క్రైమ్ కథ

హిట్ అండ్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది అమెరికాలో ఓ చిన్న ఊళ్లోని బార్. అక్కడ పాటలు పాడే పాతికేళ్ల అందమైన జూలీ దగ్గరికి వచ్చిన ఓ యువకుడు చెప్పాడు.
‘నా పేరు ఫ్రేంక్. నా బాస్ గస్ నీతో కలిసి డ్రింక్ తీసుకోవాలని ముచ్చట పడుతున్నాడు’
‘మీ బాస్‌ని వెళ్లి చెరువులో దూకి చావమని చెప్పు’ ఆమె కోపంగా చెప్పింది.
ఆ బార్ యజమానురాలు జూలీ దగ్గరికి వెళ్లి బుజ్జగింపుగా చెప్పింది.
‘అతను మన బార్‌కి నీ కోసమే వస్తూంటాడు. చాలా ధనవంతుడు’
‘నన్ను పిలిచిన ఆ యువకుడు ఎవరు?’ ఆమె అడిగింది.
‘అతను కార్ మెకానిక్. ఆయన బాడీగార్డ్ కూడా’
ఒప్పుకున జూలీ అతని కేబిన్‌లోకి వెళ్లేసరికి మెకానిక్ ఫ్రేంక్, బాస్ గస్ టేబుల్ ముందు సిద్ధంగా కూర్చున్నారు.
‘ఫ్రేంక్. ఇందులో కాస్త బబుల్ వాటర్‌ని పోయి’ విస్కీని గ్లాసులో ఒంపుకుని గస్ కోరాడు.
ఫ్రేంక్ సోడా పోయడంతో, అదే బబుల్ వాటర్ అని జూలీ అర్థం చేసుకుంది.
‘నీ కారుకి ఆయిల్ లేదా టైర్ మార్చాలన్నా, ఇంకేదైనా సమస్య వచ్చినా మా షెడ్‌కి తెస్తే ఉచితంగా చేస్తాం’ గస్ చెప్పాడు.
‘కానీ నాకు కారు లేదు’ జూలీ చెప్పింది.
‘ఫ్రేంక్! విన్నావుగా? ఈమెకి మన షెడ్‌లోని ఓ పాత కారు ఇవ్వు. అందమైన ఆడవాళ్ల మీద పెట్టుబడి పెట్టడం నా హాబీ. నీ లాంటి అందమైన అమ్మాయిని ఏ క్షణంలోనైనా పెళ్లి చేసుకోడానికి నేను సిద్ధమే’ గస్ చెప్పాడు.
‘మీరు బాగా తాగి ఉన్నారు’ జూలీ నవ్వుతూ చెప్పింది.
వెయిటర్ బిల్ తెస్తే ఆయన భారీ టిప్ ఇవ్వడం జూలీ గమనించింది.
* * *
మర్నాడు ఉదయం జూలీ గస్ ఇంటికి వెళ్లి చెప్పింది.
‘మీరు ఇస్తానన్న కారు కోసం వచ్చాను’
గస్ ఆమెని పాడైన కార్లున్న చోటికి తీసుకెళ్లి ఓ కారుని చూపించి దాని ధర చెప్పాడు.
‘కార్ల శ్మశానంలోకి వచ్చినట్లుగా ఉంది. కానీ మీరు నాకు ఫ్రీగా ఇస్తానన్నారు’ జూలీ చెప్పింది.
‘అలా చెప్పానా?’ ఆలోచనగా అడిగాడు.
‘మీరు అందమైన ఆడవాళ్ల మీద పెట్టుబడి పెడతానని, నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటాను అన్నారు కూడా’
‘నాకు గుర్తు లేదు. ఐనా తాగిన వాడి మాట నమ్మకూడదు’ గస్ నవ్వాడు.
‘మీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా?’ అడిగింది.
‘్ఛస్తే లేదు’ గస్ పగలబడి నవ్వుతూ చెప్పాడు.
* * *
పెళ్లి చేసుకున్న వాళ్లిద్దరూ చర్చ్‌లోంచి అతని ఇంటికి చేరుకున్నారు. ఆమె అతని మెడ కింద ఉన్న మచ్చని చూస్తూంటే గస్ చెప్పాడు.
‘ఇది జూదం తాలూకు సావెనీర్. పోట్లాటలో తగిలింది. జూదం నాకిష్టం. నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా జూదంలో భాగమే’
‘మంచి మాటన్నారు. మిసెస్ హెర్బర్ట్ కారు సిద్ధమైంది. వచ్చి బిల్ వేయండి’ చెప్పి ఫ్రేంక్ వెళ్లిపోయాడు.
‘నన్ను తను అవమానించాడు’ జూలీ వెంటనే కోపంగా చెప్పింది.
‘అతను మంచివాడు. అతన్ని ద్వేషించకు’
‘ఐతే అతన్ని నోర్మూసుకుని తన పని చేసుకోమనండి. నేను మీ భార్యని’ జూలీ కోపంగా చెప్పింది.
గస్ ఆమె గడ్డాన్ని నిమిరి చెంప మీద చిన్నగా తట్టి వెళ్లిపోయాడు.
* * *
‘నేను ఉద్యోగం మానేస్తున్నాను’ గస్ ఆఫీస్ గదిలోకి వచ్చిన ఫ్రేంక్ చెప్పాడు.
‘దేనికి?’ గస్ అడిగాడు.
‘మీ ఆవిడ నన్ను మీ ఇంట్లోని పై గది భాగాన్ని ఖాళీ చేయమంది. ఇంతకాలం మీకు తోడు కోసం ఉన్నాను. మీకు ఇప్పుడో తోడు వచ్చిందిగా? మీరు ఇంకో మనిషిని చూసుకునే దాకా ఉంటాను’ ఫ్రేంక్ ముభావంగా చెప్పాడు.
‘వద్దు. ఇక్కడ నేను బాస్‌ని. నువ్వు ఎప్పుడు వెళ్లాలో చెప్పాల్సింది నేను’
ఆ రోజు పోస్ట్‌లో డాన్ క్వింటన్ జైలు ఫ్రమ్ అడ్రస్‌తో వచ్చిన ఓ కవర్ని చింపి చదివి తన భర్త దాన్ని కాల్చేయడం జూలీ గమనించింది.
* * *
ఆ రాత్రి గస్ బార్‌కి వెళ్లాడు. పై గదిలో రేడియోలోంచి పెద్దగా పాట వినిపిస్తూండటంతో జూలీ విసురుగా తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లి స్విచ్ ఆఫ్ చేసింది. ఫ్రేంక్ మళ్లీ ఆన్ చేయడంతో తలుపు దాకా వెళ్లిన ఆమె వెనక్కి తిరిగి వచ్చి మళ్లీ ఆఫ్ చేసింది. మరోసారి కూడా అలా జరిగాక అతని చెంప ఛెళ్లుమనిపించింది. తక్షణం ఫ్రేంక్ లేచి ఆమె నడుం చుట్టూ చేతిని వేసి, కదలకుండా పట్టుకుని గాఢంగా చుంబించాడు.
‘గస్ చూస్తే ఏమంటాడు?’ జూలీ విడిపించుకునే విఫల ప్రయత్నం చేసి అడిగింది.
‘ఐ లవ్ యూ జూలీ’ అతను చెప్పాడు.
‘అది రుజువు చేయి’ చెప్పి బయటికి వెళ్లిపోయింది.
ఆ రాత్రి గస్ తాగి ఆలస్యంగా వచ్చాడు.
‘గస్! నీకు ఓ విషయం చెప్పాలి’ జూలీ సందిగ్ధంగా చెప్పింది.
‘ఫ్రేంక్ గురించైతే చెప్పకు. ఎటూ కొద్ది రోజుల్లో వెళ్లిపోతున్నాడు. వాడిష్టం వచ్చినట్లు ప్రవర్తించనీ’ గస్ విసుగ్గా చెప్పాడు.
* * *
‘నిన్న రాత్రి నేను చెప్పింది నిజం. ఐ లవ్‌యూ’ మర్నాడు ఉదయం ఫ్రేంక్ కారు కడుగుతూ జూలీకి చెప్పాడు.
‘కానీ నాకు పెళ్లైంది’ జూలీ చెప్పింది.
ఇంట్లో ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తిన గస్ అవతలి వైపు నించి చెప్పింది విని కఠినంగా చెప్పాడు.
‘వద్దు నువ్విక్కడికి రావద్దు. అది నాకిష్టంలేదు’
‘మనం ఎటైనా వెళ్లిపోదాం’ ఫ్రేంక్ జూలీతో చెప్పాడు.
‘ఏమిటీ పిచ్చి?’ జూలీ అడిగింది.
‘అవును. నువ్వంటే నాకు పిచ్చే. నేను గస్‌తో మన విషయం చెప్పాలనుకుంటున్నాను. రేపు నిన్ను తీసుకుని వెళ్లిపోవాలని అనుకుంటున్నాను’ చెప్పి ఆమెని గాఢంగా చుంబించాడు.
‘వద్దు. నన్ను ఆలోచించుకోనివ్వు’
కిటికీలోంచి బయటికి చూసిన గస్‌కి కారుని తుడిచే ఫ్రేంక్ చేతి మీద తన చేతిని ఉంచిన జూలీ కనిపించింది. ఇద్దరూ ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. అతనికి ఏం జరుగుతోందో అర్థమైంది. ఇంట్లోకి వచ్చిన భార్యని అడిగాడు.
‘ఫ్రేంక్ ఏమిటి అంటున్నాడు?’
‘ఏం లేదు?’ చెప్పి జూలీ లోపలికి వెళ్లిపోయింది.
ఆమె కళ్లలోని బెదురుని గస్ గమనించాడు. బయటికి వెళ్లి ఫ్రాంక్‌తో చెప్పాడు.
‘రేపటినించి పనిలోకి ఇంకో మనిషి వస్తున్నాడు. నువ్వు ఇక వెళ్లచ్చు’
‘మీరు ఉండమన్నారుగా? దాంతో నా మనసు మార్చుకున్నాను. మీ దగ్గరే కొనసాగాలని అనుకుంటున్నాను’ ఫ్రేంక్ చెప్పాడు.
‘నేనూ నా మనసు మార్చుకున్నాను’ గస్ చెప్పాడు.
* * *
ఆ రాత్రి రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి. ఒకటి ఫ్రేంక్ పాడైపోయిన కార్ల స్మశానానికి వెళ్లి వాటిని పరిశీలించి ఓ కారుని రిపేర్ చేయడం. రెండోది గస్‌కి అతని లాయర్ నించి ఫోన్ రావడం.
‘ఇవాళే వస్తున్నానని ఫోన్ చేశాడు. నీకూ ఫోన్ వచ్చిందా?’ లాయర్ అడిగాడు.
‘రాలేదు. మా ఇంట్లోకి అనుమతించను’ గస్ కోపంగా చెప్పాడు.
‘సరే. మీ పాత ఇంటి తాళం చెవి ఇవ్వు. అతను మీ ఇంటికి రాకుండా చూస్తాను’ లాయర్ సూచించాడు.
‘సరే. కానీ ఆ ఇంట్లోంచి అతన్ని త్వరగా బయటికి పంపే ఏర్పాటు కూడా నువ్వే చేయాలి’ గస్ చెప్పాడు.
‘ఏమిటి?’ ఆ సంభాషణ విన్న జూలీ అడిగింది.
‘నీకు అర్థంకాదు. వ్యాపారానికి సంబంధించినది. నువ్వు, ఫ్రేంక్ ఈ మధ్య బాగా ఫ్రెండ్లీగా ఉన్నట్లున్నారు?’ ప్రశ్నించాడు.
ఆమె బదులు చెప్పలేదు.
‘కాఫీ కావాలా?’ అడిగింది.
‘వద్దు. కడుపు బరువెక్కింది’ గస్ రెండు చేతులతో పొట్ట మీద కొట్టుకుంటూ చెప్పాడు.
తర్వాత టేబుల్ మీద రాలిన బ్రెడ్ ముక్కలని చేతిలోకి తుడిచి తీసుకెళ్లి ఫిష్ బౌల్‌లో వేశాడు. ఆ తర్వాత కోటు తొడుక్కుని బయటికి బయలుదేరాడు. అతను వెళ్లిన ఐదు నిమిషాలకి ఫ్రేంక్ లోపలికి వచ్చి చెప్పాడు.
‘నాతో రా. నీకో సర్‌ప్రైజ్’ ఆమెని గాఢంగా చుంబించి రిపేర్ చేసిన కారు దగ్గరికి తీసుకెళ్లాడు.
ఇద్దరూ కారెక్కాక ఫ్రేంక్ సరాసరి కారుని పాత ఇంటికి పోనిస్తూ చెప్పాడు.
‘అప్పుడప్పుడూ గస్ పాతింటికి వెళ్లి చూసొస్తూంటాడు’
‘ఎక్కడికి? ఎందుకు? ఏమిటిది?’ జూలీ అయోమయంగా అడిగింది.
‘ఇవాళ గస్‌తో తేల్చేసుకోవాలి’
కారుని ఇంటి బయట ఆపి హెడ్ లైట్స్ ఆఫ్ చేశాడు.
‘ఎందుకిక్కడ ఆపావు? నేను వెళ్తాను’ దిగబోతున్న జూలీని బలవంతంగా కూర్చోబెట్టాడు.
కొద్దిసేపటికి తలుపు తెరుచుకుని ఇంట్లోంచి బయటికి వచ్చిన గస్ మీదకి కారుని పోనించాడు. గస్ గట్టిగా అరుస్తూ కారు కింద పడ్డాడు. ఫ్రేంక్ ఆ కారుని మళ్లీ ఇంటికి తెచ్చాడు.
‘ఆ కారులో నువ్వు కూడా వున్నావు. నాతోపాటు నీకూ శిక్ష పడుతుంది’ జూలీని హెచ్చరించాడు.
కారు దిగి జూలీ బాధగా లోపలికి వెళ్లిపోయింది. రిపేర్ చేసిన కారుని మళ్లీ వైర్లన్నీ తెంపి యథాస్థితికి తీసుకువచ్చాడు.
‘మనిద్దరం ఇందులో భాగస్వాములం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకే శిక్ష పడుతుందో నీకూ అదే శిక్ష పడుతుంది. నీ కోసమే ఇదంతా చేశాను. సాక్షులు లేరు. మనకేం కాదు. ఇంక భవిష్యత్తు మనదే. ఐ లవ్ యూ’ ఫ్రేంక్ ఆమె దగ్గరికి వెళ్లి సముదాయించాడు.
అరగంట తర్వాత షెరీఫ్ వచ్చి చెప్పాడు.
‘ఓ ఘోరం జరిగింది. కారు ఏక్సిడెంట్‌లో మీ భర్త మరణించాడు. హిట్ అండ్ రన్. డ్రైవర్ ఎవరో తెలీదు’
* * *
మర్నాడు గస్ శవపేటికని స్మశానంలో పాతిపెడుతూంటే, జూలీ ఏడుస్తూనే ఉంది. ఓ సమాధి రాతి పక్కన నిలబడ్డ తన భర్త చెట్లలోకి నడిచి వెళ్లడం చూసిన జూలీ ఫ్రేంక్‌తో రహస్యంగా చెప్పింది.
‘గస్ నాకు అక్కడ కనపడ్డాడు’
‘మీ భర్తకి ఊళ్లో శత్రువులు ఉన్నారా? హైవే పెట్రోల్ కార్ ఆ సమయంలో మన ఊరికి వచ్చే దారిలో ఉంది. బయట నించి ఊళ్లోకి ఎవరూ రాలేదు. ఎవరూ బయటకి వెళ్లలేదు. ఆయన మరణిస్తే ఎవరికి లాభం?’ షెరీఫ్ జూలీని ప్రశ్నించాడు.
‘తెలీదు’ జూలీ చెప్పింది.
‘అది హత్యయినా ఆశ్చర్యం కాదు. ఫ్రేంక్! నిన్న రాత్రి ఆ సమయంలో నువ్వెక్కడ ఉన్నావు?’ అడిగాడు.
‘గస్ ఇంట్లో. పైన నా గదిలో రేడియో వింటున్నాను. కింద నించి నాకు జూలీ టీవీ చూసే శబ్దం కూడా వినిపించింది’
షెరీఫ్ వెళ్లిపోయాడు.
ఆ రాత్రి జూలీ కిటికీలోంచి బయటికి చూసి కెవ్వున కేకేసింది.
‘ఏమిటి? ఏమైంది?’ ఫ్రేంక్ పరిగెత్తుకొచ్చి అడిగాడు.
‘నాకు బయట గస్ కనిపించాడు’ ఏడుస్తూ చెప్పింది.
‘నువ్వు మానసికంగా డిస్ట్రబ్ అయ్యావు. అంతే’ ఫ్రేంక్ ఆమెని ఓదార్చాడు.
* * *
మర్నాడు ఉదయం గస్ లాయర్ నించి తన ఆఫీస్‌కి రమ్మని జూలీకి ఫోన్ వచ్చింది. ఇద్దరూ వెళ్లారు.
‘గస్ తమ్ముడు రాబిన్ కూడా వచ్చాడు’ విల్లు కవర్ని ఇచ్చిన సెక్రటరీ చెప్పింది.
ఆ మాటలు వినగానే జూలీ, ఫ్రాంక్ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు.
‘జూలీ. నీ భర్త మరణానికి కొద్ది గంటల ముందే జైలు నించి విడుదలైన ఆయన తమ్ముడు హత్యానేరంతో ఏడేళ్లు శిక్షని అనుభవించి ఇక్కడికి వచ్చాడు. మీకు అతన్ని పరిచయం చేస్తాను’ లేచి వెళ్లి తలుపు తెరిచి చెప్పాడు.
లోపలికి వచ్చిన రాబిన్‌కి జూలీని పరిచయం చేశాడు.
‘ఈమె మీ వదిన. ఇతను ఫ్రేంక్. మీ అన్నయ్య కుడిభుజం’
అచ్చుగుద్దినట్లు గస్‌లా ఉన్న డేవిడ్ తన వంక తెల్లబోతూ చూసే జూలీ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశాడు. ఫ్రేంక్‌తో కూడా కరచాలనం చేసి డేవిడ్ కూర్చున్నాక లాయర్ విల్లు కవర్ చింపి చదివాడు.
‘కాలిఫోర్నియాలో నివసించే నేను గస్‌ని, పరిశుద్ధమైన బుద్ధితో ఎలాంటి వత్తిళ్లు లేకుండా రాసే ఆఖరి విల్లు. నా షేర్లు, బేంక్ బాలెన్స్, వ్యాపారం మొదలైనవన్నీ నా భార్యకి ఇస్తున్నాను. అన్నిటిలో సగం డాన్ క్వింటన్ జైల్లో శిక్ష అనుభవించే నా సోదరుడైన రాబిన్‌కి ఇస్తున్నాను...’
* * *
‘నిన్న రాత్రి మీరు కిటికీలోంచి కనపడ్డారు’ జూలీ ఇంట్లోకి వెళ్తూ రాబిన్‌తో చెప్పింది.
‘అవును. మీరు నన్ను చూసి భయపడి అరవడం విన్నాను. నన్ను పాతింట్లో ఉండమన్నాడు. ఈ ఇంట్లో నాకూ సగభాగం ఉంది. కాబట్టి నేనూ నీతోనే ఉంటాను’ చెప్పి కారులోంచి సూట్‌కేస్ తీసుకురావడానికి వెళ్ళాడు.
‘నేను గస్‌ని చూసానంటే నువ్వు నమ్మలేదు. అదే మొహం, అదే కంఠం, అవే కళ్లు, నవ్వు కూడా అదే. రాబిన్ మా వారి దెయ్యంలా ఉన్నాడు’ జూలీ చెప్పింది.
అరగంట తర్వాత తన గదిలో కూర్చుని ఉత్తరం రాస్తున్న జూలీ అలికిడి విని తలెత్తి చూస్తే ఎదురుగా రాబిన్. ఉలిక్కిపడి చెప్పింది.
‘మీరు నన్ను భయపెట్టారు’
‘మీకు, ఫ్రేంక్‌కి ఉన్న సంబంధం గురించి మా అన్నయ్యకి తెలుసా?’ ఎదురుగా కూర్చుంటూ రాబిన్ అడిగాడు.
‘ఏమిటి మీరనేది?’ జూలీ నివ్వెరపోయింది.
‘నేను గుడ్డివాడ్ని కాదు. నాకు సగం ఆస్తి ఇచ్చినంత మాత్రాన ఆయన మంచివాడని నేను చెప్పను. నేను ఆ హత్యకేసులో ఇరుక్కున్నప్పుడు నాకు సెంట్ కూడా సహాయం చేయలేదు. నేను కూడా అతన్ని చంపడానికి వెనుకాడేవాడిని కాదు. కాబట్టి మీరు నిజం చెప్పడానికి భయపడకండి’
‘కూడా అంటే? అతను చంపబడ్డాడని మీరు అనుకుంటున్నారా?’ జూలీ అడిగింది.
‘అంతా చూశాను. అతను పాత ఇంట్లోంచి బయటికి రాగానే ఓ కారు వచ్చి అతన్ని ఢీకొనడం కిటికీలోంచి చూశాను. ఆ కారులో ఉన్న ఆడ మగని కూడా చూశాను.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఉత్తరాన్ని పూర్తి చేయండి’ రాబిన్ నవ్వుతూ లేచి ఆమె గడ్డం కింద నిమిరి చెప్పాడు.
* * *
రాబిన్ ఫ్రేంక్‌తో చెప్పాడు.
‘మా అన్నయ్యని ఎలా చంపారో తెలిసింది. అది తెలివైన ఆలోచన’
‘ఎలా?’
‘పాడైపోయిన ఓ కారులో ఇతర కార్లలోని భాగాలని వేసి బాగుచేసి, చంపాక మళ్లీ ఎప్పటిలా అన్నీ విడదీస్తే సాక్ష్యం ఉండదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. గస్ చావాలని ఎవరు కోరుకుంటారు? నా తర్వాత నా అన్న మరణించాలని కోరుకునేది మా వదినే. ఏమంటావు?’
‘మీరు నింద వేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి’ ఫ్రేంక్ చెప్పాడు.
‘నన్ను నమ్మవా? మా వదిన ప్రేమికుడు మెకానిక్’ రాబిన్ నవ్వుతూ చెప్పాడు.
‘మీరో వింత మనిషి’
‘జైల్లో నన్నంతా జోకర్ అనేవాళ్లు. బ్రేక్‌ఫాస్ట్‌కి టైం అయింది’ పగలబడి నవ్వుతూ లోపలకి వెళ్లాడు.
రాబిన్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని బ్రెడ్ తినసాగాడు. తర్వాత జూలీతో చెప్పాడు.
‘కాఫీ వద్దు. నా కడుపు బరువెక్కింది’ రెండు చేతులతో పొట్ట మీద కొట్టుకున్నాడు.
‘మీ గురించి ఎవరికీ చెప్పను. ఆ పని ఎవరు చేశారో వారికి నేను కృతజ్ఞుణ్ని. లేదా రోడ్డు మీద పడేవాడ్ని. ఇక్కడ ఉండడానికి ఇల్లు, ఖర్చు చేయడానికి డబ్బు ఉంది’ చెప్పి టేబిల్ మీద పడ్డ బ్రెడ్ ముక్కల్ని అరచేతిలోకి తసీకుని పిష్ టేంక్‌లో వేసి బయటికి వెళ్లిపోయాడు.
‘ఇతను రాబిన్ కాదు. గస్. అర్థంకాలేదా? నువ్వు చంపింది గస్ సోదరుడ్ని. ఎలా తెలుసు అని అడక్కు నాకు తెలుసు. నేను గస్‌ని గుర్తించగలను’ జూలీ ఆందోళనగా చెప్పింది.
‘అదే నిజమైతే అతను మనంతట మనం బయటపడాలని చూస్తున్నాడు. జాగ్రత్త. సాక్ష్యం లేకుండా, మనం ఒప్పుకోకుండా ఏదీ బయటికి రాదు’ ఫ్రేంక్ చెప్పాడు.
‘బై కార్బొనేట్ సోడా మీ దగ్గర ఉందా?’ మళ్లీ ఆ గదిలోకి వచ్చిన రాబిన్ అడిగాడు.
‘బబుల్ వాటర్ కావాలా?’ ఫ్రేంక్ వెంటనే అడిగాడు.
‘అంటే?’ రాబిన్ అర్థం కానట్లుగా అడిగాడు.
‘సోడా. దాంట్లో కాస్త బ్రాందీ కూడా వేసుకుని తాగితే, కడుపు తేలికవుతుంది’
‘వద్దు. ఆల్కహాల్ తాగితే నాకు పొట్టల్లో తిమిర్లు వస్తాయి. మా అన్న నాకన్నా గొప్ప నేరాలు చేశాడు. కానీ ఏవీ బయటపడలేదు. ఏడు సుదీర్ఘ సంవత్సరాలు నాకు ఉత్తరాలు రాయలేదు. నన్ను వచ్చి చూడలేదు. అందుకే అతనంటే నాకు ద్వేషం. అతన్ని చంపాలనుకుని వచ్చాను. కానీ ఆ పని ఎవరో చేసేశారు’ చెప్పి రాబిన్ వెళ్లిపోయాడు.
* * *
‘మీరు, గస్ ఒకరినొకరు చూసుకుని ఎంతకాలమైంది?’ ఆ రాత్రి భోజనాల దగ్గర ఫ్రేంక్ అడిగాడు.
‘పనె్నండేళ్ల క్రితం. ఆ తర్వాత అతని పాత ఇంట్లో హత్య జరిగిన రాత్రి. అతన్ని చూస్తే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది. తర్వాత ఇద్దరం పక్కపక్కన నిలబడి అద్దంలో చూసుకున్నాం. తన బట్టలు నాకు తొడిగి ఎవరైనా తేడా తెలుసుకుంటారేమో చూడమని నన్ను బయటికి పంపించాడు. కానీ మనసు మార్చుకుని మళ్లీ తనే బయటికి వచ్చాడు. ఓ కారు అతన్ని గుద్ది చంపడం కిటికీలోంచి చూశాను. డ్రైవింగ్ సీట్‌లో ఓ ఆడది కూర్చుని ఉండడం స్పష్టంగా చూశాను’ రాబిన్ చెప్పాడు.
‘అది అబద్ధం’ జూలీ వెంటనే అరిచింది.
‘అతను చెప్పేది చెప్పనివ్వు’ ఫ్రేంక్ కోప్పడ్డాడు.
‘నిజమే. అది అబద్ధం. మీనించి నిజాన్ని రాబట్టడానికి నేనీ అబద్ధం ఆడాల్సి వచ్చింది. డ్రైవ్ చేసింది జూలీ కాదు, నువ్వే’ రాబిన్ పకపక నవ్వి చెప్పాడు.
రాబిన్ బయటికి వెళ్లగానే జూలీ కోపంగా చెప్పింది.
‘కారు డ్రైవ్ చేసింది నేను కాదు. నువ్వే’
‘ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. మనిద్దరం ఇరుక్కుంటాం. ఇంతకాలం ఆ విషయం దాచడం నేరం. కాబట్టి నీకూ నాతో సమానమైన శిక్ష పడుతుంది’
‘ష్! గట్టిగా అరవకండి. ఎవరైనా వింటారు’ రాబిన్ లోపలికి వచ్చి చెప్పాడు.
‘నీ ధరెంత? నువ్వేం కోరుతున్నావ్?’ ఫ్రేంక్ అడిగాడు.
‘జూలీ. నా మొహం, నా అన్న మొహం ఒక్కటే. నాకు ఆమె కావాలి’
‘మీరు గస్ కదా?’ జూలీ ప్రశ్నించింది.
‘అది ఎలా తెలుసుకోగలరు?’ పకపక నవ్వి రాబిన్ అడిగాడు.
‘కోటు విప్పు’
‘నా భుజాలు చూస్తే తెలుసుకోగలవా?’
షర్ట్, టై విప్పించాక జూలీకి అతని మెడ కింద మచ్చ కనపడింది.
షెరీఫ్ లోపలికి వచ్చాడు. ఓ మూల ఉన్న చిన్న టేప్ రికార్డర్‌ని ఆఫ్ చేశాడు. తక్షణం ఫ్రేంక్ బయటికి పరిగెత్తాడు. కాని బయట ఉన్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
‘పద జూలీ వెళ్దాం’ షెరీఫ్ కోరాడు.
‘అందమైన ఆడదాని మీద ఇంకాస్త పెట్టుబడి పెడదామనుకుంటున్నాను. నీకో మంచి లాయర్ని నియమించి తక్కువ శిక్ష పడేలా చూస్తాను’ గస్ పకపక నవ్వసాగాడు.
*

(హెర్బర్ట్ ఓ ఫిలిప్స్ కథకి స్వేచ్ఛానువాదం)

-- మల్లాది వెంకట కృష్ణమూర్తి