Others

ఇల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వయంకృషితో, ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి అక్కినేని లక్ష్మీవరప్రసాద్ (ఎల్వీ ప్రసాద్). సినిమా పరిశ్రమపట్ల అభిరుచితో బొంబాయి చేరి థియేటర్ (డైమండ్) గేటు కీపర్‌గా పనిచేసి, తరువాతి కాలంలో తాను నిర్మించిన సినిమా (ఖిలోనా) ఆ థియేటర్‌లోనే సిల్వర్ జూబ్లీ జరుపుకునేంత స్థాయికి ఎదగడం అపురూపమైన ఘట్టం. హెచ్‌ఎం రెడ్డి ప్రోత్సాహంతో ‘తెనాలి రామకృష్ణ’ చిత్రంలో కరటక శాస్ర్తీగా, మహామంత్రి తిమ్మరసుగా రెండు పాత్రలు, ‘సత్యమేవజయం’లో హీరోగానూ నటించారు. సారథివారి ‘గృహప్రవేశం’ ద్వారా దర్శక ప్రస్థానం ప్రారంభించి అటు నటునిగా ఇటు దర్శకునిగా ప్రతిభ చూపారు. 1955లో లక్ష్మీ ప్రొడక్షన్స్‌పై, యోగానంద్ దర్శకత్వంలో అక్కినేని హీరోగా ‘ఇలవేలుపు’ చిత్రాన్ని నిర్మించారు. 1956లో ప్రసాద్ ప్రొడక్షన్స్ పేరిట ‘ఇలవేలుపు’ చిత్రాన్ని శారదగా ఆపై పలు హిందీ, తమిళ, తెలుగు చిత్రాలకు దర్శక, నిర్మాతగా బాధ్యతలు నెరిపారు. 1965లో ప్రసాద్ ప్రొడక్షన్స్‌పై వీరు నిర్మించిన చిత్రం ‘ఇల్లాలు’. నటి, నర్తకి గీతాంజలిని తొలిసారి కథానాయికగా, ద్విపాత్రాభినయంతోనూ, ఆమెకు జంటగా ఖరగ్‌పూర్‌లోని రైల్వే ఉద్యోగి కెవి నాగేశ్వరరావు అను నాటకానుభవం కలిగిన వ్యక్తిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం -ఇల్లాలు. పాఠలాగ్ అనే మరాఠీ సినిమా కథ ఆధారంగా ఇల్లాలు కథను తయారు చేస్తే, ఎల్వీ ప్రసాద్ సోదరుడు సంజీవి తొలిసారి దర్శకత్వం వహించారు. ఆ తరువాత ఆయన ధర్మదాత, అక్కా-చెల్లెలు, సిసింద్రి చిట్టిబాబు, అత్తగారు కొత్తకోడలు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కథ, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ
కళ: తోట తరణి
నృత్యం: హీరాలాల్, చెంగప్పన్
సంగీతం: కెవి మహదేవన్,
నిర్మాత, పర్యవేక్షణ:
ఎల్వీ ప్రసాద్
ఎడిటింగ్, దర్శకత్వం:
ఎ సంజీవి (ఎల్వీ ప్రసాద్ సోదరుడు)

అన్యోన్యానురాగ బద్దులైన దంపతులు వేణుగోపాలరావు (కెవి నాగేశ్వరరావు), రాధారాణి (గీతాంజలి). ఇంగ్లాండులో న్యాయశాస్త్రం చదివే అవకాశం వస్తుంది వేణుగోపాల్‌కు. ఒక ఏడాది భర్త ఎడబాటు భరిస్తే అతనికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయన్న ఆలోచనతో రాధారాణి భర్తను ప్రోత్సహించి ఇంగ్లండు పంపుతుంది. భర్తకి ఎన్నో ఉత్తరాలు ప్రేమగా రాస్తుంటుంది. ఒకరోజు భార్య రాధకు జబ్బుగా ఉందని వేణుకు టెలిగ్రాం అందుతుంది. భార్యను చూసేందుకు వచ్చిన భర్త వేణు చేతుల్లో రాధ మరణిస్తుంది. వేణుగోపాల్ ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి, వేదనతో రోజులు భారంగా గడుపుతుంటాడు. ఇంతలో ఆ ఊరి శివార్లలోని బందిపోటు సింగన్న ముఠాపై పోలీసులు దాడి చేస్తారు. సింగన్న (సిహెచ్ కృష్ణమూర్తి) తప్పించుకుంటాడు. అతని భార్య సుధారాణి (గీతాంజలి) పోలీసులకు చిక్కుతుంది. ఆమె తాను దొంగల రాణినేకాదని, లాయర్ వేణుగోపాల్ అర్ధాంగినని వాదిస్తుంది. ఆమె అచ్చంగా రాధారాణిలా ఉండటం చేత అందరూ ఆశ్చర్యపోతారు. కేసును న్యాయస్థానానికి అప్పగిస్తారు. పోలీసులు భర్త వేణుగోపాలరావు ముందు బోనులో సుధారాణిని నిలబెడతారు. తాను రాధారాణినని వాదిస్తూ, తనకూ, భర్తకూ మాత్రమే తెలిసిన రహస్యాలు చెప్తుంది. అతని నడుముపైగల పుట్టుమచ్చ సహా వివరాలు వెల్లడిస్తుంది.
వేణుగోపాల్ ఆమె చెప్పినవన్నీ నిజాలేనని, అయినా తాను తన భార్య అంత్యక్రియలు స్వయంగా నిర్వహించానని, భార్య పోలికలున్నంత మాత్రాన ఆమెను భార్యగా అంగీకరించలేనంటాడు. అంతేకాక తన ఇంటిలో దొంగలుపడి కొన్ని నగలు కాజేసారని, వాటిలో తన భార్య డైరీ మాయమైందని, అందులో విషయాలు తెలిసి ఈమె ఇలా నటిస్తోందంటాడు. చివరికి ఆమెకు మతిభ్రమించిందని, పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. పిచ్చాసుపత్రిలో ఉన్న సుధారాణి భర్తతో ఏకాంతంగా మాట్లాడేందుకు అనుమతి ఇమ్మని వేడుతూ ఉత్తరం వ్రాస్తుంది. అందులో దస్తూరి భార్య చేతివ్రాతలా ఉండటంతో ఆశ్చర్యపడిన వేణు, కోర్టు అనుమతితో ఆమెను ఇంటికి రప్పిస్తాడు. ఇంటికి వచ్చిన ఆమె, దొంగలరాణి సుధారాణి, తాను కవల పిల్లలమని, తన ఇంటికి అనారోగ్యంతో వచ్చిన సుధకు తాను ఎవరికీ తెలియకుండా ఆశ్రయమిచ్చానని, ఆమె అనారోగ్యం సంగతి, ఆమె భర్తకు తెలియచేద్దామని ఆమె వేషంతో తాను దొంగలముఠా వద్దకు వెళ్ళానని, అక్కడ చిక్కుకుపోవటంతోనూ, సుధ మరణించటంతోనూ అందరూ రాధ మరణించిందని పొరబడ్డారన్న నిజాలు భర్తకు వెల్లడిస్తుంది. భర్త వేణుగోపాల్‌తోపాటు ఆమెను చాటుగా అనుసరించి వచ్చిన సింగన్న, ఈ మాటలు విని మరణించింది తన భార్య సుధ అని గ్రహించి పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోతాడు. వేణుగోపాల్ తన ఇల్లాలు రాధారాణిని ఆదరించి, అక్కున చేర్చుకోవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
చిత్రంలో హీరో వేణుగోపాల్‌గా గంభీరమైన, మానసిక సంఘర్షణతో కూడిన సన్నివేశాల్లో, అనురాగమూర్తి అయిన భర్తగా, తొలిసారి హీరోగా పరిచయమైనా కెవి నాగేశ్వరరావు పరిణితో కూడిన నటన చూపారు. చిత్రంలో ప్రధాన పాత్ర రాధారాణిగా, ఇల్లాలు టైటిల్‌కు తగ్గట్టు ప్రేమానురాగాలతో భర్తను అలరించి, ఆరాధించటం, అత్తవారిని, కుటుంబ సభ్యులను ఆదరించటం, పద్ధతిగా పూజా పునస్కారాలు, దొంగలరాణిగా అరెస్ట్ అయి తానే రాధారాణినని భర్తకు కోర్టులో నిజాలు వెల్లడించటంలో సున్నితంగా, స్థిరంగా వేదనతో వాదించటం, భర్త నిరాదరణ, తిరస్కారం సమయంలో మానసిక వేదన, సంఘర్షణతో బోనులో కుప్పకూలి పోవటం, తిరిగి పిచ్చాసుపత్రి నుంచి భర్త ఇంటికి వచ్చి ప్రతి గదిని పరిశీలిస్తూ తన్మయం, భర్తవద్దకు వెళ్ళి తమ గదిలో నిజాలు వెల్లడించటంతో క్షోభ, అలాగే దొంగల రాణిగా చురుకుగా, హుషారుగా నృత్యం చేయటం... రెండు పాత్రలను వైవిధ్యంతో మెప్పించటమేకాక, ఇల్లాలిగా ‘గీతాంజలి’ నట జీవితంలో ఓ ప్రత్యేకమైన స్థానం పొందిన పాత్రగా నిలిచిపోయేలా ఆకట్టుకోవటం విశేషం.
