జనాంతికం - బుద్దా మురళి

ఉల్లి-హిందీ-తెలుగు ఆత్మగౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇఫ్పుడు ఎన్నికలు జరిగి ఉంటే తడాఖా తెలిసేది?’’
‘‘ఆర్టికల్ 370 రద్దు తర్వాతనా? ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవేమో? ఆ మధ్య ఓ జాతీయ మీడియా సర్వే జరిపి ప్రధాని మోదీ ఇమేజ్ పెరిగిందని, ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత సర్వే చేసి ఉంటే మోదీ గ్రాఫ్ ఇంకా పెరిగేదని చెప్పారు.’’
‘‘ఎప్పుడూ కశ్మీర్, పాక్, ఆర్టికల్ 370 గురించేనా? ఉత్తరప్రదేశ్ అంతలేదు పాకిస్తాన్. అక్కడ వాళ్లు తిండిలేక చస్తుంటే నువ్వేంటోయ్’’
‘‘మరి దేని గురించి?’’
‘‘బయట ఏం జరుగుతుందో? ఇంట్లో ఏం జరుగుతుందో?మార్కెట్‌లో ధరలెలా ఉన్నాయో ఒకసారి చూస్తే తెలిసేది?’’
‘‘మద్యం అమ్మకాలు ప్రభుత్వమే చేపట్టడంతో షాపుల వాళ్లు క్లియరెన్స్ సేల్స్ కింద డిస్కౌంట్ అమ్మకాలు జరిపితే.. యానాం వాళ్లే కుళ్లుకున్నారట!’’
‘‘చాల్లే బడాయి. మరీ అంతగా ఏమీ తగ్గలేదు. నేను మాట్లాడుతున్నది మద్యం ధరల గురించి కాదు. ప్రభుత్వాలను పడగొట్టే వాటి గురించి?’’
‘‘మద్యం ప్రభుత్వాలను పడగొడుతుందా? ఆ రోజులు పోయాయి. ఎన్టీఆర్ జమానాలో రాజకీయ ఉద్యమంగా మద్యనిషేధ ఉద్యమం వచ్చింది.. ఆ తరువాత మద్యం అమ్మకాల్లో తెలుగునాడు రికార్డు సృష్టించింది.’’
‘‘మద్యం రెండువైపులా కత్తిలాంటిది. ధర పెంచింది అమ్మకాలను నిరుత్సాహ పరచడానికే అని చెప్పవచ్చు. అదే సమయంలో ఆదాయం పెంచుకోవచ్చు. ధర తగ్గించమని ప్రత్యర్థులు అడిగితే.. ప్రజల పట్ల ఇదేనా మీ అభిమానం? వారు తాగితాగి పైకి పోవాలని కోరుకుంటున్నారా? అనవచ్చు. మద్యం అనేది రాజకీయాల్లో అధికార, విపక్షాలు రెండింటికీ ఎప్పుడూ కిక్కు ఇచ్చేదే. దశాబ్దంన్నర క్రితం ఉమ్మడి రాష్ట్రంలో మద్యనిషేధం కోసం ఉధృతంగా ఉద్యమించి అధికారం లోకి రాగానే నిషేధం ఎత్తివేసి ఆదాయం పెంచుకున్నారు.’’
‘‘మద్యం గురించి కాదని చెప్పాను కదా?’’
‘‘మరి దేని గురించి?’’
‘‘చూడోయ్.. మద్యం సీసా ధర రెండు, మూడు వేలైనా ఎవరూ పట్టించుకోరు. కిలో బీరకాయ వంద రూపాయలైనా, టమాటా రెండు వందల రూపాయలైనా..?’’
‘‘టమాటా అంటే గుర్తుకొచ్చింది. ఇండియా-పాక్‌ల మధ్య ఎగుమతి దిగుమతులు నిలిచిపోయాయి కదా? ఇప్పుడక్కడ టమాటా కిలో రూ. 150 అట! నాన్ (రొట్టె) కొనుక్కోలేం, టమాటా వండుకోలేం.. ఇదేంటి ఇమ్రాన్ భయ్యా? అని అంతా వాపోతున్నారు.’’
‘‘సినిమాల్లో స్వర్గాన్ని భూలోకానికి దించుతారనే నమ్మకం తెలుగు వారికి ఉండేది. క్రికెట్‌లో సంచలనాలు సృష్టించినట్టు ఇమ్రాన్ స్వర్గాన్ని పాక్‌లో దించుతాడనుకున్న వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. పరిపాలన, రాజకీయాలు, సినిమాలు, క్రికెట్ వేరు వేరు. క్రికెట్‌లో సిక్సులు కొట్టినవాడు అద్భుత పాలన అందిస్తాడనుకుంటే ఎలా? పిండికొద్దీ రొట్టె అన్నట్టు పాక్ ఆర్థిక స్థితి దరిద్రంగా ఉంటే పాపం జనం నాన్‌ల కోసం రోడ్డున పడితే- పిండిలేనప్పుడు ఇమ్రాన్ ఏం చేస్తాడు?’’
‘‘అతిగా ఊహించుకోవడం ప్రజల తప్పు.. కానీ ఇమ్రాన్ తప్పు కాదు .. అటుతిప్పి ఇటుతిప్పి మళ్లీ పాకిస్తాన్‌కు వెళతావేమిటి? నేను ధరల గురించి మాట్లాడింది పిండి, రొట్టెల గురించి కాదు’’
‘‘దేని గురించో..?’’
‘‘ఒకసారి మార్కెట్‌కు వెళ్లిరా! అధికార పక్షం గజగజలాడాల్సిందే’’
‘‘సస్పెన్స్‌లో పెట్టకు.. దేని గురించో చెప్పు?’’
‘‘ఉల్లిగడ్డల ధర కిలో 50 రూపాయలట! తేలిగ్గా తీసుకోకు.. దేశ వ్యాప్తంగా అలనాడు ఎమర్జన్సీకి వ్యతిరేకంగా జనం ఉద్యమించి జనతాపార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. జనతాపార్టీ ప్రభుత్వాన్ని మట్టికరిపించి తిరిగి ఇందిరా గాంధీని అధికారంలోకి తీసుకు వచ్చింది ఏమిటో తెలుసా? ఉల్లిగడ్డలు.. ఔను ఉల్లిగడ్డలే.. ఒక్కసారిగా పెరిగిన ఉల్లిగడ్డల ధరలను ఇందిరాగాంధీ వ్యూహాత్మకంగా వాడుకున్నారు. ఉల్లిధరల ఘాటు అటువంటిది. అందుకే- ఇప్పుడు విపక్షాలు ఉల్లిని నమ్ముకుంటే?’’
‘‘కిలో ఉల్లి రూ. 50 అయితే, బెండకాయలు, గోరుచిక్కుడు అంత కన్నా రెట్టింపు ధరలు పలుకుతున్నాయి. రైతుబజార్‌లో కనిపించే కూరగాయల జాబితాలో అన్నీ 50 రూపాయల పైనే ఉన్నాయి.’’
‘‘ కిలో టమాటా 150 రూపాయలు కావొచ్చు. కానీ రాజకీయాల్లో ప్రభావం చూపాలంటే ఉల్లి వల్లనే సాధ్యం. మిగతా వాటికి ఆ ఘాటు లేదు’’
‘‘అంటే- ఇప్పుడు మోదీ ప్రభుత్వం కశ్మీర్ కన్నా ఉల్లికే ప్రాధాన్యత ఇవ్వాలంటావు’’
‘‘నీకు నవ్వులాటగా ఉంది కావచ్చు. ఉల్లిని రాజకీయ ఆయుధంగా చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది’’
‘‘నవ్వు ఆపుకోలేక పోతున్నా. చూడోయ్- ఉల్లిధర ఎక్కువగానే ఉంది. కాదనడం లేదు. అంతకన్నా కొన్నిటి ధరలు ఇంకా పెరిగాయి. టమాట ధర ఒక్కోసారి వంద దాటుతుంది. మరికొన్ని సార్లు రూపాయికి కిలో అన్నా కొనేవారు ఉండరు. మనం ఎన్నిసార్లు చూడలేదు. రవాణా ఖర్చు కూడా దక్కక రైతులు టమాటాలను పారబోసి వెళుతున్నారని.. ఒక్క టమాటానే కాదు... ఉల్లి కూడా అంతే- సీజన్‌ను బట్టి ధర ఉంటుంది. అన్ సీజన్‌లో ఉల్లి రైతులకు రవాణా ఖర్చులు కూడా గిట్టవు. ధర పెరిగినప్పుడు ఎంతోకొంత వస్తుంది. మన రాజకీయం, మీడియా వల్ల ఉల్లి ధరపై అతి ప్రేమ చూపుతూ రైతులను దెబ్బతీస్తున్నాం.’’
‘‘రాజకీయ అంశం కాదంటావా?’’
‘‘ఒకసారి వేసిన బాణం రెండవ సారి పని చేయదు... ఒక ఆర్థిక నిపుణుడు దీనిపై బాగా చెప్పాడు. చెక్కు ఒక్కసారి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మళ్లీ మళ్లీ కాదు అన్నారు. హిందీ వ్యతిరేక ఉద్యమం, తెలుగు ఆత్మగౌరవం, మద్యనిషేధ ఉద్యమం.. ఏదైనా తీసుకో- ఒకసారి ప్రభావం చూపిన ఏ అంశం కూడా రెండవ సారి ప్రభావం చూపలేదు. అది ఉల్లి కావచ్చు, తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం కావచ్చు’’
*

buddhamurali2464@gmail.com