అంతర్జాతీయం

వాణిజ్య రంగంలో భారత్ వైఖరి నిరాశాజనకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 19: తమ దేశంతో వాణిజ్య రంగంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి నిరాశాజనంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈనెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. వాణిజ్య రంగంలో భారీ ఎత్తున ద్వైపాక్షిక సంబంధాలు కుదురుతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇన్నాళ్లూ భారత్ తమతో సరైన విధానాన్ని అనుసరించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తు సేవలపై భారత్ విపరీతమైన పన్నుల భారాన్ని మోపుతోందని ట్రంప్ ఇదివరకే విమర్శించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనుండగా, ట్రంప్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అమెరికా భారత సంతతికి చెందినవారు భారీ సంఖ్యలో ఉండడంతో వారి ఓట్లపై ట్రంప్ దృష్టి సారించారు. హౌడీ మోదీ పేరుతో జరిగిన కార్యక్రమానికి ట్రంప్ ప్రత్యేక అతిధిగా హాజరుకావడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాగా, భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ట్రంప్ ప్రస్తావిస్తూ ఒప్పందాలు నవంబర్ కంటే ముందుకు జరుగుతాయా లేదా ఆ తర్వాత అనేది తనకు కూడా తెలియదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎన్నికల కంటే ముందే ఒప్పందాలు కుదిరితే అది తమకు అదనపు బలాన్ని చేకూరుస్తుందని వ్యాఖ్యానించారు. తొలిసారి భారత్‌లో పర్యటించనున్న ట్రంప్ భారత్‌కు ‘ట్రేడ్ ప్యాకేజ్’ ప్రతిపాదన చేయనున్నట్టు సమాచారం. అయితే, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్‌టైజర్ తమ దేశాధ్యక్షుడితో భారత్ రావడం లేదు. దీంతో వాణిజ్య ఒప్పందాల ముసాయిదా ఏవిధంగా ఉంటుందోననే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో లైట్‌టైజర్ గత వారం సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలకు సంబంధించిన పలు అంశాలు వీరి చర్చల్లో చోటుచేసుకున్నట్టు సమాచారం. లైట్‌టైజర్ భారత్‌కు రావడం లేదన్నది అధికారికంగా ఎవరూ ఇంకా ధృవీకరించకపోవడంతో అతను వస్తారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏదేమైనా వాణిజ్య సంబంధాలపై ట్రంప్ ప్రత్యేక దృష్టిని సారిస్తారన్నది మాత్రం వాస్తవం. వస్తోత్పత్తికి సంబంధించిన రంగం ఈ చర్చల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకునే అవకాశం ఉంది. 2018-19 సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీల్లో 16.9 బిలియన్ల లోటు ఏర్పడడం ఒకరకంగా అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ మేటి ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశలో చైనా దూసుకుపోతున్న నేపథ్యంలో, ఎట్టిపరిస్థితుల్లోనూ దానిని నిలువరించాలన్న పట్టుదల అమెరికాలో కనిపిస్తోంది. అందుకే పలు వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ వైపు మొగ్గుచూపుతోంది. వాణిజ్య లోటుకు అనేకానేక కారణాలుంటాయని అమెరికా ఇదివరకే వ్యాఖ్యానించింది. చైనాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌తో సరికొత్త ఒప్పందాలను చేసుకోవడం ద్వారా లోటును భర్తీ చేసుకోవచ్చనని కూడా ఆలోచిస్తోంది. గత ఏడాది మూడు నెలల కాలంలో అమెరికా-్భరత్ మధ్య వివిధ వస్తువులు, సేవల విలువ 110.09 బిలియన్ డాలర్లు. అంతకుముందు మూడు నెలల కాలంతో పోలిస్తే ఇది 4.5 శాతం అధికం. కాగా, అమెరికా ఆ మూడు నెలల కాలంలో భారత్‌కు 45.03 బిలియన్ డాలర్ల విలువైన వస్తు సేవలను అందించింది. అదే సమయంలో 65.06 బిలియన్ డాలర్ల విలువైన వస్తు సేవలను భారత్ నుంచి దిగుమతి చేసుకుంది.
ఈ వ్యత్యాసాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించాలని అభిప్రాయం కూడా అమెరికాకు ఉన్నదన్నది వాస్తవం. అందుకే ట్రేడ్ ప్యాకేజీ ఈ అన్ని అంశాలను ప్రతిబింబించేదిగా ఉంటుందని సమాచారం. మొత్తమీద ట్రంప్ భారత వాణిజ్య రంగంలో సరికొత్త ఉత్సాహాన్నిచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
*చిత్రం...అమెరికా అధ్యక్షుడు ట్రంప్