధ్య దాచి పెట్టాను. జీవితం ఓ ప్రవాహం లాంటిది. మనల్ని దాంతోపాటు లాక్కెళుతూ ఉంటుంది. భార్యా పిల్లలూ కొంతకాలం మనతో కలిసి ప్రయాణిస్తారు. వాళ్ల సమయం ఆసన్నం కాగానే విడిపోయి కాలగర్భంలో కలిసిపోతారు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు. ఒకరు ముందూ ఒకరు తర్వాత... అంతే. అనివార్యమైన దాని కోసం ఎంతకాలమని బాధపడ్తాం చెప్పు. బతికున్నంత కాలం జీవితాన్ని జీవించడమే’ అంటూ నవ్వాడు.
నాకు భగవద్గీతలోని శ్లోకం ‘జాతస్య హి ధ్రువో మృత్యుః... న త్వం శోచితు మర్హసి’ సాకారమై ఎదుట నిలబడినట్టు అన్పించింది.
* * *
కాలేజీ వార్షికోత్సవం ముగిసింది. నేను తిరిగి ఢిల్లీ వెళ్లటానికి తయారయ్యాక నన్ను రైల్వేస్టేషన్లో దింపటానికొచ్చాడు సుధాకర్.
ట్రెయిన్ వచ్చాక వీడ్కోలు తీసుకోబోయే ముందు ‘నువ్వు రాయాలనుకుంటున్న పుస్తకాన్ని త్వరగా పూర్తి చేసి నాకో కాపీ పంపించడం మాత్రం మర్చిపోకు’ అన్నాడు.
‘నేనా పుస్తకం రాయాలనే ఆలోచనని విరమించుకున్నాను’ అన్నాను.
‘ఎందుకని?’ ఆశ్చర్యపోతూ అడిగాడు.
‘దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది ఏంటంటే నాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి దుఃఖ సముద్రాన్ని సంతోషంగా ఈదటం ఎలా అనే పుస్తకం రాసే అర్హత లేదు. అది నీలాంటి వాడికే ఉంది. రెండో కారణం ఏమిటంటే భగవద్గీత ఉండగా అటువంటి పుస్తకం రాయాల్సిన అవసరం లేదన్న జ్ఞానోదయం కావడం. శోక రాహిత్యమూ, ఆనంద ప్రాప్తియేగా గీత ప్రధాన లక్ష్యం. ఈ ప్రయాణం వల్ల నా కళ్లు తెరుచుకున్నాయి. నీకు మనసారా కృతజ్ఞతలు’ అన్నాను.
సుధాకర్ ఎప్పటికి మల్లె తెల్ల కలువలు విచ్చుకున్నట్టు పసిపిల్లాడిలా నవ్వాడు.

*
--
రెండు వందల కథలు అచ్చయినా.. ఇప్పటికీ కథ మొదలుపెడితే మొదటి కథ రాస్తున్నంత అలజడికి లోనవుతానంటున్న రచయిత సలీం, సున్నితమైన సామాజిక అంశాలే ఇతివృత్తంగా చేసుకోవడం ప్రత్యేకత. ఆయన రచనలకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిది కథా సంపుటాలు, పదకొండు నవలలు, మూడు కవితా సంపుటాలు ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన ‘కాలుతున్న పూలతోట’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇక ‘వెండిమేఘం’ నవల ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ. తెలుగు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా గౌరవాన్ని దక్కించుకుంది. బెంగళూరు విశ్వవిద్యాలయం వెలువరించిన ‘వరల్డ్ బెస్ట్ స్టోరీస్’ సంపుటిలో ఆయన కథ ‘ఆరో అల్లుడు’కు చోటుదక్కడం విశేషం. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలపై విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. తన కథకు బహుమతి వచ్చిందని తెలిసినపుడు, మొదటిసారి బహుమతి అందుకున్నప్పుడు కలిగినంత ఉద్వేగానికి లోనయ్యానంటారు సలీం.
--
సలీం
రూం నెం.206, ఆయకర్ భవన్
సివిల్ లైన్స్, నాగపూర్-440001.. 09849386327

సలీం