ఫ్లాష్ బ్యాక్ @ 50

మాంగల్య బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నపూర్ణా సంస్థ మూడో చిత్ర నిర్మాణాన్ని తలపెట్టి కథ కోసం సాగించే అనే్వషణలో -బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి నవల ఆధారంగా రూపొందించిన బెంగాలీ సినిమా ‘అగ్నిపరీక్ష’ విన్నారు. ఉత్తమకుమార్, సుస్మితాసేన్ జంటగా నటించిన ఆ చిత్రాన్ని మద్రాసులో వీక్షించారు. అప్పట్లో ఇది యాంటీ సెంటిమెంట్ కథగా అభిప్రాయపడుతూ, తెలుగులో చిత్రం విజయం సాధించక పోవచ్చన్న అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. కానీ నిర్మాత మధుసూధనరావుకి కథ నచ్చింది. బెంగాలీ చిత్రం సక్సెస్ అయ్యింది కనుక, తెలుగులోనూ ఢోకా ఉండదనే ధైర్యంతో బెంగాలీ చిత్రం రీమేక్ హక్కులు కొన్నారు. తెలుగులో ‘మాంగల్యబలం’, తమిళంలో ‘మంజిల్ మహిమై’గా పేర్లు నిర్ణయించి రూపొందించాలని సంకల్పించారు. ఈ చిత్రంలో కొన్ని అవుట్‌డోర్ దృశ్యాల్ని ఊటీలో షూటింగ్ జరిపారు. అందుకే ఊటీలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా మాంగల్యబలం నిలిచింది. మండు వేసవిలో ఊటీలో షూటింగ్ ప్లాన్ చేసి కొంత వర్క్ చేశారు. ఆకస్మికంగా వర్షాలు పడటంతో, మిగిలిన సన్నివేశాలను కొన్ని తిరుపతిలో, కొన్ని వాహినీ స్టూడియోలో సెట్స్‌వేసి పూర్తి చేశారు.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నాటికి మహానటి సావిత్రి గర్భవతి అని తెలిసింది. ఆమెను ఇబ్బంది పెట్టకూడదన్న సంకల్పంతో దర్శకుడు చిత్రాన్ని త్వరగా ముగించారు. 1959 జనవరి 7న విడుదలైన మాంగల్యబలం సినిమా త్వరలో 61ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. అదే నెలలో 14న తమిళ చిత్రం విడుదలైంది.
కథ: ఆశాపూర్ణాదేవి, మాటలు: ఆచార్య ఆత్రేయ, సంగీతం: మాస్టర్ వేణు, ఎడిటింగ్: ఎ సంజీవి, ఛాయాగ్రహణం: సెల్వరాజ్, నృత్యం: ఎకె చోప్రా, కళ: ఎస్ కృష్ణారావు, జివి సుబ్బారావు, దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు, నిర్మాత: డి మధుసూధనరావు.
రావుసాహెబ్ పాపారావు (యస్వీ రంగారావు) భార్య కాంతమ్మ (సూర్యకాంతం). ఆమెకు కూతురు సరోజ, కొడుకు సూర్యం. పాపారావు తల్లి పార్వతమ్మ (కన్నాంబ), చెల్లెలు సీత (జి వరలక్ష్మి), బావ రామయ్య (జూ. ఏవి సుబ్బారావు). సీతకు అనారోగ్యంగా ఉందని తెలిసి, ఆమె ఉంటున్న పల్లెటూరికి తల్లిని పంపుతాడు పాపారావు. ఆమెకు తోడుగా సరోజ, సూర్యం వెళ్తారు. అవసాన దశలోవున్న కూతురి కోరికమేరకు సరోజ (బేబీ శశికళ), సీత కొడుకు చంద్రశేఖర్ (మాస్టర్ బాబ్జీ)లకు పార్వతమ్మ వివాహం జరిపిస్తుంది. దీనికి ఆగ్రహించిన కాంతమ్మ -కోర్టుద్వారా బాల్య వివాహాన్ని రద్దు చేయిస్తుంది. పార్వతమ్మ పల్లెటూరిలోనే ఉండి చంద్రాన్ని, అల్లుడు రామయ్యను కనిపెట్టుకుని ఉంటుంది. సరోజకు యుక్తవయసు వస్తుంది. ఆమెకు చిన్నప్పటి పెళ్లి గుర్తుండదు. పెద్దవాడైన చంద్రం పట్నంలో చదువుతుంటాడు. నాయనమ్మ కోరికమేరకు తన భార్య సరోజను కలుసుకుంటాడు. శేఖర్‌గా ఆమె కుటుంబానికి దగ్గరై సరోజ ప్రేమ పొందుతాడు. కాని పాపారావు దంపతులు -డబ్బుగల శేఖర్ మిత్రుడు కైలాసం (రేలంగి)కు సరోజను ఇచ్చి వివాహం జరిపించాలని అనుకుంటారు. మీనాక్షికి (రాజసులోచన) ఇష్టంలేని పెళ్లి చేస్తున్న మేనమామ నుంచి కాపాడిన కైలాసం -ఆమె ప్రేమను సాధిస్తాడు. శేఖర్ -సరోజల చనువు చూసిన అన్న సూర్యం -బాల్యంలోనే ఆమెకు వివాహం జరిగిన విషయాన్ని చెబుతాడు. ఆ విషయం తెలిశాక సరోజ -శేఖర్‌ను దూరం పెడుతుంది. కానీ నాయనమ్మ పార్వతమ్మ ద్వారా చంద్రం, శేఖర్ ఒక్కడేనని తెలుసుకుని ఆనందిస్తుంది. సరోజకు కైలాసంతో పెళ్లి నిశ్చయిస్తుండగా.. శేఖర్‌తో కలిసి పల్లెటూరికి వెళ్లిపోతుంది సరోజ. విషయం తెలుసుకున్న పాపారావు, శేఖర్‌ను అంతం చేసే ఉద్దేశంతో ఆ ఊరికి వెళ్తాడు. తండ్రి ప్రయత్నానికి కూతురు సరోజ, తల్లి పార్వతమ్మ అడ్డుపడిన సమయంలో -పార్వతమ్మకు తూటా తగిలి గాయపడుతుంది. తల్లి స్థితిని, మేనల్లుడి మంచిని గ్రహించిన పాపారావులో మార్పు రావటం, వారందరినీ తీసుకొని పట్నంవచ్చి కాంతమ్మ మనసును మార్చటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. చిత్రంలో ఇంకా చదలవాడ కుటుంబరావు, సీతారాం, డాక్టర్ శివరామకృష్ణయ్య, పేకేటి శివరామ్, వంగర నటించారు.
బరువైన సన్నివేశాలు, రిలీఫ్ కోసం చక్కని హాస్య సన్నివేశాలు, అర్ధవంతమైన కుటుంబ పరిస్థితులు.. వ్యక్తుల నైజాలను చక్కగా విశే్లషిస్తూ ఆత్రేయ రాసిన పదునైన సంభాషణలు, దర్శకుడు ఆదుర్తి వైవిథ్య చిత్రీకరణ -సినిమాలో జోడు గుర్రాల్లా సాగాయి. తొలుత పిల్లలు బొమ్మల పెళ్లి చేస్తూ ఆలుమగల జీవనం గురించి పాడే సందేశాత్మక గీతం -హాయిగా ఆలుమగలై’ (గానం: పి సుశీల, యు సరోజిని బృందం; రచన: శ్రీశ్రీ). తరువాత కోర్టు ద్వారా వివాహం రద్దుకావటం, నాక్కూడా 100 రూపాయల జరిమానా వేశారని పురోహితుడు వాపోవటం, తల్లికి భరణంగా పాపారావు 10 ఎకరాల భూమి ఇవ్వగా, దాంతో మనమడు చంద్రాన్ని చదివించటంలాంటి సన్నివేశాలు కథకు ఆయువుపట్టుగా నిలుస్తాయి. స్నేహితులతో తిరుపతిలో సరోజను కలిసి -తెలియని ఆనందం (గానం: పి సుశీల, రచన: శ్రీశ్రీ) పాట వింటూ ఫొటోలు తీసి.. పాట గురించి, ఆమె గురించి చెప్పటం (ఈ పాట వాహినీ స్టూడియోలో సెట్స్ వేసి చిత్రీకరించారు) అద్భుతంగా ఉంటుంది. కైలాసం ఓ జలపాతం వద్ద మీనాక్షిని రక్షిస్తాడు. ఆ సమయంలో వారిరువురి మనసులో మాటలు బైటకు చెప్పకుండా హావభావాలు ప్రదర్శిస్తుంటే -సైలెంట్ షాట్స్‌లో చిత్రీకరించి దర్శకులు ఓ వినూత్న ప్రయోగం చేయటం విశేషాంశం. పోలీసుల నుంచి తప్పించడానికి రాజసులోచనకు మగ వేషంవేసి కారులో వారిద్దరూ కొండ దిగుతున్నపుడు సాగే హుషారైన పాట -చెక్కిలి మీద చెయ్యివేసి (గానం: మాధవపెద్ది, జిక్కి; రచన: కొసరాజు). సరోజ పుట్టినరోజు వేడుకలో రాజసులోచన, రాగిణిలపై ఓ నృత్య గీతం -ఔనంటారా మీరు కాదంటారా? (గానం: పి సుశీల, పి లీల; రచన: కొసరాజు). పాటలో ఎంతో చురుకుగా సాగే నృత్యం ప్రేక్షకులను రంజింపచేసింది. శేఖర్, సరోజల మధ్య సాన్నిహిత్యంలో మాటలు ‘పెదవులు పండితే, పెళ్లిమీద ప్రేమంటారు’ అని సరోజ అనటం.. పెళ్లిమీద సరోజ అభిప్రాయం అడిగిన శేఖర్‌తో ‘మనసు చంచలమైంది. నేను తాళిబొట్టునే పవిత్రంగా భావిస్తానని’ సరోజ జవాబు.. దర్శకులు అద్భుతంగా చిత్రీకరించారు. దాని తరువాత -తెలియని ఆనందం వెనుక తీయని కారణం వుంటుంది. కారణం తెలియని ఆనందం తీయగా వుంటుందనే ప్రాస డైలాగులు.. దాని వెంట ‘వెనె్నల ఇంత చల్లగా ఎందుకు ఉంటుంది’ అంటే, హీరో ‘వేడి పుట్టించటానికి’ అని.. ఆ క్రమంలో వచ్చే చిరస్మరణీయ అలరించే ప్రేమగీతం -ఆకాశవీధిలో అందాల జాబిలి (గానం: పి సుశీల, ఘంటసాల; రచన: శ్రీశ్రీ)తో ఆడియన్స్‌కి గొప్ప అనుభూతిని అందించాడు దర్శకుడు. రాజసులోచన, రేలంగిలపై రియాక్షన్స్ చూపిస్తూ.. పాట చివర రేలంగి వచ్చి -ఆకాశ వీధిలో దడదడ ఉరుములు అన్న యాక్షన్.. ఎంతో ఆకట్టుకునేలా రూపొందించారు.
మిగిలిన సన్నివేశాలు కథానుగుణంగా సాగుతాయి. సరోజను కలవాలని వచ్చి కలవలేకపోయినపుడు వారిరువురిపై చిత్రీకరించిన విషాద గీతం -పెను చీకటాయే లోకం (గానం: పి సుశీల, ఘంటసాల; రచన: శ్రీశీ). కథాపరంగా ప్రాణ సతినని తెలిపే అవకాశం లేకపోయిందని విచారం అర్ధవంతంగా సాగిన విషాద గీతమిది. నిజం తెలిశాక సరోజ కలలోవచ్చే యుగళ గీతం -వాడిన పూలే వికసించెలే (గానం: పి సుశీల, ఘంటసాల; రచన: శ్రీశ్రీ). ఈ పాటను ఊటీలో ఒక్కరోజులో ఎంతో ప్రయాసకోర్చి దర్శకులు చిత్రీకరించారు. అందరినీ అలరించేలా నిలిచిన పాట కావడం విశేషం.
ఇక బరువైన సన్నివేశాలుగా -సరోజ శేఖర్‌తో కారులో వెళ్తుండగా పాపారావు గన్‌తో పేల్చి కారు పార్టులు విరగతీయటం, ఊరిలో చేనువద్ద అతనిపై తుపాకి గురి చూడడం, తల్లి బోధ, పాపారావులో మార్పు.. దర్శకుడి పట్టుకు దర్పణంగా నిలుస్తాయి. ఈ చిత్రంలో సూర్యాకాంతంతో పదే పదే అనిపించే మాట -మీరు మీరూ ఒకటి. చివరకు నేనేగా పరాయిదాన్ని’ అద్భుతంగా పేలింది. క్లైమాక్స్‌లో పాపారావుతో ‘మనం మనం ఒకటి. ఇక్కడ పరాయివాళ్లెవరూ లేరు’ అనిపించటం కొసమెరుపు. సావిత్రి, అక్కినేనిల అభినయం, మిగిలిన హేమాహేమీల వంటి నటుల కాంబినేషన్ అభినయానికి తోడై మాంగల్యబలం చిత్రం విజయం సాధించింది. శత దినోత్సవాలు జరుపుకుంది. తమిళ చిత్రం ‘మంజిల్ మహిమై’ కూడా విజయం సాధించింది. తమిళంలో రేలంగి వేషం తంగవేలు, రమణమూర్తి వేషం బాలాజీ వేశారు.
మాంగల్యబలం శత దినోత్సవ వేడుకలు విజయవాడలో హైస్కూలు గ్రౌండ్స్‌లో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన వేడుక జరగటం, నటీనటులంతా ప్రేక్షకులకు కనువిందు చేయటం, ఆ రోజుల్లో జరిగిన విశేషాంశం. ఈ చిత్రానికి రాష్టప్రతి యోగ్యతాపత్రం లభించింది.
1967లో హిందీలో ఇదే కథతో ‘్ఛటీసి ములాఖత్’ పేరుతో వైజయంతిమాల ఉత్తమకుమార్ కాంబినేషన్‌లో రూపొందింది. మాస్టర్ వేణు సంగీతం, చక్కని కథా చిత్రీకరణ, నటీనటుల అభినయంతో రూపొందిన చిత్రంగా మాంగల్యబలం నిలిచింది. రేలంగి, రాజసులోచనపై హాస్య గీతం ‘మైడియర్ సారూ’ (రచన: కొసరాజు, గానం: మాధవపెద్ది, జిక్కి), సుకుమారిపై నృత్యగీతం -తిరుపతి వెంకటేశ్వర నీవే (గానం: జమునారాణి, రచన: కొసరాజు), కొసరాజు మరో రచన.. రేలంగి రాజసులోచనపై హాస్య గీతం ‘మైడియర్ మీనా/ మహ మంచిదానా’ (గానం: మాధవపెద్ది, జిక్కి) ఆకట్టుకుంటాయి.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి