జనాంతికం - బుద్దా మురళి

కొత్త సంవత్సరానికి ‘కిక్కు’తో స్వాగతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాత్రి అలసట ఇంకా తీరలేదేమో! బాగా అలసిపోయినట్టున్నావు?’’
‘‘నేనేమీ అలసిపోలేదు.. బాగా ఎంజాయ్ చేశాను.’’
‘‘అంత పెద్దబరువు భుజం మీద మోసుకొస్తే అలసిపోకుండా ఎలా ఉంటావు’’
‘‘నేనా? బరువు మోయడమా? మా ఆవిడ ఇంట్లో మంచినీళ్లు గ్లాసు ఇటు తీసి అటు పెట్టమంటేనే నా వల్ల కాదంటాను’’
‘‘నువ్వే కాదు.. నీలాంటి చాలా మంది మగాళ్లు తిన్న ప్లేట్‌ను సింక్‌లో వేయడానికి కూడా బద్ధకిస్తారు. కానీ కొత్త సంవత్సరంలో మాత్రం వారి శ్రమ చూస్తుంటే- పగవాడికి కూడా అంత కష్టం వద్దనిపిస్తుంది.’’
‘‘కొత్త సంవత్సరం చాలా పిరికిది అనుకుంటా!’’
‘‘కష్టపడ్డాం అంటావు, పిరికిది అంటావు. అసలు నీకేమైంది? నీకెందుకొచ్చిందా అనుమానం? ఐనా ఇది తెలుగు సంవత్సరం కాదు. తెలుగులో అయితే వికార నామ సంవత్సరం అంటూ ఏవో పేర్లు ఉంటాయి. అలాంటి పేర్లు చూసి ఇది పిరికి సంవత్సరం, ఇది ధైర్య సంవత్సరం, విజయ సంవత్సరం అని పేర్లు పెట్టుకోవచ్చు. కానీ ఇంగ్లీష్ నూతన సంవత్సరానికి ఇలాంటిది సరిపోదు’’
‘‘సంవత్సరం తెలుగుదైనా, ఇంగ్లీష్‌దైనా- కొత్త సంవత్సరం చాలా పిరికిది అని నా నిశ్చితాభిప్రాయం.’’
‘‘పిరికిది కాకపోతే నీలాంటి వాళ్లంతా.. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి, కళ్లు మూతలు పడుతున్నా బలవంతంగా నిద్రను ఆపుకొని, మెలకువగా ఉండడానికి మందు కొట్టి, అర్ధరాత్రి తరువాత మీరంతా అండగా ఉంటే తప్ప కొత్త సంవత్సరం బయటకు రాలేదు.. అంటే పిరికిది కాకపోతే మరేంటి?’’
‘‘నీ అమాయకత్వం పాడుగాను.. కొత్త సంవత్సరం పిరికిది కాదు, ధైర్య వంతురాలు కాదు. తేదీ మార్పు అంతే.’’
‘‘మరి అంతోటి దానికి యుగాంతం అన్నట్టుగా మీరంతా మందు షాపుల ముందు ఆ తొక్కిసలాటల్లో వీరోచితంగా పోరాడి మందు సంపాదించడం ఏమిటి? అర్ధరాత్రి ఆ కేకలేంటి?’’
‘‘ఎవరి పిచ్చి వారికి ఆనందం. అర్ధరాత్రి వేళ మేం మేలుకొనే ఉన్నా, గాఢంగా నిద్రపోయినా కొత్త సంవత్సరానికి సం బంధం లేదు. ఎప్పటి మాదిరిగానే సూర్యోదయం, సూర్యాస్తమయం తప్పవు.’’
‘‘మీ రాకపోకలతో సంబంధం లేకుండా సూర్యోదయం, సూర్యాస్తమయం కావచ్చు కానీ, నువ్వు తాగి ఏ లారీ కిందనో పడితే నీ ఇంట్లో ఎప్పటి మాదిరిగానే సూర్యోదయం, సూర్యాస్తమయాలు కావు. కుటుంబం రోడ్డున పడుతుంది. నీ పిల్లలు అనాథలు అవుతారు.’’
‘‘అబ్బా.. ఇక చాల్లే! ఇక అర్ధరాత్రులు పిచ్చిగా తాగను.. సరేనా?’’
‘‘ఈ మాట చెప్పాల్సింది నాకు కాదు. మీ చిన్నారుల ముఖాలు చూస్తూ వారి భవిష్యత్తు ఊహిస్తూ వారికి చెప్పు?’’
‘‘ఒక్క రోజులోనే నాలుగు వందల కోట్ల రూపాయల మందు పీల్చేశారట! ఒక్క రాష్ట్రంలోనే ఇంత అయితే దేశంలో ఎంత? ప్రపంచంలో ఎంత? ఆ లెక్కలు ఎందుకు కానీ, తాగడం మొదలు పెట్టిన మొదటి రోజే దానికి బదులు ఆ డబ్బేదో నెల నెలా ఇనె్వస్ట్ చేస్తే మందుకు మించిన మత్తు లభించి ఉండేది.’’
‘‘ఇక తాగనని చెప్పాను కదా.. వదిలేయ్! తాగుడు అలవాటైనప్పటి నుంచి చేసిన ఖర్చు లెక్కపెడితే తాగిందంతా దిగిపోయేట్టుగా ఉంది’’
‘‘కస్టమర్ ఈజ్ గాడ్ అని మహాత్మా గాంధీ నినాదం చాలా షాపుల్లో కనిపిస్తుంది. వినియోగదారుడిని ప్రతి వ్యాపారి దేవుడిగా భావించాలని అంటారు మహాత్ములు. వైన్‌షాపువద్ద మాత్రం జైలులో మాదిరి ఊచలు ఉంటాయి. ఊచల మధ్యలో చిన్న సందు నుంచి డబ్బులు చెల్లిస్తే బాటిల్ ఇస్తాడు. వినియోగదారుడిని దేవుడిగా చూడకపోయినా ఫర్వాలేదు కానీ మరీ ఊచల మధ్య ఖైదీలా చూడడం ఏమీ బాగా లేదోయ్’’
‘‘సరే- ఇక వదిలేయమన్నా కదా? కొత్త సంవత్సరంలో మందు అమ్మకాలు కాకుండా కొత్త విశేషాలేమిటి?’’
‘‘చరిత్ర పునరావృతం అవుతుందంటే ఏమో అనుకున్నాం కానీ జనవరి ఒకటిన నిజంగానే చరిత్ర పునరావృతం అయింది?’’
‘‘ఏం జరిగింది?’’
‘‘గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం జరిగేటప్పుడు ఎంతో మంది మహిళలు తమ బంగారు గాజులు, ఆభరణాలు తీసి మహాత్ముడి జోలెలో వేశారని చదువుకున్నాం గుర్తుందా?’’
‘‘ఔను.. ఆ తర్వాత లాల్ బహుద్దూర్ శాస్ర్తీ హయంలో కూడా యుద్ధంలో సైనికులకు అండగా నిలుస్తూ మహిళలు బంగారు నగలు ఆయనకు అందించారని చదివాను..’’
‘‘అమరావతిలోనే ఏపీ రాజధానిని ఉంచాలన్న రైతుల ఉద్యమానికి మద్దతుగా భువనేశ్వరి తన ప్లాటినం గాజులు ఇచ్చారట!’’
‘‘ప్లాటినం గాజులంటే ఏంటిరా! గోల్డ్‌వి అయితే దొంగల భయం పెరిగిందని ఈ మధ్య అంతా రోల్డ్‌గోల్డ్ నగలు ధరిస్తున్నారు కదా? గిల్ట్ నగలు అంటారు.. అవేనా?’’
‘‘నీకు గోల్డ్‌కు, రోల్డ్‌గోల్డ్‌కు తేడా తెలియదురా!’’
‘‘నిజమేరా! ఓసారి మందుకు డబ్బులు లేక చేతికున్న ఉంగరం అమ్మాలని చూస్తే- షాపువాడు ఎగాదిగా చూసి గోల్డ్ కాదు రోల్డ్‌గోల్డ్ అన్నాడు. కోపంగా ఇంటికి వచ్చి ఇదేంటని శ్రీమతిని అడిగితే.. ఉంగరం అమ్మడానికి వెళ్లారా? మీ సంగతి తెలిసే గోల్డ్‌ది దాచేసి రోల్డ్‌గోల్డ్‌ది ఇచ్చానని అంది.’’
‘‘ప్లాటినం అంటే రోల్డ్‌గోల్డ్ కాదు.. గోల్డ్ కన్నా విలువైంది. ఎంత విలువైందో నాకూ తెలియదు ’’
‘‘అదేంటిరా! చక్కగా బంగారు నగలు ధరించవచ్చు కదా? ప్లాటినం అంటే ఎప్పుడైనా అవసరం కోసం మణప్పురం వాడి వద్దకు తనఖా పెట్టడానికి కూడా పనికి రాదు. గల్లీకో నగల తనఖా దుఖాణం కనిపిస్తుంది కానీ ఇప్పటివరకు ప్లాటినం తనఖా పెట్టుకునే షాపు ఒక్కటీ కనిపించలేదు’’
‘‘తనఖా పెట్టుకోవలసిన ఖర్మ వారికేం?’’
‘‘నాకు జేబు లేదు, జేబులో పర్సు లేదు, చేతికి ఉంగరం లేదు అని వాళ్లాయన చెప్పిన మాట గుర్తు లేదా?’’
‘‘రాజకీయాలు అన్నాక అలా ఏదో ఒకటి అంటారు లే! మరి ఆయనే హై టెక్ సిటీ వద్ద లక్షకు ఎకరం చొప్పున కొని తానే 30 కోట్లకు అమ్మానని చెప్పాడు కదా? అంటే అంత డబ్బున్నా ఉంగరం కొనలేరా? రాజకీయాల్లో ప్రతి మాటను చీల్చి చెండాడ వద్దు. సింబాలిక్‌గా నేను నిజాయితీ పరుడినని చాటుకోవడానికి ఉంగరం లేదు, చెప్పులు లేవు, బూట్లు పాతవి అంటూ జనాన్ని నమ్మించడానికి ఏదో అంటారు’’
‘‘నమ్మించడానికి అంటారా? అంటే ఆ మాటలు నిజం కావా?’’
‘‘లోకల్ సంగతులు వదిలేయడమే ఆరోగ్యానికి మంచిది.’’
‘‘మరి ఇంటర్నేషనల్ సంగతులేమున్నాయి?’’
‘‘త్వరలో వ్యూహాత్మక ఆయుధాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పరుస్తామని ఉత్తర కోరియా అధ్యక్షుడు కిమ్ ప్రకటించాడు- తెలుసా?’’
‘‘మధ్యతరగతి బతుకంటేనే రోజూ దిగ్భ్రాంతికరమే. కిమ్ ఇంతకు మించి కొత్తగా దిగ్భ్రాంతి పరిచేదేముంది. ఈ కల్లోల లోకంలో చనిపోయేంత వరకు బతకడానికి మించిన దిగ్భ్రాంతి ఏముంటుంది?’’
*

buddhamurali2464@gmail.com