జనాంతికం - బుద్దా మురళి

లోకం తీరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘లోకం బహు చిత్రమైంది?’’
‘‘నీకిప్పుడు తెలిసిందా? ఇంతకూ ఏ విషయమై నీకలా అనిపించింది? అంతా రాజకీయాల గురించి మాట్లాడుతుంటే నువ్వే మో లోకం చిత్రమైందని వేదాంతం మాట్లాడుతున్నావ్..’’
‘‘అంటే- నీ ఉద్దేశం.. రాజకీయాల్లో చిత్రాలు ఉండవా?’’
‘‘రాజకీయాల గురించేనా? నువ్వు గమనించిన ఆ చిత్రాలు ఏంటో చెప్పు?’’
‘‘నిజానికి రాజకీయాలను మించిన చిత్రాలు ఇంకెక్కడా ఉండవు. హిచ్‌కాక్ సినిమాను మించిన మలుపులు, చార్లిచాప్లిన్‌ను మించిన హాస్యం, సర్కస్‌ను మించిన ఫీట్లు రాజకీయాల్లోనే ఉంటాయి.’’
‘‘ఏవీ.. కొన్ని చెప్పు?’’
‘‘రాజకీయాల్లో ఆత్మగౌరవం నినాదం ఎక్కువగా వినిపిస్తుంది?’’
‘‘ఔను.. దీనికి శ్రీకారం చుట్టింది అన్నగారు’’
‘‘కాదు.. తమిళనాడు నుంచి అరువు తెచ్చుకున్నాం.’’
‘‘మొదలైంది ఎక్కడైతేనేం? విషయం చెప్పు’’
‘‘ఆత్మగౌరవాన్ని నినాదంగా మార్చి రాజకీయాల్లో ఒక ఆయుధంగా ప్రయోగించిన వారు కాళ్లు మొక్కించుకుంటారు. ఆత్మగౌరవం ఉన్న వాళ్లు కాళ్లు మొక్కుతారా? ఆత్మగౌరవాన్ని గౌరవించేవాళ్లు కాళ్లకు మొక్కించుకుంటారా?’’
‘‘మొన్న వర్మ వీడియో చూశాను. దాసరి నారాయణరావు వద్దకు వెళ్లినప్పుడు అంతా కాళ్లు మొక్కుతుంటే తాను దాసరిని కలువకుండానే వెనక్కి వచ్చేశానని చెప్పారు’’
‘‘ఆయనకు సుడి ఉంది, సినిమా అంటే మోజు ఉంది.. నాగార్జున అవకాశం ఇచ్చారు, కాలం కలిసొచ్చింది. సక్సెస్ అయ్యారు.. ఇప్పుడేం మాట్లాడినా చెల్లుతుంది లే! అడ్రెస్ లేని తమ్ముళ్లను అన్నగారు అందలం ఎక్కించారంటే కాళ్లు మొక్కడం అనే పని చేసినట్టే కదా?’’
‘‘దీనికీ వర్మ పరోక్షంగా సమాధానం చెప్పాడులే.. కాళ్లు మొక్కిన వారి కన్నా తాను దాసరిని వంద రేట్లు ఎక్కువ అభిమానిస్తానని, వారి కన్నా వంద రేట్లు ఎక్కువగా దాసరి సినిమాల గురించి వివరిస్తానని అన్నాడు’’
‘‘కాళ్లు మొక్కనందుకు దాసరి కూడా ఏమీ బాధపడలేదు. పైగా తన శిష్యుడు మోహన్‌బాబు సినిమా పంక్షన్‌లో- మోహన్‌బాబును తన కన్నా వర్మ గొప్పగా చూపించాడని బహిరంగంగానే మెచ్చుకున్నారు. ’’
‘‘నిజమే కానీ అంతా అలా ఉండక పోవచ్చు, ప్రతిభతో సంబంధం లేకుండా నా కాళ్లు మొక్కారా? లేదా? అనే దానికే ప్రాధాన్యత ఇచ్చేవారుంటే ?’’
‘‘పాపం.. అన్నగారిని కాళ్లు మొక్కిన వారే కిందకు లాగేశారు. అప్పటికీ వెంకయ్య నాయుడు ఈ విషయాన్ని తెదేపా అన్నప్రాసన నాడే చెప్పాడట! ఈ రోజు కాళ్లు మొక్కిన వాళ్లు రేపు కాళ్లు లాగేస్తారు అని...’’
‘‘ఎప్పుడో ముగిసిపోయిన కాళ్లు మొక్కుడు వ్యవహారాలు ఇప్పుడెందుకు?’’
‘‘రాంగోపాల్ వర్మ తన సినిమాతో ఈ జ్ఞాపకాలను మరోసారి తట్టిలేపాడు’’
‘‘వర్మ సినిమాతో ఆ పార్టీకి కష్టమే అంటారా?’’
‘‘లక్ష్మీపార్వతి గృహప్రవేశంతో అన్నగారి అధికారం పోయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో అల్లుడి గారికి గండం అంటావా?’’
‘‘నాకిలాంటి నమ్మకాలు లేవు. ప్రజలు మరీ అంత అమాయకులేం కారు. పరిపాలనను చూసి ఓటేస్తారు కానీ సినిమాలు చూసి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఓటు వేయరు.’’
‘‘అలా అని కాదు.. సీతమ్మను రావణుడి చెర నుంచి విడిపించేందుకు శ్రీరాముడు లంకకు వెళ్లేందుకు వంతెన నిర్మిస్తుంటే ఒక ఉడత మట్టిలో పొర్లి తనకు అంటిన ఆ ఇసుకను తీసుకు వచ్చి వంతెన నిర్మాణానికి ఇచ్చిందట.. తన వంతు సాయంగా.. రాజకీయాల్లో ఏ అంశం ఎలా ఎవరికి అనుకూలంగా ఉపయోగపడుతుందో, ఎవరి కొంప కూలుస్తుందో ఎవరికి తెలుసు?’’
‘‘సర్లే అదంతా మనకెందుకు? సినిమాను సినిమాగా చూద్దాం, నటులను నటులుగా చూద్దాం, నాయకులను నాయకులుగా చూద్దాం.. సరేనా?’’
‘‘నాకు తెలియక అడుగుతున్నా.. ఏమీ అనుకోవద్దు.. ఈ డైలాగు చాలా సార్లు విన్నాను. అర్థం అడిగితే నవ్వుకుంటారేమో అని అడగలేదు. నాలానే చాలా మందికి ఈ డౌటు ఉండొచ్చు.’’
‘‘ముందు డౌట్ ఏంటో అడుగు?’’
‘‘సినిమాను సినిమాగా చూడకుండా నాటకంలా చూస్తారా? టీవీ సీరియల్‌లా చూస్తారా? నటున్ని నటునిగా కాకుండా నాయకుడిగా చూస్తారా?’’
‘‘సినిమాను సినిమాగానే చూస్తారు కానీ... నటులను దేవుళ్లుగా చూడడం వల్లనే కదా? నటుడు సీఎం అయింది..’’
‘‘దశాబ్దాల క్రితం నాటి పరిస్థితుల వల్ల అలా జరిగింది కానీ ఆ తరువాత నటులను నటులుగానే చూస్తున్నారు. సినిమాను సినిమాగానే చూస్తున్నారు. ’’
‘‘నిజమే ప్రజలు తెలివైన వాళ్లు. మణిపూర్‌లో ఈరోమ్ షర్మిల గుర్తుంది కదా? పాతికేళ్లపాటు నిరాహార దీక్ష చేసి ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు 90 ఓట్లు వచ్చాయి. అంత కన్నా గొప్ప ఉద్యమకారులున్నారా? ఎవరైనా?’’
‘‘ఔను నిజమే.. ఎందుకలా జరిగిందంటావు?’’
‘‘ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇంతకు ముందు నువ్వే చెప్పావు కదా? సినిమాను సినిమాగా చూడాలని. ఇదే ఫార్ములా అన్నింటికీ వర్తిస్తుంది కదా? సినిమాను సినిమాగా చూసినట్టే ఉద్యమాలను ప్రజలు ఉద్యమాలుగానే చూస్తున్నారు. ఎన్నిలకను ఎన్నికలుగానే చూస్తున్నారు. అందుకే ఈ ఫలితాలు’’
‘‘అర్థం అయి, అర్థం కానట్టుగా ఉంది. అందుకేనా రోజూ పత్రికలు చూస్తే ఎన్నో పార్టీలు, సంస్థల ఉద్యమాల వార్తలు కనిపిస్తాయి. తీరా ఎన్నికల్లో వీళ్లకు డిపాజిట్లు కూడా దక్కవు. నిజంగానే ప్రజలు తెలివైన వాళ్లు.. వారికి ఏది ఏమిటో బాగా తెలుసు?’’
‘‘ఎవరితోనూ అనకు.. ప్రజలు తెలివైన వాళ్లే కాదు. కొందరు మరీ రాక్షసంగా ఉంటున్నారు.’’
‘‘ఏమా కథ?’’
‘‘మన చిట్టినాయుడు తెలుసు కదా? వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీకి కాబోయే వారసుడు. ’’
‘‘ఔను.. నా అభిమాన హీరో.. ఉపన్యాసాలతో నవ్విస్తాడు. ఏమైం ది...?’’
‘‘దాన వీర శూర కర్ణలో దుర్యోధనుడి పాపులర్ డైలాగ్ ఉంది కదా?’’
‘‘ఆ డైలాగు తెలియని తెలుగువాడెవరుంటారు?.. ఆచార్య దేవ! ఏమంటివేమంటివి జాతినెపమున సూత....’’
‘‘ఆ.. ఆ.. ఆ డైలాగును చిట్టినాయుడు తప్పుల్లేకుండా చెబితే పాలించే అధికారం మీకే అప్పగిస్తాం పో.. అని చాలెంజ్ చేస్తున్నారు’’
‘‘మరీ ఇంత దుర్మార్గమా? అంత కఠిన పరీక్షనా? జాలి లేని కఠినాత్ములు..’’
*

buddhamurali2464@gmail.com