జనాంతికం - బుద్దా మురళి

కాలం మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈప్రభుత్వం ఒకటి రెండు రోజుల కన్నా ఎక్కువగా ఉండేట్టు లేదు’’
‘‘సరే ఇప్పుడు ఆ చానల్ మారుస్తున్నాను.. ఇప్పుడు వార్తలు చూసి చెప్పు..’’
‘‘ఎవడెంత గొడవ చేసినా పదేళ్ల వరకు అతనిదే అధికారం’’
‘‘అదేంటోయ్ క్షణాల్లోనే నీ అభిప్రాయం అంతగా మారిపోయింది’’
‘‘మరి నువ్వు చానల్ మార్చావు కదా?’’
‘‘అంటే చానల్‌లో వార్తలు ఎలా చెబితే అలానే కానీ నీకంటూ ఆలోచన ఉండదా?’’
‘‘అంతగా ప్రయోజనం లేని అంశాల గురించి ఆలోచించడం ఎందుకని...’’
‘‘చానల్ బుర్రతో కాకుండా నీ బుర్రతో నువ్వు ఆలోచిస్తే ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది’’
‘‘టీవీల్లో వార్తలు చూస్తుంటే రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ప్రభుత్వాలు పడిపోతాయని, దేశంలో మూడు రోజుల్లో పడిపోతాయని అనిపించడం సహజమే కానీ టీవీలు కోరుకున్నట్టు జరగవు.’’
‘‘ట్విట్టర్ సీఇఓ తాను ఉపవాసం ఉంటానని, యోగాసనాలు వేస్తానని చెప్పారట! టీవీలో స్క్రోలింగ్ వస్తోంది.’’
‘‘కావచ్చు... నీకేం అభ్యంతరం?’’
‘‘అభ్యంతరం కాదు. ఇప్పుడతన్ని మేధావులు బాయ్‌కాట్ చేస్తారా?’’
‘‘ఎందుకు? అతనేం తప్పు చేశాడు?’’
‘‘ఆయనెవరో స్వామీజీగారు చెప్పినట్టు యోగా చేయడం, ఉపవాసం చేయడం అంటే మేధావులు సహిస్తారా?’’
‘‘ఈయన ఉపవాసం చేస్తే, సహించని వారు దాన్ని వ్యతిరేకిస్తూ రోజుకు ఐదుసార్లు తినమను వద్దన్నదెవరు?’’
‘‘రోజుకు రెండుసార్లు తింటేనే అరగక పొట్ట, దానితో పాటు రోగాలు వస్తున్నాయనే చాలా మంది ఆహార అలవాట్లు మార్చుకుంటున్నారు. నువ్వేమో ఏకంగా ఐదుసార్లు తినమంటావేం? రోగాలు వస్తే ఎవరు బాధ్యులు’’
‘‘ఉపవాసం ఉంటే తప్పంటావు, రోజుకు ఐదుసార్లు తినమంటే తప్పంటావు. ట్విట్టర్ సీఇఓ తనకు నచ్చినట్టు చేస్తారు, మీ మేధావులకు వాళ్లకు నచ్చినట్టు చేసుకోమను’’
‘‘పోనీ భారత పౌరసత్వ సవరణ చట్టం పై నువ్వేమంటావు?’’
‘‘ఏమీ అనను?’’
‘‘్భయమా?’’
‘‘ఎవరికి?’’
‘‘అభిప్రాయం చెబితే ఎవరేమంటారో అని?’’
‘‘ఎవరికీ చెప్పను అంటే నీకో రహస్యం చెబుతాను. ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారికి, అనుకూలించే వారికి.. రెండు వర్గాలకు కూడా చట్టంలో ఏముందో తెలియదు’’
‘‘పోనీ నీకు తెలుసా?’’
‘‘తెలియదు’’
‘‘అదేంటి?’’