ఈ చిత్రంలో వేణుగోపాల్‌ను పెళ్ళి చేసుకోవాలని ఆశించి, ఆరాధించే యువతిగా వాసంతి, ఆమె తండ్రిగా విన్నకోట రామప్ప పంతులు, రాధ అత్తగారుగా నిర్మల, పోలీసు అధికారిగా రామకృష్ణ, వకీలుగా ప్రభాకరరెడ్డి, జడ్జిగా ధూళిపాళ, గుమాస్తాగా అల్లు రామలింగయ్య, నౌకరుగా చదలవాడ, వాసంతిని ప్రేమించిన యువకునిగా చలం ఇతర పాత్రలు పోషించారు.
దర్శకునిగా సంజీవి సన్నివేశాలను ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దారు. పాటల చిత్రీకరణలో వైవిధ్యం, తనదైన శైలి చూపారు. అవుట్ డోర్ దృశ్యాలను, కొన్ని పాటలు నైనిటాల్‌లో చిత్రీకరించారు.
చిత్ర గీతాలు:
కెవి నాగేశ్వరరావు, గీతాంజలిలపై చిత్రీకరించిన యుగళగీతం -అందమంటే నువ్వే ఆనందమంటే నువ్వే (పిబి శ్రీనివాస్, పి సుశీల- ఆత్రేయ) కనువిందుగా ప్రకృతిలో అలరించేలా సాగుతుంది. గీతాంజలి, కెవి నాగేశ్వరరావులపై చిత్రీకరించిన మరో యుగళ గీతం -నువ్వు పోయినచోటే నేను వున్నా పోపోపో (పిబి శ్రీనివాస్- పి సుశీల, రచన ఆత్రేయ) మనోహరంగా సాగుతుంది. రాధ మరణించాక తనను పెళ్ళి చేసుకుంటాడన్న ఆశలో వాసంతి, నాగేశ్వరరావును ఉద్దేశించి పాడేగీతం, పాట సగంలో అతను తన భార్య రాధ (గీతాంజలి)ని ఊహించుకోవటం.. ఇలా ముగ్గురిపై చిత్రీకరించిన గీతం -మనసునేదో కవ్విస్తోంది, తలచుకుంటే నవ్వు వస్తుంది (పి సుశీల- ఆత్రేయ). తొలిరేయి తరువాత రాధ తోటలో, ఇంటిలో పాడే పాట ఈ చిత్రంలోని హిట్‌సాంగ్ -మల్లెపూవులు విరిసెరా మంచుతెరలే కరిగిరా నల్లనయ్యా మేలుకో, చల్లనయ్యా మేలుకో (పి సుశీల, ఆత్రేయ). ఈ చిత్రంలోని మరో హిట్ సాంగ్, టైటిల్ సాంగ్, మధురమైన హాంటింగ్ సౌండ్‌తో రాధ ఆత్మగావచ్చి వేణుగోపాల్ ముందు పాడే పాట -నీవు నా ఊహలందే నిలిచేవు, నేను నీ కళ్ళలోనే వెలిశాను. వేయి జన్మాలకైనా విడలేను, నీ ఇల్లాలుగానే వుంటాను (పి సుశీల- ఆత్రేయ). దొంగలరాణి సుధపై చిత్రీకరించిన హుషారైన నృత్య గీతం -తకతక తాళదట్టు మామా నీ దరువులు కలుపవయా (ఎస్ జానకి-కొసరాజు). చిత్రంలోని కొన్ని గీతాలు రంగుల్లో చిత్రీకరించటం విశేషం.
‘ఇల్లాలు’ చిత్రం తమిళంలో కెఆర్ విజయ, రవిచంద్రన్‌ల కాంబినేషన్‌లో శ్రీకాంత్ దర్శకత్వం, కెవి మహదేవన్ సంగీతంతో -ఇదయ కమలం పేరిట యల్‌వి ప్రసాద్ నిర్మించారు. తెలుగులో వాసంతి పాత్రను తమిళంలో షీలా నటించారు. ఈ చిత్రాన్ని హిందీలో ‘మేరాసాయా’ (1966) పేరిట రాజ్‌భోస్లా దర్శకత్వంలో సునీల్‌దత్, సాధనలతో నిర్మాత ప్రేమ్‌జీ రూపొందించారు. తమిళంలో, హిందీలో రికార్డుస్థాయిలో విజయాన్ని సాధించింది. ‘ఇల్లాలు’ తెలుగు చిత్రం మంచి పేరు సంపాదించుకున్నా శతదినోత్సవం జరుపుకోలేకపోయింది. ఇల్లాలు పాటలు అప్పట్లో శ్రోతలను అలరించటం, నేటికీ -మల్లెపూవులు విరిసెరా, -నీవు నా వూహలందే పాటలు చిరస్మరణీయంగా మిగలటం తెలుగు ఇల్లాలు సాధించిన విజయంగా పరిగణించాలి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి