క్రైమ్ కథ

విలన్స్, స్కౌన్‌డల్స్ అండ్ రాస్కెల్స్ ......... మిలియన్‌లో పదో భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్టర్ టైపిస్ట్‌లు కూర్చునే గదిలోకి అద్దంలోంచి చూశాడు. అతని పక్కనే ఆఫీస్ మేనేజర్ గేట్స్ నిలబడి ఉన్నాడు.
టైపిస్ట్‌లలో అందరికన్నా అందమైన పౌలా కనుకొలకుల్లోంచి వాల్టర్‌ని గమనించింది. న్యూయార్క్‌లోని పెద్ద టెక్స్‌టైల్ కంపెనీ ప్రెసిడెంట్ అయిన వాల్టర్ ఆ అమ్మాయిలందర్నీ చూశాక మూడో అంతస్థులోని తన గదిలోకి వెళ్లిపోయాడు. వెంటనే టైప్ చేసే చప్పుళ్లు ఆగిపోయాయి. వాల్టర్ తమలో ఎవర్ని తన ప్రైవేట్ సెక్రటరీగా ఎంపిక చేసుకుంటాడా అని వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకోసాగారు. అందువల్ల మొదటగా వారానికి మూడు వందల ఏభై డాలర్ల జీతం పెరుగుతుంది. టైపింగ్ పూల్‌లో ఉన్నంత పని కూడా ఉండదు. ప్రత్యేకంగా ఓ ఆఫీస్ గది కూడా ఉంటుంది.
నలభైల్లో ఉన్న వాల్టర్‌కి నచ్చితే కాని తన ప్రైవేట్ సెక్రటరీగా తీసుకోడు. అతను మనసు పడితే ఎంతిస్తాడో లెక్కే ఉండదు. అప్పటికే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకుల అనుభవం గల అతను అందమైన ఆడపిల్లల పట్ల ఆసక్తిని కోల్పోలేదు.
ఆ సాయంత్రం టైపింగ్ పూల్‌లోని ముగ్గురు అమ్మాయిలని వాల్టర్ ఒకరి తర్వాత మరొకర్ని ఇంట్రవ్యూకి పిలిచాడు. ఆ ముగ్గురు అమ్మాయిలు మిస్ అమెరికా ఫైనల్స్‌లో పాల్గొన్నట్లుగా సంతోషపడ్డారు. వారిలో పౌలాకి మాత్రమే పెళ్లయింది. ఇరవై ఆరేళ్ల ఆమె వారిలో అందగత్తె.
‘పౌలా డియర్! నీకు వ్యతిరేకంగా ఒకటే ఉంది’ వాల్టర్ చెప్పాడు.
‘ఏమిటది?’ అడిగింది.
‘నువ్వు మీ ఆయన్ని ప్రేమిస్తున్నావా?’
ఆమె కిటికీలోంచి చూస్తే నలభై రెండు అంతస్థుల కింద మన్‌హేటన్ రోడ్లు కనిపించాయి.
‘అవును. లేకపోతే విడిపోయేవాళ్లం కదా?’ పౌలా చిలిపిగా నవ్వుతూ చెప్పింది.
పౌలా ఏదైనా అర్థం చేసుకుని ఉంటే అది మగాళ్ల గురించే.
‘రేపు ఉదయం నాకు రిపోర్ట్ చేయి. మేనేజర్ గేట్స్‌తో నా నిర్ణయం చెప్తాను’ అతను చెప్పాడు.
* * *
మెయిల్ ఆర్డర్ వ్యాపారంలో వస్తువులని పంపే గుమాస్తాగా పనిచేసే లేరి తెచ్చే జీతాన్ని టేక్స్‌లు, అధిక ఖర్చులు ఒక్క గుక్కతో మింగేస్తాయి. పౌలా జీతంతో వారి అవసరాలు బొటాబొటీగా తీరుతున్నాయి. ఇద్దరూ ఆదా చేసే సొమ్మని ఇల్లు కొనడానికి డౌన్ పేమెంట్ కోసం దాస్తున్నారు. ముప్పై రెండేళ్ల లేరి మృదుస్వభావి. అప్పుడప్పుడు అందగతె్తైన పౌలా విషయంలో అసూయ కలిగినప్పుడు మాత్రం పోట్లాడతాడు.
‘వారానికి మూడు వందల ఏభై డాలర్లు ఎక్కువ వస్తూంటే చేదా? ఆ లెక్కన మనం వచ్చే జనవరికే ఇంటికి డౌన్ పేమెంట్‌ని చెల్లించచ్చు’ ఆనందంగా చెప్పాడు.
తర్వాత అనుమానంగా అడిగాడు.
‘కాని నీకీ ఉద్యోగం ఎలా వచ్చింది? నీ పేరు లాటరీలో తీశారా?’
‘కాదు. వాల్టర్ కొందర్ని ఇంటర్వ్యూ చేశాక నన్ను తీసుకున్నాడు’
‘నిన్ను చూశాక వాల్టర్ లెటర్స్‌ని నువ్వు టైప్ చేయకపోయినా చేత్తో రాసి పంపడానికి ఇష్టపడి ఉంటాడు’ లేరి అసూయగా అరిచాడు.
పౌలా బదులుగా నవ్వి చెప్పింది.
‘వాల్టర్ డబ్బులో మునిగి తేల్తూంటాడు. ఐనా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు’
‘అతని దగ్గర ఎంత డబ్బుంది?’ అకస్మాత్తుగా లేరి మూడ్ మారి ప్రశ్నించాడు.
‘కోట్లు’
‘అంత త్వరగా నలభైయ్యవ ఏటికే వాల్టర్ అంత పెద్ద టెక్స్‌టైల్ కంపెనీకి యజమాని ఎలా అయ్యాడు? మేథావా?’
‘కాదు. వారసత్వం. అతని తాతయ్య ఆ కంపెనీని స్థాపించాడు. అతను బట్టలని విడిచినట్లుగా భార్యలని వదిలేస్తూంటాడు అని విన్నాను. వాల్టర్‌కి సేండ్స్ పాయింట్‌లో ఓ పెంట్‌హౌస్, ఫ్లారిడాలో సముద్రం ఒడ్డున ఓ ఇల్లు, ఓ పెద్ద మరపడవ ఉన్నాయి. ఏడాదికి ఓసారి లగ్జరీ క్రూజ్‌లో యూరప్‌కి వెళ్లొస్తూంటాడు’
‘అది ఇంకో గ్రహానికి చెందిన విషయం కాబట్టి నాకు తెలీదు. వాడు నీతో సరసాలాడితే చెప్పు. నా ఉత్త చేతులతో చంపేస్తాను’
పౌలా నవ్వుతూ భయాన్ని దాచుకుంది. లేరి మృదుస్వభావే అయినా ఈ ఒక్క విషయంలో అబద్ధం ఆడటం లేదని తెలుసు. ఓసారి వీధిలో ఎవరో ఆమెతో సరసాలాడారు, ఇతరులు విడిపించకపోతే అతన్ని లేరి చంపేసి ఉండేవాడు. తర్వాత చెప్పాడు. ‘నువ్వు నాకు విడాకులు ఇచ్చినా, ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నా, ముందు నిన్ను, తర్వాత అతన్ని వేటాడి చంపేస్తాను’
అతను అన్నంత పనీ చేస్తాడని పౌలాకి తెలుసు.
ఆమె మర్నాడు సెక్రటరీగా ఉద్యోగంలో చేరింది. మూడు నెలలకల్లా వాల్టర్ తనతో గాఢంగా ప్రేమలో పడ్డాడని తెలిసినా పౌలా తెలియనట్లే నటించింది. ఓ రోజు డిక్టేషన్ అయ్యాక అతనితో చెప్పింది.
‘మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే అది రుజువు చేసుకునే పని ఏదైనా చేయండి. ఉదాహరణకి లేరీకి వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగం ఇవ్వండి’
‘నీ మీద నాకున్న ప్రేమలో లేరీ లేడు. నిజానికి మన భవిష్యత్‌లో లేరి ఉండడు’ వాల్టర్ చిరాగ్గా చెప్పాడు.
‘అయ్యో లేరి! అతనే్నం చేద్దాం?’ పౌలా ఎకసెక్కంగా అడిగింది.
‘నా మూడో భార్యని ఎలా వదిలించుకుంటున్నానో అలాగే వదిలించుకుందాం. విడాకుల ద్వారా మేం ఇద్దరం మిత్రులుగానే విడిపోతున్నాం’
పౌలా తన ఆశ్చర్యాన్ని దాచుకోకుండా అడిగింది.
‘ఇందులో నా ప్రమేయం లేదుగా?’
‘లేదు. నా మూడు పెళ్లిళూల గొప్ప పొరపాట్లు. ధనవంతుల పిల్లల్ని పెళ్లి చేసుకోవడం ఎంత పొరపాటో తెలిసొచ్చింది. నువ్వు నాకు పరిచయం అయే దాకా నాకు ప్రేమ అనేది ఓ మాట మాత్రమే తప్ప హృదయాన్ని తట్టే భావన కాదు. నువ్వు లేరీకి విడాకులు ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచించావా?’ వాల్టర్ అడిగాడు.
‘లేదు. ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలనుకున్నా ఇవ్వలేను’
‘ఎందుకని?’
‘అందుకు అతను ఒప్పుకోడు. పైగా నన్ను చంపాక నేను చేసుకోదలచుకున్న వ్యక్తిని వేటాడి చంపుతాడు’
‘నువ్వు జోక్ చేస్తున్నావు’
‘మీకు లేరి గురించి తెలీదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసూయ వదిలేస్తే అతను అన్ని విషయాల్లో మంచివాడు. తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఆ పని చేయక మానడు’
‘ఐతే ఇది సమసేయ అవుతుంది’
‘ఏం సమస్య అవుతుంది?’
‘తర్వాత చెప్తాను’
పౌలాకి అతను తర్వాత చెప్తానన్నది ఏమిటా అని ఆసక్తి కలిగింది. ఈ సంభాషణని ఆమె లేరీకి చెప్పలేదు. వాల్టర్ తనతో అక్రమ సంబంధం కోరితే ఉద్యోగం మానేయాలని అనుకుంది.
మూడు వారాలు గడిచాయి. ఈలోగా వాల్టర్ ఒక్కసారి కూడా ఆమెతో ప్రేమ ప్రసక్తి తీసుకురాకుండా, సెక్రటరీతో బాస్ ప్రవర్తించేలా ప్రవర్తించాడు. బహుశా అతను లేరి గురించి భయపడి ఉంటాడని పౌలా భావించింది.
ఓ ఉదయం వాల్టర్ ఆఫీస్‌కి రాలేదు. వ్యక్తిగత ఉత్తరాలు అర్జెంట్‌గా టైప్ చేసి పంపాలని, తను డ్రైవర్ని పంపితే పెంట్ హౌస్‌కి వస్తావా అని ఫోన్‌లో అడిగాడు. ఆమెకి భయంకన్నా ఉత్కంఠ అధికమైంది.
లిమజిన్‌లో అక్కడికి చేరుకుంది. ఓ ఇంగ్లీష్ బట్లర్ ఆమెని బ్రిటీష్ రాణిని ఆహ్వానించినంత మర్యాదగా ఆహ్వానించి ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఓ ఫ్రెంచ్ మెయిడ్ వెండి ట్రేలో టీ, బిస్కెట్లని ఆమె ముందు ఉంచి తలుపు వేసి వెళ్లిపోయింది. కొద్దిసేపటిలో వాల్టర్ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె వచ్చినందుకు థాంక్స్ చెప్పి, ఓ గంట దాకా చాలా ఉత్తరాలని డిక్టేట్ చేశాడు. అతని మనసులో ఏం ఉందో ఆమెకి అర్థం కాలేదు. తన మీద ఆసక్తి లేకపోతే ఈపాటికి తన పోస్ట్‌లో మరొకర్ని నియమించుకునేవాడు అని ఆమెకి తెలుసు. తన మీద ప్రేమ గురించి మాట్లాడనందుకు కొద్దిగా నిరాశ పడింది కూడా.
‘మరో మూడు నెలల దాకా ఈ పెంట్ హౌస్‌కి రాను. మళ్లీ వేసవిలోనే వస్తాను. దీన్ని చూడాలని ఉందా?’ అడిగాడు.
వాల్టర్ పెంట్ హౌస్ మొత్తం తిప్పి చూపించాడు. తన భర్త లేరి అన్నట్లుగా అది మరో గ్రహానికి చెందిన ప్రదేశంలా ఆమెకి తోచింది. అత్యంత ఖరీదైన అలంకరణలు. అత్యంత విలువైన అరేబియన్ కార్పెట్స్. ఒక్క లివింగ్ రూమే తన మొత్తం అపార్ట్‌మెంట్ విస్తీర్ణానికి రెట్టింపు ఉంది. నాలుగు పడక గదులు, ఐదు బాత్‌రూంలు, టెర్రెస్ గార్డెన్, సర్వెంట్ క్వార్టర్స్. ‘అద్భుతం’ అనుకుంది. తను తిరిగి వచ్చేదాకా దాని నిర్వహణ విషయంలో బట్లర్‌కి, పనిమనిషికి కొన్ని సూచనలు చేశాక అడిగాడు.
‘ఇంకొంత పని మిగిలి ఉంది. మా ఇంటికి వెళ్లి పూర్తి చేద్దామా?’
గంట తర్వాత ఇంటికి చేరుకున్నారు. ఆ ఇల్లు కూడా మరో గ్రహానికి చెందిందిగా అనిపించింది. గుర్రపు శాలలు, టెన్నిస్ కోర్ట్, పెద్ద స్విమ్మింగ్ పూల్. ఆ ఇల్లు పెంట్ హౌస్‌కి నాలుగు రెట్లుంది. ఫ్లోరిడాలోని చలికాలపు విడిది ఫొటోలు అనేకం కనిపించాయి.
‘నువ్వు చూసిన దాని మీద నీ అభిప్రాయం ఏమిటి?’ అడిగాడు.
‘నేను చూసిందంతా నాకు నచ్చింది’
‘నన్ను పెళ్లి చేసుకున్న వారు వీటిని అనుభవించచ్చు. మా విడాకుల పత్రాలు ఇవాళ అందాయి’
ఆమెని అతను చుంబిస్తే నిమిషం మించి నిరాకరించే ప్రయత్నం చేయలేదు. తనని అంత ఆస్థికి రాణిని చేస్తానన్నాడు కాబట్టి ఆ మాత్రం బహుమతి ఇవ్వడం సబబని అనుకుంది.
‘మన పెళ్లి సంగతి ఏం నిర్ణయించుకున్నావు?’ అడిగాడు.
‘వాల్టర్! మీరు లేరీని మర్చిపోయారా?’ అడిగింది.
‘లేదు. నా భార్యలా అతనికి కొంత డబ్బిచ్చి వదిలించుకోగలమా?’
‘సరైన ధర ఇచ్చి మీరు లేరీ నించి ఏదైనా కొనగలరు - ఒక్క నన్ను తప్ప. ఐనా నేను ఆలోచించుకోవాలి. ఈ నిమిషంలో జవాబు చెప్పలేను’
‘నీకు కావాల్సినంత సమయం తీసుకుని ఆలోచించి పౌలా డియర్. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ వీటన్నిటికీ దూరంగా గడుపుతావని మాత్రం గుర్తుంచుకో. లేరీ ఆర్థికంగా ఎప్పటికీ నా స్థాయిలో వందో వంతుకి కూడా ఎదగలేడు. నేను సగటు అమెరికన్ మహిళల కలల భర్తని. నన్ను నో అనడం మూర్ఖత్వమే అవుతుంది’
‘మీరు మేరేజ్ ప్రపోజ్ చేసి నన్ను పొగిడారు. నా వైవాహిక జీవితం ఆనందంగా సాగుతోంది. మీరు దయగల మనిషి. కానీ పెళ్లయ్యాక క్రూరంగా మారచ్చు. ఎందుకంటే మీరు నాకు పూర్తిగా తెలీదు. నేను ఖర్చు చేసుకోవడానికి నాకంటూ కొంత డబ్బుండాలి. నాకంటూ ఇంతదాకా ఖర్చుకి కొన్ని డాలర్లు మించి లేవు’
‘లేరీని మన మధ్య నించి చెరిపేసేందుకు నువ్వు సహాయం చేస్తే నీ ఎకౌంట్‌లో లక్ష డాలర్లు డిపాజిట్ చేస్తాను. కాని మన పెళ్లయిన రోజు తప్ప ముందు కాదు’
‘చెరిపేయడమంటే?’
‘ఓ మనిషి జంతువులా ప్రవర్తిస్తే అతనితో మనం కూడా జంతువులానే ప్రవర్తించాలి. అతను మనల్ని చంపబోయే ముందు ఆత్మరక్షణకి మనమే అతన్ని నాశనం చేయాలి’
పౌలా ఆ మాటలకి నివ్వెరపోయి అడిగింది.
‘ఏమిటి?’
‘అవును. మనం కరీబియన్‌కి క్రూజ్‌లో వెళ్దాం - లేరీతో సహా సుమా! నేను పెండింగ్ పనిని పూర్తి చేయడానికి నిన్ను వెంట రమ్మంటున్నానని, లేరీ కూడా వస్తేనే నిన్ను తీసుకెళ్తానని అతనితో చెప్పు. అందులో మనం పదమూడు రాత్రుళ్లు ప్రయాణిస్తాం. అర్ధరాత్రి లేరీకి ప్రమాదం జరుగుతుంది. తప్ప తాగి డెక్ మీంచి నీళ్లల్లోకి పడిపోతాడు. అందుకు నువ్వు సహాయం చేయాలి’
ఆమె మరోసారి ఆశ్చర్యపోయింది.
‘ఇది కూడా నేను వెంటనే జవాబు చెప్పేది కాదు’ చెప్పింది.
పౌలా నిర్ణయం తీసుకోవడానికి మూడు రోజులు పట్టింది. నాలుగో రోజు మధ్యాహ్నం అతని ఫ్లోర్ లోంచి ఎగ్జిక్యూటివ్స్ అంతా లంచ్‌కి వెళ్లాక వాల్టర్ గదిలో తలుపు మూసి పౌలాతో ఆ విషయం చర్చించాడు.
‘వచ్చే శనివారం ఉదయం ఆ క్రూజ్ షిప్ న్యూయార్క్ నించి బయలుదేరి ఎవర్ గ్లేడ్స్, జమైకా, ప్యూర్టోరికో, వర్జిన్ ఐలండ్స్‌లో ఆగుతుంది. ఆ దారిలో అర్ధరాత్రి ఎక్కడో ఓ చోట లేరీ తాగే ఆఖరి పెగ్‌లో పౌలా క్లోరల్ హైడ్రేట్‌ని కలిపి అతన్ని నీళ్లల్లోకి తోసేయాలి.
‘కొంత విచారణ సాగుతుంది. నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. అది సరదా
విషయం కాదు. నన్ను కూడా పిలవచ్చు. విచారణ ముగిసాక మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లయ్యాక మనల్ని అనుమానిస్తారు. కాని సాక్షి లేకుండా ఇంకేం చేయలేరు’
‘ఆ తర్వాత లక్ష డాలర్ల విషయంలో మనసు మార్చుకోరుగా?’ సందేహిస్తూ అడిగింది.
‘మార్చుకోను. లక్ష డాలర్లంటే మిలియన్‌లో పదో వంతు మాత్రమే. నాకు చాలా మిలయన్స్ ఉన్నాయి. ఇంత జరిగాక మాట తప్పను. ఇందుకు నువ్వు ఒప్పుకుంటే మన పెళ్లయ్యేదాకా నీ ఖర్చులకి ఐదు వేల డాలర్లు ఇస్తాను’ చెప్పాడు.
‘నా భర్తకి జీతం నష్టం మీదే సెలవు దొరుకుతుందిట. కాబట్టి అది ఇస్తారా అని కనుక్కోమన్నారు’ మర్నాడు పౌలా అడిగింది.
వాల్టర్ ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి అంగీకరించాడు. క్లోరల్ హైడ్రేట్ సీసాని వాల్టర్ ఆమెకి ఇచ్చాడు.
* * *
ఆ సెప్టెంబర్ ఉదయం గేంగ్ ప్లేంక్ మీంచి ఓడలోకి నడుస్తూంటే పౌలాకి కొద్దిగా వణుకు పుట్టింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పథకం అంతా సక్రమంగా జరుగుతుందా? పౌలాకి వాల్టర్ షేర్ల అమ్మకాలు, కొనుగోళ్ల ఉత్తరాలు ఓడలో డిక్టేట్ చేస్తూంటే లేరీకి విసుగేసి బయటకి వెళ్లిపోయేవాడు.
ఐదో రోజు వాల్టర్ పౌలాతో చెప్పాడు.
‘ఈ తెల్లవారుజామున మూడు దాకా సంగీత కచేరీ జరుగుతుంది. రాత్రి రెండింటికి పని పూర్తి చెయ్. అతను నీళ్లల్లో పడ్డ అరగంటకి కాని అతను పడిపోయాడని చెప్పకు. అందువల్ల ఓడ తొమ్మిది మైళ్ల దూరం ప్రయాణించడంతో వెదికినా అతను కనపడడు. నువ్వు అతన్ని మోయలేవు. కాబట్టి ఆఖరి పెగ్‌ని తాగాక ఇద్దరూ డెక్ రైలింగ్ దగ్గరికి వెళ్లాలి. సాక్షులు లేనప్పుడు నేను పై డెక్ మీంచి సైగ చేస్తాను’ వాల్టర్ రహస్యంగా చెప్పాడు.
‘నాకు భయంగా ఉంది’
‘్భయం అనవసరం. ఏం జరిగినా శాంతంగా ఉండి, సహజంగా ప్రవర్తించు. సరిగ్గా రాత్రి తొమ్మిదికి మెయిన్ డెక్‌లో కలుద్దాం’
ఆ రాత్రి తొమ్మిది నించి రెండు దాకా ఆమె ఎంతో ఆందోళనగా గడిపింది. లేరి భార్య ఇచ్చింది విధేయతతో తాగాక, ఒకటిన్నరకి పౌలా అతని చెయ్యి పట్టుకుని రైలింగ్ దగ్గరికి తీసుకెళ్లింది. పై డెక్ నించి వాల్టర్ సైగ చేయగానే తక్షణం లేరీని నీళ్లల్లోకి తోసేసింది. లేరి తప్ప తాగడం చూసిన సాక్షులు ఉండటంతో కెప్టెన్ సిబ్బంది పౌలా చెప్పింది నమ్మారు.
‘నువ్వు మంచి నటివి. దుఃఖాన్ని బాగా నటించావు. అంతా ఎంత తేలిగ్గా జరిగిపోయిందో’ వాల్టర్ ఆమెని రహస్యంగా అభినందించాడు.
* * *
పెళ్లికి ముందు పౌలా వార్డ్ రోబ్ నిండా ఖరీదైన దుస్తులు నిండాయి. తర్వాతి శుక్రవారం ఉదయం తొమ్మిదికి వారు రహస్యంగా సివిల్ మేరేజ్ చేసుకున్నారు. పదికి బేంక్‌కి వెళ్లి ఆమె అకౌంట్‌లో లక్ష డాలర్లు డిపాజిట్ చేశాడు.
‘ఈ డబ్బుతో నువ్వు ఉడాయిస్తే జరిగింది పోలీసులకి చెప్తాను’ హెచ్చరించాడు.
మధ్యాహ్నం ఒంటి గంటకి విమానంలో కేలిఫోర్నియాకి, అక్కడి నించి క్రూజ్‌లో హవాయ్‌కి హనీమూన్‌కి బయలుదేరాలి. ఆమెని పికప్ చేయడానికి వెళ్లిన వాల్టర్ డోర్ బెల్ నొక్కాడు.
తలుపు తెరిచిన లేరీని చూసి వాల్టర్‌కి దాదాపు హార్ట్ ఎటాక్ వచ్చినట్లయింది.
‘హలో వాల్టర్! ఆ మొహం ఏమిటి, సీ సిక్‌నెస్ వచ్చినట్లుగా?’ లేరీ నవ్వుతూ అడిగాడు.
‘లేరీ! నువ్వేనా?’ వణికే కంఠంతో అడిగాడు.
‘అవును. ఇంకా తడిగా ఉన్నాను. కాని బతికే ఉన్నాను’
‘ఇదెలా సంభవం?’ పౌలా వంక చూస్తూ గొణిగాడు.
‘ఇది చాలా తేలికైన పథకం. లేరీకి మన పథకం మొత్తం చెప్పాను. ఓడలోంచి బయటకి తోయగానే అతని శరీరానికి కట్టుకున్న వాటర్ ప్రూఫ్ సిగ్నల్ లైట్‌ని ఆన్ చేశాడు. ఓడని వెంబడించే మరపడవ అతన్ని రక్షించి కరీబియన్‌కి తీసుకెళ్లింది. అక్కడ నించి అతను విమానంలో మయామీకి వెళ్లిపోయాడు. ఇది ప్రమాదంతో కూడుకున్నది కాబట్టి అంతా సక్రమంగా జరుగుతుందా అని నేను భయపడ్డాను. కాని లక్ష డాలర్ల కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోవడం తప్పదని లేరి చెప్పాడు.’
లక్ష డాలర్లు మిలియన్‌లో పదోవంతే అయినా అది మా అవసరాలకి చక్కగా ఉపయోగిస్తుంది. వాల్టర్! మీకు ఎలా కృతజ్ఞతలని తెలియజేయాలో నాకు తెలీటంలేదు’ లేరీ నవ్వుతూ చెప్పాడు.
‘మీ ఇద్దరూ మోసగాళ్లు. మీ మీద పోలీసులకి ఫిర్యాదు చేస్తాను’ వాల్టర్ కోపంగా అరిచాడు.
‘అప్పుడు పోలీసులకి మీ హత్యా పథకం గురించి రికార్డ్ చేసింది ఇస్తాం’ లేరి చెప్పాడు.
‘కాని పౌలా ఇప్పుడు నా భార్య’ వాల్టర్ రోషంగా చెప్పాడు.
‘ఏ మాత్రం కాదు. నేను తిరిగి వచ్చాను. రేపు దినపత్రికలో మీరు నేను నీళ్లల్లో ఎలా పడ్డానో, చేపలు పట్టే ఓ పడవ నన్ను ఎలా కాపాడిందో చదువుతారు. ఆ అబద్ధాలకోరకి తగినంత ముట్టింది. నాకు అప్పు దొరికి ఇక్కడికి రావడానికి కొంత ఆలస్యం ఐంది’ లేరీ చెప్పాడు.
‘అప్పుడు మన పెళ్లి రద్దయి, నేను చట్టరీత్యా తిరిగి లేరీ భార్యనే అవుతాను. వాల్ట్! నేను ఇప్పుడు అదే క్రూజ్‌లో హానీమూన్‌కి వెళ్తున్నాను. కాని లేరీతో. నీ లిమజిన్ సిద్ధంగా ఉంది కదా? మమ్మల్ని రేవు దగ్గర దింపుతావా? లేక టేక్సీని పిలవమంటారా?’ పౌలా వాల్ట్‌ని అడిగింది.
‘వాల్ట్ మంచివాడు. ఈ క్రూజ్ టిక్కెట్లకి డబ్బిచ్చిన అతను మనకి లిఫ్ట్ ఇవ్వకుండా ఉంటాడా?’
లేరీ తనని ఏడిపించడానికి ఆ మాటలు అన్నాడని వాల్ట్ తేలిగ్గా గ్రహించాడు.

(రాబర్ట్ కోల్బీకి కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి