జనాంతికం - బుద్దా మురళి

‘మోసపోయే’ తెలివి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘న్యూస్ పేపర్‌ను మింగేసేట్టు చూస్తున్నావ్? ఏంటో అంత ఆసక్తి?’’
‘‘ఏమీ లేదు..’’
‘‘ఏమీ లేకపోతేనే అంతలా చూస్తావా?’’
‘‘చూడోయ్.. పేపర్‌లో ఒక్కొక్కరికి ఒక్కోటి నచ్చుతుంది. లోకో భిన్న రుచి అన్నట్టు మనం ఎడమ నుంచి కుడికి రాస్తే, ఉర్దూలో కుడి నుంచి ఎడమకు రాస్తారు.’’
‘‘అసలు విషయం చెప్పు’’
‘‘అక్కడికే వస్తున్నాను. కొందరు పత్రికల్లో చివరి పేజీలో ఉండే క్రీడావార్తలను ముందు చూస్తారు. కొందరు దినఫలాలు చూసిన తరువాతే మిగతా పేజీలు చూస్తారు’’
‘‘ఔను- చిన్నప్పుడు పత్రికల్లో సినిమా వార్తలు మాత్రమే చూసేవాళ్లం.’’
‘‘ఇంకొందరు క్రైం న్యూస్‌ను రాంగోపాల్ వర్మ పోర్న్ సినిమాలు చూసినంత తన్మయత్వంతో చదివేవారు.’’
‘‘ఔను తెలుసులే! టెక్నాలజీ పెరిగి అరచేతిలోనే ప్రపంచం అంతా కనిపిస్తున్నప్పుడు అన్ని వార్తలు పాత వార్తలుగానే అనిపిస్తుంటాయి. రోజురోజుకూ రాజకీయ నాయకుల లక్షణాలు నీలో ఎక్కువవుతున్నాయి. అడిగిన దానికి తప్ప అన్నీ చెబుతున్నావ్. ఇంతకూ ఏం చూస్తున్నావో చెప్పు. చెప్పకూడని, వినకూడని, చూడకూడని విషయాలా?’’
‘‘ఛ..ఛ.. అదేం లేదు. చూడకూడని విషయాలైతే గొప్పగా చెప్పుకునే వాడిని. చూడకూడని, వినకూడని, చెప్పకూడని విషయాలనే ఘనకార్యాలుగా చెప్పుకునే కాలం ఇది. నీకో విషయం తెలుసా? వయసులో ఉండగా బూతు సాహిత్యం చదవలేదని నాకు తెలిసిన రిటైర్డ్ ఉద్యోగి ఒకరు ఇప్పటికీ ఆవేదన చెందుతుంటాడు.’’
‘‘ఇదేం కోరిక? ఇది తీరని కోరికనా? ప్రపంచంలో టెక్నాలజీ ఎక్కువగా బూతు కోసం వినియోగిస్తున్నది మన దేశమే. పాతిక రూపాయలిస్తే బూతు పుస్తకాలు దొరుకుతాయి కదా?’’
‘‘ఇక్కడ పాతిక రూపాయలు అనేది సమస్య కాదు. ఈ వయసులో వెళ్లి బూతు పుస్తకాల గురించి ఎవరిని అడగాలి? ఎలా అడగాలి? అనేది ఆయన బాధ. కోరిక తీరకుండా పైకి వెళితే ప్రేతాత్మలుగా తిరుగుతారని ఎవరో చెప్పారట! అందుకు ఉండబట్టలేక మార్నింగ్ వాక్‌లో నాతో బాధ పంచుకున్నాడు.’’
‘‘ఇంతకూ అంత ఆసక్తిగా నువ్వేం చూస్తున్నావో చెప్పనే లేదు’’
‘‘ఆ రిటైర్డ్ ఉద్యోగికున్న వింత కోరిక లాంటిదే నాదీ. ఎవరికీ చెప్పకోయ్.’’
‘‘ఎవరికీ చెప్పను సరే.. ఆ కోరికేంటో ముందు నాకు చెప్పు’’
‘‘ఇదిగో పత్రికలో అంత ఆసక్తిగా చదవిన వార్త ఇదే. దేశగతిని మార్చే పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ముందు ఇలాంటి వార్తలు చదవనిదే నిద్ర రాదు.’’
‘‘ఆ వార్త ఏందో ముందు నాకు చూపించు’’
‘‘అది మెయిన్ పేజీలో కనిపించదు. జిల్లా అనుబంధం.. పిల్లపత్రికలో ఎక్కడో మూలకు ఉంటుంది’’
‘‘అదే చూపించు’’
‘‘ఇదిగో ఇదే..’’
‘‘ఏదీ.. ఇదేనా? 40శాతం రాయితీతో బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఇస్తామని చెప్పి, ఆన్ లైన్‌లో యాప్ ద్వారా డబ్బులు పంపితే చేతులెత్తేసిన కంపెనీ గురించిన వార్తనా? ఇదో వార్తనా? ప్రతి జిల్లాలో ప్రతి గల్లీలో ఇలాంటివి కామన్. ఇంతోటి వార్తలకు నువ్వు అంత ఆసక్తి చూపడం ఏంటోయ్’’
‘‘ముందే చెప్పా.. ఎవరిష్టం వారిది. ఇండియా తరఫున 11 మంది, పాకిస్తాన్ తరఫున 11 మంది క్రికెట్ ఆడుతుంటే అదేదో ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్టుగా కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోతారు. ఇండియా గెలిచినా వచ్చే లాభం లేదు, పాకిస్తాన్ నెగ్గినా పోయేదేమీ లేదు. అంతోటి దానికి నరాలు తెగే ఉత్కంఠతో కోట్లాది మంది ఆరోగ్యాన్ని, సమయాన్ని వృథా చేసుకుంటే లేని తప్పు నామానాన నేను అలాంటి చిన్న చిన్న వార్తలు చూసుకుంటే నీకేం?’’
‘‘అది కాదు..తొక్కలో వార్తలు అలాంటివి రోజూ వస్తాయి కదా? నీకందులో అంత ఆసక్తి ఏ ముంటుంది? అదేదో మొదటి సారి చూస్తున్నట్టు అంత ఆసక్తిగా ఏం చూస్తావ్’’
‘‘ఇది మొదటి సారి చూసిన వార్త అని అనలేదు. నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుటి నుంచి రోజూ పత్రికలు చదవడం నాకు అలవాటు. నాలుగు దశాబ్దాలు దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి వార్తలు బోలెడు చూశా. పత్రికల్లోనే కాదు చివరకు టీవీ సీరియల్స్‌లో, సినిమాల్లో కూడా ఇలాంటి మోసాలు చూశాను’’
‘‘నాకూ గుర్తుకొచ్చింది చాలా తెలుగు సినిమాల్లో ఇలాంటి బోగస్ స్కీమ్స్‌తో ప్రజలను మోసం చేయడం గురించి చూశాను’’
‘‘ఇప్పుడు కాదు- మూడు దశాబ్దాల క్రితం జస్పాల్ భట్టి చివరకు దూరదర్శన్‌లో సైతం ఇలాంటి మోసాలపై వ్యంగ్యంగా ఓ ఎపిసోడ్ అద్భుతంగా చూపించాడు’’
‘‘మరి అంత పాత చింతకాయ వార్తలపై నీకెందుకు ఆసక్తి’’
‘‘పిల్లికి బిచ్చం పెట్టని వారు, అపార జ్ఞాన సంపన్నులం అనుకునేవారు, టెక్నాలజీ వీరులు ఇలాంటి సిల్లీ మోసాలకు ఎలా గురవుతారా? అనేది నాకు ఇప్పటికీ అంత చిక్కని మిస్టరీ. నాలుగైదు దశాబ్దాల నుంచి మీడియాలో, సినిమాల్లో ఇలాంటి మోసాల గురించి హెచ్చరిస్తున్నా- అలాంటి మోసాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయంటే విచిత్రం కాకుంటే మరేంటి’’
‘‘అంత ఆసక్తి ఏంటి?’’
‘‘ఈ ప్రపంచంలో ఇంకా అపరిష్కృత మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. బర్ముడా ట్రైయాంగిల్ మిస్టరీని ఛేదించేందుకు దశాబ్దాల నుంచి పరిశోధిస్తూనే ఉన్నారు. ఐనా ఇప్పటికీ తేల్చలేదు. నాకైతే బర్ముడాలో రహస్యం కన్నా.. ఇలాంటి మోసాలే ఆసక్తి’’
‘‘ఇందులో మిస్టరీ ఏముంది? మోసం తప్ప’’
‘‘బంగారాన్ని మార్కెట్‌లో ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదా? ముక్కు ముఖం తెలియని వాడు- 40 శాతం తక్కువ ధరకు ఇస్తానంటే నమ్మే వారు ఉంటారనుకునే వాడి మేధస్సు మిస్టరీ కాదా? వీరి అమాయకత్వం అంత కన్నా మించిన మిస్టరీ కాదా? కడుపున పుట్టిన వారే తల్లిదండ్రులను పట్టించుకోరు, ఒకే తల్లి కడుపులో పుట్టిన వారు తోటి వారిని ఆదుకోని ఈ కాలంలో ఎవడో బంగారాన్ని సగం ధరకు ఇస్తాననడం, వీరు డబ్బులు పంపడం... అంటే మనుషుల ఆలోచనల్లో ఏదీ మిస్టరీ ఉంది. అది తెలుసుకుందామనే పత్రికల్లో అలాంటి వార్తలను రోజూ వెతుక్కుంటాను. నాకు రోజూ ఇలాంటి వార్తలు దొరుకుతూనే ఉంటాయి.
*

buddhamurali2464@gmail.com