జనాంతికం - బుద్దా మురళి

కాలమహిమ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మనం అనుకుంటాం కానీ, కాలం ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. గిరిబాబునైనా, మోహన్‌బాబునైనా మార్చేస్తుంది’’
‘‘ఎలా?’’
‘‘గిరిబాబు సినిమాల్లో ఎంతమందిపై ఆత్యాచారం చేశాడో, రౌడీగా ఎంత మందిపై దౌర్జన్యం చేశాడో.. హీరో చెల్లెలు అని కూడా జాలిచూపే వాడు కాదు. అతని కంట పడితే అంతే.. చివరకు హీరోయిన్లను కూడా వదిలేవాడు కాదు. మరిప్పుడు ఎంత బుద్ధిమంతుడిగా మారిపోయాడు. తాతయ్యగా మనవలకు బుద్ధి చెబుతున్నాడు. కుటుంబ విలువలు చెబుతున్నాడు. ఇదంతా కాలం తెచ్చిన మార్పు . వయసుడిగిన తరువాత తాతయ్యగా ఎంతగానో మారిపోయాడు. అంగులిమాల గుర్తుకు వచ్చాడనుకో..’’
‘‘దేని గురించి?’’
‘‘మోహన్‌బాబేమన్నా తక్కువ తిన్నాడా? గిరిబాబు తరువాత ఆ స్థానం స్వీకరించిది ఈ బాబే కదా? పిల్లలున్నారు. వారిని పెంచి పెద్ద చేసి హీరోలను చేయాలనే ఆలోచన వచ్చిన తరువాత ఆ పాడు పనులు మానేసి హీరో అయ్యాడు. ‘పెదరాయుడు’గా మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ అంతకు ముందు అన్నీ గిరిబాబు పనులే కదా? బాగా సంపాదించడం, కొడుకులు హీరోలు కావడం వల్ల తాతయ్య వేషాలు వేయడం లేదు కానీ ఉపన్యాసాల్లో తాతయ్య నీతులు కనిపిస్తున్నాయి. అందుకే అంటారు కాలం ఎలాంటి వారినైనా మార్చేస్తుందని..’’
‘‘దేశమంతా ఎగ్జిట్ పోల్, ఈవీఎంల ట్యాంపరింగ్ అని ఎన్నికల టెన్షన్‌లో ఉంటే నువ్వేంటి గిరిబాబు, మోహన్‌బాబు అంటూ ఫ్లాష్‌బ్యాక్ కథలు చెబుతున్నావు?’’
‘‘నేను కూడా ఎన్నికల గురించే చెబుతున్నా..’’
‘‘గిరిబాబుకు,ఎన్నికలకు సం బంధం ఏంటి?’’
‘‘వయసులో ఉండగా గిరిబాబు రేప్‌లు చేశాడు. వయసు మీరాక తాతయ్య పాత్రలో నీతులు చెబుతున్నాడు. రాజకీయాల్లో కూడా అంతే కదా? అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎంలకు స్వాగతం పలికిన వారు, ఓడిపోతామనిపించినప్పుడు వోటింగ్ యంత్రాలపై నమ్మకం లేదని అంటున్నారు. అలా అనేవారు గెలిచింది ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినప్పుడే కదా?’’
‘‘నిజమే కానీ.. గిరిబాబుకు, ఎన్నికలకు సంబంధం లేదేమో ’’
‘‘ఎందుకు లేదు? ఉంది.. దర్శకుడు ఏ పాత్ర ఇస్తే గిరిబాబు ఐనా, మహేష్ బాబు ఐనా ఆ పాత్రలో నటిస్తారు. విలన్‌గా నటించినంత మాత్రాన వాళ్లు నిజంగా విలన్లు కాదు. గయ్యాళిగా నటించే సూర్యకాంతంది దయాగుణం అని, షూటింగ్‌లో అందరికీ భోజనాలు తెచ్చేదని, దానధర్మాలు చేసేదని అమె గురించి సినిమా వాళ్లు కథలు కథలుగా చెబుతారు. ‘సిట్యువేషన్’ డిమాండ్ చేయడం వల్లనే అందాలను ఆరబోసినట్టు హీరోయిన్‌లు ఎన్ని సార్లు చెప్పలేదు?’’
‘‘ఆ ప్రకటనలతో రాజకీయాలకు, నాయకులకు సంబంధం ఏముంది?’’
‘‘నీకు ఇంకో ఉదాహరణ చెబుతా.. టెన్త్‌లో ఇప్పుడు ఒక్కో విద్యార్థికి వచ్చే మార్కులతో 80వ దశకం వరకు ఇద్దరు విద్యార్థులు పాసయ్యేవారు. పాసైన బృందం ప్రపంచాన్ని జయించినట్టు, ఆశ్వమేధయాగంలో అశ్వాలను పట్టుకుని కట్టేసినట్టు గల్లీల్లో మిగిలిన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి ఓదార్పు పేరుతో విజయోత్సవాలు జరుపుకునే వారు. ఆ రోజుల్లో సికిందరాబాద్ శివాజీ వీధి గల్లీలో ఒకావిడ చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది. మా వీధిలో పిల్లలందరూ ఫెయిల్ అయ్యారు. ఆ పిల్లలందరినీ కావాలనే ఫెయిల్ చేశారని అందావిడ. విజయం సాధించిన పిల్లలు విజేతలుగా నీరాజనాలు అందుకోవాలని ఆ గల్లీలోకి వెళితే, ఆ గల్లీలోని ఆవిడ-‘బోడి.. మీరు పాస్ కావడం ఏంటి? గవర్నమెంట్ కావాలనే మిమ్మల్ని పాస్ చేసి, మా వీధిలోని పిల్లలను ఫెయిల్ చేసిందని అనే సరికి అంతా నీరు కారిపోయారు. ఆవిడ అలా ఎందుకు అన్నారో ఇప్పుడు పోలింగ్ తరువాత, ఎగ్జిట్‌పోల్ తరువాత ఈవీఎంల గురించి కొందరి మాటలు వింటుంటే అర్థమైంది’’
‘‘నువ్వు ఒక్కటి కూడా అర్థమయ్యేట్టు చెప్పవా? నువ్వు చెప్పిన గిరిబాబు వ్యవహారమే అర్థం కాకుండా ఉంది. దాని గురించి ఆలోచిస్తుండగానే ఇప్పుడు సికిందరాబాద్ శివాజీ వీధి 1980 నాటి టెన్త్ ఫలితాల ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నావు. అసలు దీనికి, దానికి సంబంధం ఏమిటి? ఆవిడ నాలుగు దశాబ్దాల క్రితం అన్న మాటలకు నీకు ఇప్పుడు అర్థం కావడం ఏమిటో?’’
‘‘సంబంధం ఉంది. ఆ రోజు ఆవిడ అన్న మాటలు మా మిత్రబృందం ఉత్సాహాన్ని నీరుగార్చాయి. ఆమె మీద కోపం వచ్చింది. మా విజయాన్ని తట్టుకోలేక జెలసీతో అలా అంటోందని కోపం కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె దయార్థ్ర హృదయం అర్థమైంది’’
‘‘నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఎగ్జామ్ అన్నాక కొందరు పాస్ అవుతారు. కొందరు ఫెయిల్ అవుతారు. పాసైన వాడిని భుజం తట్టి విజేతగా అభినందించక పోతే వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఫెయిల్ అయిన వాడిలో ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా చూడాలి. ఆ రోజు ఆవిడ చేసింది అదే. మా గల్లీలో అందరినీ కావాలనే ఫెయిల్ చేశారు అనడం ద్వారా- మా తప్పేమీ లేదు. కావాలని కుట్ర పన్నారు అనుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం నిలబడుతుంది. సప్లిమెంటరీ పరీక్షలు రాసి సక్సెస్ అవుతాడు. ముందు ఆ పసిప్రాణాలు దక్కాలి. తరువాత విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయి. ఆమె చేసింది అదే’’
‘‘ఇప్పటి రాజకీయాలకు- గిరిబాబు, మోహన్‌బాబులకు సంబంధం ఏంటి?’’
‘‘అదే చెబుతున్నాను. సిట్యువేషన్ డిమాండ్ చేయడం వల్లనే హీరోయిన్లు ముద్దుసీన్లలో నటిస్తారు. గిరిబాబు రేప్ సీన్లలో నటిస్తాడు. కథ డిమాండ్ చేసినప్పుడు తాత పాత్రలో నటిస్తారు. నాయకులు కూడా అంతే టెక్నాలజీని కనిపెట్టిందే వారు అయి ఉండవచ్చు. కానీ సిట్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఈవీఎంలు పని చేయడం లేదు అనాలి. ’’
‘‘ఎందుకనాలి? ’’
‘‘శివాజీ వీధిలో ఆ కాలంలో టెన్త్ ఫలితాలప్పుడు ఆ పెద్దావిడ అలా ఎందుకందో ఈ నాయకులు కూడా అందుకే అంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆమె అలా అంటే.... ఓడిపోతున్నామని గ్రహించాక ఆ పార్టీ వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి- మన తప్పేం లేదు. ఈవీఎంల వల్ల ఓడిపోయాం కానీ ప్రజల వల్ల కాదు అని చెప్పడం ద్వారా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా చూసేందుకు అలా చెప్పాలి.. తప్పదు’’
‘‘అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేయడం కాదా?’’
‘‘నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు?’’
*

buddhamurali2464@gmail.com