అంతర్జాతీయం

మాటలు కాదు.. చేతలు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 23: సమస్త జీవజాతులకు పెనుముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులకు ప్రపంచ ప్రజా ఉద్యమమే పరిష్కారమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మాటలు కట్టిపెట్టి, చేతలతోనే ప్రపంచ దేశాలు ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. ప్రవాహాల్లాంటి ప్రసంగాల కంటే నీటిబొట్టులాంటి వాస్తవిక ప్రయత్నమే ఎంతో విలువైనదని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ మార్పులను అరికట్టాలంటే ముందుగా ప్రవర్తనాపరమైన పరివర్తన అవసరమని, ఇందుకు ప్రపంచ ప్రజలంతా ఏకోన్ముఖంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని మోదీ ఉద్ఘాటించారు. అలాగే, చారిత్రక రీతిలో భారతదేశ శిలాజేతర ఇంధన వినియోగ లక్ష్యాన్ని 175 గిగావాట్ల నుంచి 450 గిగావాట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. పర్యావరణంపై సోమవారం ఐరాసలో జరిగిన అంతర్జాతీయ శిఖరాగ్ర సభలో ప్రపంచ నేతలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పులు వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ప్రస్తుతం ప్రపంచ దేశాలు చేస్తున్న కృషి ఎంతమాత్రం సరిపోదని, దీని తీవ్రత మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గటరెస్ నిర్వహించిన ఈ అంతర్జాతీయ పర్యావరణ సదస్సుకు ప్రపంచ దేశాల నేతలంతా తరలివచ్చారు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి, ఆవిధంగా వాతావరణ ప్రతికూలతలను నిరోధించేందుకు ఏ దేశానికి ఆ దేశం సొంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇందుకు అంతర్జాతీయ స్థాయిలో లోపరహితమైన రీతిలో పరిపూర్ణమైన ప్రయత్నం అవసరమని మోదీ ఉద్ఘాటించారు. విద్యావ్యాప్తి నుంచి విలువల పరిరక్షణ వరకు అలాగే జీవనశైలి నుంచి అభివృద్ధిపరమైన ఆలోచనల వరకు ప్రతి అంశాన్ని క్రోడీకరిస్తూ ఓ సమగ్రమైన రీతిలో పర్యావరణ రక్షణ ఉద్యమం జరగాలన్నారు. ‘పరిస్థితి చేయి దాటిపోతోంది. చర్చోప చర్చలతో పనికాదు. ప్రపంచ దేశాలు పర్యావరణ రక్షణ కోసం కార్యాచరణకు నడుం బిగించాలి’ అని మోదీ ఉద్ఘాటించారు. అనుకోకుండా ఐరాస సమావేశానికి వచ్చిన అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ అక్కడే కూర్చుని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వినడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమం ద్వారా వీరిరువురి మధ్య సరికొత్త స్నేహం వెల్లివిరిసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. శిలాజేతర ఇంధన వినియోగంలో భారత్ తన వాటాను పెంచుకుంటుందని, 2022 నాటికి 450 గిగావాట్ల లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. గతంలో ప్రపంచ దేశాల మధ్య కుదిరిన ప్యారిస్ ఒప్పందం అమలుపై దృష్టి పెట్టేందుకు ఈ పర్యావరణ శిఖరాగ్రం జరుగుతోంది. ఈ శతాబ్దం అంతానికి ప్రపంచ ఉష్ణోగ్రత స్థాయిని రెండు డిగ్రీల సెల్షియస్ కంటే తక్కువ స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా 2015లో ప్యారిస్ ఒప్పందం కుదిరింది. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కదిలిరావాలని ఆ ఒప్పందం నిర్దేశిస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే వాతావరణపరమైన పరివర్తనను సాధించేందుకు ప్రపంచ ప్రజోద్యమం జరగాల్సిన అవసరం ఉందని మోదీ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు. ప్రకృతిని గౌరవించడం, వనరుల వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, అందుబాటులో ఉన్న వనరుల పరిధిలోనే మన అవసరాలను పరిమితం చేసుకోవడం వంటివి అత్యంత కీలకమని, ఇవన్నీ కూడా మన సంప్రదాయంలోనూ ప్రస్తుత ప్రయత్నాల్లోనూ నిబిడీకృతమై ఉన్నవేనని మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడకు వచ్చిన భారత్ కేవలం పర్యావరణ మార్పుల తీవ్రత గురించి చెప్పడమే కాకుండా నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడానికి వాస్తవిక కోణాన్ని, ఓ రోడ్ మ్యాప్‌ను కూడా ఆవిష్కరిస్తోందని మోదీ వెల్లడించారు. భారతదేశంలో ఈ-మొబిలిటీ ద్వారా రవాణాను పర్యావరణ హితంగా మార్చామని, అలాగే పెట్రోల్, డీజిల్‌లో జీవ ఇంధన స్థాయిని కూడా పెంచామని మోదీ తెలిపారు. బయో ఇంధన వినియోగాన్ని కూడా భారత్‌లో విస్తృతం చేస్తున్నామని, దేశవ్యాప్తంగా 15 కోట్ల కుటుంబాలకు స్వచ్ఛమైన వంట గ్యాస్‌ను అందిస్తున్నామని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ చర్య ద్వారా ఇటు పర్యావరణ ఆరోగ్యాన్ని, మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తున్నామని అన్నారు. జల సంక్షరణ, వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడం, జల వనరుల అభివృద్ధి కోసం ఇటీవల తమ ప్రభుత్వం జలజీవన్ మిషన్‌ను చేపట్టిందని ప్రపంచ దేశాలకు వివరించారు. రానున్న కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు కోసం 50 బిలియన్ డాలర్లను ఖర్చు చేయబోతున్నామని మోదీ తెలిపారు. అలాగే ప్లాస్టిక్ వినియోగంపై కూడా ప్రజలే స్వయంగా ఉద్యమించాలని, దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో ప్లాస్టిక్ వల్ల కలిగే పరిణామాలపై చైతన్యం కలుగుతుందని మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి భవనంలో మంగళవారం సౌర ప్యానెల్స్‌ను భారత్ ప్రారంభించబోతోందని, వీటిని 10 లక్షల అమెరికా డాలర్ల వ్యయంతో నిర్మించామని మోదీ తెలిపారు. ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా పర్యావరణ పరిరక్షణ చర్యలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి స్ఫూర్తి కాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారత్ చొరవతో మొదలైన అంతర్జాతీయ సౌరకూటమిలో 80కి పైగా దేశాలు చేరాయని ఆయన తెలిపారు.
*చిత్రాలు..పర్యావరణ కార్యాచరణ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తున్న మోదీ..
*ఆసక్తిగా వింటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్