ఫ్లాష్ బ్యాక్ @ 50

శభాష్‌రాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈస్టిండియా ఫిలిం కంపెనీ అధినేత చమ్రియా. వీరు మద్రాసులో చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ నెలకొల్పారు. ఆ కంపెనీ మేనేజర్‌గా సుందర్‌లాల్ నహతా కొంతకాలం వ్యవహరించారు. చిత్ర పరిశ్రమలో అనుభవజ్ఞులైన తారాచంద్ బర్జాత్యాతో స్నేహంలో చిత్ర నిర్మాణ రంగానికి చెందిన అనేక విషయాలను వారివద్ద అభ్యసించారు. తరువాత రాజశ్రీ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ సంస్థలో ప్రధాన పాత్ర పోషించారు. వీరు తారాచంద్ బర్జాత్యాతో కలిసి 1950లో రాజశ్రీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తొలుత 1956లో ‘జయం మనదే’, 1957లో ‘సతీ అనసూయ’ నిర్మించారు. తరువాత 1959లో ‘శభాష్ రాముడు’, 1961లో ‘శభాష్ రాజా’ రూపొందించారు.
1957లో అజిత్, కామిని కౌశల్ కాంబినేషన్‌లో కె అమర్‌నాథ్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘బడాభాయి’. దేశ విభజన కారణంగా సరిహద్దులు దాటి వచ్చిన ఓ కుటుంబం హైదరాబాద్‌కు చేరుతుంది. అన్నగారు రిక్షా నడపటం ద్వారా తన తమ్ముడు, భార్యా, కూతురితో ఏవిధంగా జీవనం సాగించారో అదే కథాంశంతో రూపొందిన చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రం హక్కులు పొందిన రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేతలు సుందర్‌లాల్ నహతా, అశ్వద్ధ నారాయణలు కొద్దిపాటి మార్పులతో ఆంధ్రదేశంలో ఎక్కువగా వాడుకలోవుండే రాముడు పేరుతో ‘శభాష్ రాముడు’గా తెలుగులో నిర్మించారు. ఈ చిత్రం 1959 సెప్టెంబర్ 4న విడుదలైంది. అంటే 2019 సెప్టెంబర్ 4కి 60 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టు. ఆ చిత్రం విశేషాలు ఈ వారం.
కథ, మాటలు: సదాశివబ్రహ్మం, కళ: అన్నామలై, ఎడిటింగ్: శంకర్, సి హరిరావు, ఛాయాగ్రహణం: కమల్‌ఘోష్, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, సంగీతం: ఘంటసాల, దర్శకత్వం: సిఎస్ రావు, నిర్మాతలు: సుందల్‌లాల్ నహతా, అశ్వద్ధ నారాయణ.
గోదావరి వరదల వల్ల ఇల్లు, పొలం కోల్పోతాడు రాముడు (యన్‌టి రామారావు). దాంతో భార్య లక్ష్మి (దేవిక), కూతురు రాధ (బేబి శశికళ), తమ్ముడు మోహన్ (రమణమూర్తి)లతో హైదరాబాదుకు వస్తాడు. కుటుంబ జీవనం కోసం రిక్షా అద్దెకు తీసుకొని నడుపుతుంటాడు. తన ఊరివాడైన మారీసు (రేలంగి)ను కలుసుకుంటాడు. మారీసు, చిల్లర దుకాణం నడిపే అమ్మాయి మల్లిక (గిరిజ) ప్రేమించుకుంటారు. ఆ ఊరి పోలీస్ కమిషనర్ నారాయణరావు (గుమ్మడి). అతని కుమారుడు కుమార్ (కాంతారావు) పోలీస్ ఇన్‌స్పెక్టర్. కూతురు రాణి (కుసుమకుమారి) మోహన్‌తోపాటు కాలేజీలో బిఏ చదువుతుంటుంది. దొంగల నాయకుడు భూపతి (ఆర్ నాగేశ్వరరావు) ఓ నగల వ్యాపారిని హత్యచేసి నగలు దోచుకొంటాడు. అది మారీసు చూస్తాడు. భూపతిని అడ్డగించబోయిన కుమార్‌ను, జయశ్రీ (ఎల్‌ఎన్ రాజ్యం) తెలివిగా తప్పించి, తరువాత తన ప్రేమలోకి దింపుతుంది. ఆమె స్నేహంతో కుమార్, భూపతికి స్నేహితుడౌతాడు. ఒకసారి రామూ రిక్షా ఎక్కిన భూపతి, అతనికి తన స్థావరం తెలిసిందని అంతం చేయబోగా, రామూ గాయపడి తప్పించుకుంటాడు. నిజం చెప్పకూడదంటూ భూపతి హాస్పిటల్‌లో చేరిన రామును పోలీసులు బెదిరిస్తారు. రామూ కష్టార్జితంవల్ల మోహన్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం పొందుతాడు. మోహన్‌ను అంతం చేయాలనుకున్న భూపతి బారినుంచి, తన చిన్ననాటి స్నేహితుడిగా గుర్తించి జయశ్రీ కాపాడుతుంది. జయశ్రీని భూపతి హత్యచేసి, ఆ నేరం రామూ మీదకు వచ్చేలా పథకం వేస్తాడు. దానివలన మోహన్, రాణిల నిశ్చితార్థం నాడే రాము అరెస్టవుతాడు. జైలులోవున్న రాము.. మోహన్, రాణి, కుమార్‌లను భూపతి తన డెన్‌లో బంధించిన సంగతి తెలుసుకుంటాడు. జైలునుంచి తప్పించుకుని, భూపతి గ్యాంగ్‌ను ఎదిరించి తనవారిని రక్షించుకొని శభాష్ రాముడు అనిపించుకుంటాడు. చిత్రంలో ఇంకా సురభి కమలాబాయి, గంగారత్నం, కెవియస్ శర్మ, ‘రాజేశ్వరి’ తదితరులు నటించారు.
పౌరాణిక, సాంఘిక చిత్రాల దర్శకునిగా రాణించిన సిఎస్ రావు ‘శభాష్‌రాముడు’ చిత్రాన్ని సెంటిమెంట్, యాక్షన్ జోడింపుతో ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. తొలుత చిత్రం టైటిల్స్‌లో బాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ పాట వినిపిస్తుంది. రిక్షా అద్దెకు తీసుకున్నందుకు వారించిన భార్య, తమ్ముడితో రాముడు -కాయకష్టంచేసి చెమటోడ్చి బ్రతకటానికెందుకురా సిగ్గు. దోపిడి దొంగతనాలు చేస్తే సిగ్గుపడాలి’ అంటూ.. ‘శ్రమజీవి చేతిలో చక్రాలు తిరగటంలోనే దేశ సౌభాగ్యం ఉందని చెప్పటం.. అలా చెబుతున్నపుడు సింబాలిక్‌గా రైలు చక్రాలను చూపటంలో దర్శకుడి పనితనం కనిపిస్తుంది. సురభి కమలాబాయిని రిక్షా ఎక్కించుకొని ‘జయమ్ము నిశ్చయమ్మురా’ గీతం తోటి రిక్షావారితోపాటు ఒకసారి ‘ఏనాటికైనా స్వార్థం నశించి తీరును, కష్టాలకోర్చుకున్నానే’ చరణంలో ‘మద్రాస్‌లోని శ్రామికుల స్టాట్యూ, పెద్దలను గౌరవించాలి అంటూ మహాత్మాగాంధీ స్టాట్యూ చూపిస్తారు. ప్రారంభంలో హైదరాబాద్‌లోని చార్మినార్, అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్స్ భవనాలు చూపటం, మరోసారి రమణమూర్తి, బేబీ శశికళ, దేవికలపై చరణాలు రిపీట్ కావటం, దేవిక చరణం ‘గృహాన్ని స్వర్గసీమలా చేయిదేవా’ అని రిక్షా పందేలు జరిగేటప్పుడు, రమణమూర్తి అన్నగారికి స్ఫూర్తినిస్తూ ‘గాఢాంధకారమలుముకొన్న’ నుంచి ‘నిరాశలో జీవితాన్ని కృంగదీయకు’ స్వతంత్ర యోధుడన్న కీర్తివంటి పద ప్రయోగాలతో నిత్యనూతన స్ఫూర్తిదాయక గీతంగా నిలవటం విశేషం. ఈ చిత్ర నిర్మాణ సమయంలో కాంతారావు కుటుంబంతోసహా తిరుపతి ఓ పెళ్లికెళ్లి మద్రాస్ తిరిగి వస్తూండగా కారుకి యాక్సిడెంట్ అయ్యి రెండురోజులు మాత్రమే విశ్రాంతి తీసికొని శభాష్‌రాముడు షూటింగ్‌లో పాల్గొనటం జరిగింది. కొన్ని సన్నివేశాలలో నటించేటప్పుడు నెర్వస్‌గా ఫీల్ అవ్వటం కనిపిస్తుంది. దర్శకులు సిఎస్ రావు వారికి ధైర్యం చెప్పి, ఆ సన్నివేశాల క్లోజప్ షాట్స్‌ను హీరో కాంతారావు ఇబ్బంది పడకుండా చిత్రీకరించటం ఓ విశేషం. అంతేకాక ఉంగరాల జుట్టుగల కాంతారావు ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ వేషంకోసం దాన్ని కత్తిరించుకోవలసి వచ్చింది. వేషం ప్రాధాన్యం కోసం ఆయన దానికి సిద్ధపడడం ఆనాటి ఆర్టిస్టుల కమిట్‌మెంటును సూచిస్తుంది. యాక్షన్, సెంటిమెంటులతో కూడిన సన్నివేశాలను దర్శకులు సమర్ధవంతంగా తీర్చిదిద్దారు. దానికి తగ్గట్టు యన్‌టి రామారావు, ప్రేమించి పెళ్లాడిన భార్యను సుఖపెట్టలేనందుకు విచారం, తమ్ముడు బాగా చదివి పోలీస్ ఆఫీసర్ కావాలనే ఆకాంక్ష, తోటివారిపై అభిమానం.. ఇలా ఆత్రుత, పౌరుషం, బాధ కలగలిపిన సన్నివేశాలను ఎంతో నిండుతనంతో పరిపూర్ణంగా ఆవిష్కరించారు. కలిగిన ఇంటి అమ్మాయిగా, ప్రేమించిన భర్తతో కష్టాలను సుఖాలుగా భావించే ఇల్లాలిగా దేవిక సాత్వికతను, మరిది క్షేమం, భర్త ఆరోగ్యంపట్ల శ్రద్ధ, బాధ్యతగల ఇల్లాలిగా పరిపూర్ణమైన నటన చూపించారు. విలన్ పాత్రల పోషణలో ఓ ప్రత్యేకత చూపే నటుడు ఆర్ నాగేశ్వరరావు, పోలీస్ ఆఫీసర్‌గా గుమ్మడి, అన్నకుతగ్గ తమ్ముడిగా.. బాధ్యతగల పోలీస్ అధికారి మోహన్‌గా రమణమూర్తి తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించి మెప్పించారు. రమణమూర్తి జోడి రాణిగా కుసుమకుమారి నటించగా, ఆమె స్నేహితురాలిగా నటి శ్రీదేవి తల్లి రాజేశ్వరి, కొన్ని సన్నివేశాలలో నటించారు. గుమ్మడి ఇంట వంటమనిషిగా సురభి కమలాబాయి, దేవిక పక్కింటి ఇల్లాలుగా గంగారత్నం నటించారు.
ఈ చిత్రంలో నటించిన ఆర్ నాగేశ్వరరావు ఈ చిత్రం విడుదలవడానికి నెలముందు ఆగస్టులో క్షయవ్యాధి కారణంగా స్వర్గస్తులవటం విచారకరమైన విషయం.
చిత్ర గీతాలు:
రేలంగి, గిరిజలపై గుర్రంబండిపై పాడే గీతం -హల్లో డార్లింగ్ మాటాడవా (గానం: పిఠాపురం, జమునారాణి, రచన: సదాశివబ్రహ్మం). వీరిదే మరో రచన -ఓ చందమామ ఇటు చూడరా (ఓ బాబు జర్‌దేఖ్‌జా- బడాభాయి ట్యూన్. గానం: కె రాణి బృందం) ఎంఎన్ రాజ్యం, రమణమూర్తి తదితరులపై చిత్రీకరణ ఎంఎన్ రాజ్యం నృత్య గీతం -జాబిల్లి వెలుంగున కాళింది చెంత (గానం: కె.రాణి, రచన: సదాశివబ్రహ్మం). దేవిక, యన్‌టిఆర్‌లపై చిత్రీకరించిన హాయైన గీతం -రేయిమించెనోయి రాజా (గానం: పి సుశీల, రచన: సదాశివబ్రహ్మం). కొసరాజు రచించిన గీతాలు -ఆశలే అలలాగ ఊగెనే (గానం: ఘంటసాల). రేలంగి, గిరిజలపై పడవపై నదిలో చిత్రీకరించారు. మరో గీతం ఆర్ నాగేశ్వరరావు, రౌడీలముందు గిరిజ చేసే నృత్య గీతం -వనె్నలు చిలికే చిన్నదిరా (గానం: జమునారాణి). బడాభాయిలో కదంబడే జాయేగా ట్యూన్‌లో ‘జయము నిశ్చయమ్మురా’ (రచన: కొసరాజు). ఆ చిత్రంలోని చోటీచోటీ దిల్ గాలగాన్ పాట ట్యూన్‌లో రమణమూర్తి, కుసుమకుమారిపై ఎవిఎం స్టూడియో గార్డెన్స్‌లో చిత్రీకరించిన గీతం -కలకల విరిసి జగాలే (రచన: శ్రీశ్రీ, గానం: ఘంటసాల, పి సుశీల). ఈ చిత్రంలోని గీతాలన్నీ అలరించేలా సాగటం, శ్రోతలను నేటికీ అలరించటం హర్షణీయాంశం.
‘శభాష్‌రాముడు’ చిత్రం ఘన విజయం సాధించింది. చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేసి, తెలుగు చిత్రంతోపాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల చేశారు. 60 సంవత్సరాలుగా స్ఫూర్తిదాయకంగా చిత్రంలోని ‘జయమ్ము నిశ్చయమ్మురా’ గీతం నిలవటం, ఇప్పటివరకే కాదు మరెప్పటికీ ఆ స్ఫూర్తిని మరింతగా పెంపొందిస్తుందని, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మహాకవుల కలానికిగల శక్తిని రుజువు చేస్తుందని ఆశిద్దాం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి