జనాంతికం - బుద్దా మురళి

తమాషా.. సీరియస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మనుషుల మీద రోజురోజుకూ నమ్మకం పోతోంది...’’
‘‘కావచ్చు.. కానీ ప్రపంచంలో నూటికో కోటికో ఒకరు మనలాంటి మిత్రులు ఉంటారు. నీ కోసం ప్రాణామిస్తాను...’’
‘‘ఇంకా వర్షాలు పడుతూ, పంటలు పండుతున్నాయంటే మనలాంటి మంచి మనుషుల వల్లనే అని నాకు తెలుసురా! నేనంటే నీకెంత నమ్మకమో. కానీ లోకం అలా లేదు. మనుషులను నమ్మేట్టుగా లేదు.’’
‘‘నీ చేతిలో ఏవో పేపర్లు ఉన్నాయి. కొంపదీసి చీటీ పాడుకున్నావా ఏంటి? నేను ష్యూరిటీలకు దూరం. అది నా విధానం. నేనెవరికీ ష్యూరిటీ సంతకం చేయను, చేయమని అడగను. మా ఆవిడకు ఈ సంగతి తెలిసిందో.. ఇక నన్ను ఇంట్లోకి రానివ్వదు. మా బావమరిది ఆఫీసులో పనిచేసే పగిడిపాల సుధీర్‌రావు తెలుసు కదా? ఇలానే తెలిసిన మిత్రుడే కదా? అని ష్యూరిటీ సంతకం పెడితే, వాడిమో చీటీ ఎత్తుకొని డబ్బులు ఇవ్వకుండా పోయాడు. వీడు నెల నెలా ఆ డబ్బులు కట్టక తప్పడం లేదు. ష్యూరిటీ సంతకం అనగానే ఏదో సినిమా హీరో ఆటోగ్రాఫ్ ఇచ్చినట్టు పోజులు కొట్టి సంతకం చేస్తాం- కానీ ఆ తరువాత ఉంటుంది అసలు కథ. అందుకే నేను ష్యూరిటీ సంతకం చేయనంటే చేయను.’’
‘‘ష్యూరిటీ గురించి ఎవరడిగారు? అంత కంగారు పడుతున్నావు. నువ్వే తెలివైన వాడివా? నేనూ తెలివైన వాడినే. మా అబ్బాయి లోన్ తీసుకుంటేనే ష్యూరిటీ సంతకం చేయలేదు. ఇక బయటి వాళ్లకు చేస్తానా? ’’
‘‘మరి మనుషుల మీద నమ్మకం పోయిందని దేని గురించి..?’’
‘‘ఓ అదా? టీవిలో తెగ నవ్వించేవాడు కదా? అతన్ని అంతా తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమారా సాత్ హై అని ప్రోత్సహించారు.’’
‘‘నిజమే.. నేనూ అంతే.. ఆఫీసులో ఎవడికైనా బాస్ మీద కోపం వచ్చి రాజీనామా చేస్తే అభినందిస్తాను. తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమారా సాత్ హై అని ప్రోత్సహిస్తాను. వాడు ఉద్యోగం వదిలేసి బయటకుపోతే ప్రమోషన్లలో మనకు పోటీకి ఒకడు తగ్గుతాడు కదా? ’’
‘‘నిజమే- నోటిమాటే కదా? పోయేదేముంది? నేను కూడా అంతే- రోజూ ఎక్కడపడితే అక్కడ తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమారా సాత్ హై అంటుంటాను. మొన్నో రోడ్డు మీద ఓ గుంపుకనిపిస్తే ఆ గుంపులోకి దూకి తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమారా సాత్ అంటూ గట్టిగా అరిచాను. అంతా నావైపు వింతగా చూశారు. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ గుంపంతా అతని చుట్టూ గుమిగూడి స్మార్ట్ఫోన్‌లతో ఫొటోలు తీస్తున్నారు. నాకేం తెలుసు? ఉద్యమం ఏమో అనుకుని గట్టిగా నినాదాలు చేశాను.’’
‘‘ఇంతకూ ప్రజల మీద నమ్మకం ఎందుకు పోయిందో చెప్పనే లేదు’’
‘‘ఓ వ్యక్తి నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఫేస్‌బుక్‌లో ప్రకటించగానే చాలామంది- అన్నా తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమారా సాత్ హై అంటూ ప్రోత్సహించారు. చాలామంది లైక్ చేశారు. కొందరు కామెంట్లు చేశారు. ఎంతోమంది అతని పోస్ట్‌ను షేర్ చేశారు. ’’
‘‘ఇవి కామన్ అన్నా! ఇలాంటి పోస్టులు ఫేస్‌బుక్‌లో రోజూ వస్తుంటాయి. పోటీ చేయడమే కాదు. చాలా పార్టీలు ఫేస్‌బుక్‌లోనే పుట్టి ఫేస్‌బుక్‌లోనే మాయమవుతాయి. ఇందులో కొత్తేముంది? కొన్నిసార్లు ఇలాంటి పోస్టులు వారికి మద్దతుగా కామెంట్లు చూసి గెలిచేస్తారేమో అనుకున్నాను. ఫేస్‌బుక్‌లో పుట్టిన కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారో ఫేస్‌బుక్‌లోనే చక్కగా వివరించారు. ఇంత సీనియర్‌నైనా నేనే అధికారంలోకి వచ్చేస్తారేమో అనుకున్నా కూడా.. అతని సంగతేమైంది?’’
‘‘వందల మంది లైక్ చేశారు. డజన్ల మంది కామెంట్లు చేశారు. ఎంతో మంది షేర్ చేశారు.’’
‘‘ఐతే?’’
‘‘ఎన్నికల్లో పోటీ చేసిన అతనికి తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమారా సాత్ హై అని ఎంతమంది అన్నారో కనీసం అన్ని ఓట్లయినా రావాలి కదా?’’
‘‘ఔను! రావాలి..’’
‘‘పోనీ- కామెంట్ చేసినంత మంది ఓట్లయినా రావాలా?’’
‘‘ఔను! రావాలి.. రాలేదా?’’
‘‘కనీసం షేర్ చేసినంత మంది ఓట్లయినా రావాలి కదా?’’
‘‘రాలేదా?’’
‘‘రాలేదు. లైకుల్లో పది శాతం ఓట్లు వచ్చినా చెప్పుకోవడానికి బాగుండేది. అందుకే మనుషుల మీద నమ్మకం పోతోంది. నా వెనక ఐదువేల మంది ఉన్నారనే ధైర్యం ఉండేది ఫేస్‌బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా’’
‘‘ఔను- నేను కూడా అలానే అనుకుంటాను’’
‘‘నువ్వూ నేనే కాదు.. కోట్లాది మంది ఇలానే అనుకుంటారు. మిత్రులు, కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఐదువేల మందితో భారీ కుటుంబం అనుకుంటాం.’’
‘‘ఔను- ఓ డజను మంది ఉండే ఉమ్మడి కుటుంబాలు అంతరించాయని బాధపడడం ఎందుకు? ఐదు వేల మంది ఉమ్మడి కుటుంబాన్ని చూసి మురిసిపోండి అని ఓసారి అద్భుతంగా రాశాను కూడా. చాలా మంది మెచ్చుకున్నారు. కుటుంబం ఫేస్‌బుక్ కుటుంబం అని పాట కూడా పాడుకున్నాం’’
‘‘కానీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు చూశాక, నా ఐదువేల మంది కుటుంబంలో ఎన్ని వేల మంది నాతో ఉంటారో అనే ప్రశ్న మెదడును తొలిచేస్తుంది’’
‘‘ఎన్ని వేలా?.. నీకో ఐడియా చెప్పాలా? అత్యవసరంగా పని పడింది ఓ వెయ్యి రూపాయల అప్పు ఇవ్వండి అని నీ జాబితాలోని అందరినీ అడిగి చూడు నీ బలం తెలుస్తుంది’’
‘‘మరి తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమారా సాత్ హై అని మద్దతు ఇస్తున్నారు కదా?’’
‘‘ఆ మద్దతు కామెంట్ల వరకే... మీడియా మద్దతుకే దిక్కు లేదు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎందుకు గెలుస్తారో మీడియాలో ఎంత అద్భుతంగా రాశారు. ఫలితాలు వారు రాసినట్టే వచ్చాయా? ’’
‘‘ఔను- ఉపఎన్నికలో పొరుగు రాష్ట్రం పార్టీ ఒకటి తడాఖా చూపిస్తుందని ఒకరోజు, ఈ విజయంతో తెలంగాణ మొత్తం ఆక్టోపస్‌లా అల్లుకు పోతుందని ఒక రోజు, ఫలితం వచ్చాక ఢిల్లీ పాలకులు ఆరునెలల్లో తెలంగాణను ఆక్రమించుకుంటారని ఒక రోజు, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని, రెండవ రాజధాని చేస్తారని రోజుకో జోస్యం చెప్పారు. ప్రజలంతా వీటిని కేవలం జోకులుగానే తీసుకుని ఎన్నికల్లో ఏం చేయాలో అది చేశారు. ’’
‘‘మరి దేన్ని నమ్మాలి అంటావు?’’
‘‘అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు స్కైలాబ్ పడి పోతుందని, భూమి కాలిపోతుందని తెగ భయపెట్టారు గుర్తుందా?’’
‘‘ఔను గుర్తుంది. అప్పుడు టీవీలు లేవు, సామాజిక మాధ్యమాలు లేవు. పత్రికలే తమ శక్తిమేరకు భయపెట్టాయి. ఇక భూమి అంతరించి పోతున్నప్పుడు గొర్రెలు, బర్రెలు ఎందుకని చాలామంది వాటిని అమ్ముకున్నారు. నచ్చింది తిన్నారు, తాగారు.’’
‘‘నిజమే- తీరా చూస్తే తుస్సు మంది.. తిన్నది తాగింది అరిగిపోయింది కరిగిపోయింది’’
‘‘అంటే ఏదీ నమ్మవద్దా?’’
‘‘తమాషాగా చూడాలి. సీరియస్‌గా తీసుకోవద్దు’’
*

buddhamurali2464@gmail.com