జనాంతికం - బుద్దా మురళి

భూమి అంతరించేలోపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అదేదో టీవీ చానల్‌ను ఐదువందల కోట్లకు కొంటున్నారట!’’
‘‘ఏరా.. నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?’’
‘‘బాబాయ్.. చానల్ అమ్మకం గురించి చెబుతుంటే నువ్వు..’’’
‘‘ఒక తెలుగు చానల్‌కు ఐదువందల కోట్ల విలువ ఉంటుందంటావా? నీకిలాంటి విషయాలు బాగా తెలుస్తాయిరా! ఐనా నెల రోజుల్లో అదృశ్యమయ్యే దానికి ఐదువందల కోట్లు పెట్టి ఎవరు కొంటారు? ’’
‘‘నెల రోజుల్లో అదృశ్యం కావడం ఏంటి?’’
‘‘ఒకటి రెండు రోజుల్లో తోకచుక్క భూమిని ఢీకొంటుంది. ఉపగ్రహం శకలాలు భూమిని తాకి మొత్తం భస్మం అవుతుంది. రెండు రోజుల్లో భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే కక్ష్యలోకి వస్తారు. దాంతో సూర్యుడి అహం దెబ్బతిని భూమిని ఆహుతి చేస్తాడంటూ నెలకోసారి ‘భూమి భస్మం అయ్యే’ వార్తలు చానల్‌లో తరుచుగా వస్తుంటాయి కదా? నెల రోజుల్లో మొత్తం భూమండలమే భస్మం అవుతుందని ఒకవైపు చానల్‌లో వస్తుంటే అదే చానల్‌ను వందల కోట్ల రూపాయలకు కొనేందుకు ముందుకు రావడం చూస్తుంటే వింతగా అనిపించడం లేదా? భూమే అంతరించి పోతుందని వార్తలు చెప్పే వారికే నమ్మకం లేకపోతే ఎలా? ఒకవేళ అది నిజమేనని నమ్మితే నెల రోజుల్లో అంతరించేప్పుడు అన్ని కోట్లకు అంటగట్టడం తప్పు కదా?’’
‘‘పో బాబాయ్.. అమాయకంగా ఇలా అన్నీ నమ్మేస్తే.. టిఆర్‌పి రేటింగ్ కోసం అప్పుడప్పుడు ఇలా భూమిని భస్మం చేసే వార్తలు తప్పవు. చానల్‌లో ఆ వార్తలు రాసేవారికి, చదివే వారికి, చానల్ ఓనర్‌కు వాటాదారులకు, చూసే వారికి అందరికీ అదో ఉత్తుత్తి వార్త అని తెలుసు. ఐనా వాటిని చూడడం అదో తృప్తి. ఆ వార్తలను ఎవరూ నీలా సీరియస్‌గా తీసుకోరు’’
‘‘ఏదో పాతకాలం మనుషులం. వార్తలంటే నిజమేనని నమ్మే రోజుల్లో పుట్టిన వాళ్లం. మా కాలంలో దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు వంద మంది మరణించారని దూరదర్శన్‌లో చెబితే, దూరదర్శన్ వంద అని చెప్పింది గనుక అంత కన్నా రెండు మూడు రెట్లు ఎక్కువే పోయి ఉంటారనుకునే వాళ్లం. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల క్రితం ఫ్లై ఓవర్ కూలి డజను మంది పోయారని మన చానల్స్ చెబితే ఒకరో ఇద్దరో పోయి ఉంటారనుకున్నారు. తీరా ఒక్కరు కూడా పోలేదు. ఒక్కరు కూడా పోక పోవడం ఏమిటని అప్పటి విపక్ష నేత ఆస్పత్రికి వెళ్లి మరీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరూ పోకపోతే వీళ్లే తోసేసి, ప్రాణాలు తీసేసి, అందరి కన్నా ముందు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాస్తారేమో అన్నంత నమ్మకం ఏర్పడింది.’’
‘‘పోనీలే బాబాయ్.. ఎవరి వ్యాపారం వారిది. ‘ఫెయిర్ అండ్ లలీ’ వాడితే వారం రోజుల్లో నల్లవాళ్లు తెల్లగా మెరిసిపోతారని, సంతూర్ వాడితే అమ్మమ్మలు కూడా ‘నేనా కాలేజీనా?’ అనేంత చిన్నవయసు వారిగా కనిపిస్తారని టీవీలో ప్రకటనలు వస్తాయి. వాటి మధ్యలో వార్తలు వస్తాయి.. ఇష్టం ఉన్నోళ్లు నమ్ముతారు లేని వాళ్లు లేదు. ప్రకటనను నమ్మి సంతూర్ సబ్బు కొనమని ఎవరూ బలవంతం చేయరు కదా? అలానే న్యూస్‌ను నమ్మమని బలవం తం చేస్తున్నారా? ’’
‘‘ఇన్ని విషయాలు తెలిసిన వాడివి నీకు ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదెందుకురా?’’
‘‘నా తెలివిని చూసి ఓర్వలేక పోతున్నారు. వారిని మించి పోతానేమోనన్న భయం..’’
‘‘ఔను.. అడగడం మరిచిపోయాను. ఏదో వింతగా కనిపిస్తున్నావ్! హెయిర్ స్టయిల్ మారింది. పిచ్చిచూపులు చూస్తున్నావు. కొత్తగా కళ్లకు అద్దాలు వచ్చాయి. మాటమాటకూ ముక్కు ఎగదీస్తున్నావు. కళ్లు మిటకరిస్తున్నావ్! అసలేమైందిరా! నీకు ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఉద్యోగం రానంత మాత్రాన జీవితం అయిపోయిందని అంత నిరాశ ఎందుకు? గంతకు తగ్గ బొంత అని నీ స్థాయికి తగ్గ ఉద్యోగం ఏదో ఒకటి దొరుకుతుందిలే!’’
‘‘అంతేలే బాబాయ్! రాంగోపాల్ వర్మ ఇదే స్టైల్‌లో ఉంటే ఆహా మేధావి.. ఓహో మేధావి.. అని అంతా పొగుడుతుంటారు. విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. నేను ఆయన్ని, ఆయన స్టైల్‌ను ఫాలో అవుతుంటే నీకేమో పిచ్చోడిలా కనిపిస్తున్నాను’’
‘‘ఓరి.. నీ వేషం. అదా కథ.. ఇంత చిన్న వయసులో ఏదో మాయరోగం పట్టుకుందనుకున్నా.. నీది మరీ అంత ప్రమాదకరమైన రోగమేమీ కాదులే... ఇప్పుడే మొదలైంది కాబట్టి చికిత్స చేయించుకుంటే తగ్గిపోతుంది’’
‘‘ అంటే వర్మకు తెలివి లేదా? మేధావులను చూస్తే మీకు కుళ్లు బాబాయ్. ‘‘
‘‘వర్మకు తెలివి లేదని నేనెక్కడన్నాను. వర్మకు నువ్వు అనుకుంటున్న దాని కన్నా ఎక్కువ తెలివే ఉంది. నీకు నువ్వు అనుకుంటున్నదాని కన్నా ఎక్కువ వెర్రి ఉంది’’
‘‘అర్థం కాలేదు బాబాయ్. వర్మను తెలివైన వాడు అంటూనే, వర్మను ఫాలో అవుతున్న నాకు వెర్రి అంటావేం?’’
‘‘ఇప్పటికప్పుడు నీకు ఓ పాతిక వేలిచ్చే ఉద్యోగమైనా దొరుకుందా? అంతదాకా ఎందుకు? మీ అయ్య నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపితే నీకు తిండి దొరుకుతుందా?’’
‘‘దొరక్కపోతే..’’
‘‘నిన్ను నమ్మి- ఓ ఐదువేలు అప్పిచ్చే తలమాసిన వాడెవడన్నా ఉన్నాడా?’’
‘‘లేకపోతే?’’
‘‘వర్మ తన తెలివితో భవిష్యత్తుకు ఢోకా లేదు అనేంతగా సంపాదించుకున్నాడు. ముంబయిలో ఖరీదైన ఆఫీసుంది. పెట్టుబడి పెట్టే మిత్రులున్నారు. వరుసగా సంచలనాత్మక పరాజయాలు ఇచ్చినా ఇంకా అతని మాటలు నమ్మి, తెలివిని మెచ్చుకుని అతనితో సినిమాలు తీసేవారున్నారు. అతనేం మాట్లాడినా అహా ఓహో అనే అభిమానులు ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా, పెట్టుబడి పెట్టేవాడు లేకుండా ఇవే మాటలు మాట్లాడితే వర్మనే కాదు ఎవరినైనా పిచ్చోడిలా చూస్తారు. వర్మనే ఫాలో అవుతున్నాను అంటున్నావు కదా? వర్మకున్న దానిలో నీకేముంది చెప్పు ?’’
‘‘అర్థం అయి, అర్థం కాకుండా ఉన్నట్టుంది బాబాయ్’’
‘‘చెప్పొచ్చేదేమంటే.. నెలకోసారి భూమి అంతరిస్తుందని చానల్ చెప్పినా, వర్మ సంచలన ప్రకటనలు చేసినా- వాళ్ల లెక్కలు, వాళ్ల వ్యాపారాలు వారికుంటాయి. ముందు నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. లేకపోతే వర్మకన్నా తెలివిగా మాట్లాడినా నిన్ను పిచ్చోడిలానే చూస్తారు. వెళ్లి ఉద్యోగం కోసం అవసరమైన నాలెడ్జ్ కోసం ప్రయత్నించు’’
*

buddhamurali2464@gmail.com