జనాంతికం - బుద్దా మురళి

పాన్‌షాపు-బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చూస్తుంటే ప్రభుత్వం నేరుగా పడక గదిలోకి సైతం దూసుకువచ్చేట్టుగా ఉంది?’’
‘‘వచ్చేట్టుగా ఏంటోయ్..! ఎప్పుడో వచ్చేసింది... స్మార్ట్ఫోన్ ఎక్కడి వరకు వెళితే అక్కడి వరకు మన నడక మీద నిఘా ఉన్నట్టే.. అదేదో యాప్ వచ్చిందట! భార్య ఎక్కడికెళుతోంది? ఏం చేస్తోంది? ఎవరితో మాట్లాడింది? ఏం మాట్లాడింది? ఇప్పుడెక్కడుంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ ఎంత సేపు ఉందో.. ఆ యాప్ చూస్తే మొత్తం తెలిసిపోతుందట! దంపతులు ఇలా ఒకరిపై ఒకరు నిఘా పెట్టడంలో మన దేశం టాప్ 3లో ఉంది..!’’
‘‘నేనంటున్నది ఆ విషయం గురించి కాదు. మనిషన్నాక స్మార్ట్ఫోన్ వాడాల్సిందే! స్మార్ట్ఫోన్ అన్నాక మన వ్యవహారాలన్నీ రికార్డు కావలసిందే! 50వేలు, లక్ష.. అంతేసి ధరలు పెట్టి కొన్న తరువాత కేవలం ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ కోసమే వాడం కదా? ఇలాంటి నిఘా సౌకర్యం లేకపోతే స్మార్ట్ఫోన్ ఎందుకు? బేసిక్ ఫోన్ సరిపోతుంది కదా?’’
‘‘సోవియట్ రష్యా మీడియాలో వెలిగిపోతున్న కాలంలో ఆ దేశంలో ప్రతి ఒక్కడిపైనా నిఘా ఉండేదని కథలు కథలుగా చెప్పుకునే వారు. నిఘా ఎక్కువే కావచ్చు కానీ ఏ దేశం కూడా తమ దేశంలోని ప్రతి పౌరుడిపై నిఘా ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కదా? ఇంతకూ నీ బాధ ఏంటో చెప్పనే లేదు..’’
‘‘స్మార్ట్ఫోన్ నిఘాను నేనేమీ వ్యతిరేకించడం లేదు. ఆహ్వానిస్తున్నాను. ఇటీవల ఏ నేరం అయినా స్మార్ట్ఫోన్‌లోని సమాచారంతోనే పోలీసులు ఛేదిస్తున్నారు. హైదరాబాద్ హయత్‌నగర్‌లో ప్రియుడితో కలిసి తల్లిని చంపిన అమ్మాయి కేసులో అసలు రహస్యం స్మార్ట్ఫోన్‌తోనే కదా బయటపడింది?’’
‘‘మరి దేన్ని వ్యతిరేకిస్తున్నావ్..?’’
‘‘నా జీవితం నా ఇష్టం. ఈ ప్రభుత్వానికి నా బెడ్‌రూమ్‌లోకి వచ్చే అధికారం లేదు’’
‘‘నీ బెడ్‌రూమ్‌లోకి ఎప్పుడొచ్చింది? ఎందుకొచ్చింది? ఏమా కథ?’’
‘‘మనింట్లో ఎంత బంగారం ఉండాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందట! మా ఆవిడ నడుముకు వడ్డాణం ఉంటే అది మా ఆవిడ ఇష్టం. మధ్యలో ప్రభుత్వానికి వచ్చిన నొప్పేంటి? మా ఆవిడ ఏడువారాల నగలు ధరిస్తే అది ఆవిడ ఇష్టం. మధ్యలో వద్దనడానికి మోదీ ఎవరు? అడగడానికి అమిత్ షా ఎవరు??’’
‘‘గట్టిగా మాట్లాడకురా..!’’
‘‘ఏం.. మోదీ వస్తాడని భయమా?’’
‘‘కాదు.. ఇద్దరిదీ ఒకే జీతం. నువ్వేమో మీ ఆవిడకు వడ్డాణం, ఏడు వారాలు నగలు చేయించావు. నేనేమో నెల జీతంతో ఇల్లు గడిస్తే చాలురా భవగంతుడా! అని మొక్కుకుంటున్నాను. వడ్డాణం మాట దేవుడెరుగు, వీసమెత్తు బంగారం కూడా కొనలేదు. ఎంతో కష్టపడి పావుతులం బంగారం చేయించాను. ఇప్పుడు నువ్వు గట్టిగా వడ్డాణం, వజ్రాల హారం అంటూ వరుసగా చెబుతూ పోయావనుకో.. మా ఆవిడ వింటే నాకూ చేయించమని వెంటపడుతుంది. చేయించలేను అంటే నీతో పోలుస్తూ ఎందుకూ పనికిరానివాడినని తిడుతుంది.’’
‘‘నువ్వు మీ ఆవిడకు పావుతులం బంగారం కొనిచ్చావా? అదృష్టవంతుడివి. పెళ్లయినప్పటి నుంచి నేను అవసరం అయినప్పుడల్లా బంగారం అమ్ముకోవడమే కానీ కొనివ్వలేదు’’
‘‘అదేంటి..? భార్య బంగారం అమ్ముకున్నావా?’’
‘‘అమ్ముకోలేదు. మణప్పురంలో తరచూ తనఖా పెట్టేవాడిని.. ఒకసారి బాగా ఆలోచించాను. ఇలా తనఖా పెట్టడం కన్నా అవసరం అయినప్పుడు అమ్మేసుకోవడమే మంచిదని లెక్క తేలింది. మనకు అర్థం కాని విషయాలు తెలిసిన వారు చెబితే వినాలి. మణప్పురంలో బంగారం తనఖా పెట్టడం ఎంత ఈజీనో వెంకటేశ్ చెప్పాడు. తనఖాలో ఉన్న బంగారాన్ని ఒక్క నిమిషంలో మార్కెట్ రేటుకు ఎలా అమ్మవచ్చునో రాధిక ఎంత బాగా చెప్పిందో అది నా మనసులో ముద్ర పడిపోయింది. నా అభిమాన నటి చెప్పిన మాట వినకుండా ఉంటానా? ఆ రోజుల్లో చిరంజీవితో కలిసి ఆమె స్టెప్పులు వేస్తుంటే నా సామిరంగా.. చూసి తరలించాల్సిందే. అన్ని రోజులు మనకు అంత వినోదాన్ని అందించిన రాధిక అడక్క అడక్క ఒక్కటే అడిగింది. తనఖాలో ఉన్న బంగారం అమ్మేయమని.. ఇక వినకుండా ఎలా ఉంటాను’’
‘‘అంటే- బంగారం అంతా అమ్మేశావా?’’
‘‘అంతా కాదు.. మంగళసూత్రం మినహా మిగతా అంతా అమ్మేశాను. నాకు పెద్దగా సెంటిమెంట్లు ఉండవు. మంగళసూత్రం కూడా అమ్మేద్దామని అన్నాను. కానీ లేడీస్‌కు సెంటిమెంట్ ఎక్కువ కదా? ఇవ్వనే ఇవ్వను అంది’’
’’ఓరి దరిద్రుడా! మంగళసూత్రం కూడా అమ్ముకునేంత అవసరాలు ఏమొచ్చాయిరా?’’
‘‘అవసరం కాదు అభ్యుదయం. ఏం..? మంగళసూత్రం ఉంటేనే దంపతులా? ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. మంగళసూత్రం కాదు అని నిరూపించాలని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒప్పుకోలేదు. నా బంగారం- నీకేందుకు బంగారం? అని మా ఆవిడను ఎంత బతిమాలినా వినలేదు’’
‘‘అంతేలే! వీసమెత్తు బంగారం కొనే తెలివి తేటలు లేని ప్రతివాడూ.. అమ్మాయిని బైక్‌మీద తిప్పడానికి పెట్రోల్ డబ్బుల కోసం తండ్రి ముందు దీనంగా చేయిచాచే వాడు కూడా- అమ్మాయి కనిపించగానే ‘బంగారం’ అంటాడు.. ఐనా మంగళసూత్రానికే ఎసరు పెట్టాలని చూసిన వాడివి. బంగారం ఎంత ఉండాలని గవర్నమెంట్ నిర్ణయిస్తే నీకేం బాధరా..?’’
‘‘అంటే- మన స్వేచ్ఛకు ప్రభుత్వం అడ్డు వస్తే సహిస్తానా? నేను ప్రపంచ పౌరుణ్ణి. మేధావిని. అడ్డుకొని తీరుతాను’’
‘‘అంతా నీలాంటివాళ్లే ఉండరులే! బంగారం కనిపించగానే అమ్ముకుని బతకాలని చూడరు. భారతీయులకు బంగారం అంటే ప్రేమ అని మోదీకి తెలియదా? అసలే ఆయన వ్యాపారుల స్వర్గ్ధామం అని చెప్పుకునే గుజరాత్ నుంచి వచ్చాడు. గుజరాత్ అంటేనే వ్యాపారం. బంగారం అంటే అందరికీ ప్రేమే.. అందులోనూ వ్యాపారులకు మరింత ప్రేమ. కనీసం ఒక కుటుంబంలో సభ్యులందరికీ కలిసి ఒక కిలో వరకైనా బంగారం ఉంచుకోవడానికి అనుమతి ఇస్తారు. అంతకు మించిన బంగారం ఉంటే లెక్క చూపమంటారు. అంతే తప్ప- మంగళసూత్రం ఎక్కడి నుంచి వచ్చింది అని లెక్కలు అడగరులే! నువ్వేం కంగారు పడకు. ఐనా కిలోల కొద్దీ బంగారం ఉండే సంపన్న వర్గాలు వౌనంగా ఉంటే, బంగారం కనిపిస్తే చాలు తనఖా పెట్టుకోవాలనుకునే నీలాంటి వాడు అంతగా కంగారు పడిపోవడం ఏమిటో..?’’
‘‘అంటే నా ప్లాన్లు ఫలించి.. బోలెడు సంపాదించి.. మా ఆవిడ కోరినట్టుగా ఏడువారాల నగలు, వడ్డాణం కొనాలంటే అప్పుడు బంగారంపై ఆంక్షలు ఇబ్బందిగా మారుతాయి కదా?’’
‘‘ముందు- ఆ పాన్‌షాపు వాడికి సిగరెట్ల అప్పు తీర్చు. నీ స్నేహితుడినైన పాపానికి నేను కనిపించినప్పుడల్లా నీ అప్పు గురించి గుర్తు చేస్తున్నాడు. ఆ అప్పు తీర్చిన తరువాత నువ్వుకొనే బంగారం గురించి ఆలోచిద్దాం.’’
*

buddhamurali2464@gmail.com