ఫ్లాష్ బ్యాక్ @ 50

చంద్రహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్యాన్ని, సినీ రచనా ప్రక్రియను నూతనపంథాలో నడిపిన సాహితీవేత్త ఆలూరి వెంకట సుబ్బారావు. విద్యార్థి దశనుంచి చక్రపాణి కలం పేరిట రచనలు సాగించారు. తరువాతి కాలంలో నిర్మాత బొమ్మిరెడ్డి నాగిరెడ్డితో కలిగిన పరిచయం -1947లో బాలల మాసపత్రిక ‘చందమామ’ ఆవిర్భావానికి దారితీసింది. వీరిరువురి కృషి కారణంగా ‘చందమామ’ పత్రిక ప్రగతిబాటల్లో పయనించి విశేష ఖ్యాతి పొందింది. వీరిరువురూ కలిసి చిత్ర నిర్మాణంపై ఆసక్తితో ‘విజయా ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. తొలుత షావుకారు (1952) చిత్రంతో ప్రయాణం మొదలెట్టి చలనచిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని తమ చిత్రాల ద్వారా సాధించారు. ‘షావుకారు’, ‘పాతాళభైరవి’, ‘పెళ్లిచేసి చూడు’ చిత్రాల తరువాత వీరు రూపొందించిన జానపద చిత్రం -చంద్రహారం. ఈ చిత్రానికి తొలిసారిగా కమలాకర కామేశ్వరరావుకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. కమలాకర కామేశ్వరరావు 1911లో బందరులో జన్మించారు. డిగ్రీ పూర్తిచేశాక సినీ జర్నలిస్ట్‌గా కొంతకాలం రాణించారు. తరువాత దర్శకులు హెచ్‌ఎం రెడ్డివద్ద ‘గృహలక్ష్మి’ చిత్రానికి, కెవి రెడ్డివద్ద ‘పాతాళభైరవి’, ‘గుణసుందరి’ చిత్రాలకు స్క్రీన్ ప్లే వ్రాయటం, సహాయకుని బాధ్యతలను ఎంతో సమర్ధంగా నెరవేర్చారు. వీరి ప్రతిభను గుర్తించిన విజయాధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి -చంద్రహారం చిత్రానికి దర్శకునిగా తొలి అవకాశం కల్పించారు. తరువాత వీరు ‘గుండమ్మకథ’ వంటి సాంఘిక చిత్రాలు, ‘మహాకవి కాళిదాసు’, ‘మహామంత్రి తిమ్మరసు’, ‘శ్రీకృష్ణావతారం’ వంటి పలు చారిత్రక, పౌరాణిక చిత్రాల దర్శకునిగా ‘పౌరాణిక బ్రహ్మ’గా బిరుదుపొందిన విశిష్ట వ్యక్తి కమలాకర కామేశ్వరరావు. చంద్రహారం సినిమా 1954 జనవరి 1న విడుదలైంది.

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు, నృత్యం: పి కృష్ణమూర్తి, కళ: గోఖలే, కళాధర్, ఛాయాగ్రహణం: మార్కస్ బారెట్లే, ఎడిటింగ్: సిపి జంబులింగం, దర్శకులు: కమలాకర కామేశ్వరరావు, నిర్మాతలు: నాగిరెడ్డి, చక్రపాణి, సంగీతం: ఘంటసాల

చందన దేశానికి మహారాజు శ్రీవాత్సవ. మహారాణి వెంకుమాంబ. వారికి సంతానం లేనికారణంగా అల్లుడు ధూమకేతు (రేలంగి), కుమార్తె ఆశాదేవి (సూర్యాకాంతం)లకు రాజ్యం అప్పగించాలని మహరాజు నిర్ణయించగా, చంద్ర భగవానుని ప్రసాదంగా ఒక ఫలమిచ్చి, మహరాజు సంతానవంతుడు అవుతాడని ఆశీర్వదిస్తాడు రాజగురువు. ఆ ప్రకారంగా జన్మించిన బాలునికి చందన్ అని పేరు నిర్ణయిస్తారు. పుట్టుకతోనే చంద్రహారంతో జన్మిస్తాడు బాలుడు. అయితే, చంద్రహారం దూరమైతే అతని ప్రాణానికే ముప్పని తెలుస్తుంది. ఆ బాలుడి విద్యాభ్యాస శిక్షణ కోసం మాలి (ఎస్వీ రంగారావు)ని నియమిస్తాడు మహరాజు. అలా విద్య అభ్యసించి యుక్త వయస్కుడైన చందన్ (ఎన్టీ రామారావు) ఒకనాడు తన ఊహాసుందరిని చిత్రించి ఆమెతో ప్రేమలో పడతాడు. అతని జన్మ వృత్తాంతం తెలిసిన దేవకన్య చంచల (సావిత్రి) అతన్ని మోహించి, తనను ఏలుకొమ్మని కోరుకుంటుంది. యువరాజు ఆమెను తిరస్కరిస్తాడు. యువరాజు ఊహాసుందరి గౌరి (శ్రీరంజని) ఒక గ్రామంలో తన సవతి తల్లి (ఋషేంద్రమణి) వల్ల బాధలు పడుతుంటుంది. తండ్రి (దొరస్వామి) ప్రోత్సాహంతో ఇల్లు వదిలిన ఆమెను, చంచల సోదరి అచల యువరాజు మందిరానికి చేరుస్తుంది. వారిరువురికీ మాలి వివాహం జరిపిస్తాడు. ఆమె పరుల కంటపడకుండా గుడిలో దాస్తాడు. చంచల ఆగ్రహంతో చందన్ ప్రాణాధారం చంద్రహారం తీసుకొని అతను మరణించేట్టు చేయగా, ధూమకేతు తన అనుచరులతో చందన్, గౌరిని సజీవదహనం చేయబోతాడు. గౌరి ప్రార్థనతో దేవేంద్రుడు ఆగ్రహించి చంచలను శిక్షించి.. చందన్‌కి హారం ప్రసాదించి అతన్ని రక్షిస్తాడు. మహారాజ దంపతులు సహా అంతా చందన్, గౌరీలను ఆశీర్వదించి అక్కున చేర్చుకోవటంతో చిత్రం సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో ధూమకేతు వద్ద సహాయకులుగా పద్మనాభం, కెవిఎస్ శర్మ, ప్రధాన సలహాదారుడు నిక్షేపరాయుడిగా జోగారావు, గౌరి బావ పిచ్చి ఎల్లయ్యగా బాలకృష్ణ తదితరులు నటించారు.
చిత్రంలో కళా దర్శకులు గోఖలే, కళాధర్‌లు అద్భుతానే్న చూపించారు. సుమారు 25 లక్షల ఖర్చుతో చక్కటి దేవేంద్రలోకం, సువిశాల రాజభవంతి, అందమైన పూదోట, దేవీ ఆలయం లోపల రహస్య మార్గాలు.. ఇలా భారీ సెట్టింగ్స్ వేశారు. కాస్ట్యూమ్స్ విషయంలోనూ పాత్రల వేషధారణ, తొలుత కలువల ఆకారంలో కనె్నలను చూపటం లాంటివి విశేషాలు. దర్శకుడు సైతం అద్భుత సన్నివేశాలతో కథను రక్తికట్టించారు. ఓ సన్నివేశంలో ‘అలల శయ్యలతో’ మొదలై -ఎవరే ఎవరే చల్లని వెనె్నల జల్లులు మనపై చిలకరించునది (గానం: కె రాణి బృందం), దేవలోకంలో చంచల బృందం నృత్యం, వెనె్నలలో తెల్లని దుస్తులతో నృత్యం.. ఆ విన్యాసాలను దర్శకుడు ఎంతో రసవత్తరంగా (గానం: ఘంటసాల బృందం) చిత్రీకరించారు. చందన్ విద్యలనభ్యసించి యుక్త వయస్కుడు అయ్యాక తన ఊహాసుందరిని ఓ ఫలకంపై చిత్రీకరిస్తూ పాడే గీతం -ఇది నా చెలి/ ఇది నా సఖి/ నా మనోహరీ. ఈ గీతంలో భావుకతతో కూడిన చక్కని చిరునవ్వును యన్టీ రామారావు నటనలో చూపిస్తే, దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించి మనోల్లాసాన్ని కలిగించాడు. హీరోయిన్ గౌరిని (శ్రీరంజని) పరిచయం చేసినపుడు -దయగనవే తల్లీ అని తులసిని పూజించే సమయంలో చూపించటం; వివాహం తరువాత యువరాజుకు మంచి జరుగుతుందని రాజగురువు చెప్పినట్టు వివాహ ప్రయత్నం కోసం కన్యానే్వషణకు యువరాజు బయలుదేరటం; అతని ప్రయత్నం భంగపర్చటానికి నిక్షేపరాయుడి యత్నాలు; దానిలోభాగంగా కలువల నృత్యం, కన్యలు వీధివెంట మాలలతో నిలబడగా యువరాజు, మాలి గుర్రాలపై స్వారీచేస్తూ వెళ్ళటం; అది అంతగా మర్యాదకాదని యువరాజు తన ప్రయత్నం విరమించుకోవటం; గౌరి అడ్డు తొలగించుకోవాలని ఆమె సవతి తల్లి ఎల్లయ్యకిచ్చి వివాహం చేయబోవటం; వివాహం వద్దని వారిస్తూ అనారోగ్యవంతుడైన గౌరి తండ్రి ఆమెను ఇల్లువదలి వెళ్లమని పంపటం; పిచ్చివాడైన ఎల్లయ్య ఆమె ఇల్లువదిలి వెళ్తుండగా చూసినా.. ఎవరికీ చెప్పకుండా ఆనందంగా అరటిపళ్లు తినటం; ఎక్కడో అడవిలో స్పృహతప్పిన గౌరిని యువరాజు వద్దకు చంచల సోదరి చేర్చటం; దేవకన్య అయివుండి చంచల అహంకారం, మాలి ద్వారా చందన్ గౌరిని వివాహం చేసుకోవటం; చాలా చిత్రాల్లో గయ్యాళీ స్వభావంతో నటించే సూర్యాకాంతం ఈ చిత్రంలో సాత్విక పాత్రలో చందన్ అక్కగా భర్త అరాచకాలను ఎదిరించటం; చందన్ హారం గ్రహించి అతన్ని విగతజీవుణ్ణి చేసిన చంచల ఇంద్ర సభలో పలు విన్యాసాలతో నృత్యం చేయటంలాంటి సన్నివేశాలను దర్శకుడు సవివరంగా చూపించి ఆకట్టుకున్నారు. చిత్రం చివర పింగళివారు ‘కోటి దేవకన్యలు.. శతకోటి ధూమకేతులు.. సహస్రకోటి నిక్షేపరాయుళ్లు అదృష్టవంతుడిని చెడగొట్టలేరనటం -చిత్ర విశే్లషణగా భావించాలి. కమలాకర కామేశ్వరరావు దర్శకునిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించి ఎంతోపట్టుతో సన్నివేశాలు సహజంగా తీర్చిదిద్దారు. చిత్రంలోని అలరించేలా మరో రెండు ఘంటసాల గీతాలు ఎంతో మురిపెంగా తీర్చిదిద్దారు. ఇవికాక చిత్రంలో లాలి పాట -లాలీ జయలాలీ (యన్ లలిత బృందం), భక్తిగీతం -దయగనవే (పి లీల), జోగారావు బృందంపై గీతం -ఏంచేస్తే అది ఘనకార్యం ఉన్నాయి. యస్‌వి రంగారావుపై తత్వాలు -ఏనాడు మొదలిడివో ఓ విధీ (మాధవపెద్ది), గౌరిపై గీతం -నీకు నీవె తోడుగా, గౌరిపై మరో గీతం -కృపగనవా/ మొర వినవా (లీల), దేవతలను ప్రార్థించే పద్యగీతం -ఏ సాధువులు ఎందు హింసలు బడకుండా/ వేయి కన్నుల జూచు వేల్పులారా (గానం: పి లీల). ఈ గీతాలన్నీ సందర్భోచితంగా మెప్పించేలా రూపొందించారు.
చంద్రహారం గురించి ‘కినిమా’ అనే సినీ పత్రికలో ఎంతో ఆసక్తికరంగా పబ్లిసిటీ ఇచ్చారు. ఆంధ్రాలోని ప్రముఖ నగరాల్లో హోటళ్లవద్ద పెద్దసైజులో విద్యుత్ కాంతులతో చిత్రంలోని స్టిల్స్‌ను ప్రదర్శించారు. కాని ‘చంద్రహారం’ చిత్రం నిర్మాతలకు చేదు అనుభవం మిగిల్చింది. పాతాళభైరవి చిత్రంలో మాదిరిగా యన్టీఆర్ సాహసాలు చేస్తారని ఊహించుకుంటూ వచ్చిన జనం -అందుకు విరుద్ధంగావున్న చిత్రాన్ని చూసి పెదవి విరిచేశారు.
జయాపజయాలను పక్కనపెడితే -యువరాజుగా యన్టీఆర్ చక్కని చిరునవ్వుతో కూడిన అభినయం ప్రదర్శించారు. ‘ఇది నా చెలి’, ‘ఎవరితో ఎచట నుంటివో’, ‘ఏమి శిక్ష కావాలి’ పాటలలో యన్టీఆర్ ఆకట్టుకున్నారు. స్వయంవరంలో కనె్నలను తిరస్కరించటం, తన ఊహాసుందరి కోసం ఇలా కన్యలు మాలలనివ్వటం సరికాదని వెనుదిరగటం, దేవకన్య వరించివచ్చినా తన అభిప్రాయం మార్చుకోకపోవటంలాంటి సన్నివేశాల్లో పాత్రోచిత ప్రదర్శనతో మెప్పించారు. ‘సావిత్రి’ దేవకన్య చంచలగా నెగెటివ్ కారెక్టర్‌ను సమర్ధంగా పోషించారు. ‘పెళ్లిచేసి చూడు’లో అతి అమాయకంగా నటించి, దానికి విరుద్ధంగా ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంది. దేవలోకంలో గ్రూప్‌లో విడిగా ఆమె ఒక్కరిపై క్లైమాక్స్‌లోని నృత్యభంగిమలు ఆకట్టుకునేలా ప్రదర్శించింది. గౌరిగా శ్రీరంజని ఆ పాత్రకు తగిన సాత్వికతతో అలరించింది. కనువిందుచేసే సెట్టింగ్స్, ఘంటసాల గానం, సంగీతంతో గీతాలు నేటికీ సంగీత కార్యక్రమాల్లో శ్రోతలను అలరిస్తుండటం చిత్రం విజయంగా పరిగణించాలి. పింగళి సాహిత్య గుభాళింపులకు మది పరవశమవటం ఆనందించదగ్గ విషయం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి