క్రైమ్ కథ

ఎంతెంత దూరం (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆమె ఇంటికి ఇంకా ఎంత దూరం?’ నేరస్థుడు అడిగాడు.
‘కనీసం ఇంకో అరగంట పట్టచ్చు’ వింటర్స్ జవాబు చెప్పాడు.
నేరస్థుడు వర్షపు జల్లులో తడిసి వణుకుతున్నాడు.
‘ఈ చలికి కొద్ది సేపట్లో నువ్వు చచ్చిపోవచ్చు’ వింటర్స్ చెప్పాడు.
‘నోరు మూసుకోకపోతే నువ్వు నాకన్నా ముందే చస్తావు’
‘తేడా ఏమిటంటే, నేను మరణిస్తే నీకు సహాయానికి ఎవరూ రారు. నువ్వూ మరణిస్తావు’ వింటర్స్ చెప్పాడు.
నేరస్థుడివి కాటన్ సాక్స్, తలకి టోపీ, చేతికి గ్లవ్స్ లేవు. జీన్స్, కాటన్ షర్ట్ ఆ చలికి ఆగవ్. అతను తనకన్నా ఇరవై ఏళ్లు పెద్ద. కాని వాతావరణం తనకి అనుకూలంగా ఉంది అని వింటర్స్ అనుకున్నాడు. మూడు గంటల క్రితం ఆ నేరస్థుడు వింటర్స్‌ని అడిగాడు.
‘నువ్వు ఈ ప్రాంతానికి చెందిన వాడివేనా?’
‘అవును’
‘నీకు బియాట్రైస్ తెలుసా?’
‘తెలుసు’
‘ఐతే నన్ను ఆమె ఇంటికి తీసుకెళ్లు’ అతను అర్థించాడు.
‘దేనికి?’
‘పనుంది’
‘నేను వేరే పని మీద వెళ్తున్నాను. కుదరదు’
వెంటనే అతను వింటర్స్‌కి రివాల్వర్ చూపించి కోరాడు.
‘నన్ను బియాట్రైస్ ఇంటికి తీసుకెళ్లు’
ఆ అక్టోబర్ నెల సాయంత్రం అతను సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉన్న న్యూ హేంప్‌షైర్లోని వైట్ వౌంటెన్స్‌లో పొగ మంచు, సన్నటి చినుకుల మధ్య వింటర్‌ని అనుసరిస్తున్నాడు.
‘హైపోథెర్మియా మరణాలు ఇలాంటి వాతావరణంలోనే సంభవిస్తాయి’ కొద్దిసేపాగి వింటర్స్ చెప్పాడు.
‘హైపోథెర్మియా బిలో జీరో టెంపరేచర్‌లోనేగా సంభవించేది?’ అతను వణుకుతూ అడిగాడు.
‘నాకు అలవాటు కాబట్టి చెమట పట్టదు. నీకు చెమట పట్టనీయకు. చెమట శరీరాన్ని చల్లపరిచే యంత్రాంగం. నీ చర్మం మీది ఆవిరి నీరు అవడంతో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దాంతో ఈ చలి చంపుతుంది. గడ్డకట్టవు కాని నీకు మరణం సంభవిస్తుంది. నేనీ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి నాకిది బాగా తెలుసు. బియాట్రైస్ ఇంటికి మనం ఇంకో వెయ్యి అడుగులు పైకి వెళ్లాలి. పైకి వెళ్లే కొద్దీ చలి ఎక్కువ అవుతుంది. కాబట్టి వెనక్కి తిరగడం మంచిది.’
ఆ నేరస్థుడు కోపంగా ముందున్న వింటర్స్ వీపులో రివాల్వర్ గొట్టాన్ని గుచ్చి చెప్పాడు.
‘ఇది బొమ్మ తుపాకీ కాదు. పాయింట్ 38 స్మిత్ అండ్ వెస్సన్ రివాల్వర్. పద’
జైలు నించి పారిపోయి వచ్చిన అతను తనని కలిసేలోగా ఎక్కడో దాన్ని సంపాదించాడని వింటర్స్ అనుకున్నాడు.
‘నా మాట విను. నడవడం మంచిది కాదు. ఇంత వేగంగా నడిస్తే గాల్లోని తేమకి చెమట పడుతుంది. శరీరం ఈ వాతావరణంలో వేడిగా ఉండటం అవసరం’
‘షటప్’
వింటర్స్ నడుస్తూ తన జేబులోని పాకెట్ బుక్‌లోంచి ఒకో కాగితాన్ని చింపి, ఉండ చుట్టి వేలితో దూరంగా విసురుతున్నాడు.
కాళ్లతో రాళ్లని పక్కకి తంతున్నాడు. అటు, ఇటు ఉన్న మొక్కల కొమ్మలని విరుస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక కాలిబాట రెండుగా చీలడం నేరస్థుడు గమనించాడు. ఒకటి కిందకి లోయలోకి, మరొకటి పైకి వెళ్తున్నాయి. లోయలో కింద ఉన్న గ్రామం పొగమంచు వల్ల కనపడటం లేదు.
‘బియాట్రైస్‌తో నీకేం పని?’ వింటర్స్ జవాబు తెలిసీ అడిగాడు.
నేరస్థుడు జవాబు చెప్పలేదు.
‘నీ అంతట నువ్వు ఈ వైట్ వౌంటెన్స్ లోంచి బయటకి వెళ్లలేవు. ఈ పొగ మంచులో అసలు సాధ్యం కాదు. కొద్దిసేపటికి చీకటి పడ్డాక నాలాంటి స్థానికులే ఒకోసారి దారి తప్పుతూంటారు. కాబట్టి నీ రివాల్వర్‌ని జేబులో ఉంచుకో. నన్ను చంపడం నీకు ఆత్మహత్యతో సమానం. ఈ చలికి ఏమవుతుందో నీకు అర్థం కావడంలేదు. ఇలాంటి వాతావరణంలో ఇక్కడ ఏటా నలుగురైదుగురు మరణిస్తూంటారు. అందుకే ఈ ప్రాంతానికి కోల్డ్ రిడ్జ్ అనే ముద్దు పేరు పెట్టారు...’
అతను జవాబు చెప్పలేదు. వింటర్స్ చలిని బయటకి తిట్టి చెప్పాడు.
‘నువ్వు హైపోథెర్మియాలోని మొదటి స్టేజ్‌లో ఉన్నావు. వణుకుతూ నీ దేహం వేడిగా ఉండే ప్రయత్నం చేస్తోంది. నీలోని ఉష్ణోగ్రత ఇప్పటికే నార్మల్ కంటే తక్కువ స్థాయికి దిగింది. ఇప్పుడు చురుకైన మెదడుతో స్పృహలో ఉన్నావు కాని కొంత సమయం గడిస్తే అలా ఉండవు’
‘నేను బానే ఉన్నాను. నువ్వు నడు’
‘నీ ఉష్ణోగ్రత తొంభై డిగ్రీల ఫారెన్‌హీట్‌కన్నా కిందికి పడిపోతే నీ శరీర క్రియలు క్రమంగా బలహీనపడతాయి. నీలో బద్ధకం, అయోమయం కలుగుతాయి. అది నీకు రెండు విధాల నష్టం’
‘రెండో విధం ఏమిటి?’
‘నీ చేతిలోని రివాల్వర్‌ని లాక్కోగలను. కాబట్టి వణుకు ఆగాలి. ఇంకాస్త పైకి వెళ్తే కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం అధికం అవుతుంది’
‘నాది దృఢమైన శరీరం’
‘అది ఇప్పటికే నీ దేహంలో జరుగుతోంది’
‘నీ దుస్తులని విప్పతీ. నాకన్నా ముందే నీకు అవన్నీ జరుగుతాయో, లేదో చూస్తాను’ నేరస్థుడు కఠినంగా చెప్పాడు.
‘అది నీకే నష్టం. ఈ పర్వతం మీంచి ప్రాణాలతో కిందకి దిగాలంటే నీకు నా అవసరం ఉంది’
‘నేను ఎటునించైనా కిందకి దిగగలను’
‘అది అంత తేలిక కాదు. దారంతా వన్య మృగాలు, సర్పాలు. ప్రధాన కాలిబాటలు దక్షిణం వైపు సాగుతాయి. నువ్వు కొండ అంచులోంచి కిందకి పడిపోకుండా సాగినా, నువ్వు దిగాక ఎదురుగా ఇంకో పర్వతం కనిపిస్తుంది. ఇది వైట్ వౌంటెన్ కాదు. వైట్ వౌంటెన్స్’
‘అబద్ధాలు’
ఇద్దరి మధ్యా కొద్దిసేపు నిశ్శబ్దం.
‘ఈ రాత్రి చలి నించి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో తెలుసా?’ వింటర్స్ అడిగాడు.
‘కాసేపు మాట్లాడటం ఆపు’
వింటర్స్‌కి వెనక నించి శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే కాలు జారి కింద పడ్డ నేరస్థుడు కనిపించాడు. అతని చేతిలోని రివాల్వర్ అప్రమత్తంగా వింటర్స్‌కి గురిపెట్టబడి ఉంది. వింటర్స్ అతనికి చేతిని అందించి లేపాడు. ఐదు నిమిషాల తర్వాత అతని మోకాలుకైన గాయాన్ని చూసి చెప్పాడు.
‘పోలీస్ సెర్చ్ డాగ్ ఆ రక్తాన్ని తేలిగ్గా వాసన పడుతుంది. వెనక్కి వెళ్లి దాని మీద మట్టి చల్లుదాం’
‘వద్దు. వాళ్లకి నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలుస్తుంది?’
ఆ అనుమానం వింటర్స్‌లో కూడా మెదలుతూనే ఉంది. ఆయుధం ధరించిన, ప్రమాదకరమైన నేరస్థుడు ఇక్కడ ఉన్నాడని వారికి తెలుసా?
‘ఆగు. నీ జేబులోనివన్నీ తీసి కింద పడేయ్’ అతను అకస్మాత్తుగా ఆజ్ఞాపించాడు.
వింటర్స్ జేబులోంచి మూడు ఎనర్జీ డ్రింక్ బాటిల్స్, ఎనర్జీ బార్స్, ఓ ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ఎమర్జెన్సీ విజిల్, వాటర్‌ప్రూఫ్ అగ్గిపుల్లలు, కంపాస్, ఎమర్జెన్సీ షెల్టర్‌గా ఉపయోగించే ప్లాస్టిక్ సంచీ బయటకి తీశాడు.
‘స్థానికులంతా వీటిని సదా దగ్గర ఉంచుకుంటారు. మాలో కొందరు తప్పిపోతూండటం జరుగుతూంటుంది. ఇవి చాలామంది ప్రాణాలని రక్షించాయి’
‘పద’ ఆ నేరస్థుడు మంచి నీళ్లని సగం పైనే తాగి చెప్పాడు.
ఎనర్జీ బార్‌ని నములుతూ ఆ నేరస్థుడు వింటర్స్‌ని అనుసరించాడు.
‘నువ్వేం చేస్తూంటావు?’ కొద్దిసేపాగి నేరస్థుడు అడిగాడు.
‘అడవిలోని చెట్లని నరుకుతూంటా ను. వారం క్రితమే ఓ యువ జంట, వారి ముగ్గురి పిల్లలు సరిగ్గా అక్కడ చలికి మరణించారు’ ఓవైపు చూపిస్తూ చెప్పాడు.
‘చావు గురించి తప్ప ఇంకేమైనా మాట్లాడు. ఇంకెంత దూరం?’
‘ఇంకో అరమైలు. నీ పేరేమిటి?’
‘ఫ్రెడ్’ అతను చెప్పాడు.
‘నీకు బియాట్రైస్‌తో ఏం పని?’
‘ఆమె తండ్రి కోర్టులో ఓ కేసులో నాకు వ్యితిరేకంగా చెప్పే సాక్షి. ఏకైక సాక్షి. అక్కడికి త్వరగా వెళ్దాం’
‘ఆయన నాకు తెలుసు. అగ్నిమాపక దళంలో పని చేస్తున్నాడు. ఆయన కూతురు బియాట్రైస్ బయోలజీ టీచర్. కొద్దిసేపు ఆగుదామా?’
‘వైట్ వౌంటెన్స్ ఇంకా నా శక్తినంతా లాక్కోలేదు. ఎంత పైకెక్కాం?’
‘సుమారు మూడు వేల ఏడు వందల అడుగులు. నేను చెప్పేది నిజం. నీ శరీరం కొంత వేడెక్కడం మంచిది’
‘ఎలా?’
‘నాకూ తెలీదు. ఈ వర్షానికి కట్టెలు కూడా మండవు. నీకు వణుకు తగ్గింది. నీ టెంపరేచర్ ఇంకా తగ్గడంతో నీ శరీరంలోని ముఖ్య అవయవాలు పని చేయడానికి వీలుగా శరీరం కృషి చేస్తోంది’
‘నాకు బానే ఉంది’
‘కాని నీ మాటలు ముద్దగా వస్తున్నాయి. నీలోని హైపోథెర్మియా ఇంకాస్త పెరిగితే నీలో అయోమయం అధికమవుతుంది. ఓసారి బంగారం కోసం తవ్వే ఒకతన్ని ఇలాంటి స్థితిలో ఉండగా రక్షించాం. అతను భూమిలో బంగారం ఉందని భ్రమపడ్డాడు. అలా ఇక్కడ తప్పిపోయిన చాలామందిని నేను రక్షించాను.’
‘ఆపు. కనపడితే నన్ను కాల్చివేయమనే ఆర్డర్ ఉంది’ నేరస్థుడు చెప్పాడు.
‘బహుశ అది నిన్ను చంపడానికి కాక నువ్వు ఇతరులకి హాని చేయకుండా పబ్లిక్ సేఫ్టీ కోసం జారీ చేసి ఉంటారు. వారు నీ కోసం వెదకడం ఆరంభించే ఉంటారు. లొంగిపోయే వారిని పోలీసులు చంపరు. కాబట్టి నీ రివాల్వర్‌ని ఆ లోయలోకి విసిరేయ్. మనం మళ్లీ వెనక్కి వెళ్దాం. నాకు రివాల్వర్ గురిపెట్టి నడిచే నిన్ను పోలీసులు చూస్తే దూరం నించి రైఫిల్‌తో నిన్ను కాల్చచ్చు’ ‘నన్ను మాయచేసే ప్రయత్నం చేయకు. ఇక్కడ నువ్వు, నేను, దయ్యాలు మాత్రమే ఉన్నాయి’
‘మా ఇంటికి వెళ్దాం. ఉడెన్ స్టవ్ ముందు మనం బ్లాంకెట్ కప్పుకుని చలి కాచుకోవచ్చు. అక్కడికి నీ కోసం ఎవరూ రారు. అక్కడ కాలుజారి పడటం, హైపోథెర్మియా లాంటి భయాలు ఉండవు. కాల్చి చంపబడే అవకాశం కూడా ఉండదు’
కొద్దిసేపు నిశ్శబ్దం. అకస్మాత్తుగా రెండుసార్లు రైఫిల్ పేలిన శబ్దం వినిపించింది. తక్షణం ఆ నేరస్థుడి చేతిలోని రివాల్వర్ నేల మీద పడిపోయింది. వింటర్స్ వెంటనే దాన్ని అందుకున్నాడు. చేతిలో రైఫిల్స్‌తో ఇద్దరు మనుషులు ఓ పెద్ద బండరాయి చాటునించి వారి ముందుకి వచ్చారు.
* * *
నేరస్థుడ్ని పోలీసులకి అప్పగించడానికి వేన్‌లో వెళ్తూండగా ఆ నేరస్థుడు వారి సంభాషణని విన్నాడు.
‘బీర్ బాటిల్స్ కోసం వెళ్లిన నువ్వు గంటన్నరైనా తిరిగి రాకపోవడంతో ఏమయ్యావో మాకు అర్థం కాలేదు. ఫెరిగ్నో అనే నేరస్థుడు జైల్లోంచి తప్పించుకున్నాడని రేడియోలో వినగానే అతను ఎవరో మాకు అర్థమైంది. లాస్‌ఏంజెలెస్‌లో అతను హత్య చేస్తూండగా బియాట్రైస్ తండ్రి చూశాడు. నువ్వు రాకపోవడానికి, అతనికి సంబంధం ఉందని అనుమానించి వెంటనే బయటకు వచ్చి వెతికితే కాలి బాటలో నువ్వు పడేసిన కాగితపు ఉండలు, తెంపిన కొమ్మలు కనిపించగానే నువ్వు ఆ నేరస్థుడి చేతిలో చిక్కావని, కావాలనే ఆ గుర్తులని వదులుతున్నావని గ్రహించాం. బియాట్రైస్ ఇంటికి వాడ్ని తీసుకెళ్తావని ఊహించాం. పోలీసులకి వెంటనే ఫోన్ చేశాం. కాని నువ్వు తెలివిగా రెండు మైళ్ల పరిధిలోనే మన వింటర్ కాటజ్ చుట్టూ తిరుగుతున్నావని గ్రహించగానే అక్కడ మాటేసాం’
‘ఇతని పేరు ఫ్రెడ్ కాదన్నమాట?’
‘కాదు. మిస్టర్ ఫెరిగ్నో. నువ్వు అదృష్టవంతుడివి. వింటర్స్ నిన్ను బియాట్రైస్ ఇంటికి తీసుకెళ్లి ఉంటే, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ప్రకారం పోలీసులు నిన్ను కాల్చి చంపేవారు’ నేరస్థుడితో చెప్పాడు.
‘అవును. అది నాకు తెలుసు. నన్ను చంపడానికి వెనుకాడని ఫెరిగ్నో ప్రాణాలని నేను రక్షిస్తున్నాని తెలిసే రక్షించాను’ వింటర్స్ చెప్పాడు.
వారి కారు పోలీసుస్టేషన్ వైపు సాగిపోయింది.
* * *
బియాట్రైస్ తన కృతజ్ఞతలని తెలియజేయడానికి మర్నాడు వింటర్స్ ఇంటికి వచ్చింది.
‘మా నాన్నని రక్షించినందుకు థాంక్స్ ఎ లాట్’
‘యు ఆర్ వెల్‌కం’
‘వింటర్స్. అసలు నువ్వు చలికాలంలో నీ మిత్రులతో అక్కడికి ఎందుకు వెళ్లావు?’
‘నాతో పెళ్లికి నిన్ను ఎలా వొప్పించాలా అని ఆలోచించడానికి’
బియాట్రైస్ కొద్ది క్షణాలు ఆగి అడిగింది.
‘మనం రెండో క్లాస్‌లో ఉన్నప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు. గుర్తుందా?’
‘లేదు. ఏం జవాబు చెప్పావు?’ అడిగాడు.
‘నీ తలని తీసుకెళ్లి రైలు కింద పెట్టమన్నాను’
‘ఇప్పుడు’
‘ఆ జవాబు చెప్పను’
‘ఏం?’
‘నువ్వు ఇప్పుడు హీరో వింటర్స్. నా జీవితంలో, మా నాన్న జీవితంలో హీరోవి’
‘హీరోని మీ నాన్న అల్లుడిగా చేసుకుంటాడని నేను భావించచ్చా?’
‘అవును’
‘నాలుగేళ్ల క్రితమా? నిన్ను ముద్దుపెట్టుకోబోతే కొట్టావు. ఇప్పుడూ అదే పని చేస్తావా?’ వింటర్స్ అడిగాడు.
‘ప్రయత్నించి చూడు’ బియాట్రైస్ సిగ్గుగా చెప్పింది.
ఈసారి ఆమె అతన్ని కొట్టలేదు.

(కార్లా నెడ్జర్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి