కథ

ఇది సరైన దారేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో పెద్ద దుమారమే చెలరేగింది.
ఉదయాలు నిశ్శబ్దమై పోయాయి. సాయంత్రాలు పగలు గుహలలో వేలాడే గబ్బిలాలయ్యాయి. శంకరం ఎప్పటిలాగే తన ధోరణిలో తానున్నాడు. ఉదయం అయిదింటికి నిద్ర లేవడం, ఒక గంట వాకింగ్, ఆరునూరైనా నూరు ఆరైనా అతని అలవాట్లలో మార్పు రాదు. వర్షం పడితే వాకింగ్‌కి వెళ్లే బదులు ఇంట్లోనే ఎక్సర్‌సైజ్ బైక్ తొక్కడం, ఆరున్నర అయ్యేసరికి స్నానం, దేవతార్చన, సంధ్య వార్చడం ముగించుకుని అప్పటికే వచ్చిన వంట మనిషి అందించే కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తాడు.
పిల్లదానికి నచ్చచెబుదామన్న ధ్యాస ఏ కోశానా లేదు. అక్కడికి నేనేదో దాన్ని రాచిరంపాన పెడుతున్నట్టు చూపులు విసరడం.
మామూలుగా ఏడున్నరైతే గాని మెలకువ రాదు నాకు, నిజమే రాత్రి చాలాసేపు కూచుని చదువుకోడం రాసుకోడం వల్ల ఆలస్యంగా నిద్రలేచే అలవాటు. అది ఇప్పటిదా కాలేజీ రోజుల నుండి వస్తున్నదేగా?

నేను లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగే సమయంలోనే అతనితో ఏదైనా చెప్పాలనుకున్నా, అతను నాకేదైనా చెప్పాలనుకున్నా.
రాత్రి అతను సాధారణంగా బేంక్ నుండి వచ్చేసరికి తొమ్మిదవుతుంది.
మళ్లీ తన పూజ, దీపం పెట్టుకుని, తినేసి ఏదో పుస్తకం చదువుకుంటూ నిద్రపోతాడు. నేను నా పత్రిక కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉంటాను.
వీటన్నింటి మధ్యనా ఎప్పటికప్పుడు కనుచూపు మేరలో కావ్యను వెయ్యి కళ్లతో గమనిస్తూనే ఉంటాను.
నేనేమీ పెద్ద అందగత్తెను కాను. చామనఛాయా, రీతయిన కనుముక్కు తీరు, కాస్త పొడుగే అనిపించే జుట్టు. కానీ కావ్య మాత్రం పాదరసం నింపిన గాజుబొమ్మలా మిలమిలలాడుతూ ఉంటుంది. పచ్చి పసుపు వెన్నలో కలిపినట్టుండే సౌకుమార్యం, కళ్లు చెదిరిపోయే అందం. నల్లగా చీకటిని తెచ్చి అతికించినట్టుండే జుట్టు మోకాళ్లు దాటి ఉంటుంది.
చిన్నప్పుడే దానికి తలస్నానం చేయించాలంటే చేతులు నొప్పి పుట్టేవి. నాలుగు గంగాళాల నీళ్లు కూడా దాని స్నానానికి సరిపోయేవి కాదు.
స్కూల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లో జడలు వెయ్యలేక జుట్టు ట్రిమ్ చేయించాను. అయినా మళ్లీ ఆర్నెల్లలో యధావిధిగా పెరిగేది.
ఇప్పుడా బంగారు తల్లి డిగ్రీ చివరి సంవత్సరం. ఒక్క అందమే కాదు, దానికన్ని వినయ విధేయతలు ఎక్కడి నుండి అబ్బాయో నాకు అర్థంకాదు. చివరికి అడుక్కునే వాడితోనూ వినయంగా మాట్లాడుతుంది.
అన్నీ అబ్బ లక్షణాలే. అవును రంగూ రూపూ మాట తీరూ చివరికి అనుకున్నది సాధించే తీరూ... అన్నీ.
ఇంతవరకు అది కోరుకుంటున్నట్టు యూనివర్సిటీలో ఎం.ఏకి పంపుదామనే
అనుకున్నాను.
నాలుగు రోజుల క్రితం
ఆ ప్రసక్తి రానంతవరకూ
కాని...
చటుక్కున లేచి కూచున్నాను. మళ్లీ బద్దకిస్తే అతను బ్యాంక్‌కి వెళ్లిపోతాడు.
ఆదరా బాదరా బ్రష్ చేశాననిపించి,
జయమ్మా, కాఫీ తీసుకురా అని వంటావిడను పురమాయించి అతనికి సుతరామూ నచ్చదని తెలిసినా నైటీ మార్చుకోకుండానే అతని ముందుకు వెళ్లి ఎదురుగా సోఫాలో కూచున్నాను.
నా అడుగుల చప్పుడు వింటూనే పేపర్ మడిచి టీ పాయ్ మీదుంచి ఏమిటన్నట్టు నా వంక చూశాడు.
‘శం...
పేరు యధాలాపంగా వచ్చేసినా తమాయించుకున్నాను.
మీకు చెప్పానుగా మొన్న సంబంధం గురించి...
నిర్వికారంగా చూశాడు శంకరం నా వంక.
ఒళ్లు మండిపోయింది. మరొకప్పుడైతే సర్రున కోపం తన్నుకు వచ్చేదే. కానీ తమాయించుకున్నాను. ఇప్పుడు కోపం తెచ్చుకుని లాభం లేదు.
అసలెప్పుడైనా ఉంటేగా. నోరు విప్పి ఏదైనా అనే మనిషి అయితే వాదించవచ్చు. వంచవచ్చు. ఎప్పుడైతే పెళ్లైన కొత్తలోనే నా స్ర్తివాద భావాలలు గట్టిగా నొక్కి చెప్పానో అప్పుడే అతను చెప్పిన పరిష్కారం-
‘చూడు, నేను నాకంటూ కొన్ని సామాజిక విలువల్లో పుట్టి పెరిగాను. నువ్వెలా నీ దారి మార్చుకోలేవో, నేనూ నా అభిప్రాయాలు మార్చుకోలేను. కాదంటే మధ్యేమార్గంగా నా దారికి నువ్వు అడ్డం రాకు. అల్లాగే ఇదేమిటని నిన్ను అడగను. అలా కుదరదంటావా? ఎవరి బతుకు వారు బతుకుదాం’
ఎంత ఆలోచించినా మరో దారి లేకపోయింది.
అందుకే ఎవరి దారి వారిదయింది.
నా పత్రిక నా రచనలు నా సభలు నావి. అతని ఆధ్యాత్మిక ప్రపంచం అతనిది.
రంగారావుగారి సంబంధం గురించి చెప్పాను కదా, ముప్పై మూడు జన్మలు తలకిందులుగా తపస్సు చేసినా మనం వాళ్ల స్థాయికి చేరుకోలేము. ఒక్కగానొక్క పిల్లడు. కోట్లకు అధిపతులు. వాళ్లంతట వాళ్లు వచ్చి అడిగారు.
‘అది మన పిల్ల ఏనాడో చేసుకున్న అదృష్టం... అదృష్టమనే మాట మీ స్ర్తివాదులు నమ్ముతారా?’
ఆ మాటల్లో ఎంత వద్దనుకున్నా నాకు వ్యంగ్యం కనిపిస్తూనే ఉంది.
ఇప్పుడు అది కాదు కావలసినది ‘శంకరం! కావ్య ఎంత చెప్పినా వినదేం. ఎంతసేపూ తన చదువు, తన గురించి చెప్పడమే తపప్మరో మాటకు అవకాశమే ఇవ్వడం లేదు’
అనేశాక గాని తెలిసి రాలేదు. నేనూ అంతేగా.
అమ్మ పోలిక అంటాడనుకున్నాను. కాని అనలేదు.
ఇరవై ఏళల్లు వచ్చిన పిల్లకు ఏం చెప్తాం? తన ఆలోచనలు తనకుంటాయి.
నిజమే, కాని
ఎంత అణచుకున్నా కోపం హద్దులు దాటుతోంది.
అతి ప్రయాసతో మాటలు వెదుక్కునే లోగానే సుడిగాలిలా వచ్చింది కావ్య.
‘ఎన్నిసార్లు చెప్పను అమ్మా, మళ్లీ మళ్లీ ఈ ప్రసక్తి తేవడం నాకిష్టంలేదు. నేనిప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాను. అయినా నాకు నచ్చిన వాళ్లు తారసపడే వరకూ పెళ్లి ప్రసక్తి తేవద్దు’
‘అది కాదు కావ్యా...’
ఏదో సర్ది చెప్పబోయాను.
‘వద్దు.. నాకేం చెప్పొద్దు’
అంటూ సుడిగాలిలా వెళ్లిపోయింది.
* * *
రంగారావుగారింటి ముందు పోర్టికోలో ఆగింది కారు.
ఉదయం ఫోన్ చేసి చెప్పింది అరుంధతి, రంగారావుగారి సతీమణి మాట్లాడుకుందాం రమ్మని.
ఉదయం ఉదయమే శంకరంతో పెద్ద గొడవ. అతను వచ్చేందుకు సిద్ధంగా లేదు సరికదా, వద్దు అత్యాశలు వదిలెయ్యి. వాళ్లు ఆశపడగానే అమరిపోడానికి మన పిల్ల షోకేస్‌లో బొమ్మ కాదంటూ వాదన.
సమయానికి కావ్య ఇంట్లో లేదు. ఫ్రెండ్స్‌తో కలిసి టూర్ వెళ్లింది.
ఎప్పటిలా తన నిర్ణయం తను తీసుకుని ఒక్కతే వచ్చింది రంగారావు గారింటికి.
పోర్టికోలో కాలు కింద పెట్టగానే అర్థమైంది వాళ్ల హోదా.
అడుగడుగునా ఖరీదైన విగ్రహాలు.
పరిచయాలు పెద్దగా అవసరం లేకపోయాయి.
అరుంధతి ఇదివరకే కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమే.
రాజదర్బారులా ఉన్న హాల్లో ఇంట్లో సభ్యులంతా ఉన్నారు.
నాకు నేను అదేదో బోనులో నిల్చున్న ముద్దాయిలా అనిపించాను.
‘బావగారు వస్తే బాగుండేది’ రంగారావుగారు సంభాషణ ఆరంభించారు.
సర్ది చెప్పుకున్నాను ‘బ్యాంక్‌లో ఇన్‌స్పెక్షన్ ఉందనీ, వీలు కాలేదనీ’
గంటన్నర మాటల సారాంశం వాళ్లు పక్కా సంప్రదాయాలున్న వారు గనక చిన్నాచితకా మొత్తం ఒక పాతికమంది పెళ్లిచూపులకు వస్తారు. అదీ నామకహా. ఆ రోజునే పిల్లను గట్టి చేసుకుంటారు.
అంటే ఏదో ఒక నగ పెట్టి పిల్ల మాది అనిపించుకోవడమట.
దానికి సంప్రదాయబద్ధంగా నేను ప్రతివారినీ పెళ్లిచూపులకు రమ్మని చెప్పాలి.
ఆ రోజున కటికితే అతకదు గనక లైట్‌గా స్నాక్స్ ఏర్పాటు చేయాలి. కాఫీలు, టీలు, కూల్‌డ్రింక్స్ మామూలే.
ఆయన తరఫున కూడా నేనే పిలిచి వచ్చాను. ఆదివారం సాయంత్రం పెళ్లిచూపులకు రమ్మని.
ముహూర్తం చూసి నాలుగింటికి వస్తామన్నారు.
ఇంటికి వచ్చి ఈ మాట చెప్తే ఇద్దరికిద్దరూ నన్నో వెర్రిమాలోకంలా చూశారు.
నాకు వీలవదు. నేను ఇన్స్‌పెక్షన్‌కి వెళ్లాలి అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వలేదు ఆయన.
కావ్యను ఒప్పించడానికి దాని వెనకే దాని గదిలోకి వెళ్లాను.
‘ఈ ఒక్కసారికీ నా మాట నిలబెట్టు. మంచి కుటుంబం. జీవితంలో వెనక్కి చూడనవసరం లేదు’
రెండు నిమిషాలు నిశ్శబ్దం తర్వాత వేసూవియాస్‌లా విరుచుకు పడింది కావ్య.
‘మీరంతా ఫెమినిస్ట్‌లు కదమ్మా. మీరు ఏదంటే అది చెల్లుబాటు కావాలి. దాని కోసం ఉద్యమాలూ కవిత్వాలూ కథలూ కాకరకాయలూ... నువ్వు రాసిన కవిత్వం అదేగా. మొగాడు ఆడదాన్ని ఎలా కించపరుస్తున్నాడు, ఎలా అణగదొక్కుతున్నాడు, ఎలా అధికారం చెలాయిస్తున్నాడు? ఇదేగా నీ కవిత్వం. నీ అంత పచ్చిగా నేను చెప్పలేకపోతున్నాను.
ప్రేమ పారవశ్యంలో ఒకరి కోసం ఒకరు, ఒకరిలో ఒకరు వొదిగిపోయే క్షణాలలో ఎవరి ఉనికి ఎవరికి గుర్తుంటుంది. అలాటిది అదేదో ఆడదానికి జరిగే పెద్ద అన్యాయంలా చిత్రించావు కద. అక్కడికి ఆ సుఖమేదో ఒక్క అతనే దోచేసుకుంటున్నట్టు. అవన్నీ చదివాక ఏ ఆడపిల్లయినా ఏ మొహం పెట్టుకుని పెళ్లి గురించి ఆలోచిస్తుంది. జుగుప్సతో ఒక జఢురాలిగా మారిపోదూ...
ఇప్పుడేమో నువ్వు చూసిన సంబంధానికి బాగా డబ్బున్నవాడని తలవంచి తాళి కట్టించుకోవాలా? వాళ్లంతా ఛాందసులు గనక నేన సతీ సావిత్రిలా పూజలూ వత్రాలూ చెయ్యాలా? నాకిదంతా కంపరంగా ఉందమ్మా, నన్నిలా వదిలెయ్యి. నా మనసు పెళ్లికి సిద్ధంగా ఉన్నప్పుడు నేనే చెప్తాను’
విసురుగా అంది కావ్య.
నోట మాట పెగలక బిక్కచచ్చిపోయాను.
మొదటిసారి అనిపించింది ఎక్కడో దారి తప్పానా అని.
‘వాళ్లను రమ్మన్నాను’
‘్ఫన్ చేసి వద్దని చెప్పెయ్. మా పిల్ల ఇప్పుడే పెళ్లి చేసుకోదట. చదువుకోవాలనుందని చెప్పేయ్నాకు ఈ హోదాలూ డబ్బులూ , ఇగోలూ వద్దమ్మా. నన్ను నన్నుగా చూసేవాడిని నేనుగా చూసుకుంటాను. నన్ను ఒక హోదాగా చూసే మనిషి కాదు మనిషిలా చూసే మనసు కావాలి. నీ కర్థంకాదులే, నా ప్రపంచం వేరు’
ఇహ వెళ్లమన్నట్టు లేచింది కావ్య.
*

స్వాతి శ్రీపాద
302, యమున అపార్ట్‌మెంట్స్
విశాల్ మార్ట్ వెనుక
రామంతాపూర్
హైదరాబాద్- 500013
8297248988

-స్వాతి శ్రీపాద