జనాంతికం - బుద్దా మురళి

మేధోకాయం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇంకెందుకోయ్ అంత దిగులు? మనం చిన్నప్పటి నుంచి జోకులేసుకునే వాళ్లం. కశ్మీర్ సమస్య, తెలంగాణ సమస్యకు ముగింపు ఉం టుందా? ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా? అని. దీనిపై సినిమాల్లోనూ డైలాగులున్నాయి. 2014లో తెలంగాణ సమస్యకు పరిష్కారం దొరికింది, మరో ఐదేళ్లకు కశ్మీర్‌కు ఏదో ఒక పరిష్కారం అయితే చూపారు. ఇది లాభమా? నష్టమా? అన్నది కాలమే చెబుతుంది. ఇంకా నీలాంటివాడు దీర్ఘంగా ఆలోచించాల్సిన సమస్య ఏముంది? అంత దిగులెందుకు?’’
‘‘దిగులు కాదు.. బాధ’’
‘‘అదే.. ఎందుకు?’’
‘‘తిని కూర్చుంటే మనిషికీ పశువుకూ తేడా లేదన్నాడో సినీ రచయిత. నేను తిని కూర్చునే రకం కాదు. దేన్నయినా దీర్ఘంగా ఆలోచించే రకం’’
‘‘ఓహో- మీ అబ్బాయి చదువు, ఉద్యోగం గురించేనా నీ దిగులు? వాడి చదువుకు తగ్గట్టు ఉద్యోగం వస్తుందిలే! దిగులు పడకు’’
‘‘నా ఇల్లు, మా అబ్బాయి, నా ఉద్యోగం అంటూ సంకుచితంగా ఆలోచించే వాణ్ణి కాను, మొత్తం ప్రపంచం గురించి ఆలోచిస్తా. మా అబ్బాయి ఇంకా చదువుతున్నాడా? ఉద్యోగం చేస్తున్నాడా? అనేదే నాకు తెలియదు. ఇక వాడి గురించి నాకెందుకు దిగులు?’’
‘‘మరచిపోయాను రోయ్! అసలు నువ్వే ఉద్యోగం చేయాలని ఆలోచించ లేదు. ఇక నీ కొడుకు గురించేం ఆలోచిస్తావ్! ఉద్యోగం చేసే భార్య, కావలసినంత సంపాదించి పెట్టిన తండ్రి నీకుండగా, ఉద్యోగం చేయాల్సిన ఖర్మ నీకేం? మరి నీ దీర్ఘాలోచన దేనికి?’’
‘‘అందాల కశ్మీర్‌ను చూస్తే బాధేస్తుంది’
‘‘ఏమైంది? బాంబుల వర్షం వినిపించడం లేదా?’’
‘‘తెలియకుండా మాట్లాడకు.. నేను సీరియస్ విషయాన్ని ప్రస్తావిస్తే నువ్వు సిల్లీ జోకులు వేయడం అస్సలు నచ్చలేదు’’
‘‘ఆర్టికల్ 370ని ఎప్పుడో రద్దు చేస్తే నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? ఇప్పుడు దిగులు పడుతున్నావ్’’
‘‘అప్పుడు కూడా బాధపడ్డా. మళ్లీ ఇప్పుడు దాని తరువాతి పరిణామాలపై బాధపడుతున్నా. కశ్మీర్‌లో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తారట!’’
‘‘మంచిదే కదా?’’
‘‘అంబానీలు కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు’’
‘‘టీవీలో ప్రధాని మోదీ ఉపన్యాసం విన్నా. ప్రత్యేకంగా తెలుగు సినిమా పరిశ్రమను ప్రస్తావించారు. కశ్మీర్‌లో సినిమా రంగం కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. ప్రధాని కోరినా సినిమా వారు స్పందించకపోవడంపై ఆలోచిస్తున్నావా? ’’
‘‘వారి గురించి కాదు. ప్రధాన మంత్రి పిలుపునకు స్పందిస్తున్నట్టు అంబానీ ప్రకటించారు. కశ్మీర్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్టు చెప్పారు. ఎంత ఘోరం..? అంబానీ కోసమే కశ్మీర్‌లో 370 ఎత్తివేశారనే నా అనుమానం నిజమైంది.’’
‘‘అతిగా ఆలోచిస్తున్నావేమో!’’
‘‘అంబానీల కోసమేనా.. ఈ దేశంలో కోట్లాది మంది స్వాతంత్య్ర సమరంలో పోరాడింది. అంబానీ కోసమేనా గాంధీజీ తన జీవితాన్ని త్యాగం చేసింది. అంబానీల కోసమా స్వాతంత్య్రం లభించింది.’’
‘‘ఏదో సరదాగా జోకులేశా.. కానీ నీలో ఇంత ఆవేదన ఎప్పుడూ చూడలేదురా! పార్లమెంటుపై పాక్ ముష్కరులు దాడి చేసినప్పుడు కూడా నువ్వు బాధపడలేదు. ముంబయి పేలుళ్లను కూడా దీపావళి టపాకాయలు పేల్చినంత తేలిగ్గా తీసుకున్నావు’’
‘‘ఆగాగు- ముంబయి పేలుళ్లను నేనెప్పుడూ దీపావళి టపాకాయల పేలుళ్లలా చూడలేదు. దీపావళి నాడు ఇంటిముందు టపాకాయలు పేల్చడాన్ని నేనెప్పుడూ తీవ్రంగానే వ్యతిరేకించాను. దీపావళి పటాకుల కాలుష్యంపై ఎన్నిసార్లు సీరియస్‌గా మాట్లాడాను. మరచిపోయావా?’’
‘‘సారీ- మరచిపోయాను. పుల్వామాలో ఉగ్రవాదులు మన సైన్యంపై జరిపిన దాడిని కూడా సాధారణ విషయంగా తీసుకున్నావు.’’
‘‘అవన్నీ ఎప్పుడూ ఉండేవే! కానీ అంబానీ కశ్మీర్‌లో పెట్టుబడులు పెడతాననడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. ఇందుకేనా ప్రజాస్వామ్యం, ఇందుకేనా మన వ్యవస్థలు ఉన్నది.’’
‘‘అంటే- అంబానీ అక్కడ పరిశ్రమలు పెడితే ఉగ్రవాదుల కుటీర పరిశ్రమలకు ఏమైనా పోటీ అంటావా? ఐనా నాకు తెలిసి అంబానీలు అన్ని వ్యాపారాల్లో ఉన్నారు కానీ ఆయుధాలు తయారుచేయరు కదా? మరెందుకు ఆవేదన? అంబానీలు తమ పరిశ్రమల్లో యువతకు ఉపాధి కల్పిస్తే ఇక ఉగ్రవాదులుగా మారేందుకు యువత కొరత ఏర్పడుతుంది అంటావా? ఒకప్పుడు తెలుగునాట తీవ్రవాదుల సంఖ్య భారీగా ఉండేది. ఆర్థిక సంస్కరణల తరువాత అందులోకి రిక్రూట్‌మెంట్ లేక తీవ్రవాద రంగం మూత పడింది. కశ్మీర్‌లో కూడా అలానే జరుగుతుందంటావా?’’
‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయం ఆపలేరు. పరిశ్రమలు పెట్టి ఉగ్రవాదాన్ని నిర్మూలించలేరు..’’
‘‘బాగుందోయ్ నీ నినాదం. నీ బాధకు కారణం నాకు తెలుసు. అంబానీలు పెట్టుబడి పెట్టాలంటే ఒక్క కశ్మీరే ఉందా? ఆపిల్ తోటలు పెంచాలంటే కశ్మీర్‌లోనే సాధ్యం కానీ పరిశ్రమలు దేశంలో ఎక్కడైనా పెట్టవచ్చు. ఆయనేమీ ఆపిల్ తోటలు పెంచరు కదా?’’
‘‘నువ్వు పెట్టుబడి దారుల తొత్తువి’’
‘‘పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఏమన్నాడో చదివావా? పాక్ ప్రజలు పిచ్చివాళ్ల స్వర్గంలో ఉండద్దు. భద్రతా మండలిలో ఎవరూ దండలు పట్టుకుని మన కోసం (పాక్) వేచి ఉండరు. కశ్మీర్ విషయంలో ముస్లిం దేశాల వారు కూడా పాక్‌కు మద్దతు పలకక పోవచ్చు అన్నారు. ’’
‘‘ఏం చెప్పదలుచుకున్నావు?’’
‘‘నీ బాధ ఎందుకో తెలుసని అన్నాను కదా?’’
‘‘చెప్పు’’
‘‘ఎక్కువగా తింటే ఊబకాయం వస్తుంది. దేశం గురించి ఎక్కువగా వ్యతిరేకంగా ఆలోచిస్తే మేధోకాయం వచ్చినట్టు... నువ్వు మేధోకాయంతో బాధపడుతున్నావు...’’
‘‘నేనా? నువ్వా?’’
‘‘పాక్ మంత్రి ఖురేషి ఓ మాట అన్నాడు. ‘ఒక్కో దేశానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. వందల కోట్ల జనాభా ఉన్న భారత్‌లో చాలా దేశాలు పెట్టుబడి పెట్టాయి. మన కోసం వారు తమ ప్రయోజనాలను పణంగా పెట్టి భారత్‌ను వ్యతిరేకించరని చెప్పాడు. మేధోకాయంతో ఆలోచిస్తున్న నీకన్నా ఖురేషి చాలా ప్రాక్టికల్‌గా ఉన్నాడంటాను.’’ *

buddhamurali2464@gmail.com