‘‘అదే చెబుతున్నాను... ఎవరికీ తెలియదు... తెలియకుండానే ఏదేదో మాట్లాడేస్తున్నారని మాత్రం తెలుసు.’’
‘‘గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ దీనిపై ఏమన్నాడో తెలుసా?’’
‘‘ఏమన్నాడో ఎవరికీ అర్థం కాలేదు అని తెలుసు?’’
‘‘చట్టాన్ని వ్యతిరేకించారు అని కొన్ని వర్గాలు, అనుకూలంగా స్పందించారు అని కొన్ని వర్గాలు, పార్టీలు స్పందించాయి. ’’
‘‘ఇంతకూ వ్యతిరేకించాడా? సమర్ధించాడా?’’
‘‘తాను ఏమన్నానో ఎవరికీ సరిగా అర్థం కాలేదేమో అనుకుని ఆయన తన ప్రకటనపై వివరణ ఇచ్చారు. ప్రముఖ పత్రికలో పావుపేజీ వివరణ ప్రకటన వచ్చింది’’
‘‘ఏమన్నాడు?’’
‘‘ఏమన్నాడో అర్థం చేసుకుందామని అక్షరం అక్షరం శ్రద్ధగా చదివితే అర్థమైంది ఏమంటే? ఆయన ఏం చెప్పదలుకున్నారో అర్థం కాలేదు’’
‘‘అస్సలు అర్థం కాలేదు’’
‘‘నీకో కథ చెబుతాను అర్థమవుతుంది? జర్నలిజంలో చిన్నప్పుడు వినిపించిన కథ ఇది’’
‘‘ఊరించకుండా చెప్పు?’’
‘‘ఓసారి పోప్ ఇంగ్లాండ్‌కు వెళుతుంటే అనుభవజ్ఞులు సలహా ఇచ్చారు. ఇంగ్లాండ్‌లో మీడియా మహా ముదురు. వివాదాల్లోకి వెళ్లకండి వారితో జాగ్రత్త అని చెబితే.. పోప్ నవ్వుకుంటూ వెళ్లిపోతారు. పోప్ విమానం దిగగానే విలేఖరులు వచ్చి... ఇంగ్లాండ్‌లో నైట్ క్లబ్‌లపై మీ అభిప్రాయం ఏమిటి? అని ప్రశ్నిస్తారు... మీడియా గురించి ముందే తెలిసిన పోప్ తెలివిగా ఇంగ్లాండ్‌లో నైట్ క్లబ్‌లు ఉన్నాయా? అని ప్రశ్నిస్తారు. మీడియా మాట్లాడకుండా వెళ్లిపోతుంది. భలే సమాధానం చెప్పానని పోప్ అనుకుంటారు. ఉదయం చూడగానే పత్రికల్లో పోప్ విమానం దిగి ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టగానే అడిగిన మొదటి ప్రశ్న ఇంగ్లాండ్‌లో నైట్‌క్లబ్‌లు ఉన్నాయా? అని అంటూ వార్తలు వస్తాయి. పోప్ అడిగింది, మీడియా రాసింది నిజమే అనుకుంటే నిజమే, అబద్ధం అనుకుంటే అబద్ధం... ఇప్పుడు సుందర్ పిచాయ్ చెప్పిన మాటలపై కూడా ఆయన చెప్పింది నిజమే వారు రాసింది నిజమే’’
‘‘ఒక కోణంలో ఆలోచిస్తే పోప్ నైట్‌క్లబ్‌ల గురించి ప్రశ్నించింది నిజమే కదా? అనిపిస్తుంది. కానీ నిజం కాదు. ఆయన ఉద్దేశం నైట్‌క్లబ్‌ల గురించి తెలుసుకోవడం కాదు..ఆయన ప్రశ్నలో ఉద్దేశం ఇంగ్లాండ్‌లో నైట్‌క్లబ్‌లు ఉన్నాయనే విషయం కూడా నాకు తెలియదు అని చెప్పడం.’’
‘‘మీడియా గురించి ఇది అప్పుడెప్పుడో చెప్పిన జోకు కావచ్చు కానీ ఇప్పుడు కొంత మారింది.’’
‘‘ఎలా?’’
‘‘అప్పటిలానే పోప్ ఇలా అడిగి ఉంటే సగం మీడియా ఒక రకంగా మరో సగం మీడియా మరో రకంగా రాసి ఉండేది.’’
‘‘ఇంతకూ ఏమంటావు?’’
‘‘గూగుల్‌ను ఎలా ముందుకు తీసుకు వెళ్లాలా? అని ఆలోచించాలి కానీ అర్థం కాని విషయాలపై అర్థం అయి కాకుండా మాట్లాడి... వివాదాల్లో చిక్కుకోవద్దు’’
‘‘ఈ విషయం తెలియకనే కదా? దీపిక చపక్ సినిమా దెబ్బతిన్నది’’
‘‘ఏమో తెలియదు కానీ 90 శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేవే... అందులో ఇదోటి’’
‘‘వాళ్లెవరో పిలుపు ఇచ్చినందువల్లనే సినిమా బాగా పోలేదంటున్నారు’’
‘‘ఒకరు పిలుపు ఇస్తే సూపర్ హిట్ కావడం, మరెవరో వ్యతిరేకంగా పిలుపు ఇస్తే ఫ్ల్లాప్ కావడం అంటూ ఉండదు. జనానికి నచ్చితే సినిమా చూస్తారు లేకపోతే లేదు. పిలుపులు పని చేయవు’’
‘‘దీపిక ఇంతకూ జెఎన్‌యుకు ప్రచారం కోసమే వెళ్లిందంటావా?’’
‘‘తెలియదు కానీ తన ఇష్టం తాను ఎక్కడికైనా వెళుతుంది. జనం ఇష్టం వారిష్టమొచ్చిన సినిమా చూస్తారు.’’
‘‘ఆమె జెఎన్‌యుకు వెళ్లిన వార్తను హైలెట్ చేశారు కానీ.. సినిమా విడుదయ్యాక... యాసిడ్‌ను షాప్స్‌లో విచ్చలవిడిగా అమ్మేస్తున్నారంటూ ఆమె స్ట్రింగ్ ఆపరేషన్ చేసినట్టు వీడియో విడుదలైంది చూశావా?’’
‘‘ మా చిన్నతనంలో సినిమాలు వంద రోజులు ఆడేవి. సగం రోజులు గడిచిన తరువాత చూసిన ప్రేక్షకులే మళ్లీ చూడడం కోసం ఒక పాటను కలిపే వా రు. కొన్ని దృశ్యాలు చేర్చేవారు. ముగింపు మార్చేవారు. ఆ రోజుల్లో సినిమా ఒక్కటే వినోద సాధనం కాబట్టి ఇవన్నీ బాగానే వర్కవుట్ అయ్యేవి. ’’
‘‘ఇప్పుడు కావా?’’
‘‘కాలేదు. చపక్ ఒకసారి పసక్ అయిందని తెలిశాక ఎన్ని స్ట్రింగ్ ఆపరేషన్లు చేసినా పని చేయలేదు.’’
‘‘అంటే ఆమె జెఎన్‌యుకు వెళ్లడం వల్లే అంటావా?’’
‘‘ముందే చెప్పాను. సినిమా నచ్చితేనే చూస్తారు కానీ ఆమె జెఎన్‌యు బృందానికి మద్దతుగా నిలిచిందా? వ్యతిరేకించిందా? అనేది పట్టించుకోరు. సినిమాను సినిమాగా చూసేవారే ఎక్కువ.’’
‘‘ఇంతకూ ఏమంటావు?’’
‘‘జనం ముందు జిమ్మిక్కులు పని చేయవంటాను.’’

-- buddhamurali2464@gmail.com