జనాంతికం - బుద్దా మురళి

మోదీ మహావిజయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సింహం వేటాడే ముందు వౌనంగా ఉంటుంది. దాని తోకలాగేందుకు ప్రయత్నిస్తే, పీక లాగేస్తుంది. ’’
‘‘ ఏ సినిమా? ’’
‘‘సినిమా కాదు రాజకీయ సింహం మోదీ సాధించిన ఘన విజయం గురించి’’
‘‘మోదీ విజయమా? ప్రధాని అయిన తరువాత ఢిల్లీ, బిహార్ ఎన్నికల్లో చివరకు సొంత రాష్ట్రంలో సొంత జిల్లా పరిషత్తు, తన నియోజక వర్గంలోని మున్సిపాలిటీలోనూ ఒటమే కదా?
ఓహో ప్రపంచ మంతా చుట్టడం పూర్తయ్యిందా? ప్రయాణ సౌకర్యాలు లేని కాలంలోనే 80 రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చినాయన గురించి చిన్నప్పుడే చదివాం కదా? 20 నెలల్లో ప్రపంచాన్ని చుట్టిరావడంలో వింతేముంది. అంతగా పొంగిపోతున్నావ్’’
‘‘విజయాన్ని మెచ్చుకోవడానికి మనసుండాలి. ఈ విషయం తెలిసినప్పుటి నుంచి నేను కమలాభిమానిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. పార్లమెంటరీ వ్యవస్థలోనే ఇది గొప్ప ఘన విజయం ’’
‘‘ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నాయకుడి గురించి మాట్లాడుతున్నంత ఉద్వేగంగా చెబుతున్నావ్’’
‘‘ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అన్ని దేశాలకు ముందో వెనకాలో స్వాతంత్రం ఇచ్చేసి బ్రిటీష్ వాళ్లు పెట్టే బేడా సర్దుకొని వెళ్లిపోతారని తెలిసిందే. నేను ప్రజలు సాధించిన విజయం గురించి మాట్లాడుతున్నా..’’
‘‘ ఓహో తెలిసింది ఉద్యమించి తెలంగాణ సాధించుకోవడం గురించే కదా? ఇందులో మోదీకేం సంబంధం ఉంది’’
‘‘ఎన్నో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ మొదటిది కాదు చివరిది కాదు ’’
‘‘అది కాదు’’
‘‘ఎక్కడో చాయ్‌లు అమ్ముకునే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడం ప్రజాస్వామ్య విజయమని చెప్పదలుచుకున్నావా? గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. టీ అమ్ముతూ టీ కొట్టు నుంచి పార్లమెంటుకు వచ్చినంత బిల్డప్ ఎందుకు? ఈ రోజుల్లో టీ కొట్టువాడు కనీసం కౌన్సిలర్‌గా కూడా పోటీ చేయలేడు.. మోదీ అమ్మే టీ రుచి చూసి దేశ ప్రజలు మంత్ర ముగ్దులై ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన మీరు గతంలో టీ ఎంత రుచికరంగా, అద్భుతంగా చేసి మమ్ములను అలరించారో అంత రుచికరంగా పాలించండి అని పార్లమెంటుకు పంపినట్టు చెబుతావేం. ’’
‘‘ నా పాయింట్ నువ్వు క్యాచ్ చేయడం లేదు. నరేంద్ర మోదీ సాధించిన అతి కీలక ఘన విజయం ఏంటో చెప్పుకో చూద్దాం’’
‘‘చెప్పా పెట్టకుండా పాకిస్తాన్‌లో వాలిపోవడమా? ’’
‘‘ అది కాదు..’’
‘‘ఎన్నికల ముందు చెప్పినట్టుగా నెల రోజుల్లో నల్లధనం తెప్పిస్తే ఒక్కొక్కరికి రూ.15లక్షలు వస్తాయన్నారు. బ్యాంకుల్లో వేసేశారా? ఎటిఎం కార్డు ఇంటావిడ దగ్గరే ఉంది. ధరలన్నీ తగ్గించేస్తానన్నారు. తగ్గాయా ఏంటి? ’’
‘‘ అబ్బా అది కాదయ్యా బాబు... దేశమంతా ఫేస్‌బుక్‌లో కోడై కూస్తున్న విషయం కూడా నీకు తెలియలేదంటే నమ్మలేకపోతున్నాను. అన్నా హజారే నాయకత్వంలో ఢిల్లీ కేంద్రంగా సాగడం వల్ల అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ప్రచారం లభించింది. నిర్భయ ఆత్యాచారంపై నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఐతే మోదీ సాధించిన విజయం ఎక్కడికక్కడే కేంద్రీకృతం కావడం వల్ల నీకు జనం రూపంలో కనిపించడం లేదు. పార్లమెంటు క్యాంటిన్‌లో ఎంపిలకు భోజనం, టిఫిన్ కారు చౌకగా లభించేది కదా?’’
‘‘ ఔను! వాటి ధరలు మరింతగా తగ్గించారా? ’’
‘‘కాదు...కాదు... అంబానీల కంపెనీలు ఎగ్గొట్టిన వేల కోట్ల రూపాయల గురించి, లక్షల కోట్ల స్కామ్‌ల గురించి కూడా పెద్దగా పట్టించుకోని విద్యావంతులైన యువత పార్లమెంటు క్యాంటిన్‌లో భోజనం చాలా తక్కువ ధరకు అమ్మడంపై జాతీయ స్థాయిలో ఉద్యమించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు దీనిపై సామాజిక మాధ్యమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమించారు. ఈ ఉద్యమాన్ని మోదీ పట్టించుకున్నారు. నీకు తెలుసా? ఇప్పుడు పార్లమెంటు క్యాంటిన్‌లో 33 రూపాయల మాంసాహార భోజనం ధర 60 రూపాయలకు పెంచారు. 18రూపాయల శాఖాహార భోజనం ధర 30 రూపాయలకు పెంచారు. ఎంపిల కు చౌకగా భోజనం ఎందుకని దేశవ్యాప్తంగా ఉద్యమించిన వారు ధరలు తగ్గించిన తరువాత మోదీ విజయాన్ని కీర్తించాల్సిన అవసరం లేదా? మీకింత కూడా కృతజ్ఞత లేదు. అయితే మా కమలాభిమానులే సామాజిక మాధ్యమాల ద్వారా మోదీ సాధించిన ఈ ఘన విజయాన్ని కీర్తిస్తున్నాం. నేను మాట్లాడుతుంటే ఏం చూస్తున్నావ్ ’’
‘‘ క్యాలిక్యులెటర్ చూస్తే కానీ మోదీ విజయాన్ని అంచనా వేయలేం.’’
‘‘ ఇప్పటికైనా ఒప్పుకున్నావు’’
‘‘ మోదీ ఘన విజయాన్ని లెక్కల్లో చెప్పమంటావా? ఎంపిలకు క్యాంటిన్‌లో తినడం తప్ప మరో పని లేదని అనుకుందాం. ఐదేళ్లు అంటే 1825 రోజులు. ఇంటికి, నియోజక వర్గానికీ వెళ్లకుండా క్యాంటిన్‌లో తినడమే జీవితంగా గడిపితే, ఒక్కో ఎంపి తన ఐదేళ్ల కాలంలో 1825 పూటలు తింటాడు. అంతా మాంసాహారమే తింటారని అనుకుందాం . ఒక్కో పూటకు 27 రూపాయల ధర పెరిగితే, ఐదేళ్లకు ఎంపికి 49వేల 275 రూపాయల తిండి వ్యయం పెరిగింది. మొత్తం 545 మంది ఎంపిల లెక్క చూసుకుంటే వాళ్ల ఐదేళ్ల నిరంతర తిండిపై 2కోట్ల, 68లక్షల, 54వేల 875 రూపాయలను ఆదా చేసినట్టు. వంద కోట్ల మంది భారతీయుల మోదీ సూపర్ మ్యాన్‌లా వచ్చి కష్టాలు కడతేరుస్తారని ఆశలు పెట్టుకుంటే రెండేళ్లలో రెండు కోట్ల వ్యయాన్ని ఆదా చేయడం ఘన విజయమే.’’
‘‘ మరేమనుకున్నావ్’’
‘‘ ఎంపి తిండి ఖర్చు ఐదేళ్లకు 49వేల 275 రూపాయలు పెంచిన మోదీ. వాళ్లకు నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం పెంచారు. సరే ఇంతకూ పార్లమెంటులో ఇడ్లి, వడ ధరలు అలానే ఉన్నాయా? లేకపోతే దక్షిణాది వారి వంటకంపై ఇంత చిన్న చూపా అని దక్షిణ దేశ వ్యాప్త ఉద్యమం జరుపుదాం.
ముక్తాయింపు: మేం భారతీయులం. ప్రజాప్రతినిధుల వేల కోట్ల రూపాయల కుంభకోణాలను సహిస్తాం కానీ క్యాంటిన్‌లో ఎంపిలకు తక్కువ ధరకు భోజనం పెడితే అంతర్జాతీయంగా ఉద్యమిస్తాం.