జనాంతికం - బుద్దా మురళి

అర్ధసత్యం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఊరందరిదీ ఒకదారి ఐతే ఉలికి పిట్టది ఇంకోదారిలా.. సందట్లో సడేమియాలా..’’
‘‘దేని గురించి.. ?’’
‘‘దేశమంతా కశ్మీర్ గురించి ఆలోచిస్తుంటే వర్మ మాత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రయల్ శుక్రవారం రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. పైగా మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ సినిమానట’’
‘‘నాకు కేతిగాడు గుర్తుకొస్తున్నాడురా!’’
‘‘వాడెవడు? మన చిన్నప్పటి క్లాస్‌మెట్‌నా? అలాంటి పేరున్నవాడు నాకెవరూ గుర్తు రావడం లేదు’’
‘‘పూర్వం తోలుబొమ్మలాటల్లో ఉండేవాడులే! బంగారక్కను లోబరుచుకునేందుకు అల్లాటప్పగాడు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరూ రసపట్టులో ఉండగా కేతిగాడు ఊడిపడతాడు. కేతిగాడు ఒక్కదెబ్బ వేయగానే అల్లాటప్పా మాయమవుతాడు. తరువాత కేతిగాడు బంగారక్కను ఏడిపిస్తాడు అంటే పానకంలో పుడకలా అన్నమాట! పానకంలో పుడక ఐనా భరించవచ్చు, దాన్ని తీసిపారేసి పాయసం తాగేయవచ్చు కానీ శృంగారం రసపట్టులో ఉండగా.. మధ్యలో అడ్డొస్తే ఎంత ఇబ్బంది కరంగా ఉంటుందో? ఐనా ఇప్పుడా పురాణాలు చేప్పే వాళ్లు లేరు, వినేవాళ్లు లేరు. తోలుబొమ్మలాటలు అంతరించిపోయాయి.’’
‘‘దేశంలో హాట్‌హాట్ రాజకీయాలు సాగుతుంటే ఇంకా తోలుబొమ్మలాటలు, కేతిగాళ్ల గురించి ఎందుకులే.. కశ్మీర్ గురించి ఏ మంటావ్?’’
‘‘ఏం జరిగినా దేశానికి మంచి జరగాలని కోరుకుంటా. మంచే జరుగుతుందని అనుకుంటా’’
‘‘చాల్లే నీ హిపోక్రసీ.. దేశానికి మంచి జరగాలని కోరుకోకపోతే ఎవరైనా చెడు జరగాలని కోరుకుంటారా?’’
‘‘ఎందుకు కోరుకోరు..? ఇండియా చెడిపోవాలి, పాకిస్తాన్ బాగుపడాలని కోరుకునే వారు ఉంటారు.. తెలియనట్టు నటించకు’’
‘‘అది సరే- ఆర్టికల్ 370 రద్దుతో ఏమవుతుందంటావ్?’’
‘‘దేశమంతా ఉద్రిక్తతతో అట్టుడికిపోయిన సమయంలో.. ట్వంటీ-20 మ్యాచ్ మంచి ఉత్కంఠ రేకెత్తించిన సమయంలో...’’
‘‘ఊరించకు.. సాగదీయకు.. విషయం చెప్పు?’’
‘‘ఇమ్రాన్ ఖాన్ ఏం చేయాలో, ఎలా స్పందించాలో తెలియని సమయంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని అమిత్ షా చెప్పిన సమయంలో..’’
‘‘అబ్బా- అదే వద్దంటున్నా.. విషయం చెప్పు?’’
‘‘కశ్మీర్ పరిణామాలను అమెరికా ఆసక్తిగా గమనిస్తుండగా, ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో దీనికి సంబంధించి ఎన్ని వార్తలు వచ్చినా నన్ను మాత్రం ఒక వార్త బాగా నచ్చింది, ఆలోచింప జేసింది’’
‘‘ఏంటా వార్తా?’’
‘‘కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేయగానే స్టీల్ బర్డ్ కంపెనీ వాళ్లు అక్కడ హెల్మెట్ల తయారీ పరిశ్రమ పెడతామని ముందుకు వచ్చారనే వార్త’’
‘‘అందులో అంత ఆశ్చర్యపోవలసిన విషయం ఏముంది? ఆ పరిశ్రమ వల్ల మహా అయితే ఓ వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందేమో! ఇలా వెయ్యి మందికి ఉపాధి చూపే పరిశ్రమ ఏ రాష్ట్రానికైనా రోజుకొకటి వస్తుంది’’
‘‘విషయం అది కాదు. హెల్మెట్ల తయారీ పరిశ్రమ పెడతాం అని కంపెనీ వాళ్లు ప్రకటించగానే అభ్యుదయ వాదులు చూశారా? అమెరికా సామ్రాజ్యవాద కనుసన్నల్లో పనిచేసే పాలకులు పెట్టుబడి దారుల కోసమే ఆర్టికల్ 370 రద్దు చేశారని ప్రచారమైన వార్తలు నాకు భలే నచ్చాయి’’
‘‘అంటే నీ అభిప్రాయం కూడా అదేనన్న మాట! నీ ముసుగు తొలిగిపోయింది. నిజస్వరూపం తెలిసిపోయింది’’
‘‘ఔను- కొందరి ప్రచారంలో ఈ మాటలు కూడా ఉన్నాయి’’
‘‘నేను ప్రచారంలో ఉన్న మాటల గురించి కాదు, నీ గురించి చెబుతున్నా. నువ్వు కూడా ఆ పెట్టుబడిదారులనే సమర్ధిస్తున్నావు కదా?’’
‘‘నా సమర్ధన, వ్యతిరేకత వల్ల ఒక హెల్మెట్ ఎక్కువ తయారు కాదు. ఒకటి తక్కువ తయారు కాదు.!’’
‘‘తప్పించుకోక నిజం చెప్పు’’
‘‘పిచ్చోడా! పెట్టుబడిదారుడేమన్నా నీకూ నాకులా పని లేకుండా ఉంటాడనుకున్నావా? నిరంతరం తన సంపద ఎలా పెంచుకోవాలి? ఎలా పెరుగుతుంది? అని ఆలోచిస్తాడు.’’
‘‘దాటవేయాలని చూస్తున్నావు. ’’
‘‘సరే చెబుతాలే! ఆ మధ్య నెలకోసారో ఏడాదికోసారో అమరావతిలో పెట్టుబడుల సదస్సు నిర్వహించేవారు గుర్తుందా? తొలి సదస్సులో ఐదు లక్షల కోట్ల పెట్టుబడికి ప్రతిపాదనలు వచ్చాయని అప్పటి పాలకపక్షం చెప్పింది’’
‘‘ఆ సదస్సుకు అయిన ఖర్చు కూడా రాలేదని అప్పటి ప్రతిపక్షం చెప్పింది’’
‘‘బాగా గుర్తుంచుకున్నావు. పెట్టుబడి దారులు పెట్టుబడి కోసం ప్రతిపాదనలు చేయడం వేరు, వాస్తవంగా పెట్టుబడి పెట్టడం వేరు. చెట్టు మీద విస్తరాకులు కుట్టడం అనే మాట విన్నావా? పెట్టుబడి దారుడు కూడా ఎన్నో మాటలు చెబుతాడు. సైన్స్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మ్యాథ్స్ సిటీ, సోషల్ సిటీ అని ఎన్నో చెబుతాడు. కానీ రూపాయి ఖర్చు పెట్టేప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడు. ఆలోచనలు, ప్రకటనలు అన్నీ పెట్టుబడి రూపం దాల్చవు. ఆదాయం వస్తుందంటేనే పెట్టుబడి పెడతాడు. ’’
‘‘మరా ప్రకటన...?’’
‘‘ప్రకటనలకేం ఎన్నయినా చేయవచ్చు. ఆర్టికల్ 370 ఎత్తివేస్తున్నారనగానే ఏదో సంతోషంతో ఆ ప్రకటన చేసి ఉంటారు. వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఎంత పెట్టుబడి పెడుతున్నాం? లాభమెంత? రిస్క్ ఎంత? ఇక్కడే పరిశ్రమ ఎందుకు పెట్టాలి? ఇంకెక్కడైనా ఎక్కువ అవకాశాలున్నాయా? అని సవాలక్ష విషయాలు ఆలోచిస్తారు.’’
‘‘వారి పెట్టుబడి వారిష్టం కానీ ఆభ్యుదయ వాదుల ఆలోచనే చిత్రంగా ఉంది. అదేదో హెల్మెట్‌ల కంపెనీ వాడి కోసమే ఆర్టికల్ 370ని ఎత్తివేశారని, ఈ అద్భుత రహస్యాన్ని తామే బయటపెట్టామన్నట్టు భలే ప్రచారం చేస్తారు.’’
‘‘ఆర్టికల్ 370 ఎత్తివేయగానే అదేదో స్వర్గాన్ని భూలోకానికి దించేశామని ప్రచారం చేసుకునేవారొకరు. మనలో చాలామందికి ఘంటసాల పాటలు వినందే నిద్ర పట్టదు. అలానే కశ్మీర్ ప్రజలు రోజూ ఉగ్రవాదుల బాంబు దాడుల శబ్దాలను వింటూ హాయిగా నిద్ర పోయేవారు. ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా వారి సుఖాన్ని దూరం చేస్తున్నట్టుగా కొందరి ప్రచారం.’’
‘‘రెండు వర్గాల ప్రచారంలో ఏది నిజం అంటావు?’’
‘‘ఇద్దరివీ అర్ధసత్యాలే!’’
‘‘అంటే ఏదీ నిజం కాదు అంటావు?’’
‘‘కాదు. ఇద్దరివీ అర్ధసత్యాలే అంటాను. కళ్లతో చూడంది దేన్నీ సత్యంగా భావించనని అంటారు ఓషో ’’

buddhamurali2464@gmail.com