హైదరాబాద్

సమష్టి కృషితోనే నిమజ్జనం ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : దేశంలోనే అతి పెద్ద వినాయకుడిని ప్రతిష్ఠించే నగరంలో జరిగే నిమజ్జననోత్సవం దేశంలోనే అతిపెద్ద ఈవెంట్ అని, ఈ మహోన్నత కార్యాన్ని అన్ని ప్రభుత్వ శాఖల సమష్టి కృషి, సమన్వయంతో విజయవంతం చేశామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. నిమజ్జనం ముగిసిన సందర్భంగా ఆయన బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఏ పండుగ జరిగినా, అందుకు సంబంధించిన వివిధ వర్గాలకు ఓ చారిత్రక నేపథ్యం ఉంటుందని వివరించారు. శుక్రవారం సాయంత్రం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 55 వేల పైచిలుకు వినాయక విగ్రహాలు నిమజ్జనమైనట్లు మేయర్ తెలిపారు. వినాయక చవితి వేడుకల కోసం కనీసం నెలరోజుల ముందు నుంచి నగరప్రజల జీవనంతో ముఖ్యమైన సంబంధమున్న జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, పోలీసు, రెవెన్యూ, ఆర్టీసీ, పర్యాటక ఇతరత్ర శాఖలకు చెందిన అధికారులు ఎప్పటికపుడు సమన్వయంతో ఏర్పాట్లు చేశారని, నిమజ్జనం రోజున అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది, అధికారులు ఎంతో అంకితభావంతో విధులు నిర్వర్తించినందుకే నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని వివరించారు. నిమజ్జనం అనేది అన్ని పండుగల మాదిరిగా జనం వికేంద్రీకరణతో జరిగేది కాదని, ఒక చోటకు లక్షలాది మంది భక్తులు చేరే జనం కేంద్రీకృతం పండుగగా వివరించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అన్ని విభాగాలకు చెందిన అధికారులు పరస్పరం సహకరించుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు మేయర్ వెల్లడించారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ నిమజ్జనం ప్రశాంతంగా ముగియటంతో హైదరాబాద్ నగరం మరోసారి మతసామరస్యానికి నిలయమన్న విషయాన్ని చాటుకుందని వివరించారు. నగరంలో ఎంతో సురక్షితమైన ప్రాంతమని, అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, తమ ప్రపంచ స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అమేజాన్ వంటి సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. సుమారు 22వేల మంది పోలీసులు విధులు నిర్వర్తించి నిమజ్జనాన్ని సాఫీగా, ప్రశాంతంగా కొనసాగించారని, ఈసారి సోషల్ పోలీసింగ్ తమ విధి నిర్వహణకు మంచి ఫలితాన్ని ఇచ్చిందని వివరించారు. ప్రతి గణేష్ మండపం నుంచి సుమారు నలుగురైదుగురు నిర్వాహకులే తామంతట తాము ముందుకొచ్చి, సోషల్ పోలీసింగ్ నిర్వహించటం వల్ల కూడా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని వివరించారు. గణేష్ మండపాల విగ్రహాల భద్రత, ప్రమాదాల నివారణ వంటి అంశాలపై వాలంటీర్లు తామిచ్చిన మార్గదర్శకాలను పక్కాగా పాటించాలని కమిషనర్ అంజనీ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు, అధికారుల పరస్పర సహకారంతోనే నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని, శుక్రవారం సాయంత్రం కల్లా నిమజ్జనం ముగియటంతో చెత్త తరలింపు, సాగర్ నుంచి వ్యర్థాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. సమావేశంలో బల్దియా అదనపు, జోనల్ కమిషనర్లు, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి,
పెరిగిన విగ్రహాలు 10వేలు
మహానగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈసారి హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో 32800 విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 12వేలు, సైబరాబాద్ కమిషనరేట్‌లో నిమజ్జనమైన 10160 విగ్రహాలతో కలిపితే గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 55వేల పైచిలుకు విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. గత సంవత్సరం 42043 విగ్రహాలు నిమజ్జనం కాగా, ఈసారి 10వేల విగ్రహాలు, అంటే సుమారు 18 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రశంస
మహానగరంలో గణేష్ నిమజ్జనం ఎలాంటి సంఘటనల్లేకుండా ప్రశాంతంగా నిర్వహించినందుకు జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీసు, రెవెన్యూ, విద్యుత్, పర్యాటక ఇతర శాఖల అధికారులను సీఎం కేసీఆర్ ప్రశంసించినట్లు మేయర్ రామ్మోహన్ వెల్లడించారు. నిమజ్జనం రోజున సీఎం ఫోన్ చేసి నిమజ్జనం జరుగుతున్న తీరును సమీక్షించినట్లు తెలిపారు. అన్ని శాఖల చక్కటి సమన్వయంతో పనిచేసి, నిమజ్జనాన్ని విజయవంతం చేసినందుకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించినట్లు మేయర్ తెలిపారు.
అల్మాస్‌గూడ లడ్డూ రూ.4 లక్షలు
బాలాపూర్: బడంగ్‌పేట్ అల్మాస్‌గూడ శ్రీ రామాంజనేయ భక్త భజన మండలి గణేష్ ఉత్సవ కమిటి అద్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుని లడ్డూను రూ.4 లక్షల 5116కు వేలం పాటలో అల్మాస్‌గూడ నివాసి రామిడి భీంరెడ్డి తనయులు రామిడి వీరాకర్ణ రెడ్డి, రామిడి శూరకర్ణ రెడ్డి దక్కించుకున్నారు. ఉత్సవ కమిటి చైర్మన్ కందుకురి యాది రెడ్డి, అధ్యక్షుడు రామిడి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ రామిడి రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ సమ్ రెడ్డి వెంకట్ రెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, చప్పిడి కొండల్ రెడ్డి, రామిడి వెంకట్ రెడ్డి, చంద్రారెడ్డి, కనె్నమోని రాజు యాదవ్, సమ్ రెడ్డి సంజీవ రెడ్డి, డీ.శ్రీనివాస్ గౌడ్, నాగరాజు గౌడ్, రామిడి సురేందర్ రెడ్డి, నవారు మల్లారెడ్డి పాల్గొన్నారు.
పోలీసులకు సన్మానం
సీఐ సైదులు, ఎస్‌ఐలు నాగరాజు, కృష్ణారెడ్డిని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి పూల బోకే అందజేసి, సన్మానం చేసి, గణనాధుని లడ్డూను అందజేశారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు జరిగినన్ని రోజులు పోలీసులు నిరంతరం గట్టి బందోబస్తు, నిఘాలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ నిరంతరం రాజీలేకుండా సేవలు అందించారని అన్నారు.
కార్యక్రమంలో బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు సమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కే.సత్యనారాయణ రెడ్డి, టేకుల శశిధర్ రెడ్డి, వంగేటి సుధాకర్ రెడ్డి, కళ్లెం శ్రీకాంత్ రెడ్డి, కళ్లెం ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి: మియాపూర్ పాత గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రతిష్ఠించిన లంబోదరుడి లడ్డూకు శుక్రవారం వేలం పాట నిర్వహించారు. కూన సత్యం గౌడ్ రూ.1.1 లక్షలకు కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించాడు. యూత్ నాయకుడు మహేందర్ ముదిరాజ్, వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లడ్డూ దాత కూన సత్యాన్ని సత్కరించారు. మాజీ కౌన్సిలర్ బండారి రామ్‌చందర్, రాచమళ్ల ఓంప్రకాశ్ గౌడ్, అశోక్, మోహన్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, కొడాలి రవికుమార్ పాల్గొన్నారు.
రెండో రోజు కొనసాగిన నిమజ్జనం
ఉప్పల్: పీర్జాదిగూడ, బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవం శుక్రవారం రెండో రోజూ కొనసాగింది. కాలనీలలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి విగ్రహాలను గురువారం హుస్నేస్ సాగర్‌లో నిమజ్జనం చేయగా శుక్రవారం మిగిలిన విగ్రహాలను ఉప్పల్ నల్లచెరువు కొలను, ఎదులాబాద్, నాగార్జున సాగర్, కాళేశ్వరం, శ్రీశైలం తరలించారు. వెళ్లే ముందు మండపంలో అన్నదానాలు, సన్మాలతో ఉత్సవ నిర్వాహకులు సందడి చేశారు. బుద్ధానగర్ రోడ్డు నెంబర్ 4లో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండంలో 11రోజులు పూజలందుకున్న విఘ్నేశ్వరుడి లడ్డూ వేలం పాటలో టీఆర్‌ఎస్ మహిళా విభాగం నాయకురాలు శేరి సవితా కరుణాకర్ రెడ్డి రూ.38116కు దక్కించుకున్నారు. రెండో లడ్డూను కాలనీ నివాసి దుర్గా ప్రసాద్ దక్కించుకున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు వీకే నాదం గౌడ్, శ్రీనివాస్, మోహన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు వంగేటి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
కొడంగల్: గణనాథులను కోలహాలం మధ్య శుక్రవారం తెల్లవారుఝాము వరకు నిమజ్జనం చేశారు. గురువారం రాత్రి పట్టణంలోని పలు వీధులలో అంగరంగ వైభవంగా గణనాథులను అలంకరించి శోభాయాత్రను నిర్వహించారు. వడ్డర్‌గల్లి చితారు పెరుమళ్ల దేవస్థానంలోని వినాయక లడ్డూను 51116 రూపాయలకు కానుకూర్తి హన్మంతు, వినాయక చౌరస్తాలో రూ.51000 బాకారం శ్రీనివాస్, బాకారంవాడలో రూ.31111 టీఎస్ బాకారం అనిత మోహన్, కార్గిల్ కాలనీలో రూ.20111 బాబుమేస్ర్తి, లహోటి కాలనీలో రూ.26116 గోడల రాంరెడ్డి, ఆర్యానగర్‌లో రూ.12700 నగేష్ కుమార్, చౌడేశ్వరిమాత దేవాలయంలో రూ.8వేలకు సుధామ్, అంబేద్కర్ చౌరస్తాలో రూ.31వేలకు వికాస్ కైవసం చేసుకున్నారు.
బొంరాస్‌పేట: నవరాత్రుల్లో భక్తుల పూజలందుకున్న ఆదిదేవుడు నిమజ్జనానికి వైభవంగా కదిలివెళ్లాడు.. శుక్రవారం తెల్లవారుఝాము నుంచి మండల కేంద్రంలో గణనాథుని నిమజ్జన యాత్ర ఆద్యంతం భక్తిశ్రద్దల మధ్య కొనసాగింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు, కుంటల్లో నీరులేకపోవడంతో నిమజ్జనం కోసం శ్రీశైలం, కొట్‌పల్లి ప్రాజెక్టులకు తరలివెళ్లారు. చిన్నపాటి విగ్రహలను బొంరాస్‌పేట పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు.
కేపీహెచ్‌బీకాలనీ: రమ్య గ్రౌండ్‌లో శివ శక్తి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాలలో ఏర్పాటు చేసిన లడ్డూ వేలం పాటలో రూ.73 వేలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధం యేసురాజు దక్కించుకున్నారు.