ఫ్లాష్ బ్యాక్ @ 50

దైవ బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్రాస్‌లో పొన్నలూరి బ్రదర్స్ సొంత స్టూడియో నిర్మించారు. పొన్నలూరి బ్రదర్స్ బ్యానర్‌పై ఇదే స్టూడియోలో 1957లో ‘్భగ్యరేఖ’ చిత్రాన్ని యన్టీ రామారావు, జమున కాంబినేషన్‌లో రూపొందించారు. ప్రముఖ దర్శకులు బిఎన్ రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాహినీ సంస్థ చిత్రాలకేకాక ఇతర చిత్రాల సంస్థలకూ బిఎన్ రెడ్డి పనిచేయటం ‘్భగ్యరేఖ’తోనే ప్రారంభం కావటం విశేషం. ఆ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు. భాగ్యరేఖ చిత్రానికి రాష్టప్రతి రజిత పతకం లభించింది. తరువాత పొన్నలూరి బ్రదర్స్ -యన్టీఆర్, అంజలి, రాజసులోచనతో ‘శోభ’ (1958), యన్టీఆర్, జానకి కాంబినేషన్‌లో ‘కాడెద్దులు- ఎకరం నేల’ (1960) నిర్మించారు. ‘శోభ’ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఏఎం రాజా సంగీత దర్శకత్వం వహించారు. ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటుడు, నాటక రచయిత రావి కొండలరావు ‘శోభ’ చిత్రం ద్వారానే సినీ రంగానికి పరిచయమయ్యారు. పొన్నలూరి బ్రదర్స్ బ్యానర్‌పై నిర్మాతలలో ఒకరైన వసంతకుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1959లో రూపొందించిన జానపద చిత్రం ‘దైవబలం’. తరువాత వీరు 1966లో ‘పాదుకా పట్ట్భాషేకం’, 1973లో ‘పూలమాల’ చిత్రాలు నిర్మించారు.
దైవబలం చిత్రం 1959 సెప్టెంబర్ 17న విడుదలై 60ఏళ్లు పూర్తి చేసుకుంది.
యన్టీఆర్, జయశ్రీ (జయచిత్ర తల్లి.. అసలు పేరు అమ్మాజి) కాంబినేషన్‌లో వసంత్‌కుమార్‌రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో ‘దైవబలం’ రూపొందింది. ఛాయాగ్రహణం: బిజె రెడ్డి
శబ్దగ్రహణం: కణ్ణన్
కళ: వాలి
సంగీతం: అశ్వద్ధామ
నేపథ్య సంగీతం: టీవీ రాజు
మాటలు, పద్యాలు: పరశురామ్
మేటి హాలాహలమ్మును మ్రింగవచ్చు/ ప్రళయ కాలాగ్నిలో బడి బ్రతుకవచ్చు/ ఎంత బలవంతుడైన.. తానెవ్వడైన/ దైవబలమును కాదనతరముగాదు. పరశురామ్ రచించిన ఈ పద్యాన్ని ఘంటసాల గానం చేశారు. ఈ పద్యంలోని సత్యాన్ని నిరూపించే కథతో రూపొందిన చిత్రం -దైవబలం.
మాళవ దేశ మహారాజు ఉగ్రసేనుడు (గుమ్మడి). అతని కుమార్తె రూప. ఆమె జాతకం చూసిన జ్యోతిష్యులు.. ఓ సామాన్యుడు ఆమెకు భర్త అవుతాడని చెబుతారు. విధి లిఖితాన్ని మార్చాలని ఉగ్రసేనుడు ప్రయత్నిస్తాడు. జ్యోతిషులను పంపించేసి, ఆ లక్షణాలుకల బాలుడు చంద్రసేనుని కనిపెడతారు. ఆ బాలుని తల్లి (మాలతి) వద్దనుంచి తెచ్చి వధించమని తలారులను మహారాజు ఆజ్ఞాపిస్తాడు. ఆ బాలుని తలారులు వదిలిపెట్టడంతో, అతడు తల్లితో కలిసి ఓ గురువు ఆశ్రయంలో ఆశ్రమవాసిగా పెరిగి సకల విద్యలు నేరుస్తాడు. ఒకనాడు రాకుమారి రూప (జయశ్రీ)ని కలిసిన చంద్రసేనుడు (యన్టీ రామారావు) ఆమె అనురాగం పొందుతాడు. రాకుమారి స్వయంవరానికి ఏర్పాటు చేసిన పోటీలలో పాల్గొని విజయం సాధిస్తాడు. అతడెవరో నిజం తెలుసుకున్న ఉగ్రసేనుడు అతన్ని భూతమందిరంలో బంధించగా, చంద్రసేనుడు అతన్ని వధించి రూప చెలికత్తె (బాల) సాయంతో తప్పించుకొని మృత్యుమందిరం చేరతారు. అక్కడ గంధర్వుని పత్ని, భర్త శాప విమోచనం కోసం సంగీత వృక్షాన్ని కోరుతుంది. కంకాక్షుడు (ముక్కామల) అనే రాక్షసరాజు వద్దనున్న సంగీత వృక్షాన్ని అతి ప్రయాసతో సాధించి, తనను ప్రేమించాననే కంకాక్షుని కుమార్తె (గిరిజ) వలపునుండి తప్పించుకుని రూపతోసహా చంద్రసేనుడు మాళవ రాజ్యం చేరతాడు. చంద్రసేన రూపలను బంధించి ఉరిశిక్ష విధించిన మహరాజు ఉగ్రసేనుడు, తన ఆలోచన మార్చుకొని ఇద్దరికీ వివాహం జరిపించి.. దైవ నిర్ణయాన్ని ఎంతటివారికైనా తప్పింపరాదన్న నిజాన్ని వెల్లడించటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో చంద్రసేనుని బంధించిన వారికి రాశులలో బంగారం ఇస్తారన్న రాజు ప్రకటనతో అతన్ని బంధించటానికి యత్నించిన టక్కు, టమారాలుగా రేలంగి, రమణారెడ్డి నటించారు. యన్టీఆర్ మిత్రుడు, ఆశ్రమవాసిగా కస్తూరి శివరావు నటించగా, ప్రముఖ నటుడు శోభన్‌బాబు మృత్యుమందిరంలో (కావలివానిగా, గంధర్వుల కుమారునిగా) నటించారు. అతని తల్లిగా మోహన.. ఇంకా అనేకమంచి ఇతర పాత్రలు పోషించారు.
దర్శకులు వసంతకుమార్‌రెడ్డి కథానుగుణంగా సన్నివేశాలను తీర్చిదిద్దటంలో చాకచక్యం చూపించారు. ఓ జానపద చిత్రానికి తగిన విధంగా అన్ని అంశాలను మేళవించటం కనిపిస్తుంది. హీరో స్వయంవర పోటీల్లో అన్ని విన్యాసాల్లో పాల్గొనటం; రథాలమీద గుర్రాల మీద పోరాటాలు; భూతమందిరంలో.. తెలివిగా భూతం కాలిలోని కన్ను నొక్కి అంతం చేయటం; ఉగ్రసేనునినుంచి పారిపోయి మృత్యుమందిరం చేరిన రూపను పూవుగా మారిస్తే.. గంధర్వుని నుంచి ఆమెను రక్షించటానికి కంకాక్షుని రాజ్యంచేరిన చంద్రసేనుడు అతనితో చేసే పోరాటాలు; అక్కడ బందీకావటం; రూపతోసహా పారిపోతూ కంకాక్షునితో గుహలో జరిపిన పోరాటం; కంకాక్షుని ప్రాణంవున్న జీవిని పట్టి రూప వధించటం; హాస్యంకోసం రేలంగి, రమణారెడ్డిలపై ఓ పాట, సన్నివేశాలు, తల్లినుంచి చిన్నతనంలో చంద్రసేనుడు విడిపోయినపుడు విషాద గీతాన్ని అడవిలో తల్లీబిడ్డలపై చిత్రీకరణ -లేనే లేదా రానే రాదా బాబును చూసే భాగ్యము (తల్లి, బాలుడు చంద్రపై).. లేనే లేదా రానే రాదా అమ్మను చూసే భాగ్యము (రచన: సీనియర్ సముద్రాల, గానం: వైదేహి). చిత్రం చివరలో కూతురును బంధించిన మహారాజు ఉగ్రసేనునికి ఆమె బాల్యంలో తండ్రితో ప్రహ్లాదుని వృత్తాంతము గురించి చేసిన చర్చ గుర్తుకువచ్చి.. కూతురు రూపకోసం కారాగారం వద్దకు వచ్చి ఆమెను, చంద్రసేనుని విడిపించి, వారికి వివాహం జరుపనిశ్చయించి ‘దైవబలం’ గూర్చి వివరించటం, రాజులోని మానసిక పరివర్తన, మార్పునకు సంకేతంగా ఆ సన్నివేశాన్ని రూపొందించటం అర్ధవంతంగా నిలిచింది.
చిత్రంలో చంద్రసేనునిగా యన్టీ రామారావు పాత్రోచితం, పలు వైవిధ్య సన్నివేశానుగుణంగా నటన ప్రదర్శించారు. అతని జోడి రూపగా జయశ్రీ తన పాత్రకు తగిన నటనతో అలరించింది. చిత్రంలో వారిరువురిపై చిత్రీకరించిన నేటికీ అలరించే యుగళ గీతం -అందాల ఓ చందమామ రావోయి (గానం: పిబి శ్రీనివాస్, ఎస్ జానకి; రచన: అనిశెట్టి). హవాయిన్ గిటార్ బేస్‌తో పాట సాగుతుంది. చిత్రంలో పద్యాలు, పాటలు 14పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని రమణారెడ్డి, రేలంగిలపై హాస్య గీతం -కొడితే కోస్తాలే కొట్టాలి ఒరే చిచ్చరపిడుగా (రచన: కొసరాజు, గానం: పిఠాపురం, మాధవపెద్ది). గిరిజపై చిత్రీకరించిన గీతం -జీవితం ఎంతో హాయి.. ఈ యవ్వనమే (గానం: వైదేహి, రచన: అనిశెట్టి). -చిరు చిరు నవ్వుల పువ్వుల మురిసే యుగళ గీతం యన్టీఆర్, జయశ్రీలపై (గానం: పిబి శ్రీనివాస్, ఎస్ జానకి, రచన: అనిశెట్టి), మరో గీతం -నిను వరియించి మదికరగించి (గానం: పిబి శ్రీనివాస్, జానకి; రచన: అనిశెట్టి) అశ్వద్దామ సంగీతంతో అలరించేలా రూపొందాయి.
దైవబలం చిత్రం స్క్రీన్‌ప్లే, ఫొటోగ్రఫీ, సంగీతం, నటీనటుల అభినయంపరంగా అలరించేలా రూపొందినా.. అంతగా ఆర్థిక విజయం సాధించలేదు. ‘అందాల ఓ చందమామ’ గీతం విన్నపుడల్లా మాత్రం ఈ చిత్రం గుర్తుకు రావటం.. ఓ మంచి జ్ఞాపకంగా మిగలటం హర్షణీయాంశం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి