జనాంతికం - బుద్దా మురళి

సేద తీరేందుకో అరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ముఖంలో అంత వైరాగ్యం ఎందుకు?’’
‘‘చిత్రంగా ఉందే? మాటల్లో వైరాగ్యం కనిపిస్తుంది కానీ, ముఖంలో ఎక్కడైనా వైరాగ్యం కనిపిస్తుందా? ముఖంలో కనిపించేది దిగులు. వైరాగ్యం కాదు. ’’
‘‘భాషలో ఏముంది? భావం ముఖ్యం. నేనేం అడగాలనుకున్నానో నీకు అర్థం అయింది. అది చాలు. దిగులైతేనేం, వైరాగ్యమైతేనేం.. నువ్వు ఏదో ఆలోచిస్తూ దిగులుపడుతున్నావనేది మాత్రం నిజం’’
‘‘భాషలో ఏముంది? అని అంత తేలిగ్గా తీసేస్తావేం. భాషలోనే కదా ఉన్నదంతా.. ఏ పదాన్ని ఎలా పలకాలో అలానే పలకాలి. ఏ సందర్భానికి ఏం మాట్లాడలో అలానే మాట్లాడాలి.’’
‘‘సరే- ఇప్పటికే తెలుగు మాయమవుతోంది. నువ్విన్ని తప్పులు పట్టావంటే తెలుగంటేనే హడలి పోతారు. ఇంతకూ నీ దిగులైన ముఖారవిందానికి కారణం ఏమిటో చెప్పలేదు’’
‘‘విజయానికి ఐదు మెట్లు ’’
‘‘ఇప్పుడా పుస్తకం సంగతి ఎందుకు? ఏప్పుడో చదివేశాం. ఆ తరం యువతీ యువకులంతా అనేక సార్లు చదివేసి ఉంటారు.’’
‘‘విషయం అది కాదు. అప్పుడెప్పుడో 1920లో రచయిత డెల్‌కార్నిగ్ ‘హౌ టూ ఇన్‌ఫ్లుయెన్స్’తో శ్రీకారం చుట్టిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాని భాష లేదు, రాయని రచయిత లేడు. దాని గురించి కాదు. విజయానికి ఐదు మెట్లు ఉన్నాయి కదా?’’
‘‘ఔను.. యండమూరికి పోటీగా ఇంకోకాయన తాను ఇంకో మెట్టు పైనున్నాని చెప్పడానికన్నట్టు విజయానికి ఆరుమెట్లు అని రాసినట్టున్నాడు. పుస్తకాల షాప్‌లో కవర్‌పేజీ చూశానులే! ’’
‘‘ఐదు మెట్లయినా, ఆరుమెట్లయినా నడిచి వచ్చిన దారి డెల్‌కార్నిగ్ చూపిందేలే! విషయం అది కాదు.’’
‘‘అది కాదు.. అది కాదు అనడమే కానీ.. ఏదో చెప్పవేం?’’
‘‘విజయానికి ఐదు మెట్లు సరే కానీ పరాజయం పొందినప్పుడు సేద తీరేందుకు ఒక అరుగు ఉంటే బాగుండేదనిపించింది. ’’
‘‘అరుగులు అంటే గుర్తుకు వచ్చింది. పూర్వం ఊళ్లలో ఇంటి ముందు అరుగులు ఉండేవి. ఆ అరుగుల మీద చేరి ఎన్నో ముచ్చట్లు చెప్పుకునే వారు.’’
‘‘ఊళ్లలోనే కాదు బాబూ.. హైదరాబాద్ వంటి మహానగరాల్లో సైతం ఇలాంటి అరుగులు ఉండేవి. కావాలంటే సికిందరాబాద్‌లో శివాజీనగర్, నాలాబజార్, బూర్గుశెట్టి బజార్.. అబ్బో ఒకటీ రెండు అని కాదు. సికిందరాబాద్, హైదరాబాద్‌లలో ఇంకా రూపు మారని పాత గల్లీలకు వెళ్లి చూడు ఇప్పటికీ ఆ ఆరుగులు కనిపిస్తాయి.’’
‘‘్ఫట్‌ఫాత్‌లే మిగలడం లేదు. ఆ అరుగులు ఇంకా మిగలడం ఆశ్చర్యమే’’
‘‘్ఫట్‌ఫాత్ అంటే మనుషులు నడిచే దారి అంటే నిజమా? అని ఆశ్చర్యపోయే వారు కూడా ఉన్నారు తెలుసా? ఫుట్‌పాత్ అంటే దుఖాణాల వారు తమ షాపులు పెట్టుకొనే స్థలం అని, తోపుడుబండ్ల వాళ్లు పండ్లు అమ్మే స్థలం అని, బట్టల దుఖాణాల వారు షోకేస్‌లను నిలిపే స్థలం అని చాలా మంది అనుకుంటారు. అవి బాటసారులు నడిచేవని చెప్పి నమ్మించడం కష్టం.’’
‘‘వైరాగ్యం గురించి వదిలేసి అరుగులు, ఫుట్‌పాత్‌ల గురించి మాట్లాడేస్తున్నాం. ఇంతకూ వైరాగ్యం ఎందుకో? అదే.. నీ ముఖం దిగులుగా ఉంది ఎందుకో అని..’’
‘‘కాఫీ డే తెలుసు కదా?’’
‘‘పేరు తెలుసు కానీ నిజంగా అక్కడ రుచి గురించి తెలియదు. ఓసారి టివోలీ వైపు వెళుతుండగా భారీ వర్షం. వర్షం నుంచి తప్పించుకోవడానికి అక్కడున్న కాఫీ డే షాపు ముందు కాసేపు నిలబడ్డాం. అంతసేపునిలబడి ఒక కాఫీ కూడా తాగకపోతే పాపం షాపు వాడు ఫీలవుతాడని లోనికి వెళ్లాం. కాఫీ ధర చూసి ఈ ధరతో మన ఇరానీ హోటల్‌లో ఏడాది మొత్తం టీ తాగవచ్చునని బయటకు వచ్చాం. కాఫీ డేలో కాఫీ రుచి గురించి తెలియదు కానీ వారి మెనూలో ధరల ఘాటు తెలుసు’’
‘‘ఇప్పుడా సంగతి ఎందుకు కానీ? పాపం కాఫీ డే ఓనర్ సిద్ధార్థ ఆత్మహత్య ఒక్కసారి అందరినీ కలిచివేసిందనుకుంటున్నా’’
‘‘నిజమే.. నాకూ అలానే అనిపించింది. పిల్లల ఫీజులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న వారి వార్తలు చూశాం. అప్పుల నుంచి బయటపడలేక, తండ్రిని మద్యం మహమ్మారి నుంచి బయటపడేయలేక ఆత్మహత్య చేసుకున్న వారి వార్తలు చదివాం. కానీ వేల కోట్ల రూపాయల ఆస్తులు, వందల ఎకరాల కాఫీ తోటలు ఉండి, చిన్న వయసులోనే భారీ విజయాలను చవి చూసిన సిద్ధార్థ ఆత్మహత్య ఆశ్చర్యకరమే!’’
‘‘పాత సినిమాల్లో ఎన్టీఆర్, జగ్గయ్య వంటి వారు సంపన్నులని చూపాలంటే వారికి కాఫీ తోటలున్నట్టు చూపేవారు. అలాంటిది వందల ఎకరాల కాఫీ తోటలుండి, దాదాపు ఆరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించిన విజేత జీవితం ముగింపు అలా ఉండకూడదు’’
‘‘అమెరికాలో టాప్ బ్రాండ్ కాఫీ స్టార్‌బక్స్‌తో పోటీ పడిన కాఫీ డే విజేత జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడం ఏమిటో?’’
‘‘అమెరికా అంటే గుర్తుకు వచ్చింది. బాబు అమెరికా యాత్రలో ఉన్నారు కదా? కుటుంబంతో కలిసి ఒక కాఫీ షాప్‌లో హాయిగా కాఫీ తాగుతున్నారు. ఎంత ముచ్చటేసిందో ఎప్పుడు చూసినా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పిచ్చపిచ్చగా ఉందా? అంటూ మండిపడుతుండే వారు. ఇప్పుడు చూడు హాయిగా కుటుంబంతో కాఫీ సేవిస్తున్నారు. ఇలాంటి ఫోటో అంతకు ముందు ఎప్పుడైనా చూశావా? ఓడిపోవడం ఒక రకంగా ఆయనకు మంచే జరిగింది. జీవితాన్ని కుటుంబంతో గడపగలుగుతున్నారు.’’
‘‘నువ్వు అసందర్భంగా ఆ విషయం చెప్పినా, నేను నిజంగా అదే విషయం చెప్పాలనుకున్నాను. చక్రం తిప్పడమే కాదు. ఓడిపోయినప్పుడు దాన్ని స్వీకరించాలని అంటున్నాను. ’’
‘‘నువ్వు స్వీకరించినా? స్వీకరించక పోయినా విజయం విజయమే, ఓటమి ఒటమే’’
‘‘నిజమే కానీ నాణెం ఎగరేస్తే బొమ్మ పడొచ్చు, బొరుసు పడొచ్చు. అంత మాత్రాన నాణెం విలువ తగ్గదు. ఒకసారి బొమ్మ పడితే మరోసారి బొరుసు పడొచ్చు. అన్నిసార్లూ మనం అనుకున్నట్టు పడాలని లేదు. అనుకున్నట్టు పడకపోతే జీవితమే వృథా అనుకుంటే ఎలా? ’’
‘‘ఒడ్డున ఉన్నవాడు ఎన్ని నీతులైనా చెబుతాడు’’
‘‘అందుకే అంటున్నాను. విజయానికి ఐదు మెట్లే కాదు. ఓడిపోయినప్పుడు సేద తీరేందుకు అరుగులు కూడా అవసరం. ఇప్పుడు విశ్వం అరచేతిలో ఇమిడిపోతోంది కానీ, పరాజయం పాలైనప్పుడు ఓదార్చే మనిషి కనిపించడం లేదు. పరుగుల నుంచి అలసిపోయి కాసేపు సేద తీరే అరుగు కనిపించడం లేదు. అరుగు మీద సేదతీరితే- పోటీదారుడు మనల్ని దాటిపోతాడేమో అనే భయం మనల్ని వీడడం లేదు.’’
‘‘విజయ తీరం అనుకుని పరుగులు తీస్తున్నాం కానీ అది ఎండమావి అని గుర్తించడం లేదేమో అనిపిస్తోంది’’ *

buddhamurali2464@gmail.com