క్రైమ్ కథ

అన్నిటా సమర్థుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్‌స్పెక్టర్ హేజెల్ రిగ్ ఓడల నిర్మాణ వ్యాపారంలో ఉన్న కోవెట్ ఆఫీస్‌కి వెళ్లాడు. మఫ్టీలో వచ్చిన అతను ఆ భవంతి వెనక తలుపు దగ్గర వేన్ దిగి లోపలకి నడిచాడు. కిడ్నాపర్లు ఎవరైనా ఆయన ఆఫీస్‌ని గమనిస్తూంటే పోలీస్ యూనిఫాంలోని వ్యక్తి లోపలికి వెళ్లడం చూస్తారని ఆ జాగ్రత్త తీసుకున్నాడు. తనతో కరచాలనం చేసే కోవెట్ మొహంలో హేజెల్ రిగ్‌కి భయంతో కూడిన అలసట కనిపించింది.
‘నిన్న మధ్యాహ్నం మా అబ్బాయి డేవిడ్ నా చెల్లెలితో పార్క్‌కి వెళ్లాడు. వాళ్లని ఓ ఖాళీ సందులో ఓ కారు ఓవర్‌టేక్ చేసింది. దాన్లోంచి ఇద్దరు దిగి, మా అబ్బాయిని ఎత్తుకుని బలవంతంగా తమ కారులో తీసుకెళ్లిపోయారు. అది క్షణాల్లో జరిగిపోవడంతో నా చెల్లెలు షాక్‌తో అడ్డుకోలేక పోయింది. ఆమె తేరుకునేసరికి కారు మాయం అయిపోయింది. వెళ్తూ వాళ్లు ‘మా ఫోన్ కోసం ఎదురుచూడండి’ అని చెప్పి వెళ్లారుట’
లండన్‌లో ఇటీవల పిల్లల కిడ్నాప్‌లు ఏడెనిమిది పైనే జరిగాయని, అది ఓ నేరస్థుల బృందం పనని హేజెల్‌కి తెలుసు. వాళ్లు ఒక్కసారిగా పెద్ద మొత్తం అడగరు. తక్కువే కదా అని ఇస్తే అంతటితో సంతృప్తి చెందరు. మరి కొన్ని చిన్న మొత్తాలని అడుగుతూ జలగలా పీడిస్తారు. అది వారి పద్ధతి.
‘అతను ఎలా ఉన్నాడట?’
‘నల్ల కళ్లజోడు ధరించాడు. కాబట్టి కళ్ల రంగు తెలీదు. నల్ల జుట్టు. బలంగా ఉన్నాడు. ఐదున్నర అడుగుల పొడవు ఉండచ్చని చెప్పింది. మొహానికి రుమాలు కట్టుకున్నాడు కాబట్టి ఇంకోసారి చూసినా గుర్తు పట్టలేదు’
‘మీకు వాళ్ల నించి ఫోన్ వచ్చిందా?’
‘ఆ. ఇవాళ ఉదయం వచ్చింది. మా అబ్బాయిని క్షేమంగా విడిచి పెట్టడానికి ఐదు వేల పౌన్లు ఇవ్వమని కోరారు’
‘మిస్టర్ కోవెట్. మీకో నిజం చెప్పాలి. గతంలో వాళ్లు కిడ్నాప్ చేసిన ఏ పిల్లల్నీ ప్రాణాలతో తిరిగి అప్పగించలేదు. చంపి శవాలని ఎక్కడో వదిలేశారు. వాళ్లు డబ్బుని తీసుకునే పద్దతి కూడా వాళ్లు దొరకని పద్ధతే. తమ తరఫున డబ్బు తీసుకోడానికి చిన్న నేరస్థులని పంపుతారు. కొన్ని సందర్భాల్లో మేము వాళ్లని పట్టుకున్నా వాళ్లు కిడ్నాపర్లు ఎవరో, కిడ్నాప్ అయిన పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పలేక పోయారు. డబ్బుని వాళ్లు వందల విధాల్లో ఏదో విధంగా తీసుకుంటారు. రద్దీగా ఉన్న రైల్లో లేదా బస్‌లో లేదా పెద్ద వీధిలో, సినిమా థియేటర్‌లో తీసుకుంటారు. డబ్బుని ఎలా, ఎక్కడ ఇవ్వమన్నారు?’ హేజెల్ రిగ్ ఆ సమాచారాన్ని అయిష్టంగానే చెప్పి అడిగాడు.
‘పిక్కడల్లీ వైపు. గ్రీన్ పార్క్‌లో రేపు మధ్యాహ్నం రెండుకి. వాళ్లని అనుసరించగలరా?’ కోవెట్ అడిగాడు.
‘రోజర్ అనే అతని కూతురు జినీని కిడ్నాప్ చేశారు. చిన్న మొత్తాల్లో అతను లక్ష పౌన్ల దాకా చెల్లించాక ఇంక చెల్లించడానికి డబ్బు లేకపోయింది. మర్నాడు ఉదయం అతని ఇంటి సమీపంలో ఆ అమ్మాయి శవం కనిపించింది.’
ఆ గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం.
బిజినెస్ మేగ్నెట్ కోవెట్ చాలా తెలివిగలవాడని ప్రసిద్ధి. అతను అతి తక్కువ కాలంలో ఎక్కువ వ్యాపారాలని స్థాపించాడు. అన్నీ విజయవంతంగా నడుస్తున్నాయి.
ఇన్‌స్పెక్టర్ హేజెల్ రిగ్ వెళ్లాక కోవెట్ కొద్దిసేపు ఆలోచించి స్టీవెన్స్‌ని పిలిపించాడు. అతని వయసు రెండు, మూడు నెలలు తక్కువగా పదిహేనేళ్లు. కోవెట్ కంపెనీల్లో మెసెంజర్స్ పనిచేసే అందరిలో స్టీవెన్స్ తెలివిగలవాడు. అతను కోవెట్ చెప్పింది శ్రద్ధగా విని తను చేయగలిగింది చేస్తానని మాట ఇచ్చాడు.
‘వాళ్లు నిజమైన దుర్మార్గులు. ప్రమాదకరమైన వాళ్లు. వాళ్లకి తమని ఎవరైనా అనుసరిస్తారని తెలుసు కాబట్టి మీరంతా తెలివిగా ప్రవర్తించాలి’ కోవెట్ హెచ్చరించాడు.
* * *
మర్నాడు గురువారం మధ్యాహ్నం నాలుగుకి ఇన్‌స్పెక్టర్ హేజెల్ రిగ్ క్రితం రోజు తీసుకున్న జాగ్రత్తలే తీసుకుని కోవెట్ గదిలోకి వచ్చాడు.
‘మీ అబ్బాయి కిడ్నాప్‌కి సంబంధించి నాకు కొంత సమాచారం ఇస్తారన్నారు?’ అడిగాడు.
‘దానికి జవాబు చెప్పే ముందు నాకు మీ నించి ఓ మాట కావాలి. నేను మీకు ఇచ్చే సమాచారం ఆధారంగా నా అనుమతి లేకుండా స్వతంత్రంగా మీరు ఎలాంటి చర్యా తీసుకోకూడదు’ కోవెట్ కోరాడు.
‘అలాగే. ఐతే నేను తలపెట్టిన చర్యల విషయంలో మాత్రం వెనక్కి వెళ్లలేను. కాని మీరిచ్చే సమాచారం ఆధారంగా, మీ అనుమతి లభించేదాకా కొత్త చర్యలు తీసుకోనని మాట ఇస్తున్నాను’
‘నాకు ఆ దుర్మార్గుల్లోని చాలామంది పేర్లు తెలుసు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడో, వాళ్లు ఎక్కడ దాక్కున్నారో కూడా తెలుసు’
‘ఇంకాస్త వివరంగా చెప్తారా?’ హేజెల్ రిగ్ కోరాడు.
‘మీరు నాకు చెప్పిన దాని గురించి చాలా ఆలోచించాను. అంటే ఎలాంటి మనుషులతో నేను వ్యవహరిస్తున్నానో, ముఖ్యంగా నన్ను కాంటాక్ట్ చేశాక డబ్బు తీసుకెళ్లే వారి గురించి, వాళ్లు హింసకి జడవరు. అరెస్ట్ చేయబడతామనే భయం కూడా వారికి ఉండదు. వాళ్లు నా నించి డబ్బు తీసుకున్నాక ముందే అనుకున్న పథకం ప్రకారం దాన్ని చేరవేయాల్సిన వారికి చేరవేస్తారు. తమని ఎవరూ అనుసరించేందుకు అవకాశం ఇవ్వరు. వాళ్లని ఓడించడం కష్టం. అందుకని ఓ తెలివైన పని చేశాను’
ఇన్‌స్పెక్టర్ ప్రశ్నార్థకంగా చూశాడు.
‘వాళ్లకి ఇవ్వాల్సిన మొత్తం కన్నా ఐదు వేల పౌన్లు అధికంగా ఇచ్చాను. నేను వాళ్లని కలిసాను. వాళ్లు ఇద్దరు. గ్రీన్ పార్క్‌లో వాళ్లు చెప్పిన సమయానికి నేను నా బ్రీఫ్‌కేస్‌ని తెరచి, గోధుమరంగు కాగితం సంచీని వాళ్లకి ఇచ్చి చెప్పాను. ‘పదివేల పౌన్లు కదా. సరిపోయిందేమో చూసుకోండి. నా కొడుకుని ఎప్పుడు చూస్తాను?’ వాళ్లు నా మాటలకి నివ్వెరపోతూ ఒకరి మొహాలని మరొకరు చూసుకున్నారు. ‘రేపు ఫోన్ చేస్తాం’ అని చెప్పి వాళ్లు మాయం అయ్యారు.’
ఆయన పథకం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ హేజెల్ రిగ్ వినసాగాడు.
‘నా పథకం ప్రకారం వాళ్లు ఐదువేల పౌనే్ల కిడ్నాపర్లకి ఇస్తారు. అది తెలిసీ పదివేల పౌన్లు ఇచ్చాను. ఆ అదనపు ఐదు వేలు వాళ్లు ఉంచేసుకుంటారు. ఐతే నేనా మొత్తం డబ్బు ఒకే సంచీలో ఉంచాను. దాన్ని వాళ్లు వేరు చేసి, తమలో తాము పంచుకోవాలి. అంతేకాక వాళ్లు త్వరగా ఆ డబ్బుని ఎక్కడైనా దాచి వెళ్లాలి. అంత డబ్బుతో వాళ్లు కిడ్నాపర్ల దగ్గరకి వెళ్లరు. ఏ కారణంగానైనా తమని వాళ్లు వెదికితే అది కనపడచ్చు. దాన్ని తీసుకున్నాక తమని చంపేయచ్చనే భయం వాళ్లల్లో ఉంటుంది. ఉండదా?’ కోవెట్ ప్రశ్నించాడు.
‘తప్పకుండా ఉంటుంది.’
‘అప్పుడు వాళ్లు సరాసరి ఆ కిడ్నాపర్ల దగ్గరకి వెళ్లకుండా, ఇంకో చోటికి వెళ్లి ఆ డబ్బుని దాచి వెళ్లాలి. తమ ఇంటికి లేదా మిత్రుల ఇళ్లకి. ఆ ఇంట్లో ఫోన్ కూడా ఉండాలి. కిడ్నాపర్లకి ఫోన్ చేసి ఆలస్యానికి కారణం చెప్పాల్సి ఉంటుంది. ఆ ఆఖరి అంశం కోసం నేను ఐదు వేలు ఎక్కువ ఇచ్చాను’
‘అర్థమైంది. కాని వాళ్లని అనుసరించగలిగారా?’
‘నాలో ఆ నైపుణ్యం లేదు. కాని నా కుర్రాళ్లకి ఉంది. నేను తిరిగి నా ఆఫీస్‌కి వెళ్లిపోయాను. ఆ వీధిలో కారు నంబర్ల మీద పందెం వేసుకునే కుర్రాళ్లు చాలామంది ఆ సమయంలో ఉన్నారు. మీకా ఆట తెలుసుగా? తర్వాత వచ్చే కారు నంబర్లోని రెండంకెలనైనా కరెక్ట్‌గా చెప్పగలిగితే ఓ గోలీ ఇవ్వాలి. స్టీవెన్స్ అనే నా కొరియర్ బాయ్ వాళ్లని ఏర్పాటు చేశాడు. పావుగంట తర్వాత నాకు స్టీవెన్స్ నించి ఫోన్ వచ్చింది. కింగ్స్ క్రాస్‌లోని ఓ చిరునామాని అతను చెప్పాడు.’
హేజెల్ రిగ్ మెచ్చుకోలుగా చూశాడు.
‘నేను ఓ సీనియర్ పోలీస్ అధికారికి ఆ చిరునామాని ఇచ్చాను. అతని పేరు చెప్పను. ఐదు నిమిషాల్లో ఆ ఇంట్లోని ఫోన్‌ని అతను అనధికారికంగా, చట్ట వ్యతిరేకంగా టేప్ చేయించాడు. ఆ ఇంటి నించి ఎసెక్స్‌లోని ఓ ఇంటికి ఫోన్‌కాల్ వెళ్లింది. ఇదీ ఆ చిరునామా’
కోవెట్ ఇచ్చిన ఆ కాగితాన్ని చదివి హేజెల్ చెప్పాడు.
‘స్కాట్‌లేండ్ యార్డ్ ఆరు నెలలుగా చేయని పనిని మీరు చేశారు’
‘అంతా సవ్యంగా జరక్కపోతే మీకన్నా నేను పోగొట్టుకునేది ఎక్కువ’
‘ఐతే ఏమిటి మీ పథకం?’
‘వేచి ఉందాం’ కోవెట్ చెప్పాడు.
* * *
ఆ కిడ్నాపర్లు ఓ వేలుని రివాల్వర్ ట్రిగర్లో ఉంచి నిద్రపోతారని హేజెల్ రిగ్‌కి తెలుసు. పథకంలో మార్పు జరగడానికి డబ్బుని తీసుకున్న చిన్న నేరస్థుల జంట వాళ్లకి ఏం చెప్పి ఉంటారో తెలీదు కాని, కిడ్నాపర్లకి అది తమని పట్టుకునే ఉచ్చు అనే అనుమానం తప్పక కలుగుతుందని హేజెల్‌కి తెలుసు.
థేమ్స్ నదికి ఉత్తర భాగంలోని ఆ ఇంటికి మఫ్టీలోని పోలీసుల్ని కాపు పెట్టాడు. అది చాలా పెద్ద ఇల్లు.
నాలుగో రోజు ఉదయం కోవెట్ ఆఫీస్‌కి పోస్ట్‌లో ఓ ఉత్తరం వచ్చింది.
ప్రియమైన నాన్నకి,
దీన్ని మీకు రాయమన్నారు. మీరు ఇంకా ఐదువేల పౌన్లు చెల్లిస్తే నన్ను విడుదల చేస్తారుట. ఫోన్ చేసి ఎలా చెల్లించాలో చెప్తారు. నేను బాగానే ఉన్నాను. నా గది బావుంది. మనింట్లో లాగానే ఉదయపు సూర్యుడు నన్ను నిద్ర లేపుతున్నాడు. లవ్, డేవిడ్.
* * *
‘సరిగ్గా మీరు కోరే లాంటి ఇల్లు ఒకటి ఉంది’ ఏండ్రూస్ తన ముందు కూర్చున్న రాబిన్‌సన్‌తో చెప్పాడు.
‘ఐతే వెంటనే దాన్ని అద్దెకి తీసుకోవచ్చా?’ రాబిన్‌సన్ అడిగాడు.
‘లేదు. ప్రస్తుతం దాన్ని ఎవరో అద్దెకి తీసుకున్నారు. ఈ నెలాఖరికి లీజ్ ఐపోతుంది. మీరా ఇంటిని ఈలోగా చూడలేరు. మా అంగీకారం ప్రకారం లీజ్ అవడానికి రెండు రోజుల ముందే మేమా ఇంటిని ఎవరికైనా చూపించగలం. ఈలోగా వాళ్లు ఎవర్నీ లోపలకి రానివ్వరు. కలర్ ఫిల్మ్ ప్రాసెస్ చేయడానికి దాన్ని అద్దెకి తీసుకున్నారు. కాంతి ఫిల్మ్‌ని పాడు చేస్తుందన్న సంగతి మీకు తెలిసిందే కదా’
రాబిన్‌సన్ కొద్ది క్షణాలు ఆలోచించి అడిగాడు.
‘కనీసం ఆ ఇంటి ప్లాన్ మీ దగ్గర ఉందా?’
‘ఉంది. టు ఫ్లోర్స్ ప్లాన్ ఉంది. ప్లాన్‌ని చూసి సంతృప్తి పడని వారికి ఆ ఇంటిని చూపించడం వృథా కదా?’
ఏండ్రూస్ లేచి వెళ్లి ఓ ప్లాస్టిక్ గొట్టంలోని బ్లూప్రింట్‌ని తెచ్చి చూపించాడు. అది చూడగానే ఉదయపు సూర్యుడు నన్ను నిద్ర లేపుతాడు అనే వాక్యం రాబిన్‌సన్‌కి స్ఫురించింది.
‘ఓ పడక గది తూర్పు వైపు ఉందన్న మాట?’ దాన్ని పరిశీలించి చెప్పాడు.
‘అవును. పై ఫ్లోర్‌లోది’
‘ఈ మేప్‌ని ఒకటి, రెండు రోజులు నా దగ్గర ఉంచుకోవచ్చా? మా ఆవిడకి చూపించాలి’
‘అలాగే. ఇంకా ఎక్కువ రోజులు కావాలన్నా ఉంచుకోవచ్చు’ ఏండ్రూస్ చెప్పాడు.
రాబిన్‌సన్ అసలు పేరు కోవెట్ అని ఇళ్లని అద్దెకి చూపించే బ్రోకర్ ఏండ్రూస్‌కి తెలీదు.
* * *
వేసవికాలం సాయంత్రం నాలుగుకి లండన్‌లో రెండోసారి పోస్ట్‌మేన్ వస్తాడు. ఆ ఇంటి బెల్ మోగగానే ఓ మహిళ తలుపు తెరిచి చూసింది. యూనిఫాంలోని పోస్ట్‌మేన్‌ని, అతని వెనక స్టాండ్ వేసి ఉన్న సైకిల్‌ని, దాని మీది కాకీ రంగు ఉత్తరాల మూటని చూసింది. తలుపు మూసి ఆమె వెనక గదిలోకి వెళ్లి ఇంటర్‌కంలో చెప్పింది.
‘పోస్ట్‌మేన్’
అది ఆమె చేసిన పొరపాటు.
మళ్లీ తలుపు తెరచుకుంది. క్వార్డ్‌రాయ్ పేంట్, ట్వీడ్ జాకెట్ ధరించిన ఓ ముప్పై ఏళ్ల అతను తలుపు తెరచి పోస్ట్‌మేన్‌గా నటించే కోవెట్ వంక చూశాడు.
‘అరవక’ కోవెట్ తన చేతిలోని రివాల్వర్‌ని అతనికి గురి పెట్టి చెప్పాడు.
అతను కొద్ది క్షణాలు చేష్టలుడిగి ఆ రివాల్వర్ వంక చూశాడు. తర్వాత అతను లోపలకి గెంతుతూ అరవడానికి నోరు తెరవబోయాడు. రెండు గజాల దూరంలోని అతనికి తగిలిన గుండు అతన్ని గాల్లోకి లేపి కింద పడేసింది.
రివాల్వర్ పేలిన శబ్దం తర్వాత అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కోవెట్ లివింగ్ రూంలోని మెట్ల వైపు పరిగెత్తి వాటిని ఎక్కి పైకి చేరుకున్నాడు. మేప్‌లో చూసి గుర్తు పెట్టుకున్న తూర్పు వైపు పడక గదికి క్షణాల్లో చేరుకున్నాడు. దాని బయట తాళం కప్ప వేలాడుతోంది. రివాల్వర్‌తో దాన్ని రెండుసార్లు కాల్చగానే అది ఊడిపోయింది. కోవెట్ కాలితో తలుపుని తన్ని తెరిచి లోపలికి పరిగెత్తాడు.
డేవిడ్ ఓ మూల కూర్చుని కనపడ్డాడు. అతను బల్లని కిందకి వంచడంతో దాని నాలుగు కాళ్లు అవతలి వైపునకు లేచాయి.
‘డేవిడ్! దా. ఈ బల్ల వెనక దాక్కో’ కోవెట్ చెప్పాడు.
కోవెట్ తన నడుంలో దోపుకున్న మరో రివాల్వర్‌ని తీసి ఎడం చేత్తో పట్టుకున్నాడు.
పిల్లల్ని కిడ్నాప్ చేసే కిల్లర్‌కి శారీరక బలం అధికం. మానసిక పిరికితనం కూడా అధికమే. మిగిలిన ఇద్దరు అనుచరుల వైపు చూశాడు.
‘నువ్వు నిచ్చెనని పిల్లాడి గది కిటికీ బయట వేసి, ఎక్కి కిటికీలోంచి లోపలి చొరబాటుదారుడు మీద కాల్పులు జరుపు’ ఒకడికి చెప్పాడు.
‘నువ్వు మెట్ల మీద పైకెళ్లి అతన్ని ఎదుర్కో’ రెండో వాడికి చెప్పాడు.
ఇంటి బయట పోలీస్ కారు ఆగింది. అందులోంచి సూపరింటెండెంట్, ఇన్‌స్పెక్టర్ హేజెల్‌రిగ్ దిగారు. దాని వెనకే ఇంకో రెండు కార్లు ఆగాయి. వాటిల్లోంచి యూనిఫాంలోని పోలీసులు దిగారు. కిటికీ దగ్గర నిచ్చెనని వేసి ఎక్కే వ్యక్తిని చూసి ఇద్దరు పోలీసులు ఆగమని అరుస్తూ అతని వైపు పరిగెత్తారు. అతని చేతిలోని రివాల్వర్ వాళ్ల వైపు పేలింది కాని ఎవరికీ గుండు తగల్లేదు. వాళ్లిద్దరూ సందేహించకుండా కాల్చడంతో సగం నిచ్చెన మీంచి అతను దబ్బున కింద పడ్డాడు.
రెండో వ్యక్తి పై అంతస్థులోని కారిడార్లో నేల మీద డేవిడ్‌ని బంధించి గది వైపు పాకాడు. లేచి అకస్మాత్తుగా లోపలకి దూకుతూ రివాల్వర్‌ని గురి పెట్టకుండా కాల్చాడు. అదే సమయంలో తయారుగా ఉన్న కోవెట్ బల్ల వెనక నించి రెండుసార్లు కాల్చాడు. ఓ గుండు అతని భుజాన తగలడంతో నేల కూలాడు.
రివాల్వర్ పేలుళ్లు వినపడగానే సూపరింటెండెంట్, ఇన్‌స్పెక్టర్ హేజెల్‌రిగ్, ఇతర పోలీసులు ఆ ఇంట్లోకి పరిగెత్తారు. రెండు చేతులు ఎత్తిన కిడ్నాపర్ జో అర్థించాడు.
‘కాల్చకండి. లొంగిపోతున్నాను.’
* * *
‘మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు?’ అక్కడికి కొద్ది సేపట్లో వచ్చిన పత్రికా విలేకరులు కోవెట్‌ని ప్రశ్నించారు.
‘ఎందుకంటే నా కొడుకు కూడా గతంలో కిడ్నాపైన ఎనిమిది మంది పిల్లల్లా మరణించకూడదని. నాకు స్కాట్‌లేండ్ యార్డ్ మీద విశ్వాసం లేదని అనను కాని ఈ కిడ్నాపర్ విషయంలో మాత్రం వాళ్లు ఎందుకో వెనక పడ్డారు’ కోవెట్ జవాబు చెప్పాడు.
*
(మైఖేల్ గిల్బర్ట్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి