క్రైమ్ కథ

బతికించబడును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1890.
ఆరిజోనా రాష్ట్రంలోని హేపీనెస్ అనే గ్రామ శివార్లలో గుర్రపు బగ్గీని ఆపిన గేరిటీ పక్కనే బోర్డ్ మీద రాసి ఉన్నది చదివాడు.
‘సంక్షోభ కాలంలో మరణించిన వారి సంఖ్య 128’
అతను గుర్రాన్ని అదిలించి, గ్రామంలోకి ప్రవేశించి ఓ సెలూన్ (బార్) ముందు దాన్ని ఆపి దిగి, లోపలికి వెళ్లాడు.
‘కోల్డ్ బీర్’ అడిగాడు.
‘మీరేం చేస్తూంటారు?’ బీర్ ఇచ్చిన బార్ టెండర్ ప్రశ్నించాడు.
‘ఎక్కువ భాగం ఇలా తిరుగుతూంటాను. నా పేరు గేరిటీ’ అతను జవాబు చెప్పాడు.
‘మీరు సేల్స్‌మేనా? ఏం అమ్ముతూంటారు?’
‘సేవని?’
‘ఏ రకం సేవని?’
‘మరణించిన వారిని వెనక్కి తీసుకురావడం’
‘ఏమిటి? నిజంగా?’ బార్ టెండర్ నివ్వెరపోతూ అడిగాడు.
‘అవును.’
* * *
బార్ టెండర్ చెప్పింది విని బార్‌లోని నలుగురూ తలుపు దగ్గరికి వెళ్లి గేరిటీ కోసం చూశారు. బయట అతను ఎక్కి వచ్చిన బండి ఉంది కాని అతను కనపడలేదు.
‘నాకు కబురు చేసి మంచి పని చేసావు. అతను మోసగాడైతే మన ఊళ్లోంచి వెంటనే పంపించేస్తాను’ షెరీఫ్ చెప్పాడు.
‘మన కొత్త షెరీఫ్ వచ్చిన పది నెలల నించి ఊరంతా శాంతిగా ఉంది’ జేసన్ చెప్పాడు.
‘రివాల్వర్ బదులు తలని ఉపయోగిస్తే గుళ్లని, సమయాన్ని, శ్రమని ఆదా చేయచ్చు’ గర్వంగా చెప్పి షెరీఫ్ మళ్లీ అడిగాడు.
‘అతను ఏమన్నాడన్నావు?’
‘మరణించిన వారిని వెనక్కి తెస్తానని చెప్పాడు. చెప్పింది చేయకపోతే అతను పిచ్చివాడని అర్థం’ బార్ టెండర్ జేసన్ పకపకా నవ్వి చెప్పాడు.
‘కాదు. మోసగాడై ఉండాలి. షెరీఫ్ వస్తున్నాడని తెలిసి ఊరు వదిలి పారిపోయి ఉంటాడు’ ఓ ముసలి కస్టమర్ చెప్పాడు.
‘అలాంటప్పుడు బండిని ఎందుకు వదిలి వెళ్తాడు?’ తప్ప తాగి ఉన్న జేమ్స్ అడిగాడు.
‘అదీ నిజమే. బహుశ ఏదైనా హోటల్లో గది తీసుకోవడానికి వెళ్లి ఉంటాడు’ షెరీఫ్ చెప్పాడు.
అంతా డ్రింక్స్ తాగుతూండగా గేరిటీ లోపలికి వచ్చాడు.
‘నీ పేరేనా గేరిటీ?’ షెరీఫ్ అతన్ని ఎగాదిగా చూసి అడిగాడు.
‘అవును. బయట ఉన్న బండి కూడా నాదే’
‘నువ్వు చచ్చిన వాళ్లని వెనక్కి తెస్తానని చెప్పావా?’ షెరీఫ్ అడిగాడు.
‘అవును’ గేరిటీ చెప్పాడు.
‘ఎగతాళిగా చెప్పావా?’ ముసలి కస్టమర్ అడిగాడు.
‘కాదు. అది నా వృత్తి’
‘ఐతే వాళ్లని ఎలా వెనక్కి తెస్తావు?’ షెరీఫ్ ప్రశ్నించాడు.
‘వెయిటర్. నాకో పెగ్.. అది రహస్యం. ఓ మెజీషియన్ తన ట్రిక్స్‌ని ఎలా చెప్పడో అలా ఇది కూడా ట్రేడ్ సీక్రెట్. మీ ఊళ్లో నూట ఇరవై ఎనిమిది మంది మరణించారని విన్నాను.’
‘అవును. వారిలో నా భార్య కూడా ఉంది. ఆమె ఆత్మకి శాంతి కలుగుగాక’ ఓ తాగుబోతు గౌరవసూచకంగా నెత్తి మీది టోపీని తీసి మళ్లీ పెట్టుకుని చెప్పాడు.
బయట నించి కుక్క అరుపు వినిపించడంతో అంతా బయటకి వచ్చారు. రోడ్‌కి అవతల ఓ గుర్రపు బగ్గీ ఉంది. పక్కనే నిశ్చలంగా పడి ఉన్న ఓ కుక్క కనిపించింది. ఆ గుర్రపు బగ్గీని నడిపే వ్యక్తి దాని మీంచి దిగుతూ భయంగా చెప్పాడు.
‘నేనిది కావాలని చేయలేదు’
‘ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం. ఇందులో నీ తప్పు లేదు.. ఈ కుక్క ఎవరిదో తెలుసా?’ షెరీఫ్ అడిగాడు.
‘లేదు. ఇంతకు మునుపు దీన్ని ఎన్నడూ చూడలేదు’ గుమిగూడిన వారిలోని ఒకామె చెప్పింది.
‘జెంటిల్‌మేన్. ఓ వంటకం ఎలాంటిదో దాని రుచి చూసి చెప్పచ్చనే సామెత ఉంది. అలాగే నా వృత్తిని నిరూపించుకునే అవకాశం నాకు వచ్చింది. దీన్ని నేను వెంటనే బతికించి మీకు నమ్మకాన్ని కలిగిస్తాను... అది నిజంగానే చచ్చింది కదా?’ గేరిటీ ప్రశ్నించాడు.
‘చచ్చింది’ చాలా కంఠాలు చెప్పాయి.
‘సరే. మీరంతా వెనక్కి తిరగండి. నేను దాన్ని బతికించడం మీరెవరూ చూడకూడదు.’
అంతా వెనక్కి తిరిగాక అతను పలికే కొన్ని మంత్రాలు వినిపించాయి. తర్వాత కుక్క అరుపు విని తలతిప్పి చూస్తే అది నెమ్మదిగా లేచింది. వెంటనే వారి మధ్య నించి దూరంగా పారిపోయింది.
‘ఇది ఎలా సాధ్యమైంది? బ్లాక్‌మేజిక్కా? లేక దెయ్యం పనా?’ ముసలి వ్యక్తి ప్రశ్నించాడు.
‘ఆ రెండూ కాదు. శాస్ర్తియ జ్ఞానాన్ని మతానికి కలపడమే. నేను హిమాలయ పర్వతాల్లో కొంతకాలం ఉన్నప్పుడు ఈ విద్యని నేర్చుకున్నాను’
అంతా ఆశ్చర్యంగా ఒకరి మొహాల వంక మరొకరు చూసుకుని గుసగుసలాడారు.
‘అంటే మరణించిన నా భార్య గిల్డాని వెనక్కి తీసుకురాగలవా?’ జేమ్స్ అడిగాడు.
‘నా భార్యని కూడా తీసుకురాగలవా?’ తాగుబోతు కస్టమర్ అడిగాడు.
‘నా భర్తని?’ ఓ విధవరాలు ఆసక్తిగా అడిగింది.
‘జెంటిల్‌మెన్. ఈ అర్ధరాత్రి హేపీనెస్ అనే ఈ గ్రామంలో మరణించిన నూట ఇరవై ఎనిమిది మందీ తిరిగి మీ మధ్యకి వచ్చి మీకు ఆనందాన్ని ఇస్తారు’ చెప్పి గేరిటీ సిగార్ని వెలిగించుకున్నాడు.
* * *
సెలూన్‌లో చేరిన అంతా గేరిటీ కోసం ఎదురుచూస్తూ తమలో తాము మాట్లాడుకోసాగారు.
‘నాకిది నచ్చలేదు. మరణించిన వారు మరణించినట్లే ఉండాలి అని నాకు అనిపిస్తోంది’ ముసలాయన చెప్పాడు.
కొద్దిసేపటికి లోపలకి వచ్చిన గేరిటీ బార్ టెండర్ జేసన్‌తో చెప్పాడు.
‘ఓ పెగ్ విస్కీ ఇవ్వు. ఈ రాత్రి మీ గ్రామంలోని వారికి నమ్మలేని రాత్రి. వారంతా తిరిగి రావడానికి ఆత్రంగా ఉన్నారు. ఏ క్షణంలోనైనా వారంతా తిరిగి రావచ్చు’
గోడమీద ఉన్న ఓ చిత్రాన్ని చూసి జేసన్ని అడిగాడు.
‘పోలిక బాగా తెలుస్తోంది. అతను నీకు ఏమవుతాడు?’
‘నా అన్న. క్రితం మార్చ్‌లో ప్రమాదంలో మరణించాడు’ జేసన్ చెప్పాడు.
‘నీలాగే ఉంటాడు. కొద్దిగా కుంటిగా నడుస్తాడు కదా?’
గేరిటీ మాటలకి జేసన్ నివ్వెరపోతూ అడిగాడు.
‘అది నీకెలా తెలుసు?’
‘ఆఖరుగా పాతిపెట్టబడ్డ వారు ముందుగా వస్తారు...’
తలుపు దగ్గరికి వెళ్లి బయటకి చూస్తూ చెప్పాడు.
‘అడుగో! వస్తున్నాడు’
సెలూన్‌లోని అంతా ఆసక్తిగా, ఆదుర్దాగా రోడ్ మీదకి వెళ్లి చూడసాగారు. గేరిటీ జేసన్‌తో చెప్పాడు.
‘మీ సోదరుడు వచ్చాక అతని భుజాల మధ్య తగిలిన గుండు నీ రివాల్వర్లోంచే వచ్చిందని చెప్తాడు. అతన్ని ఎందుకు చంపావు?’
‘తాగుబోతు భాగస్వామి. నాకు తెలీకుండా విస్కీని దొంగిలించి తాగేవాడు. మిస్టర్ గేరిటీ. అతను రాకుండా వెనక్కి పంపడానికి మీరేం తీసుకుంటారు?’ బార్ టెండర్ జేసన్ గొంతు తగ్గించి అడిగాడు.
‘నాకు వచ్చే ఆదాయంతో నేను ఆనందంగా జీవిస్తున్నాను’
‘ఆ ఆనందాన్ని నేను పెంచుతాను. వంద డాలర్లు?’ జేసన్ పర్స్‌ని బయటకు తీసి అడిగాడు.
‘కాని వారిని ఓసారి బతికించాక ఇంకొన్ని మంత్రాలతో తిరిగి పంపాల్సి ఉంటుంది. వంద చాలా తక్కువ. వెయ్యి డాలర్లయితే ఆలోచిస్తాను’
‘తగ్గించవా?’ జేసన్ బతిమాలాడు.
‘ఏడు వందల ఏభై డాలర్లు’
‘సరే’
సెలూన్ బయట నిలబడ్డ ఐదారుగురు గబగబా లోపలికి వచ్చారు. వారిలోని ముసలాయన చెప్పాడు.
‘మీ అనే్న. కొంత దూరం వచ్చి మాయం అయ్యాడు’
అప్పటికే బార్లోకి చాలామంది వచ్చారు. గేరిటీ తాగుబోతుతో చెప్పాడు.
‘నీ భార్య లేక ఒంటరిగా ఉన్న నువ్వు తాగుడికి అలవాటు పడ్డావు. ఇంకాసేపటికి గిల్డా వచ్చాక ఇక నువ్వు మళ్లీ జీవితంలో తాగాల్సిన అవసరం ఉండదు.’
‘నా భార్య ఓసారి నా ఎడం చేతిని విరక్కొట్టింది. ఈ చెయ్యి చాలాకాలం బాండేజ్‌లో ఉంది. తిరిగి వస్తే తాగుతున్నందుకు నా రెండు చేతులూ విరక్కొడుతుంది. ఆమె అక్కడే విశ్రాంతి తీసుకోడానికి మీకు ఎంతివ్వాలి?’ ఆఖరి వాక్యాన్ని ఆ తాగుబోతు గొంతు తగ్గించి అడిగాడు.
‘అది కష్టమైన పని. ఐదు వందల డాలర్లు ఇస్తే ఆలోచిస్తాను.’
‘కాని నా దగ్గర ఏడువందల ఏభై డాలర్లు తీసుకున్నావు?’ జేసన్ కోపంగా అడిగాడు.
‘ఇది అవమానకరం. నీ స్వంత అన్న తిరిగి రాకుండా డబ్బివ్వడం అవమానకరం’ షెరీఫ్ చెప్పాడు.
‘నేను మీ మాటలని ఖండించను మిస్టర్ షెరీఫ్. ఇంకాసేపట్లో మెరుపు పీటర్సన్ కూడా తిరిగి వస్తున్నాడు. అంతా అనుకుంటున్నట్లుగా అతన్ని నువ్వు పగలు కాల్చి చంపలేదు. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న అతన్ని వెనక నించి కాల్చి చంపావు. అందుకు కొందరు దొంగ సాక్షులు నీకు సహకరించారని పీటర్సన్ చెప్పాడు. దాంతో నువ్వు తుపాకీ వేగంగా పేలుస్తావన్న పేరు కూడా తెచ్చుకున్నావు’
గేరిటీ మాటలు వినగానే షెరీఫ్ మొహంలో రంగులు మారాయి.
‘అతను కూడా వస్తున్నాడా?’ అడిగాడు.
‘అవును. అందరూ చూస్తుండగా రేపు ఉదయం నువ్వు అతన్ని కాల్చి చంపి, తుపాకీని వేగంగా పేలుస్తావని రుజువు చేసుకునే అవకాశం నీకు ఇస్తానని పీటర్సన్ చెప్పాడు.’
‘పీటర్సన్ బతికి రాకూడదు. అతను సమాజానికి ప్రమాదకారి’ షెరీఫ్ వెంటనే చెప్పాడు.
‘అతను బయలుదేరాడు’
‘అతను రాకుండా ఉండటానికి నీకు ఎంత కావాలి?’ జేబులోంచి ఓ కవర్ తీసి షెరీఫ్ గొంతు తగ్గించి అడిగాడు.
‘పనె్నండు వందల డాలర్లు’
‘సరే’ చెప్పి షెరీఫ్ ఆ డబ్బిచ్చి ఓ విస్కీ బాటిల్ని అందుకున్నాడు.
ఒకావిడ గేరిటీని అడిగింది.
‘వచ్చే వాళ్లల్లో మెల్లకన్ను గల ఓ పొట్టి వ్యక్తి ఉన్నాడా?’
‘అతని పేరు పెర్కిన్సా? వస్తున్నాడు’ గేరిటీ చెప్పాడు.
‘అతను పోయాక నేను మరో పెళ్లి చేసుకున్నాను. ఇద్దరు భర్తలని ఏం చేసుకోను? దయచేసి అతను రాకుండా చేయగలరా? నా దగ్గర ఉన్నది ఇంతే. ప్లీజ్’ వంద డాలర్లు ఇస్తూ అర్థించింది.
‘ఐదు వందలు’ గేరిటీ చెప్పాడు.
ఆమె మాట్లాడకుండా మిగిలిన నాలుగు వందలు ఇచ్చి వెళ్లిపోయింది.
‘నా భార్య పాతిపెట్టబడ్డప్పుడు అందంగా ఉండేది. ఆమె అలాగే శవపేటికలో ఉండేలా చూడగలవా?’ ముసలాయన అడిగాడు.
‘ఐదు’
ముసలాయన బేరం ఆడకుండా గేరిటీ కోరిన మొత్తం ఇచ్చాడు. ఓ యువతి ఆదుర్దాగా చెప్పింది.
‘నా దగ్గర డబ్బు లేదు. కాని నా మామగారు పరమ క్రూరుడు. వస్తే నా భర్తతో నన్ను కాపురం చేయనివ్వడు..’
‘్భయపడక. రాని వాళ్లల్లో అతనూ ఒకడు’ ఆమె వంక సానుభూతిగా చూస్తూ చెప్పాడు.
తర్వాత అక్కడ ఉన్న వాళ్ల వంక చూసి గేరిటీ చెప్పాడు.
‘మీకు తిరిగి రాకూడదనే బంధుమిత్రులు ఉంటే వారి పేర్లని ఈ కాగితంలో రాసి తలో ఐదు వందల డాలర్లు ఇవ్వండి. మిగిలిన వారంతా వస్తారు’
అక్కడున్న ప్రతీ వాళ్లు తలో ఐదు వందల డాలర్లు సమర్పించి, రాకూడని వారి పేర్లు రాసారు.
తెల్లవారుఝామున ఆ ఊరి వారంతా ప్రశాంతంగా నిద్రపోయేటప్పుడు గేరిటీ తన బండి దగ్గరికి వచ్చి చిన్నగా ఈల వేశాడు. దూరంగా చీకట్లోంచి ఇందాక చచ్చి బతికిన కుక్క పరిగెత్తుకు వచ్చింది.
‘బాగా నటించావు’ దాన్ని దువ్వుతూ చెప్పి, ముద్దు పెట్టుకుని బండిలోకి ఎక్కించాడు.
దాని వెనకే వచ్చిన వ్యక్తి లావుగా కనపడటానికి తొడుక్కున్న దుస్తులని, గడ్డం మీసాలని తీసి బండిలో పడేశాడు. కుంటిగా నడవడానికి అనువుగా కుడికాలి బూటులో ఉంచిన రాతిని కూడా తీసేశాడు. గేరిటీ అతనికి కొంత డబ్బిచ్చి చెప్పాడు.
‘ఇది నీ వాటా. స్టేజ్ మీద నువ్వు నటిస్తే ఇచ్చే దానికి పది రెట్లు. మన జాబితాలోని తర్వాతి గ్రామం పేరు నైస్‌విల్. నువ్వు ఎప్పటిలా ఆ గ్రామానికి వెళ్లి మరణించిన వారి వివరాలు, కారణాలు మొదలైనవి సేకరించు. ఊరి బయటి బండిలోని నా దగ్గరికి రేపు రాత్రి వచ్చి కలు. ఎల్లుండి ఆ ఊరి పని చూద్దాం’
అతను డబ్బు జేబులో పెట్టుకుని బండెక్కాడు. బండి స్మశానం పక్కనించి వెళ్తున్నప్పుడు గేరిటీ దాని వంక చూస్తూ చెప్పాడు.
‘సారీ ఫ్రెండ్స్. దీంట్లో మీరంతా భాగస్వాములైనా మీతో నా సంపాదనని పంచుకోలేను. రెస్ట్ ఇన్ పీస్.’
బండి ముందుకి సాగిపోయింది.
*

(మైక్ కొరోలొగోస్కీ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి