క్రైమ్ కథ

దయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్డెన్ రెస్ట్‌రెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేసే థెల్మా వంట గదిలోంచి బయటకి వచ్చినప్పుడల్లా ఓ మూల ఖాళీగా ఉన్న టేబిల్ వంక ఆందోళనగా చూడసాగింది.
‘ఏమైంది?’ పదకొండేళ్లుగా తన రెస్ట్‌రెంట్‌లో పనిచేసే థెల్మా ప్రవర్తన గురించి తెలిసిన దాని యజమానురాలు అడిగింది.
‘మిసెస్ మేనర్‌హైమ్ ఇవాళ ఎందుకో ఇంకా రాలేదు. అరగంట ఆలస్యమైంది. ఒంట్లో సరిగ్గా ఉందో? లేదో?’ థెల్మా తన అనుమానాన్ని వ్యక్తం చేసింది.
‘తల్లి కోడిలా ప్రవర్తించక. వస్తుందిలే’
ఐదు నిమిషాల తర్వాత మిసెస్ మేనర్‌హైమ్ వచ్చి ఆ టేబిల్ ముందు కూర్చుంది. తెల్లటి ముడతలు పడ్డ మొహం. లూజ్ గౌన్. ఆవిడ వయసు తొంభై దాటి ఉంటుందని థెల్మా అనుకుంది. కొద్దిగా అనారోగ్యంగా కనిపించింది.
‘మిసెస్ మేనర్‌హైమ్. మీరు ఆలస్యం చేస్తే మీకు ఏమైందా అని భయపడ్డాను. ఈ రాత్రి కూడా ఎప్పటిలానేగా?’ థెల్మా అడిగింది.
‘అదే డియర్. కొద్దిగా సుస్తీ చేసింది. నా గురించి నువ్వు ఆందోళన చెందకు’ ఆవిడ చెప్పింది.
‘డాక్టర్‌ని కలిశారా?’ థెల్మా అడిగింది.
‘నేను గత ముప్పై ఏళ్లుగా డాక్టర్‌ని చూళ్లేదు. నేను మరణించబోతున్నానని డాక్టర్ లెవరెట్ చెప్పినప్పటి నించి. థాంక్ యూ థెల్మా. మన గురించి ఎవరైనా ఆందోళన చెందడం ఆనందాన్ని ఇస్తుంది’ మేనర్‌హైమ్ థెల్మా చేతి మీద తట్టి చెప్పింది.
వంట గదిలోకి వెళ్లి వంటవాడితో మిసెస్ మేనర్‌హైమ్ వచ్చిందని, ఆవిడవి వండమని కోరింది. గత ఎనిమిదేళ్లుగా గార్డెన్ హోటల్‌లో బస చేస్తూ ఆ రెస్ట్‌రెంట్లో తినే ఆవిడకి ఏం వండాలో అతనికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆవిడ తినేది ఎప్పుడూ మారదు. ట్రేలో ఓ గ్లాస్‌లో టమోటా జ్యూస్, రోస్ట్ బీఫ్, ఉడకబెట్టిన బంగాళాదుంపలు, కేరట్స్, పాల గ్లాసు, తీసుకెళ్లి ఇచ్చింది. ఎప్పటిలా ఆవిడ కోసం రోస్ట్ బీఫ్‌ని కట్ చేసింది.
‘నువ్వు మంచి పిల్లవి’ ఆవిడ మెచ్చుకోలుగా చూస్తూ చెప్పింది.
‘నేను పిల్లని కాదు. నా వయసు నలభై నాలుగు. బంగాళా దుంపల మీద ఇంకాస్త వెన్న కావాలా?’ అడిగింది.
‘కాసేపు నా దగ్గర కూర్చుని మాట్లాడతావా?’
‘ఇప్పుడు కాదు. నేను బిజీగా ఉన్నాను’
‘తర్వాత? నీతో ఓ విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను’
‘తర్వాతైతే సరే మిసెస్ మేనర్‌హైమ్’
రాత్రి పదిన్నరకి రెస్ట్‌రెంట్ ఖాళీ అయింది. తన యూనిఫాంని విప్పే ముందు థెల్మా ఆవిడ టేబిల్ ముందుకి వెళ్లి కూర్చుంది.
‘ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు?’ అడిగింది.
‘నీ గురించే థెల్మా’
‘నా గురించి మాట్లాడటానికి ఏం ఉంటుంది?’
‘నీకు వచ్చే ఆదాయం సరిపోతోందా?’
‘్ఫర్వాలేదు’
‘నీ తమ్ముడి ఆదాయం?’
‘ఆర్థర్? ఓకే. లక్షలు ఆర్జించటం లేదు కాని వాడికి సరిపోయేంత సంపాదించుకుంటున్నాడు’
‘నువ్వు ఇంకా నీ తమ్ముడి గురించి ఆందోళన పడుతున్నావా? అతను ఓ మందు దుకాణాన్ని నడుపుతున్నాడని క్రితం సారి చెప్పావు’
‘అవును. మా నాన్న పోయాక మా కుటుంబంలో నాకు మిగిలింది వాడొక్కడే. ఇంకాస్త జ్యూస్ కావాలా?’
‘వద్దు. థాంక్స్. ఇవాళ రాత్రి మొదటిసారిగా నేను ముసలిదాన్ని అని అనిపిస్తోంది. ఇటీవల తరచూ అనారోగ్యం కలుగుతోంది. బహుశ నా టైం దగ్గర పడిందని అనుకుంటున్నాను తెల్మా’
‘అలా మాట్లాడకండి మిసెస్ మేనర్‌హైమ్’
‘నా వయసు వచ్చాక బహుశా నువ్వూ నాలా మరణం గురించి మాట్లాడుతావు. నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను మరణించాక నీకు ఆర్థికంగా సహాయం చేయదలచుకున్నాను. ఎంతో తెలుసా?’
‘తెలీదు’
‘నాకు కేలిఫోర్నియాలో ఓ మేనకోడలు ఉంది. కానీ నేనంటే లక్ష్యమే లేదు. ఉత్తరాలు రాయదు. క్రిస్మస్‌కి గ్రీటింగ్ కార్డ్ కూడా పంపదు. అందువల్ల నా తదనంతరం నీకు అవసరమైనంత అందేలా విల్లు రాసాను’
థెల్మా నిర్ఘాంతపోతూ చూసింది.
‘నువ్వు ఈ వయసులో నాకు మంచి మిత్రురాలివి. కొన్ని సంవత్సరాలుగా నువ్వు నా అవసరాలు చూస్తున్నావు. నేను మరణించాక నువీ ఉద్యోగాన్ని మానేసి నీ తమ్ముడితో సుఖంగా జీవించచ్చు’
‘మిసెస్ మేనర్‌హైమ్. మీరీ పని చేయాల్సిన అవసరం లేదు’
‘అది నా ఆనందం కోసం. నా భర్త మరణించాక నా డబ్బు పెరుగుతూ వస్తోంది. నువ్వు ఊహించలేనంత మొత్తం అది. అది నన్ను సౌకర్యంగా జీవించేలా చేస్తోంది. తర్వాత అది నీక్కూడా ఆ సౌకర్యాన్ని ఇస్తుంది. నేను ఆట్టే కాలం జీవించను. ఇటీవల కలల్లో తెల్లటి డ్రస్‌లో మా అమ్మ కనిపిస్తోంది. నీకు కలలంటే నమ్మకం ఉందా?’
‘నాకు తెలీదు’ థెల్మా చెప్పింది.
* * *
ఎప్పటిలా పదకొండుం పావుకి థెల్మా ఇంటికి చేరుకునే సరికి ఆర్థర్ టీవీ ముందు బాసింపట్టు వేసుకుని కూర్చుని కునికిపాట్లు పడుతూ కనిపించాడు. మామూలుగా ఐతే థెల్మా కరెంట్ వృథా చేస్తున్నందుకు అరిచేది. కాని ఆ రోజు వేరే మూడ్‌లో ఉంది.
‘ఆర్థర్! మందుల దుకాణాన్ని ఎప్పుడు మూసావు?’
‘కొద్దిసేపటి క్రితమే’
‘అంత త్వరగా మూయకూడదు. నాన్నగారు వ్యాపారం రాత్రి పది తర్వాతే మొదలవుతుందని చెప్పేవారు గుర్తుందా?’
ఆర్థర్ మొహాన్ని విసుగ్గా పెట్టాడు.
‘నీకోటి చెప్పాలి’
‘ఉత్తరం రాయి’
‘పిచ్చిగా మాట్లాడకు’
మిసెస్ మేనర్‌హైమ్ చెప్పింది అతనికి చెప్పింది.
‘ఓ! ఎంత?’ ఆశగా అడిగాడు.
‘తెలీదు. కాని పెద్ద మొత్తమే. ఆవిడ అనారోగ్యంగా కనిపిస్తోంది’
‘ఇంకో రెండు నెలల్లో ఆవిడ పోతే నేను పక్క షాప్‌ని కూడా కొని...’
‘ఆర్థర్!’ అరిచింది.
‘ఆవిడకి చెడు కలగాలని నేను ఆశించడం లేదు. ఆవిడ మరణం గురించి ఆలోచించడమే నాకు ఇష్టం లేదు’
‘ఆవిడ వయసెంత?’ ఆర్థర్ అడిగాడు.
‘తొంభై పైనే’
* * *
తర్వాతి రెండు నెలలు థెల్మా ప్రతీ రాత్రి మూల బల్ల వంక చూడసాగింది. ఆవిడ బుగ్గల్లోని రంగు పోయి అవి లోపలికి వెళ్తున్నాయని గమనించింది. నడక వేగం బాగా తగ్గింది. ప్రతీ రాత్రి భోజనం చేస్తూ అక్కడే ఆవిడ మరణించచ్చని థెల్మా అనుకునేంతగా ఆవిడ ఆరోగ్యం పాడైంది. గతంలోకన్నా థెల్మా ఆవిడకి ఎక్కువ సేవ చేయసాగింది. ఆవిడ ఒళ్లో నేప్‌కిన్‌ని పరవడం, మంచినీళ్ల గ్లాస్‌ని నింపడం.. ఆవిడ దయకి కొంత చెల్లించాలనే సంకల్పమే అది. నాలుగు నెలలు గడిచినా ఆవిడ మరణించలేదు. ‘ఆవిడ ఎందుకు పోదు?’ అనే ఆలోచన థెల్మాలో తరచూ కలగసాగింది.
ఓసారి ఆవిడ బల్ల మీద తల వాల్చేసింది. డాక్టర్ వచ్చి అది తాత్కాలిక అపస్మారకం అని చెప్పాడు. మరో వారంపాటు థెల్మా ఆవిడ గదికి భోజనాన్ని తీసుకెళ్లి ఇచ్చింది. కాని తేరుకున్న మేనర్‌హైమ్ రెస్ట్‌రెంట్‌కే రాసాగింది.
‘మీ ఫ్రెండ్ ఇక చావదా?’ ఆర్డర్ ఓ రాత్రి కోపంగా అడిగాడు.
‘ఆర్థర్!’
‘నీకూ ఆ ఆలోచన అనేకసార్లు వచ్చి ఉంటుంది. ఇటీవల ఆవిడ గురించి నువ్వు మాట్లాడే ధోరణి మారింది’
‘హాస్యాస్పదంగా మాట్లాడక’
‘ఆవిడ ఆరోగ్యం దిగజారుతోంది అంటున్నావు. ఐనా ఎనిమిది నెలలుగా ఎందుకు చావలేదు?’
‘ఆర్థర్!’
‘అందుకు ఆవిడకి సహాయం చేద్దామా?’
థెల్మా తమ్ముడి వంక నిశే్చష్టురాలై చూసింది.
‘అది తేలిక. తప్పు కూడా కాదు. ఆవిడ ఇంకెంతకాలం అనారోగ్యంతో బాధ పడాలి. ఆవిడకి నువ్వు శాంతిని ఇవ్వచ్చు’
‘నువ్వు చెప్పేది నేను వినడంలేదు’
‘అది ఎవరికీ తెలీదు. దాన్ని ఎలా చేయాలో నేను చెప్పాను’
‘ఆపు’
‘రాత్రి వడ్డించే భోజనంలో నేనిచ్చేది కొద్దికొద్దిగా కలిపితే ఎవరికీ తెలీదు. ఒక్కసారిగా విషం ఇస్తే ప్రమాదం కాని స్లో పాయిజన్ వల్ల ఎవరికీ తెలీదు. ప్రతీ రాత్రి చిటికెడు కలిపితే చాలు. అది మెర్సీ కిల్లింగ్ కిందికి వస్తుంది’
‘నీకు డబ్బు పిచ్చి పట్టింది ఆర్థర్’
* * *
ఆర్థర్ ఆ విషయాన్ని మళ్లీ నెల దాకా ఎత్తలేదు. థెల్మా అందుకోసం వేచి ఉంది. తర్వాత తనే చెప్పింది.
‘ఆవిడ బాగా అనారోగ్యంగా ఉంది. మంచం మీద నించి కదల్లేకపోతోంది. భోజనాన్ని నేను మిసెస్ మేనర్‌హైమ్ గదికే తీసుకెళ్లి ఇస్తున్నాను’
‘అతనేం మాట్లాడకపోవడంతో అడిగింది.
‘నువ్వు మెర్సీ కిల్లింగ్ గురించి ఏదో చెప్పావు?’
ఆర్థర్ డ్రాయర్ తెరిచి కొన్ని పొట్లాలని ఇచ్చి చెప్పాడు.
‘రోజుకి ఒకటి చాలు’
ఆ రాత్రే వంటవాడు ఇచ్చిన ట్రేతో ఆవిడ గదిలోకి వెళ్తూ దారిలో టమోటా జ్యూస్‌లో ఓ పొట్లంలోని తెల్లటి పొడిని కలిపింది. నాలుగు రాత్రులు గడిచినా ఆవిడ మరణించలేదు. ఆరో రాత్రి ఆవిడ భోజనానికి కిందకి వచ్చింది.
‘ఆర్థర్! మనం డోస్ పెంచితే?’ ఇంటికి వెళ్లాక అడిగింది.
‘వద్దు. మొహం నీలం రంగుకి మారితే డాక్టర్‌కి అనుమానం వస్తుంది’
‘అలా తిరగని మందు లేదా?’
‘లేదు. ప్రతీ విషయానికీ మొహం నీలం రంగుకి మారుతుంది’
మరో వారం గడిచినా మిసెస్ మేనర్‌హైమ్ మరణించలేదు. ఇంకో వారం గడిచాక ఆవిడ ఇంకాస్త చురుగ్గా మారింది.
‘ఆవిడ వందేళ్లు జీవించేట్లుంది ఆర్థర్’
‘సరే. రెండు పొట్లాలని ఉపయోగించు. ఇప్పటికే కొంత విషం శరీరంలోకి ఎక్కింది కాబట్టి బహుశ మొహం నీలంగా మారదు’ ఆర్థర్ సూచించాడు.
ఆవిడ విల్లుని మారిస్తే అనే భయం అక్క, తమ్ముళ్లు ఇద్దరిలో ఉంది.
ఆ రాత్రి మిసెస్ మేనర్‌హైమ్ చెప్పింది.
‘్థల్మా! నేను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని అనిపిస్తోంది. నా మేనకోడలు నన్ను చూడటానికి రెండు, మూడు రోజుల్లో వస్తానని నాకు ఉత్తరం రాసింది. బంధుప్రీతి ఓ పట్టాన మనిషిని వదలదు కదా’
థెల్మా సందేహించలేదు. ఆవిడ టమోటా జ్యూస్ గ్లాస్‌లో మిగిలిన అన్ని పొట్లాలని కలిపింది. దాన్ని తాగాక ఆవిడ టేబిల్ మీద తల వాల్చేసింది. గతంలోలా ఆవిడకి స్పృహ తప్పింది అనుకున్నారు. కాని డాక్టర్ వచ్చి ఆవిడ మరణించిందని చెప్పాక థెల్మా రిలీఫ్ ఫీలైంది.
* * *
మర్నాడు పోలీసుస్టేషన్‌లో ఆర్థర్, థెల్మాలు కూర్చుని ఉన్నారు. లెఫ్టినెంట్ ముందు థెల్మాని లోపలికి పిలిచి ప్రశ్నించాడు.
‘మిసెస్ మేనర్‌హైమ్‌కి నిత్యం భోజనం ఇచ్చేది నువ్వే కదా?’
‘అవును’
‘ఆవిడని ఎందుకు చంపావు?’
‘ఆవిడ అనారోగ్యంతో పోయింది’
‘కాదు. పోస్ట్‌మార్టంలో ఆవిడకి పేరాసైటిక్ ఇన్‌ఫెక్షన్ ఉందని తెలిసింది. ఆవిడ వయసుకి అది ప్రమాదకరం’
‘దాంతో పోతే నేను చంపానని అంటారేమిటి?’ థెల్మా ప్రశ్నించింది.
‘నువ్వే ఇంతకాలం ఆవిడని బ్రతికించావు. తర్వాత నువ్వే చంపావు’
‘అంటే?’ థెల్మా అర్థంకాక అడిగింది.
‘చిన్న డోసుల్లో నువ్వు ఇచ్చిన ఆర్సెనిక్ చక్కటి చికిత్స అయి ఆవిడలోని ఇన్‌ఫెక్షన్ తగ్గుతూ వస్తోంది. కాని నిన్న రాత్రి అకస్మాత్తుగా ఆ డోస్ పెరగడంతో ఆవిడ పోయింది. నీకు ఆ ఆర్సెనిక్‌ని నీ తమ్ముడు ఇచ్చాడా? లేకపోతే నీకు ఎక్కడ నించి అది వస్తుంది?’ ఆయన అడిగాడు.
థెల్మా ఆయన వంక నిర్ఘాంతపోతూ చూస్తూండిపోయింది.

(హెన్రీ స్లీసర్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి