జనాంతికం - బుద్దా మురళి

ప్రియాంక-ఎన్టీఆర్- వాణిశ్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘లక్నోలో ప్రియాంక రోడ్ షో అదిరిపోయిందట కదా..?’’
‘‘గజ్వేల్‌లో ఒంటేరుప్రతాప్‌రెడ్డి ప్రచార సభ ఫొటోను లక్నోలో ప్రియాంక సభగా చూపారని భాజపా ట్విట్టర్‌లో ఎద్దేవా చేస్తే, ఆ ఫొటో తీసేశారని పత్రికలో చదివాను’’
‘‘నేనేదో అడిగితే నువ్వేదో చెబుతున్నావు. ప్రియాంక అచ్చం ఇందిరా గాంధీలా ఉంటుంది కదా?’’
‘‘జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చినప్పుడు టీడీపీ ఎంపీ, నటుడు, దర్శకుడు శివప్రసాద్ దీనిపై చక్కని వివరణ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌ను అచ్చం ఎన్టీఆర్‌లానే ఉన్నాడని అంటున్నారు.. ఏమంటారు? అని అడిగితే ఆయన అచ్చం ఎన్టీఆర్‌లా ఉన్నాడని మీడియా 75 శాతం ప్రచారం చేస్తుంది. సినిమా వాళ్లు ఇంకో 15 శాతం కలిపేస్తారు. దీంతో 90 శాతం ఎన్టీఆర్‌లానే అనేస్తారు.. నిజానికి ఇద్దరి మధ్య పదిశాతం పోలికలు కూడా ఉండవని తేల్చేశారు. మన రాష్ట్రం వాళ్లను వదిలేసి మన గురించి అస్సలు తెలియని వారికి జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు మరో వంద మంది ఫొటోలు చేర్చి ఇందులో అచ్చం ఎన్టీఆర్‌లా ఉన్న ఫొటో ఎవరిది అంటే ఏ ఇద్దరి సమాధానం ఒకేలా ఉండక పోవచ్చు’’
‘‘సూటిగా అడిగినప్పుడు సూటిగా చెప్పాలి.. ప్రియాంకను చూడగానే ఇందిరా గాంధీ గుర్తుకు వస్తారా? రారా?’’
‘‘కాదు.. సావిత్రి గుర్తుకొస్తుందని నేను చెబితే నువ్వు ఒప్పుకుంటావా? ’’
‘‘ఇంతకూ ఏమంటావు?’’
‘‘జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం లానే... ఇందిరాగాంధీ గుర్తుకు వస్తుందని మనం, మీడియా, నాయకులు పదే పదే మనల్ని బ్రెయిన్ వాష్ చేస్తే గుర్తుకు రాకుండా ఉంటుందా?’’
‘‘అంటే- ఇందిరా గాంధీలా లేదా?’’
‘‘పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసిన ఇందిరతో పోల్చదగిన నాయకులు పుట్టలేదంటాను. ఎవరి అభిప్రాయం వారిది. రూపంలో, ఆలోచనలో, ధైర్యంలో ఇందిరాగాంధీతో పోల్చదగిన నాయకులు ఆమె కన్నా ముందు లేరు, తర్వాత లేరు! ’’
‘‘ఎమర్జన్సీ తరువాత జనతా పార్టీ ప్రయోగం విఫలమయ్యాక ఇందిర విశ్వరూపం చూపించినట్టు ప్రియాంక విజయం సాధిస్తుందని నాకనిపిస్తోంది. ’’
‘‘ఎన్టీఆర్ తెలుసు కదా?’’
‘‘నీకేమన్నా పిచ్చా.. ఎన్టీఆర్ తెలియని తెలుగు వాడుంటాడా?’’
‘‘కదా? మాయాబజార్, మిస్సమ్మ, పాతాళాభైరవి చూశావా?’’
‘‘మనకాలం నాటి ఆ సినిమాలు చూడని తెలుగువాడు ఉండడు. నువ్వే పార్టీ అయినా కావచ్చు. నువ్వు అల్లుడి అభిమాని కావచ్చు, మామ అభిమాని కావచ్చు. స్వయంగా నువ్వు అల్లుడివే కావచ్చు.. సినిమాల పరంగా ఎన్టీఆర్‌కు తిరుగులేదు. అలాంటి నటుడు లేడు.. ’’
‘‘కాదని ఎవరన్నారు? సరే- సామ్రాట్ అశోక్ అని ఎన్టీఆర్ సినిమా వచ్చింది. చూశావా?’’
‘‘గూగుల్‌లో వెతక్కు. ఆ పేరుతో ఓ సినిమా వచ్చింది. ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తరువాత 92 ప్రాంతంలో ఆ సినిమా వచ్చింది. నీకే కాదు చాలా మందికి ఆ సినిమా తెలియదు. యూ ట్యూబ్‌లో చూస్తావా? నీ వల్ల కాదు. ఎంత గొప్ప అభిమాని అయినా అరగంటకు మించి చూడలేడు. ఎన్టీఆర్ సినిమాలను లెక్కలేనన్ని సార్లు చూసిన వీరాభిమానులు సైతం ఈ సినిమాను ఒకసారి చూడడం కష్టమే. ’’
‘‘కావచ్చు.. ఐతే..’’
‘‘నూనూగు మీసాలతో తోటరాముడు రాజకుమారి కోసం పాట్లు పడడం, మాయల పకీరుతో యుద్ధం చేస్తుంటే... ప్రేమించిన అమ్మాయి కోసం ఆ యుద్ధం ఏదో మనమే చేస్తున్నట్టు లీనమై చూశాం పాతాళాభైరవిని. అది ఎన్టీఆర్ వయసులో ఉండగా వచ్చిన సినిమా. తాతకే తాతలా కనిపించే వయసులో మహావీరుడు అశోక సామ్రాట్టులా మనవరాలి వయస్సున్న నటితో అమ్మా అంటూ పలికే డైలాగులు విన్నప్పుడు నవ్వు వస్తుంది.. కానీ ఆ దృశ్యంలో లీనం కాలేకపోయారు. అందుకే ఆ సినిమా వచ్చిందని కూడా తెలియకుండా వెళ్లిపోయింది.’’
‘‘ఎన్టీఆర్ సినిమాలు సూపర్ హిట్టయితే ఏంటి? ఫ్లాపైతే ఏంటి? ప్రియాంక రాజకీయాలకు, ఎన్టీఆర్ సినిమాలకు సంబంధం ఏమిటి?’’
‘‘వాణిశ్రీ గుర్తుంది కదా? ’’
‘‘కడవెత్తుకెళ్లింది కన్నె పిల్ల అని, చెంగావి రంగు చీరకట్టుకున్న చిన్నది అంటూ అక్కినేని వెంటపడ్డప్పుడు వాణిశ్రీ అందాలు చూసి తరించిన తరం మనది. అప్పుడే ఎలా మరిచిపోతాం?’’
‘‘హీరోయిన్‌గా ఆమె శకం ముగుస్తున్న కాలంలో కాంతారావు ఆమె హీరోయిన్‌గా సినిమా తీసి నిండా మునిగిపోయి రోడ్డున పడ్డారు. పై లోకానికి వెళ్లే నాటికి కూడా ఆ కష్టాలు తీరలేదు’’
‘‘దానికీ దీనికీ సంబంధం ఏంటి?’’
‘‘చందమామ గుర్తుందా?’’
‘‘చందమామ పత్రిక తెలుగువారి జీవితాల్లో భాగం. మనకీ రోజు నాలుగు అక్షరాలు వస్తున్నాయన్నా, నాలుగు అక్షరాలు రాస్తున్నామన్నా చందమామ చూపిన దారే కదా?. చందమామను, తెలుగు వాడిని వీడిదీసి చూడలేం. ఆ నాటి చందమామ కాపీలు దొరుకుతాయంటే ఎక్కడికైనా వెళ్లేవాళ్లు ఉన్నారు తెలుసా? ఆ మధ్య ఓ పత్రికాయన పిల్లల కోసం పత్రిక తెస్తున్నానని ప్రకటిస్తే, అందరూ తిరిగి చందమామ రోజులు రావడం ఖాయం అనుకున్నారు. ’’
‘‘చందమామ మూత పడింది కదా? భారీ ఆశలతో ఎవరో చందమామను కొని కొత్త హంగులతో ప్రచురించి నడపలేక మరోసారి మూత పడేశారు.’’
‘‘ప్రియాంక భవిష్యత్తు గురించి అడిగితే నువ్వు ఆ ఒక్కటి తప్ప అన్నీ చెప్పావు. పాత జ్ఞాపకాలు గుర్తు చేశావు’’
‘‘ఇంకా అర్థం కాలేదా? ఇందిరమ్మ మరణించాక రాజీశ్ శకం, సోనియా శకం, రాహుల్ శకం చూశాం. పాతాళభైరవి కాలం నాటి ఎన్టీఆర్ వేరు. సామ్రాట్ అశోక్ కాలం నాటి ఎన్టీఆర్ వేరు. సామ్రాట్ అశోక్ బయ్యర్లు కూడా పాతాళాభైరవిలానే ఆ సినిమా నడుస్తుందని ఆశించి ఉండవచ్చు, నడవాలని కోరుకుంటే తప్పు లేదు. కానీ అలానే నడవాలని ఏమీ లేదు. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణల శకం ముగిసి బాలకృష్ణ శకం తరువాత అర్జున్‌రెడ్డి కాలంలో ఉన్న ప్రేక్షకులు, ఓటర్లు కాలానుగుణంగా స్పందిస్తారు.’’
‘‘ప్రియాంక ప్రభావం ఉండదంటావా..?’’
‘‘ఓటర్లు కాలానికి తగ్గట్టు స్పందిస్తారు అన్నాను. తమ కాలానికి ఏది ముఖ్యమో ఓటర్లు నిర్ణయించుకుంటారు. ప్రియాంక ఇందిరాగాంధీ అవుతుందా? రాహుల్ గాంధీ అవుతుందా? కాలమే చెబుతుంది’’
*

buddhamurali2464@gmail.com