జనాంతికం - బుద్దా మురళి

త్యాగమే జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘జీవితంలో ఏదో ఒకటి త్యాగం చేయాలని బలంగా అనిపిస్తుందోయ్’’.
‘‘ఎప్పటినుంచి ఈ రోగం. కడుపుతో ఉన్నవారికి మామిడికాయ, చింతకాయ లాంటి పుల్లని పదార్థాలు తినాలనిపించినట్టు త్యాగం చేయాలని నీకెప్పటినుంచి అనిపిస్తోంది?’’
‘‘నీకన్నీ వెటకారాలే. ఏం త్యాగం చేయాలో అర్థంకావడం లేదు. కానీ ఏదో ఒకటి త్యాగం చేయాలనిపిస్తోంది.’’
‘‘మొన్న మీ బ్రదర్ వాళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి వదిలేయాలని వంకాయ కూర వదిలేశారు కదా? అప్పటినుంచి నీకీ త్యాగం వెరల్‌లా పట్టుకొన్నట్టు ఉంది. ఐనా నీ గురించి తెలిసిన వారందరికీ నీవేం వదిలేశావో తెలుసుకదా?’’
‘‘ఏం తెలుసు? ఏం వదిలేశాను?’’
‘‘సిగ్గు, శరం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వంటివన్నీ వదిలేశావని నీ గురించి అంతా అనుకొంటారు’’.
‘‘ఓస్ అదా? ఇంకా ఏమిటో అని కంగారుపడ్డాను. ఐనా ఈరోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోనే పిచ్చోళ్ళు ఎవరున్నారు? ఇవన్నీ నేను వదిలేశానని అంతా అనుకొంటారు. అందరూ వదిలేశారని నేననుకొంటాను. వదిలేయనిది ఎవరు? నువ్వు వదిలేయలేదా?’’
‘‘నా సంగతి ఎందుకులే కానీ. ఇంతకూ ఏదో ఒకటి త్యాగంచేయాలని నీకు హఠాత్తుగా ఎందుకనిపించింది? ఎప్పుడనిపించింది?’’
‘‘ఎప్పుడో గుర్తుకు లేదు. ఏం త్యాగం చేయాలో అర్థంకావడం లేదు. కానీ ఏదో ఒకటి త్యాగంచేయాలని మాత్రం బలంగా ఉంది.’’
‘‘ఆయనెవరో విజయ్‌మాల్యా బ్యాంకులకు వేల కోట్లు రుణం త్యాగం చేసి వెళ్ళాడు కదా? నువ్వుకూడా అలానే తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పుచేసి చేతులెత్తెయ్. ఆ త్యాగాన్ని వాళ్ళు జీవితకాలమంతా గుర్తుపెట్టుకొంటారు?’’
‘‘నాకూ ముందు ఇలాంటి ఆలోచనే వచ్చింది. కానీ ఏ బ్యాంకువాడు మనల్ని నమ్మేట్టుగాలేరు. లక్ష రూపాయల అప్పుకావాలన్నా పది లక్షల ఆస్తిని స్యూరిటీగా చూపించాలి అని అడుగుతున్నాడు. బ్యాంకులకు వందల కోట్లు, వేల కోట్లు ముంచడం ఈజీ కానీ, రెండుమూడు లక్షల పర్సనల్ లోన్ తీసుకొని ముంచడం కష్టం. పోనీ ఓ వెయ్యి కోట్లు అప్పుతీసుకొని ముంచుదామా? అంటే ఆ స్థాయిలో బ్యాంకు పరిచయాలు లేవు.’’
‘‘అంటే బ్యాంకువాడు నమ్మితే మరో మాల్యా అవుదామనే’’. ‘‘విజయ్‌మాల్యాలా ఎగిరిపోదామని ఎవరికుండదు చెప్పు. నాకేనా? నీకుండదా? బ్యాంకువాడు మనల్ని నమ్మడుకాబట్టి నిజాయితిపరులుగా ఉండిపోతున్నాం. నమ్మితే, ప్రతోడు విజయమాల్యాలా విజయవంతమైన జీవితం గడుపుతాడు. నువ్వేమైనా అనుకోగానే విజయ్‌మాల్యాలో నాకో త్యాగజీవి కనిపిస్తున్నాడు.’’
‘‘విజయ్‌మాల్యా త్యాగజీవినా? ఎట్టెట్టా? ఏ త్యాగం చేశాడు?’’
‘‘మాల్యా బ్యాంకులను ముంచిన వేల కోట్ల గురించే ఆలోచిస్తున్నావు కానీ, ఆయన త్యాగం గురించి ఆలోచించడం లేదు. కలల రాకుమారుడిగా అందమైన భామల మధ్య బతికిన మాల్యా ఇప్పుడు ఎక్కడో పరాయి దేశంలో గుంపులో గోవిందయ్యలా బతుకుతున్నాడు.
కొత్త సంవత్సరం వస్తుందంటేనే సకల జనం మాల్యా క్యాలండర్లకోసం ఎదురుచూసే వాళ్లం. అందమైన మోడల్స్ తమ దుస్తులను త్యాగం చేసి, అందాలు ఆరబోసేవాళ్ళు. ఇంకో మూడు రోజులైతే కొత్త సంవత్సరం. మాల్యా కాలంనాటి ఉత్సాహం మనలో ఉందా? ఇప్పుడు క్యాలండర్‌లో చూసిన అందాలకే మనమింతగా బాధపడుతుంటే అంతమంది అందగత్తెలతో సరదాగా గడిపిన మాల్యా వాళ్ళను వదిలి, రాత్రికి రాత్రి విమానంలో చెక్కేశాడు అంటే, అంత అందమైన మోడల్స్‌ను త్యాగం చేయడానికి ఆయన మనసు ఎంత క్షోభించిందో.’’
‘‘నీ మాటలు చూస్తుంటే మానవ బాంబులుగా మారడానికి తీవ్రవాదులు తమకుతాము త్యాగం చేసుకున్నారని పొగిడేట్టుగా ఉన్నావే.’’
‘‘పాకిస్తాన్ తీవ్రవాద శిక్షణ శిబిరాల్లో కసబ్ లాంటి వారిని త్యాగజీవులుగా పాఠాలు చెబుతారు. అలాంటి పాఠాల ప్రభావంవల్లనే కదా? మరింత మంది ఉగ్రవాదులు తయారయ్యేది. పాక్ వారి గురించి మనకెందుకులే కానీ. మన త్యాగజీవుల గురించి మనం మాట్లాడుకుందాం.’’
‘‘మనం చదువుకొనే రోజుల్లో కొందరు మేధావుల పాఠాలవల్ల ఆనాటి యువత చాలామందే జీవితం త్యాగంచేసి ఆయుధాలుచేపట్టి అడవి బాట పట్టారు. యవ్వనం అంతా కరిగిపోయి ఎన్‌కౌంటర్‌లనుంచి బతికి బట్టకట్టినవారు లొంగిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనో, చిన్నా చితకా వ్యాపారాల్లోనూ బతికేస్తున్నారు. మేం జీవితాన్ని ఎందుకు త్యాగం చేశామో? ఏం సాధించామో తలుచుకొంటే సిగ్గుతో కూడిన ఆవేదన కలుగుతోందని కొందరి మాట.’’
‘‘వీరి త్యాగం వృథా అంటావా?’’
‘‘నీ జీవితం విలువ నీకే తెలియనప్పుడు, నీ గురించి ఎవరికి పట్టింది.’’
‘‘పూర్వం గుడి, బడి నిర్మాణాలకు, సత్రాల నిర్వహణకు దయార్థహృదయులు ఆస్తులను త్యాగంచేసేవారు. డొక్కా సీతమ్మ లాంటివారు ఆకలితో ఎవరూ బాధపడవద్దని నిత్యాన్నదానం చేసేవారు. ఆస్తులు కరిగిపోయినా త్యాగానికి వెరవని మహనీయులను పట్టించుకోవడం లేదు కానీ వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన వారిని, ఉగ్రవాదులను, తీవ్రవాదులను త్యాగజీవులని కొలిచేస్తున్నాం.’’
‘‘నువ్వు ఇంకా రామాయణం, మహాభారతం కాలంలోనే ఉండిపోయావు. శరీరాన్ని కోసి ఇచ్చిన శిబిచక్రవర్తి కాలంలోనే ఉండిపోయావు. ఇచ్చిన మాటకు కట్టుబడి భార్యను అమ్మేసి కాటికాపరిగా బతుకీడ్చిన సత్యహరిశ్చంద్రుని కాలంలోనే నీ ఆలోచనలు ఆగిపోయాయి. కాలంతోపాటు ఎదుగు. కాలంతోపాటే ఇప్పుడు పదాలకు అర్థాలు మారిపోతాయి.’’
‘‘ఔను! గుర్తుకొస్తున్నాయి. అలిపిరిలో దాడి జరిగినప్పుడు ఓ సి.ఎం. సానుభూతిని నమ్ముకొని ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్ళి, మీకోసం నెలల అధికారం త్యాగం చేశాను అన్నారు. పైకి చెప్పలేదు కానీ మీకోసం మామను కూడా త్యాగంచేశాను అనుకొని ఉండొచ్చు.’’ ‘‘మామగారేం తక్కువనా? 60 ఏళ్ళ వయసులో హీరో వేషాలు త్యాగం చేసి మీకోసం రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పలేదా?’’

‘‘నిజమే. ఈ మాటలు వింటుంటే ఏది త్యాగమో! ఏది స్వార్థమో అర్థం కావడం లేదు.’’
‘‘నిజమే! కాలం మారిపోయింది. ఇప్పుడు స్వార్థం త్యాగం వేరువేరు కాదు. రెండు కలిసిపోయాయి. కొత్త రాజధానికోసం మా పొలాలు త్యాగంచేశామని కొందరంటున్నారు. లక్షల్లో ఉండే పొలాలకు కోట్లు సంపాదిద్దామని త్యాగంచేశారని మరికొందరి వాదన.’’
‘‘హైటెక్ సిటీలో భూములు బంగారాన్ని పండించడాన్ని చూసినవారు అలాంటి అదృష్టం తమ తలుపుతడితే, స్వాగతం పలికితే తప్పేముంది?’’
‘‘నిజమే కానీ అది త్యాగం కాదు వ్యాపారం. వ్యాపారం అన్నాక లాభం ఉంటుంది. నష్టం ఉంటుంది. స్టాక్‌మార్కెట్‌లో ప్రతి షేర్ ఇన్ఫోసిస్ కాలేదు. కొన్ని షేర్లు నాగార్జున ఫెర్టిలైజర్‌లా పాతాళంలో పడిపోతాయి. అలానే అన్ని భూములు హైటెక్ సిటీ భూములు కాలేవు.’’
‘‘అంతేలే. ఏ భూమి ప్రత్యేకత ఆ భూమిది. మాధాపూర్ భూముల్లో ఐటి పంట పండుతుందేమో కానీ పంటలు పండవు. అమరావతి సారవంతమైన భూముల్లో ఐటి కంపెనీల పంట పండకపోవచ్చు కానీ, ఏడాదికి మూడు పంటలు పండుతాయి.’’

buddhamurali2464@gmail.com