జనాంతికం - బుద్దా మురళి

గోడలు- ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వారాసిగూడకు వచ్చింది నిన్ను చూడడానికి అనుకున్నావా? కాదు కానే కాదు. బ్యాచిలర్‌గా ఉన్నప్పటి నుంచి మనం ఇక్కడ తిన్న వేడివేడి ఇడ్లీలను ఎప్పుడూ మరిచిపోను. ఎక్కడ తిన్నా ఆ రుచి రాదనుకో.. అయినా ఇవన్నీ నీకు తెలియనివా? కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. పద వెళదాం’’
‘‘అక్కడికి నేను రాను..’’
‘‘అదేంటిరోయ్ కాకినాడ సుబ్బయ్య హోటల్ అని బడాయి ప్రచారమే కానీ వారాసిగూడ చౌరస్తాలో ఇడ్లీలు తిన్నవాడు ఆ రుచి మరిచిపోలేడు అని ఎన్నిసార్లు అన్నావు అలాంటి నువ్వేనా నేనక్కడికి రాను అని మాట్లాడింది’’
‘‘రానంటే రాను..’’
‘‘అదే ఎందుకూ? రుచి తగ్గిందా?’’
‘‘కాకినాడ సుబ్బయ్య హోటల్ బ్రాండ్ నేమ్‌ను అమ్ముకుంటూ కూకట్‌పల్లి, అమీర్‌పేటల్లో బ్రాంచులు పెట్టారు. కానీ రుచి మాత్రం అబ్బే అని వెళ్లి వచ్చిన వారు పెదవి విరుస్తున్నారు. కానీ బ్రాండ్ నేం పుణ్యమా అని భారీ క్యూలు... కానీ వారాసిగూడ టిఫిన్ సెంటర్‌లో రుచికి తిరుగు లేదు’’
‘‘మరెందుకు?’’
‘‘వానిమీద నాకు మనసు విరిగింది? ఇక జన్మలో అటువైపు వెళ్లకూడదు అనుకున్నాను.’’
‘‘ఎందుకు విరిగిందో అర్థమయ్యేట్టు చెప్పు?’’
‘‘ఇరాన్ రక్షణదళం అధికారిని అమెరికా సైన్యం చంపేసింది కదా? దీనిపై నీ అభిప్రాయం’’
‘‘నాకెలాంటి అభిప్రాయం లేదు’’
‘‘ఇరాన్, ఇరాక్ వివాదాలపై ఏమంటావు?’’
‘‘మా ఆఫీసులో నా పక్క సీటులో కూర్చునే అప్పిగాడు, సుబ్బిగాడు కొట్టుకుంటేనే పట్టించుకోకుండా నా పని నేను చేసుకున్నాను. అలాంటిది ఎక్కడో ఉన్న రెండు దేశాలు దాడులు జరుపుకుంటే నాకేంటి. సుబ్బిది తప్పంటే అప్పికి కోపం, అప్పిది తప్పంటే సుబ్బి దూరమవుతాడు. అందుకే వాళ్లను అస్సలు పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటాను. కొట్టుకున్న వారం రోజులకే ఇద్దరూ కలిసిపోయారు. ఇరానీ హోటల్‌కెళ్లి వన్‌బై టూ టీ తాగుతున్నారు. కనీసం నన్ను పిలువ లేదు.’’
‘‘అదేదో యూనివర్సిటీ గొడవల గురించి నీ అభిప్రాయం?’’
‘‘పిల్లలు అన్నాక చదువుల్లో పోటీ ఉంటుంది. ఒకడికి ఒక మార్కు ఎక్కువ వస్తే టీచర్లు పక్షపాతం చూపారని తిట్టుకుంటారు. మళ్లీ కలుసుకుంటారు. దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. నువ్వడిగే కాలేజీలో అసలేం గొడవ జరిగిందో నాకు తెలియదు. కాబట్టి ఏ గ్రూపుది తప్పో నాకేం తెలుసు. ఐనా పిల్లలు కొట్టుకుంటారు. కలిసి పోతారు. పిల్లల గొడవలో పెద్దలు జోక్యం చేసుకోవద్దు’’
‘‘సోమాలియాలో ట్రంసీ గ్రూపులో వివాదాల గురించి నీ అభిప్రాయం’’
‘‘సోమాలియా అనే ఓ దేశం ఉందని పత్రికల్లో చదివా కానీ అంతకు మించి తెలియదు. ఆకలి చావులతో దేశం మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్నాను ఆ దేశంలో ఇంకా జనం ఉన్నారా?’’
‘‘పోనీ విప్లవ ప్రతిఘాతక శక్తులను ఎదుర్కోవడానికి ఆచరణాత్మక సిద్ధాంతంపై విబేధాల గురించి నువ్వేమంటావు?’’
‘‘ఇదోటి ఉందని తెలియదు. అస్సలు అర్థమే కాలేదు. ఇక అభిప్రాయం ఏ ముంటుంది?’’
‘‘పోనీ ఇజ్రాయిల్, పాలస్తీనాపై దాడులు జరపడాన్ని సమర్థిస్తావా?’’
‘‘ఆ దేశాలు ప్రపంచ పటంలో ఎటువైపు ఉంటాయో కూడా తెలియదు’’
‘‘ఇవే ప్రశ్నలు మన వారాసిగూడ టిఫిన్ సెంటర్ వాడిని అడిగాను’’
‘‘వాడేమన్నాడు?’’
‘‘ముందు అయోమయంగా చూశాడు. తరువాత చిరాగ్గా ముఖం పెట్టి టిఫిన్ అప్పు తీర్చమని నేనెప్పుడన్నా అడిగానా అన్నా! నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు. ఇప్పుడేం కావాలంటే అది తిని వెళ్లు నేనేమీ అనుకోను అంటూ ముఖం మీదే అనేశాడు.’’
‘‘కస్టమర్లు ఎక్కువగా ఉండడం వల్ల నా ప్రశ్నలపై దృష్టిసారించలేదేమో అనుకుని ఒక్కో ప్రశ్నను మళ్లీ వివరించడానికి ప్రయత్నిస్తే, బిజీగా ఉన్నాను. వెళ్లిరా.. ఆ మూలకు కూర్చోని కామ్‌గా తిని వెళ్లు అన్నాడు. మనం ఇంత కాలం టిఫిన్లు బాగున్నాయని మెచ్చుకున్నది ఇతన్నా అని మనసు విరిగిపోయింది. సామాజిక స్పృహ లేని టిఫిన్లు ఎంత రుచిగా ఉంటేనేం. చెట్నీలో ఉప్పు లేకపోయినా భరిస్తాను. గట్టి చట్నీ లేకపోయినా ఇడ్లీ తింటాను కానీ సామాజిక స్పృహ లేని వ్యక్తులను భరించలేను. అందుకే అతన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇడ్లీ లేకపోతే ఇరానీ హోటల్‌లో సమోసాలైనా తింటాను కానీ ఆ టిఫిన్ సెంటర్ మొఖం చూసే ప్రసక్తే లేదు.’’
‘‘పాపం నీకొచ్చిన కష్టం ఆ పగవాడికి కూడా రావద్దురా!’’
‘‘ఔను! ఆ టిఫిన్ సెంటర్ వాడిని అడిగిన ప్రశ్నలన్నీ నిన్నూ అడిగాను. నువ్వు కూడా సమాధానం చెప్పలేదు. అంటే నీకూ సామాజిక స్పృహ లేదన్నమాట! నిజంగా నీకు తెలియక చెప్పలేదా? చెప్పే ఉద్దేశం లేక చెప్పలేదా? అసలు నీ సిద్ధాంతం ఏమిటో చెప్పు?’’
‘‘చూడోయ్ నువ్వు అదృష్టవంతుడిని... నీ జీవితం వడ్డించిన విస్తరి. మీ అమ్మానాన్నలు మంచి ఉద్యోగాల్లో ఉండి నిన్ను చదివించారు. ఆ అదృష్టం నిన్నూ వరించింది. ఉద్యోగం చేయకపోయినా కాలుమీద కాలు వేసుకుని బతికేయగల కుటుంబానికి చెందిన నీకూ మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత ఉన్న నువ్వు సోమాలియా మొదలుకుని ఇజ్రాయిల్ వరకు అన్నింటిపైనా ఒక స్థిరమైన అభిప్రాయం కలిగి ఉండే అదృష్ట జాతకుడివి..’’
‘‘మనిషన్నాక ఆ మాత్రం సామాజిక స్పృహ లేకపోతే ఎలాగోయ్’’
‘‘నిజమే నీ అంత అదృష్టం అందరికీ ఉండదు కదా? ఈ దేశంలో చాలా మందిది ఆ టిఫిన్ సెంటర్ వాడి కథే.. నాదీ అంతే నెల నెల టార్గెట్లను ఎలా పూర్తి చేయాలని అనుక్షణం ఆలోచించే నాకు సోమాలియా గ్రూపుల గురించి, ఇరాన్ - ఇరాక్‌ల విబేధాల గురించి ఐఎస్‌ఎస్ విశాల హృదయం గురించి తెలుసుకునేంత సమయం ఎక్కడ దొరుకుంది. ఆ టిఫిన్ సెంటర్ వాడు సాంబారులో పప్పు సరిపోయిందా? పల్లీ చట్నీలో కారం సరిపోయిందా? అనే ఆలోచనకు మించి ఆలోచించలేడు. వాడి టిఫిన్ సెంటరే వాడి ప్రపంచం.’’
‘‘ఇలా ఐతే ప్రపంచం ఏమై పోవాలి?’’
‘‘నీకు తెలియని విషయం లేదనుకో కానీ నాకు తోచింది ఒకటి చెబుతాను. నా చిన్నప్పుడు1977 -78 ప్రాంతంలో హైదరాబాద్ మహానగరంలో గోడల మీద ఎక్కడ చూసినా జనతాపార్టీ గుర్తు నాగలి పట్టిన రైతు కనిపించే వాడు. ఆ పార్టీ సిద్ధాంతాలు, నినాదాలే కనిపించేవి. జనాతా పార్టీ ఘన విజయం ఖాయం అని అప్పటి నా చిట్టి బుర్ర ఒక నిర్ణయానికి వచ్చేసింది. తీరా ఫలితాలు చూస్తే జనతా అడ్రెస్ లేదు. ’’
‘‘ఐతే?’’
‘‘శేషన్ పుణ్యమా అని గోడల మీద రాతలు కనిపించడం లేదు. కానీ సామాజిక మాధ్యమాలు, టీవీలు, పత్రికలు ఆ పాత్ర పోషిస్తున్నాయి. అవి చూసి ప్రపంచం మునిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని కంగారు పడక, ఈ ప్రపంచానికి ఏమీ కాదు. గోడలు వేరు, ప్రజలు వేరు. ఎవడి జీవితం వాడికో యుద్ధం. జీవిత యుద్ధంలో తలమునకలై ఉన్న సామాన్యుడు నీ అంత తీరిగ్గా ప్రపంచ పరిణామాలపై దృష్టి పెట్టడు. ఎవడి జీవితం వాడికి ప్రపంచం.

buddhamurali2464@gmail.com