క్రైమ్ కథ

పథకం (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్చర్ ఆ చిన్న దుకాణం తలుపు తెరవగానే తలుపుకి కట్టిన చిరుగంట మోగింది. ఆ షాప్‌లో గోడలకి వేలాడే చాలా గడియారాల టిక్‌టిక్ శబ్దాలు వినపడసాగాయి.
ఓ గడియారాన్ని బాగు చేసే ఓ లావుపాటి పొట్టి వ్యక్తి దగ్గరికి వెళ్లి అడిగాడు.
‘మీరేనా జేజర్?’
‘అవును’
‘నన్ను డగెట్ పంపాడు. దీన్ని మీకు ఇవ్వమన్నాడు’
ఆర్చర్ ఇచ్చిన సగం నోట్‌ని అందుకుని, ఆ వ్యక్తి డ్రాయర్ తెరచి తన దగ్గరున్న సగం పౌండ్ నోట్‌ని పక్కన ఉంచి పోల్చి చూశాడు. రెండూ ఓకే నోట్ నించి చింపబడ్డాయని నంబర్లని బట్టి గ్రహించాడు.
‘మిస్టర్ ఆర్చర్. ఐదువేల పౌండ్లు. సగం ఇప్పుడు. సగం పని పూర్తయ్యాక’ ఆ పొట్టి వ్యక్తి చెప్పాడు.
ఆర్చర్ జేబులోంచి తీసిచ్చిన కవర్లోని డబ్బుని లెక్క పెట్టుకుని ఆ పొట్టి వ్యక్తి ఆ డబ్బుతోపాటు ఉంచిన ఓ ఇంటి బ్లూ ప్రింట్‌ని తీసి టేబుల్ మీద పరిచి పరిశీలించాడు. తర్వాత అడిగాడు.
‘ఇరుగు, పొరుగు గురించి చెప్తారా?’
‘ప్రస్తుతం వారు లేరు. ఈ ఇల్లు ఏడు ఎకరాల్లో సముద్రపు ఒడ్డున ఉంది’
‘వంట గేస్ కనెక్షన్ ఉందిగా?’
‘ఉంది. ఇక్కడ అల్మారా వెనక నించి పైప్ ఇంట్లోకి వస్తుంది. ఇక్కడ నించి ఓ పైప్ వంట గదిలోకి, ఇంకోటి ఫైర్ ప్లేస్‌లోకి వెళ్తుంది’ వేలితో బ్లూప్రింట్‌ని చూపిస్తూ చెప్పాడు.
అతను తల ఊపాడు.
‘ఇంట్లోవి ఇటుక గోడలు. మీరు గేస్ లీకైనట్లుగా భ్రమ పడేలా చేసి ఇంటిని ఎలాంటి అనుమానం రాకుండా పేల్చేస్తారని నా మిత్రుడు డగెట్ చెప్పాడు. ఇంటి కిటికీలు, తలుపుల్లోంచి గేస్ బయటకి పోకుండా జాగ్రత్త తీసుకునే వచ్చాను. ఎప్పుడు పని పూర్తి చేస్తారు?’ ఆర్చర్ అడిగాడు.
‘రేపు మధ్యాహ్నం సరిగ్గా పనె్నండుకి’
‘ఈలోగా మీరు ఆ ఇంటిని పరిశీలించాలా?’
‘అవసరం లేదు. మీ బ్లూప్రింట్ చాలు. మీరు రేపు మధ్యాహ్నం పనె్నండుకి చక్కటి ఎలిబీని ఏర్పాటు చేసుకోండి. ఏదైనా క్లబ్‌లో లంచ్ తీసుకోండి. అక్కడి రిజిస్టర్‌లో మీరు వచ్చిన టైం, వెళ్లిన టైం నమోదు అవుతుంది’ ఆ వ్యక్తి సూచించాడు.
‘సరే’
‘ఓ ప్రశ్న. ఆ ఇంటిని మీరు ఎంతకి ఇన్సూర్ చేశారు?’
‘అందుకోసం కాదు. ఇన్సూర్ చేయలేదు. మా నాన్న విల్లు ప్రకారం నేను దాన్ని అమ్మకూడదు. కూల్చకూడదు. అందువల్ల ఆ ఏడు ఎకరాలు నిరుపయోగం అవుతున్నాయి. ఇల్లు పోతే దాన్ని ఓ హోటల్ నిర్మాణానికి అమ్మగలను’ ఆర్చర్ చెప్పాడు.
మర్నాడు ఉదయం పదకొండున్నరకి జేజర్ కారుని ఆ ఇంటికి చాలా దూరంలో ఆపి కాలినడకన అక్కడికి చేరుకున్నాడు. కారు నించి ఇంటికి వచ్చే దారిలో ఒక్క మనిషి కూడా జేజర్‌కి కనిపించలేదు. అతని చేతిలో ఓ సంచీ ఉంది. మరో చేతిలో రోడ్లు ఊడ్చే ఓ పొడుగాటి చీపురుతో తన వెనకాల పడ్డ బూట్ల ముద్రలని చెరుపుకుంటూ వెళ్లడానికి అదనంగా కొంత సమయం పట్టింది. అతను గ్లవ్స్ ధరించి ఆ ఇంటి గుమ్మం ముందున్న కార్పెట్‌ని ఎత్తితే, ఆర్చర్ చెప్పినట్లుగానే దాని అడుగుభాగంలో టేప్‌తో అతికించిన తాళం చెవి కనిపించింది. దాన్ని తీసుకుని తాళం తెరిచి లోపలకి వెళ్లి తలుపు మూశాడు. ఆ ఇంట్లోకి సముద్రపు ఘోష వినిపిస్తోంది.
ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తన జేబులోంచి బ్లూ ప్రింట్‌ని తీసి ఇల్లంతా తిరుగుతూ లింటెల్స్, కాంక్రీట్ దూలాలు ఎక్కడ ఉన్నాయో చూసి చాక్‌పీస్‌తో గుర్తు పెట్టుకున్నాడు. అదా కూలాక ఆ గుర్తుల మీద దుమ్ము పడి అవి కనిపించవు. తర్వాత కిటికీ తలుపులు అన్నీ మూసీ ఉన్నాయో, లేవో చెక్ చేశాడు.
వంట గదిలో పక్కనే ఉన్న పేంట్రీ గది తలుపు తెరచి ఉంది. లోపలకి వెళ్లి సంచీలోంచి డైనమైట్ స్టిక్స్‌ని కొన్నిటిని బయటకి తీశాడు. తర్వాత చిన్న గడియారం, సన్నటి వైర్ చుట్ట, రెండు బ్లాస్టింగ్ కేప్స్‌ని కూడా బయటకి తీశాడు. జేబులోంచి పెన్ నైఫ్‌ని తీసి డైనమైట్ స్టిక్స్‌ని దాంతో కోసి, వాటిలో మృదువుగా ఆ కేప్స్‌ని అమర్చాడు. తర్వాత ఆ స్టిక్స్‌ని మూడిటిని కలిపి టేప్‌తో చుట్టాడు. అలాంటివి రెండు తయారుచేశాడు. వాటిని గేస్ పైప్ వెళ్లే గోడకి రెండు చోట్ల అమర్చాడు.
గ్లవ్స్‌ని తొలగించి అత్యంత శ్రద్ధతో డైనమైట్ స్టిక్స్‌కి వైర్‌ని అమర్చాడు. తర్వాత ఆ సర్క్యూట్‌ని తనిఖీ చేసి అంతా సరిగ్గా ఉందని తృప్తి చెందాడు. తన చేతి గడియారం వంక చూసుకుని టైమర్ని సెట్ చేసి, దాన్ని చివరగా వైర్‌కి కనెక్ట్ చేశాడు. ఇంకో పది నిమిషాల తర్వాత, సరిగ్గా పనె్నండూ ఐదుకి అది పేలుతుంది. రుమాలుతో తన వేళ్లు పడ్డ అన్ని చోట్లా తుడిచాడు. ఓసారి అది పేలితే వేలిముద్రలు మాయం అవుతాయని తెలుసు. కాని అతను వృత్తిపరంగా తీసుకునే జాగ్రత్త అది.
మళ్లీ గ్లవ్స్ ధరించి పేంట్రీ గది తలుపు మూసి వంటగదిలోకి వెళ్లి ఫ్రిజ్ తెరిచి ఓ బీర్ కేన్‌ని తీసుకుని తృప్తిగా నిట్టూర్చాడు. దాన్ని తెరిచి తాగుతూ తను వచ్చిన తలుపు దగ్గరకి నడిచాడు. పిడి తిప్పితే తలుపు తెరచుకోదని అతనికి తెలుసు. జేబులోంచి తాళంచెవి తీసి దాని రంధ్రంలోకి తిప్పాడు. కాని అది తిరగలేదు. ఒకటికి రెండుసార్లు ప్రయత్నించినా అది తాళాన్ని తెరవకపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
తాళం చెవిని బయటకి తీసి, ఇంకోసారి చొప్పించి తిప్పాడు. ఉపయోగం లేకపోయింది. ఆలోచించి దాన్ని మళ్లీ బయటకి తీసి తలకిందులుగా పెట్టే ప్రయత్నం చేశాడు. అది అలా అసలు రంధ్రంలోకి పట్టనే లేదు. దాంతో దాన్ని మళ్లీ సరిగ్గా తిప్పి ఇంకోసారి చూశాడు. అది దాని తాళంచెవి కాదని అర్థమైంది. అతనిలోని ఆశ్చర్యం భయంగా మారింది. చేతి గడియారం వంక చూసుకున్నాడు. విస్ఫోటానికి ఇంక ఆరు నిమిషాలే ఉన్నాయి.
సంచీలోంచి స్క్రూ డ్రైవర్‌ని తీసి చకచకా ఆ తలుపు తాళం స్క్రూలని విప్పాడు. దాని పైభాగం ఊడి వచ్చాక మెకానిజాన్ని పరిశీలించాడు. దాన్ని బయటి నించి తప్ప, లోపల నించి తెరవడం అసాధ్యం అని గ్రహించాక అతని భయం రెట్టింపైంది. అలాంటి తాళం అతనికి ఎన్నడూ తారసపడలేదు. ఆర్చర్ ప్రత్యేకంగా చేసి బిగించిన తాళం అని ఇట్టే గ్రహించాడు.
ఆ తలుపులని భుజాలతో బలంగా నెట్టి చూశాడు. బలమైన ఓక్ కలపతో చేసిన అది బాహుబలంతో తెరచుకోదని జేజర్‌కి అర్థమైంది. ఇది విస్మరించిన ఆర్చర్ మీద అంతులేని కోపం వచ్చింది. చేతి గడియారం వంక చూసుకున్నాడు. ఇంక నాలుగు నిమిషాలే ఉన్నాయి.
వెంటనే వెనక ఉన్న వంట గదిలోకి వెళ్లి అక్కడ నించి బయటకి వెళ్లే తలుపు పిడి మీద చేతిని వేసి కిందకి నొక్కి తోశాడు. అదీ తెరచుకోలేదు. మళ్లీ డైనమేట్స్ అమర్చిన పేంట్రీ గది దగ్గరికి దూకి తలుపు తెరిచే ప్రయత్నం చేశాడు. అది లోపలకి కాని, బయటకి కాని తెరచుకోలేదు!
జేజర్ ఎందుకు? అన్న ప్రశ్న పక్కన పెట్టి, ఎలా? అని ఆలోచించాడు. ఆర్చర్ తనని ఎందుకు ఆ ఇంట్లో ఇరికించాడు అన్నది అనవసరం. డైనమేట్స్ పేలి ఇల్లు కూలేలోగా తను ఎలా బయటపడాలి అన్నది ముఖ్యమని అతను ఆలోచించాడు. కిటికీల దగ్గరికి పరిగెత్తి చూస్తే అన్నిటికీ లోపల ఇంటూ ఆకారంలో తలుపులు తెరచుకోకుండా బలంగా చెక్కలు బిగించి ఉన్నాయి. పేంట్రీలోకి వెళ్తే కాని తను డైనమేట్స్‌ని నిర్వీర్యం చేయలేడు. కాని వెళ్లే అవకాశం లేదు. దాంతో బాంబ్ పేలేలోగా ఎలా బయట పడాలా అని దారులు వెదికాడు. దొరకలేదు.
అతనికి ముచ్చెమటలు పోశాయి. మెట్లెకి పైకి పరిగెత్తాడు. మెట్ల చివర ఉన్న తలుపు మూసి ఉంది. హేండిల్ తిప్పితే తెరచుకోలేదు. ఆ ఓక్ తలుపు మడతబందులు లోపలి వైపు బిగించి ఉన్నాయి. ఇటు వైపు ఉండి ఉంటే స్క్రూలని విప్పి తెరవగలిగేవాడు.
అతను ఊపిరి తీసి వదిలే విరామం బాగా తగ్గి, భయంతో, అలసటతో రొప్పుతున్నాడు. అతని మనస్థితి బోనులో పడ్డ ఎలుకలా ఉంది.
పక్క గదిలోని గడియారం రెండు లోహపు ముళ్లూ క్షణక్షణానికీ ఒకదాని దగ్గరికి మరొకటి జరుగుతున్నాయి. ఆ రెండూ తాకగానే బాంబ్ పేలుతుంది. దాంతో గేస్ అంటుకుని ఇంకో పెద్ద పేలుడు సంభవించి ఇంటి పైకప్పు, గోడలు లోపలకి కూలిపోతాయి. అతనికి ఆర్చర్ మీద అంతులేని కోపం, తన పరిస్థితి అంతే భయం కలిగాయి. ఆర్చర్ తనని ఆ ఇంట్లో చంపడం వల్ల అతనికి కలిగే లాభం ఏమిటో జేజర్‌కి అంతుపట్టలేదు.
అతనికి మిగిలి ఉన్న ఆశ ఒక్కటే. తను అమర్చిన బాంబ్‌లో ఎక్కడైనా చిన్న లోపం ఉండి అది పేలకపోవచ్చు. సమయం క్షణాలకి దిగింది. కాని తను ఎలాంటి తప్పూ చేయడని, అది పేలుతుందని అతనికి తెలుసు.
* * *
అక్కడికి పదహారు మైళ్ల దూరంలోని ఓ క్లబ్‌లోని వెయిటర్ డగెట్ ఇద్దరు కస్టమర్లకి డ్రింక్ గ్లాసులని అందించాక ఓ టేబిల్ ముందు కూర్చుని చైనీస్ భోజనాన్ని తినే ఆర్చర్ దగ్గరికి వచ్చాడు.
‘దీపావళి ఎన్నింటికి?’ అడిగాడు.
‘సరిగ్గా పనె్నండుకి. ఇంకో నిమిషంలో’ ఆర్చర్ నవ్వుతూ చెప్పాడు.
‘జేజర్ ఒక్క తప్పూ చేయడు. ఆ ఇల్లు తప్పక కూలిపోతుంది’ డగెట్ చెప్పాడు.
‘అతను ఓ తప్పు చేశాడు’ ఆర్చర్ ఇతరులకి వినపడనంత నెమ్మదిగా చెప్పాడు.
‘ఎప్పుడు? ఎక్కడ?’
‘క్రితం సంవత్సరం జేజర్ ఓ బట్టల దుకాణాన్ని కాల్చినప్పుడు’
‘మీకు ఎవరు చెప్పారు?’
‘డగెట్! నీ పేరు నేనెలా తెలుసుకున్నావని అనుకున్నావు? నువ్వు మధ్యవర్తివి. అతను పని చేస్తాడు. క్లైంట్ ఇన్సూరెన్స్ సొమ్ముని వసూలు చేసుకుంటాడు. ఆ అగ్ని ప్రమాదంలో ఓ ఫైర్ మేన్ మరణించాడు’
‘అవును. విన్నాను’
‘ఆయన పేరు స్టింసన్. మా నాన్న’
‘ఐనా మీ పనిని జేజర్‌కి అప్పగించారా?’ డగెట్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘అవును. పనె్నండైంది. ఇంటితోపాటు జేజర్ కూడా తుక్కుతుక్కై పోయి ఉంటాడు’
‘అదే జరిగితే రేపు ఇన్సూరెన్స్ వాళ్లు మిమ్మల్ని చాలా ప్రశ్నలు వేస్తారు. తృప్తికరమైన సమాధానాలని మీరు చెప్పలేని ప్రశ్నలు’ డగెట్ క్రోధంగా చెప్పాడు.
‘ఇందులో ఇన్సూరెన్స్ వారి ప్రమేయం లేదు. వారం క్రితం దాన్ని రద్దు చేశాను’ చెప్పి ఆర్చర్ రిలాక్సింగ్‌గా వైన్ గ్లాస్‌లోని వైన్‌ని తాగసాడు. *

(గిల్బర్ట్ రాల్‌స్టన్ కథకి
స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి