క్రైమ్ కథ

సముద్ర ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్ర ప్రయాణాలు మార్టిన్‌కి కొత్త కాకపోయినా ఓడ అటూ ఇటూ ఊగడానికి అతను ఇంకా అలవాటు పడలేదు. ముఖ్యంగా రాత్రిళ్లు. అందువల్ల అట్లాంటిక్‌ని దాటేప్పుడు అతనికి తక్కువ నిద్ర పడుతుంది. దాంతో ఇక అలసటతో కళ్లు వాటంతట అవే మూత పడేదాకా నిద్ర కోసం వేచి చూడాల్సి వస్తుంది. అతనికి వ్యాపారం వల్ల తరచు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతూంటుంది. భార్య అతన్ని విమానంలో వెళ్లమని తరచూ తిడుతూంటుంది. కాని మార్టిన్‌కి విమాన ప్రయాణం అంటే మానసికంగా భయం. సముద్రంలోని ఓడ కుదుపులు కడుపులో, మెదడులో కూడా ఇబ్బంది పెట్టినా విమానం అంటే అతనికి గల తీవ్ర భయం వల్ల డోవర్ నించి న్యూయార్క్ దాకా సముద్ర ప్రయాణాన్ని భరిస్తాడు. కళ్లు తెరచుకుని కేబిన్‌లో పక్క మీద పడుకుని పైకప్పు వంక చూస్తూండటం చాలా బాధాకరం.
చాలా సముద్ర ప్రయాణాల్లో మార్టిన్ ఓడ డెక్ మీద అటు ఇటూ నడుస్తూ ఆకాశంలోని లక్షలాది నక్షత్రాలని లెక్కపెట్టే ప్రయత్నం చేస్తూంటాడు. ఇది అతను చేసే ఆఖరి ఓడ ప్రయాణం. ఆ తర్వాత అతను తన వ్యాపారాన్ని అమ్మేసి ఆస్ట్రియాకి వెళ్లి రిటైర్‌మెంట్ జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాడు.
మూడో రాత్రి అతనిలా నిద్ర పట్టని మరో ప్రయాణీకుడు డెక్ మీద తారసపడ్డాడు. న్యూయార్క్‌కి చెందిన ఆ మరో ప్రయాణీకుడి పేరు కూలీ. మార్టిన్ కన్నా చిన్నవాడైన అతనూ వ్యాపారస్థుడే. నలభై ఐదు - ఏభై ఏళ్లు ఉంటాయి. అందరు ప్రయాణీకులు నిద్రిస్తూండగా వారు ఇద్దరూ ఖాళీ డెక్ మీద ఒకరితో మరొకరు కలివిడిగా మాట్లాడుకోసాగారు. అతనితో కొద్దిసేపు ముచ్చటించాక అతను తెలివిగలవాడని మార్టిన్‌కి అనిపించింది. ఒక్కోసారి అతను వేసే ముతక జోకులని వదిలేస్తే అతను మార్టిన్‌కి నచ్చాడనే చెప్పాలి.
రాత్రుళ్లు డెక్ మీద నడుస్తూనో, అతని కేబిన్ ఉన్న డెక్‌లోని బిలియర్డ్స్ గదిలోనో గడిపేవారు. ఆ ఆట ఆ ఇద్దరికీ నచ్చిన ఆట. ఐతే ఎవరూ నిష్ణాతులు కారు. ఒకరికొకరు పోటీ కూడా కాదు కాబట్టి వారికి ఆట విసుగు అనిపించేది కాదు. ఎనిమిదో రాత్రి బయట బాగా చలిగా ఉంది. దాంతో వారు ప్రతీ తలుపునీ, కిటికీని మూసేసి, బిలియర్డ్స్ గదిలో సిగార్స్‌ని తాగుతూ సిగార్ పొగని భరిస్తూ గడిపారు.
పావుగంట తర్వాత ఆ ఘోరం జరిగింది. ఇద్దరికీ పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇంకా ఎవరూ స్వాధీనం చేసుకోని, అంతుచిక్కని మందు పాతర ఓడకి తగిలి ఉండచ్చు అని మార్టిన్ అనుకున్నాడు. అది ఏమైనా ఆ రాత్రి నిశ్శబ్దం ఆ శక్తివంతమైన అధిక శబ్దం వల్ల అకస్మాత్తుగా ఛిద్రమైంది. వారి ఓడ హింసాత్మకంగా వణికిపోయింది. అకస్మాత్తుగా వారు ఇద్దరూ నేల మీదకి విసిరి వేయబడ్డారు. బిలియర్డ్స్ బంతులు చెల్లాచెదురుగా కింద పడ్డాయి.
తర్వాత ఓడ నిశ్చలమై అంతా నిశ్శబ్దం. మార్టిన్ మెయిన్ డోర్ వైపు చూస్తే దాని అద్దంలోంచి డెక్మీద తెల్ల గౌన్‌లోని ఒకామె భయంతో పాలిపోయిన మొహంతో అరుస్తూ కనిపించింది. ఆమె నోరు తెరచుకుని ఉండటంవల్ల అరుస్తోందని గ్రహించాడు కాని ఆ అరుపు వినపడలేదు. అకస్మాత్తుగా ఓడ మళ్లీ ఇంకో వైపుకి ఒరిగింది. దాంతో డెక్ మీది ఆమె చీకట్లో సముద్రంలోకి పడిపోవడం మార్టిన్ చూశాడు. ఇప్పుడు సముద్రపు అలలు కిటికీల అద్దాలని తాకుతున్నాయి. ఓడ మునిగిపోతోందని కిటికీలోంచి కనపడే నీళ్లని బట్టి మార్టిన్ గ్రహించాడు. మరి కొద్ది క్షణాల్లో తను మరణిస్తాడని కూడా అనుకున్నాడు.
మరోసారి - ఆఖరిసారి - ఓడ కదిలి చివరికి మళ్లీ నిశ్చలం అయిపోయింది. నేల ఏటవాలుగా ఉండటంతో బిలియర్డ్స్ బంతులన్నీ వాలు వైపు జారాయి. మార్టిన్ మూలుగుతున్న కూలీ దగ్గరికి వెళ్లి చేతిని అందించి పైకి లేచేందుకు సహాయం చేశాడు. అతనికి ఏం జరిగిందో మొదట అర్థం కాలేదు.
‘నా తల ఓడ నేలకి తాకింది’ కూలీ చెప్పాడు.
‘ఓడ ఎంత లోతుకి మునిగిందో, ఉపరితలం ఎంత పైన ఉందో మనకు తెలీదు’ మార్టిన్ చెప్పాడు.
‘ఎక్కువ లోతుకి దిగలేదు. లేదా నీటి వత్తిడికి కిటికీ అద్దాలు పగిలిపోయేవి. మనం నీళ్లల్లోకి వెళ్లి పైకి ఈదుకుంటూ వెళ్లగలమా?’ కూలీ అడిగాడు.
‘ఈ వయసులో నేనా ధైర్యం చేయలేను. ఎంత పైకి ఈదాలో తెలీదు. ఈలోగా ఊపిరి బిగబట్టే శక్తి ఉండకపోవచ్చు’
మార్టిన్ దాన్ని నిరాకరించాడు.
‘ఎంతమంది ఉన్నారో? ఎంతమంది పోయారో? ఆహా! మరణించడానికి ఇదేం దారి?’ కూలీ బాధగా చెప్పాడు.
‘మనం చావకపోవచ్చు. ఇంకొందరు జీవించి బయటపడి ఉంటారు. వాళ్లని కాపాడతారు. తర్వాత మనల్ని కూడా కాపాడుతారు. మనం ఇక్కడ ఉన్నామని ఊహించి డైవర్స్ ఇక్కడికి వస్తారు’ మార్టిన్ ధైర్యం చెప్పాడు.
‘నీటి గర్భంలోకి వచ్చామా? నిజంగా డైవర్స్ ఇక్కడికి వస్తారంటారా?’ కూలీ నమ్మలేనట్లుగా అడిగాడు.
‘డైవర్స్‌ను తప్పకుండా పంపుతారు’
‘ఒకవేళ ఎవరూ జీవించి ఉండకపోతే?’
‘అప్పుడు మనం మరణించిన వారితో సమానం. మనం కూడా పోయామనే వారు భావిస్తారు’
‘అది తెలుసుకోవడానికి మనం వేచి ఉండాలి’ కూలీ నిస్పృహగా చెప్పాడు.
‘అవును. అంతకి మించి మనం మాత్రం ఏం చేయగలం?’
ఓ అరగంటాగి కూలీ బయటి నీళ్ల వంక చూస్తూ చెప్పాడు.
‘ఈ సస్పెన్స్‌ని భరించలేను. తలుపు తెరిస్తే చాలు’
మార్టిన్ అతని వంక చురుగ్గా చూస్తూ అడిగాడు.
‘మీరు అంత తేలిగ్గా చావుకి లొంగిపోతారా?’
‘లేదు’ అతను నవ్వుతూ చెప్పాడు.
అకస్మాత్తుగా లైట్లు ఆరి వెలిగాయి. అలా మూడుసార్లు ఆరి వెలిగాక బల్బులన్నీ ఆరిపోయాయి. ఇప్పుడు వారు కటిక చీకటిలో, సముద్ర గర్భంలో ఉన్నారు.
మార్టిన్ తన భార్యాపిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. రెండు ఖండాల్లోని తన మిత్రులు, బంధువులు, ఇంకా భూమి, గాలి, ప్రాణాల గురించి. ఇద్దరూ ఒకరికొకరు ఆ చీకట్లో కనపడకపోవడంతో సంభాషించకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు.
అలా ఎంతసేపు కూర్చున్నారో ఇద్దరికీ తెలీకుండానే లోపల స్వల్పంగా వెలుగు ప్రవేశించింది. ఆ గదిలోని వస్తువుల ఆకారాలని మార్టిన్ అల్లుకుపోయినట్లుగా చూడగలిగాడు. కూలీ ఓ కుర్చీలో కూర్చుని ఉండటం కనిపించింది. అతను నెమ్మదిగా లేచి చెప్పాడు.
‘సూర్యోదయమైనట్లుంది. ఉపరితలం మీద పడే ఎండ వెలుగై ఉండచ్చు ఇది’
‘ఈ గదిలోని గాలి ఎంతకాలం ఉండచ్చని మీ ఉద్దేశం?’ మార్టిన్ కాసేపాగి అడిగాడు.
‘నాకు తెలీదు. ఇది చాలా పెద్ద గది. మనం ఇద్దరమే ఇందులో ఉన్నాం. బహుశ మరణించడానికి మునుపు ఆకలికి అలమటించి ఆహారం లేకుండా నెమ్మదిగా మరణించచ్చు’ కూలీ చెప్పాడు.
ఆకలి మరణం అనే ప్రమాదం పొంచి ఉందని అంతదాకా మార్టిన్‌కి తట్టలేదు. గాలి ఉంది కాని ఆ గదిలో ఆహారం లేదు.
కూలీ లేచి మంద్రకాంతి గల ఆ గదిలో అటూ ఇటూ నడవసాగాడు. తర్వాత ఒళ్లు విరుచుకుని గతంలోని తమ సంభాషణ ఇంకా కొనసాగుతున్నట్లుగా అడిగాడు.
‘కొందరు ప్రాణాలతో ఉన్నారని, కొందరు డైవర్స్ వస్తారని నమ్ముదాం. వారు మనల్ని కాపాడటానికి రావడానికి ఎంత కాలం పట్టచ్చు?’
‘ఉపరితలం మీది వారు ఈ రోజే కాపాడచ్చు’ మార్టిన్ ఆశగా చెప్పాడు.
‘డైవర్స్ రేపు రావచ్చు. వారం తర్వాత కూడా. లేదా రెండు నెలల తర్వాత’ కూలీ నిస్పృహగా చెప్పాడు.
‘ఏమో మరి? అది ఎవరు చెప్పగలరు?’ అతని మాటల్లోని నిరాశావాదం తనకి నచ్చలేదని ధ్వనించేలా మార్టిన్ చెప్పాడు.
చాలాసేపటికి అకస్మాత్తుగా కూలీ నవ్వు ఆ గదిలోని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వినిపించింది. అది అసహజంగా, భయం కలిగేలా వినిపించి మార్టిన్ ఉలిక్కిపడ్డాడు. కూలీ తనలా శాంతంగా లేడని గ్రహించాడు.
‘ఇదే కనక నవలో, సినిమానో ఐతే రక్షించే వాళ్లు చివరి నిమిషంలో వస్తారు. సరైన సమయానికి, కాల్పనిక సాహిత్యం ఈ విషయంలో గొప్పది. విలువైనవన్నీ ఆఖరి నిమిషాల్లో జరిగేది సాహిత్యం. ప్రాణం పోవడానికి ఇంక ఒక్క నిమిషం ఉందనగా వస్తారు’ కూలీ చెప్పాడు.
‘మనం ఇంకే విషయాలైనా మాట్లాడదాం’ మార్టిన్ అయిష్టంగా చెప్పాడు.
‘అసలు మనం మాట్లాడద్దు’
కొద్దిసేపాగి కూలీ నేల మీంచి బిలియర్డ్స్ బంతులని తీసుకున్నాడు. ఆ మంద్రపు వెలుగులో అతను వాటిని గాల్లోకి ఎగరేస్తూ పట్టుకోవడం మార్టిన్ చూశాడు.
‘నేను మన సమస్యని తేలిగ్గా పరిష్కరించగలను’ కొద్దిసేపాగి కూలీ చెప్పాడు.
‘ఎలా?’ మార్టిన్ ఆశగా అడిగాడు.
‘ఓ బంతిని కిటికీ అద్దం మీదకి విసిరి దాన్ని పగలగొట్టి’
వెంటనే మార్టిన్ ఉలిక్కిపడి అరిచాడు.
‘వద్దు. వాటిని కింద ఉంచు. నీ ప్రాణాలని నువ్వు లెక్క చేయకపోవచ్చు కాని నాకు జీవించాలని ఉంది’
కూలీ మళ్లీ ఇందాకటిలా నవ్వి వాటిని బిలియర్డ్స్ బల్ల మీద ఉంచాడు. ఇంకాసేపు అటూ ఇటూ నడిచి తర్వాత మళ్లీ కుర్చీలో కూలబడ్డాడు.
‘నేను అలసిపోయాను. ఓడ కదలడం లేదు. నేను నిద్రపోతాను’ చెప్పాడు.
కాని మార్టిన్ నిద్ర పోవడానికి భయపడ్డాడు. తను నిద్రపోయే సమయంలో కూలీ బిలియర్డ్స్ బంతులని కిటికీ అద్దాల మీదకి విసిరి వాటిని పగులకొట్టి లోపలకి నీరు వచ్చేలా చేస్తాడనే భయంతో కూర్చుని కూలీ వంకే చూడసాగాడు. కాని చివరకి అతని కనురెప్పలు బరువుగా వాలిపోయాయి.
* * *
మార్టిన్ నిద్ర లేచేసరికి మళ్లీ పూర్తిగా చీకటి. అర్ధరాత్రి అయుండచ్చని అనుకున్నాడు. కూలీ ఊపిరి తీసుకుని నడిచే శబ్దం వినిపిస్తోంది. అతను నిద్రలో ఉన్నాడని గ్రహించాడు.
మళ్లీ వెలుగు వచ్చే సమయానికి మార్టిన్ నిద్ర లేచాడు. కొద్దిసేపటికి కూలీ ఏదో గొణగడం
వినిపించింది. పూర్తి మెలకువ వచ్చాక అతను లేచి చెప్పాడు.
‘నాకు ఆకలి దంచేస్తోంది. గది గోడలు నా మీదకి వస్తున్నాయని అనిపిస్తోంది’
‘రక్షించేవారు బహుశ ఇవాళ వస్తారు’ మార్టిన్ ధైర్యం చెప్పాడు.
‘లేదా వారు ఎప్పటికీ రాకపోవచ్చు. ఎప్పుడో మన అస్థిపంజరాల మీద వారి టార్చ్‌లైట్ వెలుగు పడచ్చు’
కూలీ లేచి అటూ ఇటూ నడవసాగాడు. తర్వాత ఆగి మార్టిన్ వైపు తిరిగి చెప్పాడు.
‘ఓసారి నేను ఎక్కడో చదివాను. ఓ రోజు తినకపోతే మర్నాడు ఆకలి అధికంగా వేస్తుంది. ఆ తర్వాత ఆహారం లేకుండా ఒకటి, రెండు రోజులు గడిచాక ఆకలి బాధ ఇక ఉండదు. తగ్గిపోతుంది’
‘అది నిజం కావచ్చు. నాకు నిన్న ఉన్నంత ఆకలి ఇవాళ లేదు’ మార్టిన్ అంగీకరించాడు.
‘కాని నాకు నిన్నటికన్నా రెట్టింపు ఆకలి వేస్తోంది. కడుపులో తిమ్మిరిలు. బాగా దాహంగా కూడా ఉంది’
అతను కిటికీ దగ్గరికి వెళ్లి బయట నీటి వంక పరిశీలనగా చూసి చెప్పాడు.
‘నాకు దాహంగా ఉంది. కిటికీ తలుపుని తెరచి నీళ్లని తాగితే?’
‘కిటికీ నించి దూరంగా జరుగు’ మార్టిన్ అరిచాడు.
వెంటనే అతని దగ్గరికి వెళ్లి పట్టుకుని కిటికీకి దూరంగా లాక్కెళ్లాడు.
‘కూలీ! దయచేసి నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకో. మనం శాంతంగా, సహనంగా ఉంటే మన మీద మనకి విశ్వాసం కలిగి సహనంగా వేచి చూసే శక్తి కలుగుతుంది. మనం రక్షించబడచ్చని ఆలోచిస్తూండు. అసలు నీకు జీవించాలని లేదా?’
‘జీవించడం?’ కూలీ వైరాగ్యంగా నవ్వాడు.
కొద్దిసేపాగి కూలీ మళ్లీ చెప్పాడు.
‘మీకు తెలీదా? నేను మొన్ననే మరణించాను. నేను మరణించినా ఆ సంగతి నా పొట్టకి తెలీడంలేదు. పాడు బాధ! మార్టిన్. నన్ను నమ్ము. ఈ ఆకలి బాధని తప్ప నేను దేన్నైనా భరించగలను. కడుపులోని ఈ బాధ పోవాలంటే నేనేదైనా తినాలి. వెంటనే ఆహారం దొరక్కపోతే నాకు పిచ్చెక్కుతుంది. అది నాకు తెలుసు’
మార్టిన్‌కి ఏం మాట్లాడాలో తోచక అతని వంకే చూడసాగాడు. కూలీ మూడ్స్ తక్షణమే ఎలాంటి కారణం లేకుండా మారసాగాయి. అకస్మాత్తుగా మళ్లీ నవ్వాడు.
‘ఆహారం లేకుండా నకనకలాడే వారు ఆకలిని చల్లార్చుకోడానికి ఆఖరి పరిష్కారం ఒక్కటే ఉంది’
‘ఏమిటది?’ మార్టిన్ అడిగాడు.
‘ఒకర్ని మరొకరు. అలా చాలాసార్లు జరిగింది కూడా’
మార్టిన్ అతని వంక భయంగా చూశాడు. తర్వాత గొంతు పెగుల్చుకుని అడిగాడు.
‘కూలీ. నువ్వు సరదాగా అంటున్నావా? లేక నిజంగా అంటున్నావా?’
అతను మళ్లీ నవ్వాడు.
‘్భయపడకు మార్టిన్. నేనా పని చేస్తానని అనుకోను. వండగలిగితే అప్పుడు ఆలోచిస్తాను. కాని పచ్చిమాంసం? లేదు. నాకు అంత ఆకలి వేస్తుందని అనుకోను’
అతని మూడ్ మళ్లీ కొద్ది క్షణాల్లో మారింది. కఠినంగా చూస్తూ చెప్పాడు.
‘కాసేపట్లో ఈ రగ్గుని తింటాను. నా బట్టలని తింటాను...’
అతను ఆ తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మార్టిన్ అతనికి సాధ్యమైనంత దూరంగా కూర్చున్నాడు. అతను ఆ రాత్రి నిద్ర పోదలచుకోలేదు. ఆ ఆకస్మిక పరిణామానికి కూలీకి మతిస్థిమితం తప్పిందని నమ్మాడు. ఉన్మాది ఏదైనా చేయగల సమర్థుడు. చీకటి పడబోతోందంటేనే మార్టిన్‌కి భయంగా ఉంది.
వారి మధ్య నిశ్శబ్దం అప్పుడప్పుడూ కూలీ అర్థంకాని గొణుగుడుతో భగ్నం అవుతోంది. చివరికి చీకట్లు అలముకున్నాయి. కూలీ తన మీద దాడి చేస్తాడనే భయంతో మార్టిన్ అప్రమత్తంగా కూర్చున్నాడు. అతని శ్వాసని బట్టి నిద్రపోయాడని అనిపించినా మార్టిన్ దాన్ని పూర్తిగా విశ్వసించలేదు. తను ఓ పిచ్చివాడితో ఖైదు చేయబడ్డాడు. అతన్నించి ప్రమాదం రాకుండా జీవించి ఉండాలంటే మెలకువగా ఉండాలి. రక్షించేవారు వచ్చేదాకా అతన్ని కనిపెట్టుకుని ఉండాలి. వాళ్లు తప్పక వస్తారని ఆశావాదైన మార్టిన్ నమ్మాడు.
అతని భయం అతన్ని ఆ రాత్రి, మర్నాడు ఉదయం కూడా నిద్ర పోనీలేదు. కూలీ మాత్రం చాలా సమయం నిద్రిస్తూనే గడిపాడు. అతను లేచాక కాసేపు ఏదో నెమ్మదిగా గొణుగుతూ, కాసేపు నిశ్శబ్దంగా గడపసాగాడు.
మళ్లీ రాత్రి చీకటి పడేసరికి మార్టిన్ ఇక నిద్రని ఆపుకోలేక పోయాడు. మూడో రోజు కూడా వారి సమస్యకి పరిష్కారం లేకుండా గడిచిపోయింది. మార్టిన్ నరనరంలో భయం నిండి ఉన్నా, నిద్రతో పోరాడినా చివరికి మంచుతెరలా నిద్ర అతన్ని చుట్టేసింది.
* * *
అకస్మాత్తుగా మార్టిన్‌కి మెలకువ వచ్చింది. వెలుతుర్ని బట్టి అది పగలని గ్రహించాడు. అతనికి ఊపిరి అందడం లేదు. ఎదురుగా నిలబడ్డ కూలీ చేతులు తన మెడ చుట్టూ బిగుసుకుని, తన ఊపిరితిత్తులకి గాలి అందకుండా మూసేస్తున్నాయని గ్రహించాడు. కళ్లు వెళ్లుకు వచ్చి, నోరు నిస్సహాయంగా తెరచి, మూసుకుని మార్టిన్‌కి తన తల పేలిపోతుందా అనిపించింది. కూలీ మొహంలో భయంకరమైన నవ్వు కనిపిస్తోంది.
మార్టిన్ అతని చేతులని తన చేతులతో నెట్టివేసే ప్రయత్నం చేశాడు. కాని బలంగా పట్టుకున్న ఆ వేళ్లని కదపలేక పోయాడు. గాలి అందడం లేదు. అతని గుండె బలహీనపడసాగింది. మార్టిన్ వేళ్లు కూలీ మొహాన్ని తాకాయి. అతని కళ్లల్లో రెండు వేళ్లతో బలంగా పొడిచాడు.
వెంటనే కూలీ కెవ్వున కేక పెట్టాడు. తక్షణం చేతులని తన మొహం దగ్గరికి తీసుకెళ్లాడు.
మార్టిన్ గట్టిగా ఊపిరి పీల్చి వదిలి కుర్చీలోంచి లేచాడు. పారిపోవడానికి చుట్టూ చూశాడు కాని ఆ గదిలోంచి దారి బయటికి కనపడలేదు. తామిద్దరం అందులో బందీలమని మరోసారి గ్రహించాడు.
కూలీ మళ్లీ మార్టిన్ మీదకి దూకాడు. రక్తం అలుముకున్న అతని మొహం భయంకరంగా కనిపించింది. మార్టిన్ అరుస్తూ, ఏడుస్తూ అతన్నించి దూరంగా పరిగెత్తాడు. మార్టిన్‌కి బిలియర్డ్స్ స్టిక్ కనిపించింది. దాన్ని అందుకుని కూలీ వైపు విసిరాడు. అది వెళ్లి సరిగ్గా తెరచిన అతని నోట్లోంచి కూలీ గొంతులోకి దిగింది. కూలీ పెద్దగా అరుస్తూ ముందుకి తూలాడు. దాంతో ఆ కర్ర నేలని తాకి అతని గొంతులోంచి తల్లోకి దిగింది. కొద్దిసేపు అతను గట్టిగా మూలుగుతూ కాళ్లు చేతులు కొట్టుకుంటూంటే మార్టిన్ భయంగా అతనికి దూరంగా గెంతాడు. తర్వాత ఆ కదలికలన్నీ ఆగిపోయాయి.
మార్టిన్ అలసటగా ఓ బిలియర్డ్స్ టేబిల్ మీదకి వాలిపోయాడు. అతనిలోని ఆందోళన తగ్గి శ్వాస మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పట్టింది.
* * *
కూలీ మరణించి మూడు రోజులైంది. ఐనా రక్షించే డైవర్స్ రాలేదు. వారు ఏ క్షణంలోనైనా రావచ్చు అనుకున్నాడు. ఆ గదిలోని గాలి నీచు వాసన వేస్తోంది. మార్టిన్ తనలో తను అస్పష్టంగా మాట్లాడుకోసాగాడు. అప్పుడప్పుడు బిలియర్డ్స్ బంతిని చేతిలోకి తీసుకుని కిటికీ అద్దం వంక కోరికగా చూడసాగాడు. అతనిలో చావాలనే కోరిక పెరగసాగింది. అది పిచ్చి అని, తననా ఉన్మాదం ఆక్రమించుకోకుండా చూడాలని అనుకోసాగాడు.
ఆకలి మళ్లీ తిరిగి వచ్చింది. కుళ్లినా సరే, పచ్చి మాంసం రుచిగా ఉంటుంది అనిపించసాగింది.

డొనాల్డ్ ఈ వెస్ట్‌లేక్ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి