ఫ్లాష్ బ్యాక్ @ 50

నిండు హృదయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలరుహ ప్రొడక్షన్స్ పతాకంపై మిద్దే జగన్నాథరావు 1957లో నిర్మించిన చిత్రం -రాజనందిని. నటుడు యన్టీ రామారావుతోవున్న స్నేహం కారణంగా, ఈయన రూపొందించిన పలు చిత్రాలకు యన్టీఆరే హీరోగా నటించారు. 1964లో మహలక్ష్మి ప్రొడక్షన్స్‌పై ఓ తమిళ సినిమాను తెలుగులో ‘మాస్టారమ్మాయి’ పేరిట డబ్బింగ్ చేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామి (ఎస్‌విఎస్) ఫిల్మ్ బ్యానర్‌పై 1967లో ‘నిండు మనసులు’, 1968లో ‘కలిసొచ్చిన అదృష్టం’ చిత్రాలను రూపొందించారు. 1969లో జగన్నాథరావు రూపొందించిన చిత్రం ‘నిండు హృదయాలు’. ఈయన 1970లో ‘చిక్కమ్మ’ (కన్నడం), ‘నిండు దంపతులు’, నూరాండు కాలమ్‌వాళగ్ (తమిళం), 1972లో డబ్బుకులోకం దాసోహం చిత్రాలు నిర్మించారు. అక్టోబర్ 22, 1972లో మిద్దే జగన్నాథరావు మరణించారు. తరువాత వారి కుమారులు 1975 నుంచీ ఎస్‌విఎస్ బ్యానర్‌పై మరికొన్ని చిత్రాలు రూపొందించారు.
1930 ఫిబ్రవరి 19న విజయవాడలో జన్మించారు కాశీనాథుని విశ్వనాథ్. బిఎస్సీ డిగ్రీ పొంది, వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ విభాగంలో ఇంజనీరుగా రాణించారు. ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకునిగా ‘ఇద్దరు మిత్రులు’ నుంచి ‘తేనెమనసులు’ వరకూ తమ ప్రతిభ చూపారు. అన్నపూర్ణా ‘ఆత్మగౌరవం’తో దర్శకునిగా ప్రస్థానం మొదలుపెట్టి కళాత్మక చిత్రాల దర్శకునిగా ఘనత వహించి పద్మశ్రీ బిరుదు పొందారు. విశిష్ట దర్శకుడు కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నిండుహృదయాలు’. నిర్మాత మిద్దే జగన్నాథరావు. 1969 ఆగస్టు 15న సినిమా విడుదలైంది.
అక్కినేని సరసన తొలిసారి నాయికగా ‘ఆత్మీయులు’ చిత్రంలో, యన్టీ రామారావు సరసన తొలిసారి నాయికగా ‘నిండుహృదయాలు’లో వాణిశ్రీ నటించటం విశేషం. ఇద్దరు అగ్ర హీరోలతో ఓకే ఏడాదిలో నాయికగా నటించారు.
కథ: నాగర్ కోయిల్ పద్మనాభన్, మాటలు: సముద్రాల రామానుజాచార్య, సంగీతం: టివి రాజు, నృత్యం: చిన్ని, సంపత్, కళ: తోట, కూర్పు: బి గోపాలరావు, స్టంట్స్: సాంబశివరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె విశ్వనాథ్, నిర్మాణ నిర్వహణ: యం చంద్రకుమార్, నిర్మాత: యం జగన్నాథరావు
దురాశపరుడు, దుష్టుడు వీర్రాజు (సత్యనారాయణ). ఆర్టిస్టు శ్రీ్ధర్ (త్యాగరాజు) సాయంతో ప్రెస్ ఓనర్ ప్రసాద్ (రేలంగి), కామినీదేవి (మోహన్) దొంగనోట్లు ప్రింట్ చేస్తారు. పని పూర్తికాగానే శ్రీ్ధర్‌ను దారుణంగా అంతం చేస్తాడు వీర్రాజు. శ్రీధర్ కుమారుడు గోపి (మాస్టర్ రాజ్‌కుమార్) వీర్రాజుపై పగ పెంచుకుంటాడు. వీర్రాజు పథకం ప్రకారం ప్రసాద్‌కు విషమిచ్చి, అతని కూతురు శారదను తనతో తీసుకెళ్తుంది కామిని. వీర్రాజు, కామిని ఊరొదిలి వెళ్లటంతో, పోలీసులు వీర్రాజు భార్య జానకి (రుక్మిణి)ని అరెస్ట్ చేస్తారు. వారి కొడుకు చిట్టిబాబు అనాధగా మిగులుతాడు. అతనికి ఆ ఊళ్లో మరో అనాధ మారుతి (మాస్టర్ విశే్వశ్వరరావు) తోడుగా నిలుస్తాడు. తండ్రికోసం అలమటించే గోపి కూడా వారితో కలుస్తాడు. ఈ ముగ్గురూ కానిస్టేబుల్ (మిక్కిలినేని) సాయంతో పెద్దవారవుతారు. ఆ ఊళ్లో గోవిందయ్య (అల్లు రామలింగయ్య) ఇంట్లో వీరు అద్దెకు చేరతారు. పెద్దవాడు గోపి టికెట్ కలెక్టర్‌గా, రాము (శోభన్‌బాబు) ఉద్యోగిగా, మారుతి (చలం) టైలరుగా జీవిస్తుంటారు. అనుకోని సంఘటనలో జానకి వీరికి తల్లిగా తోడై ఆప్యాయత అందిస్తుంది. కామిని ఇచ్చిన విషంతో పిచ్చివాడిగా మారిన ప్రసాద్, కూతురికోసం ఆవేదనతో డాక్టరు శారద (వాణిశ్రీ) పనిచేస్తున్న ఆస్పత్రికి చేరతాడు. రాజశేఖరంగా పేరు మార్చుకున్న వీర్రాజు, ఆ ఊళ్లో ధనవంతునిగా, పుణ్యమూర్తిగా, మంచివాడిగా గౌరవించబడుతుంటాడు. అదే ఊళ్లో వేశ్య అనసూయ (్ఛయాదేవి) కుమార్తె గీత (చంద్రకళ)ను లోబర్చుకోబోయిన రాజశేఖరాన్ని గోపి గుర్తుపడతాడు. అతన్ని గుర్తించిన రాజశేఖర్, తన చేతి గుర్తులు కూతురు శారదచే తొలగింప చేసుకుంటాడు. పరస్పరం ప్రేమించుకుంటున్న శారద, గోపిల మధ్య ఇది సంఘర్షణకు దారితీస్తుంది. గోవిందయ్య కూతురు లలిత (గీతాంజలి) రామును ప్రేమించి, గోపి అంగీకారంతో వివాహం చేసుకుంటుంది. మారుతి ఇష్టపడిన గీతతో అతని వివాహం జరిపించి, గోపి ఇంటికి తీసుకొస్తాడు. లలిత అహంకారపూరిత స్వభావంవల్ల గోపి, మారుతి, ఇల్లొదిలి వెళ్లాల్సి వస్తుంది. రాము తన కుమారుడేనని గ్రహించిన జానకి, తనను కలిసిన రాజశేఖరంతో చెప్పటం, రాజశేఖరాన్ని అంతం చేయటానికి ముగ్గురు అన్నదమ్ములు ఏకంకావటం, చివరలో రాజశేఖరం.. గోపీ చేతిలో గాయపడి, భార్య వద్దకు వచ్చి పశ్చాత్తాపపడి, నేరాన్ని తనమీద వేసుకున్న గోపిని విడుదల చేసి జైలుకెళ్లటం, అంతకుముందు జరిగిన తుపాకి దాడిలో జానకి, భర్తముందే జైలులో మరణించటం, శారద, గోపిల కలయికతో చిత్రం శుభంగా ముగుస్తుంది. సినిమాలో ఇంకా విజయశ్రీ, వై విజయ తదితర నటులు నటించారు.
చిత్ర దర్శకుడు విశ్వనాథ్ కథానుగుణంగా సన్నివేశాలను తీర్చిదిద్దారు. చిత్ర ప్రారంభంలో త్యాగరాజును రప్పించిన సత్యనారాయణ, తన అనుచరుడిని విద్యుత్ షాక్‌తో అంతం చేయటంతో -ఆ పాత్ర లక్షణాలను దర్శకుడు వెల్లడించాడు. అతి క్రూరంగా శ్రీ్ధర్‌ను అంతం చేయటం, ఆక్రమంలో శ్రీధర్ తనను తాను రక్షించుకోవటానికి ప్రయత్నించటం, తన కొడుకు గోపిని రక్షించటానికి ప్రయత్నించటంలాంటి సన్నివేశాలు ఎంతో విపులంగా చిత్రీకరించారు. గోపి తప్పించుకుని వెళ్లిన తరువాత.. తనవంటి మరో ఇద్దరితో కలిసి ఆనందంగా ఎదుగుతున్న తీరును -మనిషి మనిషిగా పురోగమిస్తే మంచిగ కలిసి బ్రతికితే బలముంది అనే సందేహంతో పూర్తి చేయటం, వారి ముగ్గురి అనుబంధం, ఒంటరైన జానకి తల్లిగా వారి పంచన చేరి వారికి ఆత్మీయత పంచటం లాంటి సన్నివేశాలు ఆర్ధ్రతగా సాగుతాయి. రాము-లత, గీత- మారుతి పెళ్లి గొడవల కారణంగా, మారుతి, గోపి ఇల్లొదిలి వెళ్లటం, తిరిగి వారిపై విషాదంగా -ఒకటి, రెండు, మూడు పాట చిత్రీకరణతో వారి వారి సంఘర్షణలను ఎంతో ఉన్నతంగా చిత్రీకరించాడు దర్శకుడు. సంఘంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతోన్న రాజశేఖరమే వీర్రాజు అన్న విషయాన్ని గోపి గుర్తుపట్టి, చంద్రకళ ఇంట్లో ఓ పాట ద్వారా అతని నిజస్వరూపం తెలుసుకోవటంలాంటి సన్నివేశాలు కథలో ఆడియన్స్‌ని లీనం చేస్తాయి. నిజం తెలుసుకోడానికి కూతురు శారద ప్రయత్నిస్తూ, గుర్తులు మాపుకున్న రాజశేఖరంతో తుపాకిని గురించి ఓ డైలాగు చెబుతుంది. ‘్భగవంతుడు దీన్ని మూగగా మార్చింది, సత్యానికి కీడు చేయటానికేనా నాన్నా’, ‘నీకు సహకరించిన నేనూ దోషినేగా’ అనే భావోద్వేగ సన్నివేశం చిత్రానికి కొత్తబలం చేకూరుస్తుంది. శారదను గోపి -‘నిజం దాచావు. నా తండ్రి దారుణంగా మరణించటం చూసిన పగ నాది’ అని నిందిస్తాడు. ఈ సన్నివేశంలో యన్టీ రామారావు తన బాధను భావోద్వేగ గంభీరంగా చూపించటం, దానికి వాణిశ్రీ రియాక్షన్ సన్నివేశానికి పరిపూర్ణత చేకూరింది. చివర కామినీదేవిని హత్యచేసి వీర్రాజు తప్పించుకోవటం, అతన్ని గోపి వెంబడించి ఒక ప్రెస్‌లో అతనిపై దాడిచేయటం, మిషన్ కిందకు వీర్రాజును నెట్టడం, రౌడీలతో స్టంట్స్ సన్నివేశంలో చలం చేసే సాయం, తన పగ తీరేలా సత్యనారాయణపై యన్టీఆర్ విజృంభణ సన్నివేశాలను థ్రిల్లింగ్‌గా చిత్రీకరించారు. జానకి గాయాలతో ఇంటికొచ్చి, తన కొడుకు రామూను చిట్టిబాబుగా తెలిసికొని ఆనందించటం, తమను తల్లిలా పోషించిన జానకికోసం, రామూ పోలీసులకు తానే కామినిని హత్యచేశానని లొంగిపోవటం, ఎవరిని నొప్పించని నిష్కల్మషమైన నిండు హృదయం నీది అంటూ టైటిల్ జస్ట్ఫికేషన్‌గా వాణిశ్రీ, యన్టీఆర్‌తో అనటం, భర్తకు శిక్ష పడకూడదని విషం త్రాగి జైలువద్దకు వచ్చిన రుక్మిణి.. భర్త ఎదుట బిడ్డల చేతుల్లో కన్నుమూయటం, అదృష్టం మీ నిండు హృదయాలు అని మరోసారి టైటిల్ జస్ట్ఫికేషన్ ఇవ్వటం, ‘చంపాలనుకున్నవాడికి, ప్రాణదానం చేసే నిండు హృదయం నీదని’ సత్యనారాయణ.. ఇలా రచయిత సముద్రాల (జూ) పరిపక్వతతో కూడిన సందర్భానుగుణమైన ఇంపైన సంభాషణలను కూర్చటం సన్నివేశాలు అర్ధవంతమైనవిగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు కె విశ్వనాథ్. పాత్రోచితమైన హావభావాలతో యన్టీ రామారావు, వాణిశ్రీ మిగిలిన పాత్రధారులూ సముచిత నటనతో మెప్పించారు. వేశ్య కూతురుగా గీత -ఓ గొప్ప జీవితం గడపాలనే తపన, గీతాంజలితో భేటీ సన్నివేశాలలో మంచి నటన చూపారు.
చిత్ర గీతాలు: టివి రాజు సంగీతంలో పాటలు అలరించేలా సాగాయి. సి నారాయణ రెడ్డి రచించిన టైటిల్ సాంగ్ -ఒకటి రెండు మూడు. ఆనందగీతంగా ఎల్‌ఆర్ ఈశ్వరి, వసంత, ఘంటసాల; విషాదంలో ఘంటసాల ఆలపించారు. సత్యనారాయణ ముందు చంద్రకళ, విజయనిర్మల నృత్యగీతం -మరి మరి విన్నానులే నీవే (గానం: పి సుశీల, ఎల్‌ఆర్ ఈశ్వరి, రచన: దేవులపల్లి కృష్ణశాస్ర్తీ). రుక్మిణి భర్తను గుడిలో చూసినప్పటి గీతం -ఏడుకొండల సామి..(గానం: పఠాభి, వసంత, రచన: సముద్రాల, కె విశ్వనాథ్). మిగిలిన గీతాలన్నీ సినారె రచించారు. చంద్రకళ, యన్టీఆర్, శోభన్‌బాబు, చలం, సత్యనారాయణలపై హిట్ సాంగ్ -అద్దంలాంటి చెక్కిలి చూసి (గానం: పి సుశీల, ఘంటసాల). వాణిశ్రీ, యన్టీఆర్‌లపై వెనె్నలలో ఆహ్లాదకరంగా చిత్రీకరించిన గీతం -రామాలాలీ మేఘ శ్యామాలాలీ (గానం: పి సుశీల). రైలులో వాణిశ్రీ, స్నేహితురాలిపై చిత్రీకరించిన గీతం -ఓ ప్రియా, ఓ ప్రియా (గానం: పి సుశీల). శోభన్‌బాబు, గీతాంజలి, చలం, చంద్రకళపై చిత్రీకరించిన గీతం -మెత్తమెత్తని సొగసు వెచ్చవెచ్చని వయసు (గానం: ఎస్పీ బాలు, ఎల్‌ఆర్ ఈశ్వరి)
ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా పబ్లిసిటీ పోస్టర్‌పై ‘సమైక్యతతో మనదేశం స్వాతంత్య్రం సాధించింది’ అంటూ -సంఘీభావంలోని శక్తినిచాటిన చిత్రం -నిండు హృదయాలు. అలాగే 505 రోజు పోస్టర్‌పై ‘ఎక్కడికి వెళ్తున్నారని ఎవరిని అడిగినా’ అదేమాట ‘నిండు హృదయాలు’ చూడండి. ఎందుకో తెలుసా అది ఉత్తమ చిత్రం కనుక -అంటూ తమాషా వెరైటీ పబ్లిసిటీ ఇవ్వటంకూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవటం హర్షణీయం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి