క్రైమ్ కథ

ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ బ్రిడ్జ్‌మీద ఓ కారు ఆగడాన్ని చూశాడు. ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పుడు అక్కడ చాలా మంది కార్లు ఆపి ఆ నగరాన్ని రెండుగా విభజిస్తున్న నదిని, అవతలి వైపు కనిపించే ఎతె్తైన భవనాలని చూస్తూంటారు. ఆ నగరంలోని టూరిస్ట్ ప్రాంతాల్లో అదొకటి. రద్దీగా ఉంటే అక్కడ కారు వేగాన్ని కొద్ది క్షణాలు తగ్గించి, వెనక నించి హార్న్ వినిపించే దాకా ఆ దృశ్యాన్ని చూసి వెళ్తూంటారు.
పర్యాటకులే కాక ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారికి కూడా ఆ బ్రిడ్జ్ అంటే ఇష్టమే. సగటున వారం, పది రోజులకి ఒకరు చొప్పున ఆ బ్రిడ్జ్ మీంచి అతి చల్లటి నీటిలోకి దూకి మరణిస్తూంటారు. దాంతో అక్కడ ఓ పోలీస్ ఆఫీసర్ని అలా జరగకుండా నియమించారు.
అక్కడ ఓ కారు ఆగడం, అందులోంచి ఓ వ్యక్తి కొద్దిగా ఆలస్యంగా సందేహిస్తూ దిగడం, ఇటు ఇటూ చూసి అతను తడబడుతూ బ్రిడ్జ్ పిట్ట గోడ వైపు వెళ్లడం, అక్కడ నిలబడి కిందకి నీళ్లల్లోకి చూడటం ఆ పోలీస్ ఆఫీసర్ గమనించాడు. అవన్నీ ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి లక్షణాలని అతనికి తెలుసు. తను సమయానికి వెళ్లగలడా అనుకుంటూ పొగమంచులో కనపడే ఆ ఆకారం వైపు వేగంగా, నిశ్శబ్దంగా నడిచాడు. అరిచినా, ఈల వేసినా అతను స్థిర నిశ్చయంతో వచ్చి ఉంటే వెంటనే దూకేస్తాడు.
అతని చేతులు పిట్టగోడని గట్టిగా పట్టుకున్నాయి. కుడి కాలు కొద్దిగా పైకి పిట్టగోడ మీదకి వెళ్లడం చూశాడు. తక్షణం ఆ పోలీస్ ఆఫీసర్ వేగంగా పరిగెత్తుకెళ్లాడు. ఆ అడుగుల చప్పుడు వినగానే ఆ వ్యక్తి తన కాలుని గోక్కొన్నట్లు నటించి వెనక్కి తీసుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ అతని పక్కనే నిలబడి చెప్పాడు.
‘బాగా చలి రాత్రి కదా ఇది?’
‘అవును’
‘నగరాన్ని చూడటానికి వచ్చారా?’
‘అవును’
‘ఒంటరిగా రావడానికి ఇది మంచి ప్రదేశం కాదు. ముఖ్యంగా రాత్రుళ్లు’
అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
‘మీ పేరు? ఏం చేస్తూంటారు?’
‘ఇక్కడ శాంతిగా ఉంటుందని వచ్చాను’
‘శాంతిని జీవితంలో వెతుక్కోవాలి తప్ప మరణంలో కాదు. ఆలస్యంగానో, త్వరగానో పరిస్థితులు మారి చీకట్లు తొలగుతాయి. కాని చీకట్లో ఉండగా మనకి రాబోయే వెలుగు గురించి తెలీదు’ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు.
‘మీరు ఇది నమ్మే చెప్తున్నారా?’ అతను అడిగాడు.
‘అవును. నా ప్రశ్నకి జవాబు చెప్పనే లేదు?’
‘ఇది చాలా కఠినమైన ప్రపంచం’
‘నది నీటి అడుగున మృదువైన ప్రపంచం ఎవరికీ కనిపించదు’
‘కొందరు అందుకు ప్రయత్నిస్తూంటారు’
‘ఈ రాత్రి కాదు. నేను డ్యూటీలో ఉండగా కాదు’
అతను కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి, తర్వాత అడిగాడు.
‘ప్రయత్నించడం వృథా అంటారా?’
‘అవును. ఇక్కడ ఎక్కువసేపు నిలబడి ఆలోచిస్తే సరే. లేదా రాగానే చల్లటి నీళ్లల్లోకి దూకితే ఆలస్యం ఐపోతుంది. అప్పుడు ఇంకా కఠినమైన ప్రపంచంలోకి వెళ్తారు’ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు.
‘మీరు చెప్పింది నిజం కావచ్చు’
‘మీకేమైనా ఇబ్బంది ఉందా?’
‘లేదు. ప్రత్యేకంగా ఏదీ లేదు’
‘మీరు సైకియాట్రిస్ట్ దగ్గరకి వెళ్లారా?’
‘కొన్నిసార్లు’
‘అది మీకు సహాయం చేసిందా?’
‘చేస్తే ఇక్కడ ఉంటానా?’
‘ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపోండి’
‘కాని నా భార్య మరణించినప్పటి నించి...’ అతను మధ్యలో ఆపేశాడు.
‘ఓ! మీ పేరు చెప్పనే లేదు?’
‘నాకు ఉన్నదల్లా ఆమే. ఇప్పుడు లేదు. నా పేరు ఎడ్వర్డ్’
‘మిస్టర్ ఎడ్వర్డ్. దీన్ని మీరు త్వరలోనే అధిగమిస్తారు. అలా అధిగమించిన చాలామందినే ఈ ప్రపంచం చూసింది’
‘్థంక్స్’
‘మీరు ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడ ఉండకపోవచ్చు. కాని ఇంకో ఆఫీసర్ ఉంటాడు’
‘నేను వెళ్లచ్చా? లేక నన్ను అరెస్ట్ చేస్తారా?’
‘ఆత్మహత్య చేసుకోడానికి వచ్చే వాళ్ల మనసులో తప్ప బయటకి ఎలాంటి సాక్ష్యాలు దొరకవు కాబట్టి మీరు వెళ్లచ్చు’
‘్థంక్స్’ చెప్పి అతను వెనక్కి తిరిగి వేగంగా వెళ్లి తన కార్లో కూర్చున్నాడు.
కారు కదిలాక ఆ పోలీస్ ఆఫీసర్ జేబులోంచి నోట్ బుక్, పెన్సిల్ తీసి అతని పేరు, వర్ణన, భార్య మరణించింది, దూకే ఆలోచనతో వచ్చాడు’ అని రాసుకున్నాడు. ఆ వివరాలు రొటీన్‌గా పోలీస్ ఫైల్‌లోకి వెళ్తాయి.
* * *
సైకియాట్రిస్ట్ కౌచ్ మీద పడుకున్న రోగి వంక చూస్తూ అతను చెప్పేది వినసాగాడు.
‘నాది జీవించదగ్గ జీవితంగా నాకు తోచడం లేదు. నిద్ర లేవగానే ప్రతీ రోజు చాలా భారంగా గడుస్తోంది’
‘మనమంతా మన జీవితాలని ఒకోసారి ఒక్కోరోజు చొప్పున గడుపుతాం ఎడ్వర్డ్’ సైకియాట్రిస్ట్ నెమ్మదిగా చెప్పాడు.
‘కాని ఇంత భారంగానా? ఇంత బాధగానా? నిన్న రాత్రి నేను ఆత్మహత్య చేసుకోబోయాను.. నిన్న రాత్రి కాదనుకుంటా. మొన్న రాత్రి. మేరిస్ బ్రిడ్జ్ మీంచి దాదాపు దూకేసేవాడిని’
ఆయన ప్రశ్నార్థకంగా చూశాడు.
‘ఓ పోలీస్ ఆఫీసర్ అడ్డు పడటంతో కుదరలేదు’
‘మీకు చట్టం అంటే గౌరవం ఉందన్నమాట. లేదా అతన్ని పక్కకి తోసి దూకి ఉండేవారు’
అతను కొద్ది క్షణాలు ఆలోచించి, తల అడ్డంగా ఊపి చెప్పాడు.
‘గౌరవం కాదు. బహుశ చావాలనే కోరిక నాలో ఇంకా పూర్తిగా నిండలేదు అనుకుంటా’
ఎడ్వర్డ్ మూడు వారాల నించి తన దగ్గరికి వస్తున్నా, అతనిలో అనుకూల అభివృద్ధి కాక, ప్రతికూల అభివృద్ధి జరుగుతోందని ఆయన గుర్తించాడు.
* * *
ఐదు రోజుల తర్వాత డాక్టర్ టెకెల్ తన వంక భీతిగా, అపరాధ భావంతో చూసే వ్యక్తిని ఆశ్చర్యంగా అడిగాడు.
‘ఏమిటి?’
‘నాకు స్టమక్ వాష్ చేయాలి డాక్టర్’ అతను మళ్ళీ కోరాడు.
‘దేనికి?’
‘నిద్ర మాత్రలని మింగాను’
‘ఏవి? ఎన్ని?’
అతను ఆ వివరాలు చెప్పాక డాక్టర్ చెప్పాడు.
‘మీ వయసుకి, బరువుకి ఇరవై మాత్రలు ప్రాణాంతకం. మింగి ఎంతసేపైంది?’
‘ఇరవై నిమిషాలు - అరగంట మధ్య’
‘ఐనా నిద్ర రాలేదా? స్టమక్ వాషింగ్ బాధాకరమైన అనుభవం’
ఆ మాత్రలు ఎక్కువ భాగం రక్తంలో కలవలేదని గమనించాక డాక్టర్ చెప్పాడు.
‘మీకేం కాదు’
‘్థంక్ యూ డాక్టర్’
‘్థంక్స్ చెప్పకండి. దీన్ని నేను పోలీసుల దృష్టిలోకి తీసుకెళ్లాలి’
‘దయచేసి మీరు.. నేను సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్‌లో ఉన్నాను. అవి పొరపాటున మింగాను తప్ప కావాలని కాదు’ అతను చెప్పాడు.
‘ముప్పై మాత్రలు పొరపాటున? బిల్ చెల్లించండి. ఆత్మహత్య చేసుకునే వారికి బిల్ పంపను. వెంటనే చెల్లించాలి. లేదా నాకు ఇబ్బంది’ డాక్టర్ కఠినంగా చూస్తూ చెప్పాడు.
అతను వెళ్లాక ఎడ్వర్డ్ రాసిన పేరు, చిరునామాలని చూసి రిసీవర్ అందుకున్నాడు.
* * *
‘ఈ ధరకి ఇది చాలా మంచి రివాల్వర్. ఇంకొన్ని డాలర్లు చెల్లిస్తే ఎక్కువ రేంజ్ గల రివాల్వర్ కూడా చూపిస్తాను’
‘ఇది నా పనికి సరిపోతుంది. గుళ్ల పెట్టె కూడా ఒకటి కావాలి’ అతను కోరాడు.
‘మూడు పెట్టెల ఖరీదు..’
‘నాకు ఒక్కటి చాలు. నిజానికి ఒక్కటే ఎక్కువ’
‘సరే’ చెప్పి సేల్స్‌మేన్ కౌంటర్ కింద నించి రిజిస్టర్‌ని తీసి తెరచి, అతని వైపు జరిపి పెన్ అందించి చెప్పాడు.
‘మీరు ఇక్కడ మీ వివరాలు రాసి సంతకం చేయాలి. ఇది ప్రభుత్వాన్ని ఆనందంగా ఉంచడానికి’
అతను ఆ పని చేశాక ఆ వివరాలు చదివి సేల్స్‌మేన్ చెప్పాడు.
‘మీ ఐడి కూడా నేను చూడాలి మిస్టర్ ఎడ్వర్డ్. మీ డ్రైవర్స్ లైసెన్స్ చూపించండి’
అతను లైసెన్స్‌లోని సంతకాన్ని, రిజిస్టర్‌లోని సంతకంతో పోల్చి చూసి తృప్తిపడి ఆ లైసెన్స్ నంబర్ని రాసుకున్నాడు.
‘్థంక్ యు’ ఎడ్వర్డ్ అతనికి డబ్బిచ్చి చెప్పాడు.
‘్థంక్ యు మిస్టర్ ఎడ్వర్డ్. ఈ రివాల్వర్ మీకు బాగా ఉపయోగిస్తుందని ఆశిస్తాను’
‘నేను కూడా ఆ ఆశతోనే కొన్నాను’ అతను చెప్పాడు.
* * *
రాత్రి తొమ్మిది గంటలకి ఎడ్వర్డ్‌కి తన ఇంటి వెనక తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. అతను పడక గదిలోంచి మెట్లు దిగి కిందకి వచ్చి కిటికీలోంచి చూసి ఆ పొడుగు వ్యక్తిని గుర్తు పట్టి, కొద్దిగా సందేహించి తలుపు తెరిచాడు. లోపలికి వచ్చిన అతన్ని ప్రశ్నించాడు.
‘ఇప్పుడు ఎందుకు వచ్చావు మార్క్?’
మార్క్ కోట్ జేబులోంచి రివాల్వర్‌ని తీసి ఎడ్వర్డ్ పొట్టకి గుచ్చి చెప్పాడు.
‘బయట చల్లగా ఉంది. నన్ను లోపలకి రానీ’
దాన్ని చూడగానే ఎడ్వర్డ్‌కి తను మరణించబోతున్నాడని అర్థమైంది. అతను బెదిరింపుని నిజం చేయడానికి వస్తాడని ఎడ్వర్డ్ ఊహిస్తూనే ఉన్నాడు.
‘నువ్వు ఆమెని చంపావు ఎడ్వర్డ్. ఆమె విడాకులు అడిగింది. దాన్ని భరించలేక చంపావు. నిన్ను విడాకులు అడగడం ప్రమాదకరం అని, నువ్వు క్రూరమృగం లాంటివనీ హెచ్చరించినా? నా మాట వినలేదు. బదులుగా ఇద్దరం కలిసి పారిపోదామని చెప్పినా ఒప్పుకోలేదు’ మార్క్ చెప్పాడు.
‘నీకు పిచ్చెక్కింది’
‘ఆమె మరణాన్ని నువ్వు ఏక్సిడెంట్ అని పోలీసులని నమ్మించగలిగావు. అది ఎలా చేసావు? చెప్పు. లేదా రివాల్వర్ పేలుతుంది’
‘కొట్టాను’
‘కొడితేనే పోయిందా?’
ఎడ్వర్డ్ ఓ గుటక వేసి ఆ రివాల్వర్ వంక, దాన్ని పట్టుకున్న ఆ మనిషి వంకా చూశాడు.
‘ఆమెని చాలాసార్లు కొట్టాను. తర్వాత సెల్లార్ మెట్ల మీంచి తోసేశాను. నేను ఇలా చెప్పానని నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్లి రుజువు చేయలేవు. వాళ్లు నమ్మే సాక్ష్యాలు వాళ్లకి దొరకలేదు’
‘నేనా పని చేయను. నువ్వు నీ భార్యని చంపడానికి గల కారణాన్ని వాళ్లకి చెప్పలేను. ఆ బల్ల ముందు కూర్చో’
ఎడ్వర్డ్ భయంగా కూర్చున్నాక అతను చెప్పాడు.
‘డ్రాయర్లోంచి పెన్, పేపర్ తీసుకొని నేను చెప్పినట్లు రాయి’
‘బలవంతంగా నువ్వు...’
‘అడ్డు రాక. అణచుకున్న నా కోపాన్ని పెంచితే వెంటనే కాల్చేస్తాను. నేను చెప్పినట్లు రాసి సంతకం చేయి’
‘రాయను. నువ్వు నన్ను చంపవు’
‘చంపి తీరతాను’
‘నిన్ను ఉరి తీస్తారు మార్క్ తప్పించుకోలేవు’
‘నీది ఆత్మహత్య ఎడ్వర్డ్’
‘ఉత్తరం రాసినా, రాయకపోయినా సరే, నేను ఆత్మహత్య చేసుకున్నానంటే ఎవరూ నమ్మరు’
‘ముందు రాయి. తర్వాత నీకు రివాల్వర్ ఇస్తాను. నీ మనస్సాక్షి ప్రకారం చేయి. నువ్వు తప్పక ఆత్మహత్య చేసుకుంటావని నాకు తెలుసు’
ఎడ్వర్డ్ అతని మాటలని బొత్తిగా నమ్మలేదు. కాని తల వెనుక తగిలే రివాల్వర్ గొట్టం అతనికి ఇంకో అవకాశాన్ని ఇవ్వలేదు. మార్క్ చెప్పినట్లు రాసి, కింద సంతకం చేసి తారీకు వేశాడు.
‘వెనక్కి తిరుగు ఎడ్వర్డ్’ చాలాసేపటికి మార్క్ చెప్పాడు.
ఎడ్వర్డ్ అతన్ని నివ్వెరపోతూ చూశాడు.
నకిలీ కనుబొమ్మలు, విగ్, మేకప్‌లోని మార్క్ అడిగాడు.
‘నేను ఎవరిలా కనిపిస్తున్నానో తెలుసా ఎడ్వర్డ్?’
‘తెలీదు’
‘నీలా. పూర్తిగా కాకపోయినా కొంతదాకా. మన ఇద్దరి ఎత్తు, బరువు, వయసు ఒకటే. అవసరమైన వాళ్లు ఇప్పటికే నన్ను ఎడ్వర్డ్‌గా గుర్తించారు’
‘నువ్వు వారి ముందు ఎందుకు నాలా నటించావు?’ ఎడ్వర్డ్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘నీలోని నిరాశని ఎస్టాబ్లిష్ చేయడానికి’
‘అంటే? నాకు అర్థం కాలేదు’
‘నువ్వు ఆత్మహత్య చేసుకునే రకానివి కావు. చేసుకున్నావన్నా ఎవరూ నమ్మరు. కాని నీ భార్య పోయాక నీ ప్రవర్తన గురించి నీకు నేను చెప్తే ఆశ్చర్యపోతావు’
‘నాకు ఇంకా అర్థం కాలేదు’
‘ఐతే విను. మేరిస్ బ్రిడ్జ్ మీంచి నువ్వు నీ భార్యా వియోగాన్ని భరించలేక దూకబోతూంటే ఓ పోలీస్ ఆఫీసర్ నిన్ను ఆపాడు. మానసిక కృంగుబాటుతో నువ్వు ఓ సైకియాట్రిస్ట్‌ని కలిసావు. నిన్న మధ్యాహ్నం ఓ డాక్టర్ నీ కడుపులోని నిద్ర మాత్రలని పంప్ చేసి తీసారు’
‘అవన్నీ అబద్ధాలు’
‘కడుపుని పంప్ చేయడం బాధాకరం. నీ కోసం నేనా బాధని అనుభవించాను. ఆ సమయంలో నా విగ్ ఊడిపోతుందనే భయం’
ఎడ్వర్డ్ వౌనంగా ఆలోచిస్తూండి పోయాడు.
‘నువ్వు ఈ రివాల్వర్‌ని కొనడం నీకు తెలీదు’
‘అది ఎప్పుడు?’ ఎడ్వర్డ్ అతను చెప్పేది అర్థం చేసుకుంటూ అడిగాడు.
‘గంట క్రితం. ఓ షాప్‌లోకి వెళ్లి దీన్ని, ఇందులోని గుళ్లున్న పెట్టెని కొన్నావు’
‘అందుకు నా సంతకం, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం’
‘వాటిని నేను సృష్టించాను. ఓ సేల్స్‌మేన్‌ని అవి తేలిగ్గా మోసగించాయి’
‘సంతకం?’
‘ఈ పథకం తట్టగానే నీ సంతకాన్ని ఫోర్జరీ చేయడం సాధన చేశాను’
‘ఆఫీస్‌లోని నా కొలీగ్స్, నా మిత్రులు నా ఆత్మహత్యని నమ్మరు’
మార్క్ పకపక నవ్వి చెప్పాడు.
‘వాళ్లెవరూ నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పరు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అతను ఎంతో మూడీగా ఉండేవాడని జ్ఞాపకం తెచ్చుకుంటారు. నీ భార్య పోయాక నీలో దుఃఖం లేదు. పార్టీలు, హుషారు. ఇదంతా నటన అని సైకియాట్రిస్ట్‌కి నీ తరఫున నేను చెప్పాను. ఆమెని నేను ప్రేమించినట్లుగా నువ్వు ప్రేమించలేదు. మేము కోరినట్లుగా విడాకులు ఇచ్చి ఉండాల్సింది’
ఎడ్వర్డ్‌కి ముచ్చెమటలు పోశాయి.
‘నువ్వు నన్ను చంపనని, రివాల్వర్ ఉంచి వెళ్లిపోతావని చెప్పావు?’ అడిగాడు.
‘అలా చెప్పకపోతే ఈ ఉత్తరం ఎలా రాస్తావు?’
మార్క్ మెరపులా రివాల్వర్ గొట్టాన్ని ఎడ్వర్డ్ నోట్లో ఉంచి ట్రిగర్ నొక్కాడు. తర్వాత రివాల్వర్ మీది తన వేలిముద్రలని తుడిచి దాని మీద ఎడ్వర్డ్ వేలిముద్రలు పడేలా చేశాడు. దాన్ని చేతిలోంచి జారి కింద పడినట్లుగా పడేశాడు. ఎడ్వర్డ్ పర్స్‌లో సైకియాట్రిస్ట్ విజిటింగ్ కార్డుని ఉంచి, రివాల్వర్ కొన్న బిల్‌ని ఉండలా చేసి అతని జేబులో ఉంచాడు. ఆ తర్వాత వచ్చిన దారిలో బయటకి వెళ్తూ చెప్పాడు.
‘నువ్వు ఆమెని చంపకుండా ఉండాల్సింది.’ *

(లారెన్స్ బ్లాక్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి