ఫ్లాష్ బ్యాక్ @ 50

బందిపోటు భీమన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా జిల్లా దేవరకోట భూస్వామి దోనేపూడి బ్రహ్మయ్య. కళాహృదయుడు, సినిమాలపట్ల మంచి అభిరుచి గలవాడు. అలా సినిమా నిర్మాణంపట్ల ఆసక్తితో మదరాసు వెళ్లారు. హీరో కృష్ణతో ఓ సినిమా నిర్మించాలని భావించారు. అప్పటికే కృష్ణతో యాక్షన్, సెంటిమెంట్, సాహసోపేతమైన పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎం మల్లిఖార్జునరావు సారథ్యంలో బ్రహ్మయ్య రూపొందించిన చిత్రం -బందిపోటు భీమన్న. తమిళ చిత్రం ‘చక్రం’ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. 1969 డిసెంబరు 25న విడుదలైన సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.
తమిళ సినిమా చక్రం -1968 డిసెంబరు 6న విడుదలైంది. ఆ చిత్రానికి నిర్మాత కెఆర్ బాలన్. రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎ కాశీలింగం. సంగీతం ఎస్ సుబ్బయ్యనాయుడు. తమిళంలో ఎవిఎం రాజన్ పోషించిన పాత్రను తెలుగులో ఎస్‌వి రంగారావు పోషించారు. హీరోగా జెమిని గణేషన్, జోడీగా వెన్నిరాడై నిర్మల, ఆమె తండ్రి, ఇన్‌స్పెక్టర్‌గా మేజర్ సౌందర్‌రాజన్, జమీందారిణిగా షావుకారు జానకి, హాస్య జంటగా నాగేష్, మనోరమ నటించారు. తెలుగులో హీరోగా కృష్ణ, జోడీగా విజయనిర్మల, చెల్లిగా మంజుల, జమీందారిణిగా అంజలీదేవి, హాస్య జంటగా రాజ్‌బాబు, మీనాకుమారి నటించారు.
బందిపోటు భీమన్న చిత్రానికి సంభాషణలు మహారధి. సంగీతం టివి రాజు. ఛాయాగ్రహణం ఎం కన్నప్ప. కూర్పు పి శ్రీనివాసరావు. కళ కుదరవల్లి నాగేశ్వరరావు. నృత్యం సుందరం. స్టంట్స్ ఆర్ రాఘవులు. నిర్వహణ- ఎస్‌పి వెంకన్నబాబు, కెఎల్‌ఎన్ శాస్ర్తీ. అసోసియేట్ డైరెక్టర్ యన్ రామచంద్రరావు. దర్శకత్వం ఎం మల్లిఖార్జునరావు. నిర్మాత దోనేపూడి బ్రహ్మయ్య.
బందిపోటు భీమన్న (ఎస్‌వి రంగారావు) పేరుమోసిన గజదొంగ. అతని పేరుచెబితే చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు భయంతో వణికిపోతుంటారు. అతనిని పట్టిచ్చిన వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేస్తుంది.
జమీందారిణి అన్నపూర్ణా దేవి (అంజలీదేవి) వద్ద మేనేజర్ మోహన్ (కృష్ణ). ఆమె కుమారుడు రాజా (చంద్రమోహన్) కాలేజీలో చదువుతుంటాడు. పేరుకి జమీందారిణి అయినా, ఆస్తిపాస్తుల కంటె అప్పులు ఎక్కువవుతాయి. దీంతో రాజాకు డబ్బుగల సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటుంది అన్నపూర్ణా దేవి. దాంతో రాజా తన ప్రేమ విషయాన్ని బయటపెడతాడు. కాలేజీ సహాధ్యాయని లత (మంజుల)ను ప్రేమించానని చెబుతాడు. లతతో పెళ్లి జరగాలంటే 50 వేలు కట్నం కావాలని నిర్ణయించుకుని, మోహన్‌కు ఆ విషయాన్ని చెబుతుంది. లత, మోహన్‌కు చెల్లెలు. దాంతో చెల్లి పెళ్లికి కావాల్సిన ధనంకోసం గజదొంగ, బందిపోటు అయిన భీమన్నను పట్టుకోవాలని బయలుదేరతాడు మోహన్. అతనికి సాయంగా ప్రేయసి లీల (విజయనిర్మల), మిత్రుడు రాజ్‌బాబు మరికొందరు వెంటవెళ్తారు. చివరికి తన శక్తియుక్తులు, మంచితనంతో భీమన్న బంధించి తీసుకొస్తాడు. ఇంటికొచ్చిన భీమన్నను చూసి అన్నపూర్ణాదేవి, తన భర్తగా గుర్తిస్తుంది. అతడు పోలీసులకు బందీ అవ్వాలని తెలిసి, అన్నపూర్ణాదేవి విషంతాగి మరణిస్తుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక, పిస్టల్‌తో తనను తాను కాల్చుకొని భీమన్నా ప్రాణాలు విడుస్తాడు. రాజా-లత, మోహన్-లీల జంటలుగా స్థిరపడటంతో సినిమా ముగుస్తుంది.
చిత్రంలో బాలకృష్ణ, జగ్గారావు, నెల్లూరి కాంతారావు, కెవి చలం, మల్లిక, జ్యోతిలక్ష్మి, మీనాకుమారి నటించారు. ఇన్‌స్పెక్టర్‌గా రావి కొండలరావు, నాగయ్య, డాక్టర్ శివరామకృష్ణయ్యలు అతిథి నటులుగా నటించారు.
దర్శకులు ఎం మల్లిఖార్జునరావు చిత్రాన్ని చక్కటి సన్నివేశాలతో తీర్చిదిద్దారు. దట్టమైన అడవుల్లో మోహన్ బృందం భీమన్నను పట్టుకునే యత్నం, వాటిని భీమన్న తమాషాగా తిప్పికొట్టడంలాంటి సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. మోహన్, లీల మధ్య చిలిపి గొడవలు అలకలు, వారిమధ్య సున్నిత ప్రణయ సన్నివేశాలు మనసుకు హాయినిస్తాయి. చివరలో జీపు వెనక సీటులో డప్పువాయిస్తూ పాడే గీతం భీమన్నపై చిత్రీకరణ, ముందు సీటులో రాజ్‌బాబు, మీనాకుమారిల రియాక్షన్ ఆకట్టుకునేలా చిత్రీకరించారు. మిగతా నటీనటులంతా పాత్రోచిత నటనను సమర్ధంగా ప్రదర్శించారు.
చిత్ర గీతాలు
జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించిన నృత్యగీతం -కసిరే వయసు/ ముసిరే సొగసు (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, రచన: సి.నారాయణరెడ్డి). కృష్ణ, విజయనిర్మలపై చిత్రీకరించిన సినారె రచనలోని మరో హిట్టుసాంగ్ -నీ కాటుక కన్నులలో/ ఏ కమ్మని కథ ఉందో (గానం: పి సుశీల, ఎస్పీబీ). కథానాయకా నాయికలపై చిత్రీకరించిన మరో యుగళగీతం -తడి తడి చీర తళుక్కుమంది/ చలి చలివేళ చమక్కుమంది (గానం: పి సుశీల, ఎస్పీ బాలు; రచన: ఆరుద్ర). ఈ రెండు పాటలూ ఇప్పటికీ అలరించేవిగా ఉన్నాయి. మీనాకుమారి, రాజ్‌బాబుపై చిత్రీకరించిన మరో హస్యగీతం -అబ్బో అబ్బ అబ్బ (రచన: కొసరాజు, గానం: పిఠాపురం, ఎల్‌ఆర్ ఈశ్వరి). అబ్బో అబ్బ అబ్బ, జిమ్మి అమ్మ అమ్మ అన్న తమాషా పదాలతో సాగుతుంది. బందిపోటు భీమన్న (ఎస్‌వి రంగారావు) జీపులో డప్పువాయిస్తూ పాడే గీతం -డబ్బు మాయదారి డబ్బు/ పైసాలోన ఉంది పరమాత్మ/ పైసాకోసం గిజగిజలాడును జీవాత్మ (గానం: ఘంటసాల, రచన: సినారె). డబ్బు విలువ, మనుషుల స్వభావాన్ని తెలుపుతూ సందేశాత్మకంగా సాగే గీతమిది. రాజ్‌బాబు జీపు నడుపుతుంటే, పక్కనే మీనాకుమారి కూర్చుని ఉంటుంది. వెనక సీటులోవున్న భీమన్నపై పాట చిత్రీకరించారు. అందుకు అనుగుణంగా ముందు సీట్లలో ఉన్నవాళ్ల రియాక్షన్స్ ఉంటాయి. తమిళంలో ఈపాటను ఎవి రాజన్‌పై చిత్రీకరించారు. వెనుక సీటులో అతను, ముందుసీట్లలో నాగేష్, మనోరమ ఉంటారు. ప్రతి చరణానికి ముందు సీటులోనివాళ్లు మారుతూ, పాట చరణానికి తగినట్టు ప్రవర్తిస్తుంటారు. తెలుగులో దాన్ని మార్చి ఈ ముగ్గురిపైనా పాటను, దారిలో వచ్చే మలుపులను చూపుతూ చిత్రీకరించారు.
బందిపోటు భీమన్న -చిత్రం సాధారణ చిత్రంగా గుర్తింపుపొందింది. ఆ చిత్రంలోని రెండు గీతాలు మాత్రమే నేటికీ ఆ సినిమాను జ్ఞప్తికి తెస్తున్నాయి. ఫలితంతో సంబంధం లేకుండా ఓ ప్రయత్నం చేసిన నిర్మాతలు అభినందనీయులు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి