క్రైమ్ కథ

మనీ మనీ - విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

19వ ప్రెసింక్ట్ (పోలీసుస్టేషన్)లో కూర్చుని ఉన్న ఆల్బర్ట్‌ని చూడగానే అతనిలో పూర్వంగల ఆత్మవిశ్వాసం, ఉత్సాహం లోపించాయని నాకు అనిపించింది.
‘్థంక్ గాడ్. మీరు వచ్చినందుకు థాంక్స్ మిస్టర్ జోర్దాన్’ అతను నా చేతిని అందుకుని కరచాలనం చేస్తూ చెప్పాడు.
‘విన్నాను. నువ్వు ఆమెని చంపావా?’ అడిగాను.
అతను తల అడ్డంగా ఊపాడు.
నాకు ఆల్బర్ట్ రెండేళ్ల క్రితం పరిచయం. ఓ వాల్‌స్ట్రీట్ బ్రోకరేజ్ ఫర్మ్‌లోని చిన్న భాగాన్ని జూనియర్ భాగస్వామిగా కొన్నప్పుడు అతనికి లాయర్ అవసరం ఏర్పడింది. అతని అత్త ఏగ్నస్ నించి డబ్బు అప్పు తీసుకుని, అతను ఆ భాగాన్ని కొన్నాడు. ఆ పార్ట్‌నర్‌షిప్ డీడ్‌ని రాయడానికి ఆల్బర్ట్ నన్ను నియమించుకున్నాడు. ఆ తర్వాత అతనికి లాయర్ అవసరం లేకపోవడంతో మళ్లీ మేము కలవలేదు.
అతని అత్త ఏగ్నెస్ మరణించింది. ఎవరో ఆమె నెత్తి మీద బలమైన ఫ్లవర్‌వేజ్‌తో కొట్టి చంపారు. ఇరవై నాలుగు గంటల్లో న్యూయార్క్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే, ఆవిడ విల్లు ప్రకారం హతురాలి ఏకైక, జీవించి ఉన్న వారసుడు ఆల్బర్ట్.
‘నువ్వు హంతకుడు అని వారు ఎందుకు అనుమానించారు?’ ప్రశ్నించాను.
‘ఆంట్ ఏగ్నెస్‌కి, నాకు పోట్లాట జరిగింది. ఆవిడ పొరుగు వారిలో ఒకరు అది విని పోలీసులకి ఫోన్ చేశారు’
‘దేని గురించా పోట్లాట?’
‘నాకు కొంత డబ్బు అవసరం ఐతే ఆంట్ నాకు అప్పు ఇచ్చింది. కాని ఆవిడ ఇచ్చిన చెక్ అకౌంట్‌లో డబ్బు లేక వెనక్కి తిరిగి వచ్చింది’
‘ఎంత మొత్తం?’
‘ఎనభై వేల డాలర్లు’
‘మీ ఫర్మ్‌లో లాభాలు బావున్నాయని విన్నాను. అంత డబ్బు దేనికి అవసరం వచ్చింది?’ అడిగాను.
‘టు థౌజండ్ పర్సెంట్ రూట్ గురించి మీకు తెలుసా?’ ఆల్బర్ట్ అడిగాడు.
‘చూచాయగా. నాకు ఓసారి గుర్తు చెయ్యి’
‘బ్రోకర్స్ అప్పు తీసుకున్న డబ్బుతో వ్యాపారం చేస్తూంటారు. సాధారణంగా బేంకులే అందుకు అప్పుని ఇస్తూంటాయి. మా పెట్టుబడిలో ఇరవై రెట్లు మించి అప్పు చేయకూడదని స్టాక్ ఎక్సేంజ్ నిబంధన. మా కంపెనీ ఆ పరిమితిని దాటింది’
‘తనఖాగా ఏం పెట్టి?’
‘రిజిస్టర్ చేయని షేర్స్’
‘కాని అది చట్టానికి వ్యతిరేకం కదా?’ అడిగాను.
‘అవును. మాకు అప్పు ఇచ్చిన బేంక్‌కి అది తెలీగానే తమ అప్పుని తీర్చమని చెప్పి ఎక్స్చేంజ్‌కి మా మీద ఫిర్యాదు చేసింది. దాని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వారంలోగా అలాంటి అప్పులన్నీ తీర్చమని, లేదా సస్పెండ్ చేస్తామని హెచ్చరిక చేశారు. దాంతో బ్రోకరేజ్ ఫర్మ్‌లోని భాగస్వాములు ఆ డబ్బు సంపాదించి అప్పు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆందులోని నా వాటా ఎనభై వేలు’
‘దాంతో ఏగ్నెస్‌ని అప్పు అడిగావు’
‘అవును. నాకు వేరే దారి లేకపోయింది. లేదా ఆ ఫర్మ్‌లో నా భాగస్వామ్యం రద్దయిపోతుంది’
‘మీ అత్తయ్య ఆ అప్పు ఇవ్వడానికి అంగీకరించిందన్న మాట?’
‘అవును. ఆమె కరీబియన్ క్రూజ్ నించి అప్పుడే తిరిగి రావటంతో మంచి మూడ్‌లో ఉండి నా పేర చెక్ రాసిచ్చింది. దాన్ని నా అకౌంట్‌లో డిపాజిట్ చేశాను’
‘అది వెనక్కి వచ్చేసిందా?’
‘రబ్బర్ బంతిలా. ఇన్‌సఫీషియంట్ ఫండ్స్ అనే కారణంగా. నేను నలభై

ఎనిమిది గంటల్లో నా ఫర్మ్‌కి ఆ డబ్బు చెల్లించకపోతే నా భాగస్వామ్యాన్ని కోల్పోతాను. నా భవిష్యత్ మంట కలిసిపోతుంది’
‘తర్వాత?’
‘నాకు కోపం వచ్చి మా అత్త అపార్ట్‌మెంట్‌కి వెళ్లి, ఆవిడని ఇష్టం వచ్చినట్లు తిట్టాను. నాకు ముక్కు మీద కోపం మిస్టర్ జోర్డాన్’
‘ఎకౌంట్‌లో ఎందుకు డబ్బు లేదో ఆవిడ వివరణ ఇచ్చిందా?’
‘బేంక్ తప్పు చేసిందని, తన అకౌంట్‌లో చాలా డబ్బుందని ఆవిడ చెప్పింది. కాని బేంకులు అలాంటి పొరబాట్లు చేయవని మీకు తెలుసు. నేను పెద్దగా పోట్లాడానని అంగీకరిస్తాను. కాని చంపలేదు’
‘ఆవిడకి శత్రువులు ఉన్నారా?’
‘లేరనుకుంటాను’
‘దగ్గర మిత్రులు?’
‘పక్కింటావిడ మిసెస్ స్టీవర్ట్ తరచు వచ్చి వెళ్తూంటుంది. ఆవిడే నా గురించి పోలీసులకి ఫిర్యాదు చేసింది. దయచేసి నన్ను బెయిల్ మీద బయటకి తీసుకురాగలరా? నాకు ఇక్కడ బాలేదు’
‘నీ మీద హత్యానేరం మోపితే అది కష్టం. నా ప్రయత్నం నేను చేస్తాను’
డిటెక్టివ్ లెఫ్టినెంట్ జాన్‌ని ప్రశ్నిస్తే చెప్పాడు.
‘ఈసారి మీకు ఓడిపోయే క్లైంట్ దొరికాడు. నిందితుడికి డబ్బవసరం ఉంది. హతురాలి ఎస్టేట్‌కి అతను ఏకైక వారసుడు. ఆవిడ మీద అతనికి కోపం వచ్చి బెదిరించాడు. బలవంతంగా ఆవిడ ఇంట్లోకి ఎవరూ వచ్చిన దాఖలాలు లేవు. దొంగతనం కూడా జరగలేదు. హత్యాయుధం మీద అతని వేలిముద్రలు ఉన్నాయి. ఇవన్నీ అతనికి వ్యతిరేక సాక్ష్యాలు. మోటివ్, అవకాశం అతనికే ఉన్నాయని అనుకుంటున్నాను. అతను నిర్దోషి అని మీరు రుజువు చేయలేరు. బహుశ నలభై ఏళ్ల శిక్ష పడచ్చు’
‘నేనా పని చేయక్కర్లేదు లెఫ్టినెంట్. మీరే అతను దోషి అని రుజువు చేయాలి. అప్పటిదాకా అతను నిర్దోషే అని చట్టం నమ్ముతుంది’
* * *
మిసెస్ స్టీవర్ట్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్థులో ఉంది. నేను ఎవరో చెప్పగానే ఆవిడ తలుపు తెరిచింది.
‘ఆల్బర్టే తన అత్తని చంపాడో, లేడో నాకు తెలీదు. పోలీసులకి అతను ఆవిడతో పోట్లాడాడని మాత్రమే చెప్పాను. ఆ భాష... నేను విడాకులు ఇచ్చిన నా భర్త నించి తప్ప మళ్లీ అలాంటి భాషని వినలేదు’
‘ఎవరు వస్తే ఏగ్నెస్ తలుపు తెరుస్తుంది?’ అడిగాను.
‘కొత్తవాళ్లు ఎవరు వచ్చినా తెరవదు. ఈ నగరం అడవి. ఆవిడ బహు జాగ్రత్త మనిషి. కొత్త వాళ్లని ఆవిడ ఎన్నడూ లోపలకి రానివ్వదు. ఆల్బర్ట్ వస్తే మాత్రం తలుపు తెరుస్తుంది’
‘అతను వెళ్లాక మీరు ఆవిడతో మాట్లాడారా?’
‘ఆవిడే నా దగ్గరికి వచ్చి జరిగింది చెప్పి చాలా బాధ పడింది. బేంక్ తన చెక్‌ని ఎందుకు తిరక్కొట్టిందో ఆవిడకి అర్థం కాలేదు. మా ఇంట్లోంచే బేంక్‌కి ఫోన్ చేసి వారు చాలా పెద్ద తప్పు చేశారని చెప్పింది. అందుకు బేంక్‌దే బాధ్యత అని కూడా హెచ్చరించింది. మర్నాడు ఉదయం బేంక్‌కి వస్తానని, తనకి ఆ విషయంలో తగిన వివరణ ఇవ్వాలని కోరింది. కాని మర్నాడు బేంక్‌కి వెళ్లనే లేదు. ఈలోగానే.. పాపం’
‘ఆవిడ శవాన్ని ముందుగా ఎవరు చూశారు?’
‘ఉదయం వచ్చే పనిమనిషి ఆవిడ ఇంటి తలుపు తెరవకపోతే కేర్‌టేకర్‌ని పిలిచింది. అతను డూప్లికేట్ తాళం చెవితో తలుపు తెరిచాడు. అతనే పోలీసులకి ఫోన్ చేసి ఆ హత్య గురించిన సమాచారం ఇచ్చాడు’
* * *
ఏగ్నెస్ అకౌంట్ గోథమ్ ట్రస్ట్ బేంక్‌లో, మేడిసన్ ఎవెన్యూ బ్రాంచ్‌లో ఉంది. దాని మూడవ వైస్ ప్రెసిడెంట్ హేరి బల్ల దగ్గరికి నడిచాను. అతని నవ్వు సేల్స్‌మేన్ నవ్వు, కళ్లు టేక్స్‌లని సేకరించేవాడి కళ్లు. నేను ఎందుకు వచ్చానో చెప్పగానే అతని మొహంలోని నవ్వు ఆగిపోయింది.
‘ఏగ్నెస్ మా విలువైన కస్టమర్స్‌లో ఒకరు. ఆవిడ పోవడం చాలా బాధాకరం. అప్పుడప్పుడు ఆవిడ అయోమయంగా ఉండటం తప్ప ఆవిడతో మాకే సమస్యా లేదు. ఆవిడ తరచు ప్రయాణాలు చేస్తూంటుంది. మేము ఆవిడ తరఫున షేర్లని కొని అమ్ముతూంటాం. ఆవిడ డివిడెండ్స్ డైరెక్ట్‌గా మా బేంక్‌కే వస్తూంటాయి. ఆవిడ పెట్టుబళ్ల మీద తరచు సలహాలు ఇస్తూ, మూడు నెలలకి ఓసారి రిపోర్ట్‌ని కూడా పంపుతూంటాం. ఆవిడ హత్య గురించి విని నిర్ఘాంతపోయాం. ఆవిడ మరణం గురించి తెలీగానే ఆవిడ లావాదేవీలు అన్నిటినీ ఆపేశాం. ఆవిడ చెక్స్‌లో ఒకటి బౌన్స్ అయిందన్నారా? అసాధ్యం. ఆవిడ ధనవంతురాలు. మా అసిస్టెంట్ కేషియర్ మార్టిన్‌తో మాట్లాడి కాని నేను ఏం జరిగిందో చెప్పలేను’
అతను ఇంటర్‌కంలో మార్టిన్‌ని పిలుస్తూ చెప్పాడు.
‘వస్తూ మిసెస్ ఏగ్నెస్ ఫైల్‌ని కూడా తీసుకురా’
కొద్ది క్షణాల్లో నలభై ఏళ్ల మార్టిన్ ఓ లావుపాటి ఫైల్‌తో మా బల్ల దగ్గరికి వచ్చాడు.
‘నాకు ముందుగా ఈ సంగతి చెప్పు. ఏగ్నెస్ చెక్‌ని తిప్పి పంపామా?’
‘అవును సర్’
‘ఎందుకు తిప్పి పంపాం’
‘ఆవిడ అకౌంట్‌లో డబ్బు లేక సర్’
‘కాని ఆవిడ సేవింగ్స్ బేంక్ ఎకౌంట్‌లో ఎప్పుడూ ఎనభై వేలకన్నా ఎక్కువ డబ్బు ఉంటుంది కదా?’ హేరీ ప్రశ్నించాడు.
‘గత కొన్ని వారాలుగా ఆవిడ ఎకౌంట్‌లోంచి పెద్ద మొత్తాలు విత్‌డ్రా చేయబడ్డాయి’
అతను ఫోల్డర్‌లోంచి అనేక చెక్‌లని బయటకి తీసి హేరీకి ఇచ్చాడు. వాటిని పరిశీలించాక హేరీ వాటిని నాకు అందించాడు. నేను ఆ చెక్స్ మీది తారీకులని చూశాను. వాటిలోని కొన్ని ఆవిడ క్రూజ్‌లో ఉండగా రాసినవని గమనించాను. సంతకాలని పరిశీలించాను. నాకు ఆల్బర్ట్ చూపించిన బౌన్స్ అయిన ఎనభై వేల డాలర్ల చెక్ మీది సంతకాలకి, వాటిలోని సంతకాలకి పోలికే లేదు అని ఇట్టే గ్రహించాను.
‘ఈ సంతకాలు ఫోర్జరీలు’ చెప్పాను.

‘ఏమిటి? ఏమంటున్నారు?’ హేరీ ఆందోళనగా అడిగాడు.
వెంటనే అతను ఆవిడ ఫోల్డర్‌లో వెతికి, ఆవిడ స్పెసిమన్ సంతకం ఉన్న కార్డ్‌ని బయటకి తీసి చూశాక అతని మొహంలోని ఆందోళన మాయం అయింది.
‘మీరు పొరబడ్డారు. ఇది ఆవిడ అకౌంట్ తెరచినప్పుడు చేసిన సంతకం కార్డ్’
దాన్ని అందుకుని చూస్తే అది చెక్‌ల మీది సంతకంతో సరిపోయింది.
‘ఐతే మిస్టర్ హేరీ. ఈ కార్డ్ మీది సంతకం కూడా ఫోర్జరీనే. ఏగ్నెస్ ఆల్బర్ట్‌కి ఇచ్చిన చెక్‌ని నేను చూశాను. అది అతని సమక్షంలో ఏగ్నెస్ రాసి సంతకం చేసి ఇచ్చింది. కాబట్టి అది అసలు సంతకం’ చెప్పాను.
‘మా ఆధీనంలోని కార్డ్‌లో ఉన్న సంతకాలు ఫోర్జరీ అయే అవకాశమే లేదు. ఆల్బర్ట్ చెప్పింది అబద్ధమేమో? అతనే ఆ చెక్ మీది సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉండచ్చు’ హేరీ వెంటనే చెప్పాడు.
‘కావచ్చు. కాని మనం ఇంకో విధంగా ఏది సరైన సంతకమో తేల్చుకోవచ్చు. ఏగ్నెస్ రాసిన విల్లుమీది సంతకంతో ఈ కార్డ్ మీది సంతకాలని పోల్చి చూద్దాం. ఈలోగా ఇంకో పని కూడా మనం చేయచ్చు. కొన్ని నెలలు వెనక్కి వెళ్లి ఆవిడ పాత చెక్‌ల మీది సంతకాలని చూద్దాం’ సూచించాను.
అతను తల ఊపి, ఆ ఫోల్డర్‌లోని కొన్ని పాత చెక్‌లని వెనక నించి చూశాడు. మళ్లీ ఇందాకటి ఆందోళన అతని మొహంలో ప్రవేశించింది.
‘మీరు చెప్పింది నిజమే. వెనకటి సంతకాలు, ఈ సంతకాలు వేరు. ఎవరో ఆ అసలు సంతకాల కార్డ్‌ని తీసేసి, ఆ స్థానంలో దీన్ని ఉంచారని నా అనుమానం’
‘ఇది తెలివైన నేరస్థుడు చేసిన పని. చెక్‌ల మీది సంతకాలని పోల్చి చూసేది ఈ కార్డే. ఇది మీ సిబ్బందిలోని వారి పనే అయి ఉంటుంది. మీ బేంక్‌ని దివాలా తీయించకమునుపే మీరా ఇంటి దొంగని పట్టుకోవాలి’
‘ఈ బ్రాంచ్‌లోని దాదాపు ప్రతీ ఉద్యోగికీ ఈ ఫోల్డర్ అందుబాటులో ఉంటుంది. సిబ్బందిలో ఇది ఎవరి పనో కనుక్కోవడం కొద్దిగా కష్టమే’
‘మీకు ఇన్సూరెన్స్ ఉందనుకుంటా?’ అడిగాను.
‘ఉంది. కాని ఇలాంటి మోసం జరిగినప్పుడల్లా మేం కట్టాల్సిన ప్రీమియం మొత్తాలు పెరుగుతాయి. మేము ఆవిడ అకౌంట్ మొత్తాన్ని వెంటనే ఆడిట్ చేయించాలి’
‘ఈలోగా ఆ బౌన్స్ అయిన చెక్ మొత్తం ఎనభై వేల డాలర్లని నా క్లైంట్ అకౌంట్‌లో జమ చేయించండి. అతనికి దాని అవసరం ఉంది’ సూచించాను.
‘అతను నిర్దోషి అని మీరు నిరూపిస్తే సరే. ఓ వారసుడు తన పేర విల్లు రాసిన వారికి హాని చేసి ఆ సంపదని పొందలేడని చట్టం’ హేరీ చెప్పాడు.
నేను కొద్దిసేపు ఆలోచించాను. ఆల్బర్ట్ చంపకపోతే ఏగ్నెస్‌ని చంపడానికి మరొకరికి కారణం ఉంది. బహుశ ఆ ఫోర్జరీ చేసిన వ్యక్తికి. ఆవిడ నిశ్శబ్దం వారు కోరుకుంటారు. ఆ మరొకరు ఎవరో నేను తెలుసుకుంటే, ఆల్బర్ట్ నిర్దోషి అని రుజువు చేయడం తేలిక అవుతుంది. నా అనుమానం బేంక్‌కి వచ్చి డబ్బుని విత్‌డ్రా చేసుకుంది ఏగ్నెస్ పొరుగావిడ మిసెస్ స్టివార్ట్ అయి ఉంటుంది. నేను ఆవిడ దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి, ఆవిడ చేతి రాతని చూపించడమంటే చూపించవచ్చు. లేదా రెండు కారణాలుగా నిరాకరించచ్చు. మొదటిది అహంకారంతో. రెండోది నిజంగా దోషి ఐతే. అప్పుడు కోర్ట్ ఆర్డర్ ద్వారా మాత్రమే ఆ సమాచారాన్ని రాబట్టగలను. అప్పుడు ఆమె నిర్దోషి అని తేలితే?
బయటకి వచ్చాక వెంటనే నేను లెఫ్టినెంట్ జాన్‌కి ఫోన్ చేసి జరిగింది చెప్పాను.
‘ఇది అసిస్టెంట్ కేషియర్ మార్టిన్ పనని నా అనుమానం. అతను ఫోర్జరీ చెక్‌తో నగదు తీసుకుని జేబులో వేసుకుంటే అప్పుడు ఏగ్నెస్‌లా ఎవరైనా బేంక్‌కి రావాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు అతన్ని బెదిరిస్తే నిజం తెలియచ్చు’
‘సరే’
మార్టిన్ ఇంటి అడ్రస్‌ని తెలుసుకోడానికి లెఫ్టినెంట్ తన సిబ్బందిని నియమించాడు. బేంక్ మూసేసాక వారు అతన్ని అనుసరించి అతని ఇంటి చిరునామాని కనుక్కున్నారు.
గంటన్నర తర్వాత నాకు లెఫ్టినెంట్ నించి ఫోన్ వచ్చింది.
‘మార్టిన్‌ని ఎవరో చంపేశారు. నేను అతని అపార్ట్‌మెంట్‌కి చేరుకునే సరికి అతని శవం కనిపించింది. పది నిమిషాల క్రితం దాకా అతను జీవించి ఉన్నాడని ఏష్ ట్రేలోని సిగరెట్‌ని బట్టి గ్రహించాను’
‘ఓ! ఐతే ఇది అతనితో సహకరించిన మరో ఆవిడ పనై ఉండాలి. ఆ తోడు దొంగ తన బండారం బయటపడుతుందని అతన్ని చంపి ఉంటుంది’
‘బేంక్‌లో జరిగిన సంగతి ఆవిడకి ఎలా తెలుస్తుంది?’ లెఫ్టినెంట్ ప్రశ్నించాడు.
‘మార్టినే ఆ సంగతి ఆవిడకి ఫోన్ చేసి చెప్పి ఉంటాడు. బహుశ ఇందులోంచి బయటపడటానికి ఆలోచించడానికి ఆహ్వానించి ఉంటాడు. అతను మరణిస్తే ఇక మీరు ఆవిడని కనుక్కోలేరని చంపి ఉంటుంది. నా క్లైంట్ ఇంకా మీ కస్టడీలోనే ఉన్నాడు కాబట్టి ఇది అతని పని కాదు. అంటే ఏగ్నెస్ మరణంతో అతనికి సంబంధం లేదని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక మీరు అతన్ని విడుదల చేయండి’ కోరాను.
‘చూద్దాం. వైస్ ప్రెసిడెంట్ హేరీని కలుద్దాం. మీరూ రండి’ కోరాడు.
‘అలాగే. ఈలోగా మిసెస్ స్టివార్ట్ ఎలిబీని కూడా హత్యా సమయంలో చెక్ చేయండి’ సూచించాను.
* * *
హేరీని లెఫ్టినెంట్‌కి పరిచయం చేశాను. అతను కేషియర్ మార్టిన్ హత్య గురించి వినగానే చెప్పాడు.

‘మార్టిన్ ఆ డబ్బుని కొట్టేశాడని నమ్మలేను’
‘అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా?’ లెఫ్టినెంట్ అడిగాడు.
‘నాకు తెలిసి లేరు. అతని తోడుదొంగ ఎవరో తెలిసిందా?’ హేరీ ప్రశ్నించాడు.
‘తెలిసింది’ చెప్పాను.
‘ఆవిడే అతన్ని చంపిందా?’
‘మా దగ్గర అందుకు సరిపడే సాక్ష్యం ఉంది’
‘ఆవిడని ఎలా గుర్తించారు’
‘మార్టిన్ తన తోడుదొంగ పేరుని జోర్డాన్‌కి చెప్పాడు’ జాన్ చెప్పాడు.
‘అవునా?’ హేరీ నా వంక చూస్తూ అడిగాడు.
‘హేరీ! నాకో థియరీ ఉంది. కాని మార్టిన్ హత్య వల్ల అది మారింది. మార్టినే ఈ మోసం చేశాడని ముందు భావించాను. కాని అతని ప్రమేయం లేదని అతని హత్య తర్వాత గ్రహించాను’
‘ఎలా?’
‘మార్టిన్ తోడుదొంగని మేము కనుక్కున్నామా? అని ప్రశ్నించావు. అసలు తోడుదొంగ ఉన్నట్లుగా మీకు ఎలా తెలుసు? అంతేకాక ఆ వ్యక్తి స్ర్తి అని ఎలా తెలుసు?’
‘మిస్టర్ జోర్డాన్. అది సహజంగా ఊహించాను. డబ్బుని విత్‌డ్రా చేసింది స్ర్తినే అయి ఉండాలి’
‘ఆ సంగతి ఇంత అకస్మాత్తుగా ఎలా తెలిసింది? తన చెక్ బౌన్స్ అయితే ఏగ్నెస్ బేంక్‌లో ఎవరికి ఫోన్ చేస్తుంది? మీకే. ఆవిడకి బేంక్‌లో పరిచయం ఉంది మీతోనే. ఆవిడ అపార్ట్‌మెంట్‌కి మీరు అనేకసార్లు వెళ్లారు. కాని ఆవిడ మీకు ఫోన్ చేసిన సంగతి మీరు ఒప్పుకోలేదు’ చెప్పాను.
‘మీరు పొరపడ్డారు మిస్టర్ జోర్డాన్’
‘బహుశ మీరు ఏగ్నెస్ ఇంటికి వెళ్లినపుడు మిసెస్ స్టివార్డ్ ఆవిడ ఇంట్లో పరిచయమై ఉండాలి. తన చెక్‌ని ఫోర్జరీ చేసారని ఏగ్నెస్ పోలీసులకి చెప్తుందని మీరు ఆవిడని చంపారు. స్టివార్ట్, నువ్వు ఇందులో భాగస్వాములై ఉండి ఉంటారు’
‘మీరు చెప్పింది ఏదీ నిజం కాదు’ హేరీ అభ్యంతరం చెప్పాడు.
‘అదీ తెలుసుకుందాం’ చెప్పి నేను హేరీ టేబిల్ మీది రిసీవర్ అందుకుని మిసెస్ స్టివార్ట్ నంబర్ తిప్పి, ఆవిడ లైక్‌లోకి రాగానే హేరీ కంఠాన్ని అనుకరిస్తూ చెప్పాను.
‘హేరీని. అంతా బయట పడింది. తక్షణం పారిపో’
‘అలాగే’ ఆవిడ కంఠం ఆందోళనగా వినిపించింది.
వెంటనే హేరీ మొహం పాలిపోయింది. లెఫ్టినెంట్ నా వంక, అతని వంక చూసి చెప్పాడు.
‘మార్టిన్‌ని రివాల్వర్‌తో కాల్చింది నువ్వే హేరీ. తర్వాత రివాల్వర్‌ని పారేశావా? ప్రొఫెషనల్ కిల్లర్ ఐతే దాన్ని ఏ నదిలోనో పారేసేవాడు. కాని నువ్వు ప్రొఫెషనల్ కాదు. వెతికితే ఈ అపార్ట్‌మెంట్‌లో కచ్చితంగా దొరుకుతుంది. మిసెస్ స్టివార్ట్ తన తప్పుని ఒప్పుకుని బయట పడటానికి అంతా నీ మీదకి నెడుతుంది’
లెఫ్టినెంట్ వెంటనే రిసీవర్ అందుకుని మిసెస్ స్టివార్ట్ మీద ఆల్ పాయింట్స్ లుక్ అవుట్ బులెటిన్‌ని రిలీజ్ చేశాడు.
‘నా క్లైంట్ ఆల్బర్ట్‌ని ఇంక ఒక్క క్షణం కూడా మీ కస్టడీలో ఉంచకండి. అప్పుడే అతను నాకు ఇచ్చే ఫీజ్‌కి న్యాయం జరుగుతుంది’ లెఫ్టినెంట్‌కి ఫోన్ రిసీవర్ని అందిస్తూ చెప్పాను.
‘హేరీ ఉపయోగించిన రివాల్వర్ అతని కారు సీటు కింద దొరికింది. స్టివార్ట్ హేరీ ప్రేమికులు. మార్టిన్ కూడా ఇందులో భాగస్వామి. మార్టిన్ భయంతో అప్రూవర్‌గా మారి పోలీసులకి తమ గురించి చెప్తాడని హేరీ అతన్ని హత్య చేశాడు’ లెఫ్టినెంట్ తర్వాత చెప్పాడు.
(హెరాల్డ్ క్యూజర్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి