ఫ్లాష్ బ్యాక్ @ 50

ఆత్మీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడకు చెందిన కాట్రగడ్డ శ్రీనివాసరావు అక్కడే విద్యనభ్యసించి బెనారస్ యూనివర్సిటీలో బికాం పూర్తి చేశారు. రాజకీయాల్లో కొంతకాలం చురుకుగా పాల్గొన్నారు. కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య ప్రోత్సాహంతో విజయవాడలో ‘నవయుగ ఫిలింస్’ పంపిణీ సంస్థ ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు రెండు వేల పైచిలుకు చిత్రాలను పంపిణీ చేశారు. అన్నపూర్ణా పిక్చర్స్‌లో భాగస్వామిగా, మరికొన్ని చిత్రాలకు పరోక్షంగా నిర్మాతగానూ వ్యవహరించారు. వీరి సహకారంతో వై రామకృష్ణప్రసాద్ హైద్రాబాద్‌లో సారథి స్టూడియోస్ స్థాపించి, ఆ బ్యానర్‌పై ‘కలసి ఉంటే కలదు సుఖం’, ‘ఆత్మబంధువు’, ‘కుంకుమ రేఖ’, ‘్భగ్యదేవత’ వంటి చిత్రాలు రూపొందించారు. తరువాత కాట్రగడ్డ శ్రీనివాసరావు ఆధిపత్యంలోకి సారథి స్టూడియోస్ రావటంతో, ఆ బ్యానర్‌పై అన్నపూర్ణ పిక్చర్స్, దుక్కిపాటి మధుసూధనరావులు నిర్మాతలుగా సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ఆత్మీయులు’. 1969 జూలై 17న సినిమా విడుదలైంది.
మధుసూధనరావు ఊరి పక్క గ్రామంలో ఓ భూస్వామికి, ఇతర పొలం వ్యక్తుల మధ్య నీటి తగాదా తలెత్తింది. ఆ తగాదా కారణంగా తలెత్తిన కొట్లాటల్లో.. భూస్వామి ప్రాణాలు కాపాడే యత్నంలో పాలేరు మరణించాడు. అందుకు భూస్వామి కృతజ్ఞతతో.. పాలేరు పిల్లల్ని పెంచి పెద్దచేయటం జరిగింది. కథలో సహజత్వానికి ప్రాముఖ్యతనిచ్చే మధుసూదన రావు, ఈ అంశాన్ని ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణికి వివరించి ఓ కథ తయారు చేయమని కోరారు. ఆమె ఆ సంఘటనకు చక్కని జిగి, బిగి జోడించి అన్నాచెల్లెలు సెంటిమెంటుతో కూడిన కథను రూపొందించారు. కథకు తగిన సంభాషణలు తయారు చేసే బాధ్యతను ప్రముఖ నాటక రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తికి అప్పగించారు. అప్పటికి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు హిందీ సినిమా దర్పణ్ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో -వి మధుసూధనరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అప్పటికి హీరోయిన్‌గా కృష్ణ సరసన నటించి ప్రత్యేకత పొందిన వాణిశ్రీని, అక్కినేని సరసన జంటగా నిర్మాతలు నిర్ణయించారు. అలా వాణిశ్రీకి అన్నపూర్ణా సంస్థలో తొలి అవకాశం, అక్కినేనితో హీరోయిన్‌గా నటించే గొప్ప అవకాశం ‘ఆత్మీయులు’ చిత్రం ద్వారా లభించాయి. అక్కినేని చెల్లెళ్లుగా చంద్రకళ, విజయనిర్మల నటించారు.
కథ: యద్దనపూడి సులోచనారాణి, సంగీతం: ఎస్ రాజేశ్వరరావు, నృత్యం: తంగప్ప, పసుమర్తి కృష్ణమూర్తి, ఛాయాగ్రహణం: పి సెల్వరాజ్, కళ: జివి సుబ్బారావు, కూర్పు: ఎంఎస్ మణి, స్టంట్స్: రాఘవులు అండ్ పార్టీ, దర్శకత్వం: వి మధుసూధనరావు, నిర్మాత, కథ సినిమా అనుసరణ: దుక్కిపాటి మధుసూధనరావు
భూస్వామి జగన్నాథాన్ని (గుమ్మడి) పొలం తగాదాల్లో జరిగిన కొట్లాట నుంచి కాపాడే యత్నంలో పాలేరు వీరయ్య (్ధళిపాళ) మరణిస్తాడు. గర్భవతియైన వీరయ్య భార్య, పిల్లలు సూర్యం, సీతల పోషణకై వీరయ్య చెల్లెలు మహంకాళి (సూర్యాకాంతం)కి జగన్నాథం 10వేల రూపాయలు ఇస్తాడు. న్యాయమూర్తి అయిన అన్న రాజారావు (నాగభూషణం) సలహాతో తన కొడుకుతో పట్నం మకాం మారుస్తాడు. వీరయ్య భార్య ఓ ఆడపిల్లకు జన్మనిచ్చి ఆస్పత్రిలో మరణిస్తుంది. ఆ బిడ్డను సంతానం లేని నాంచారి (రాధాకుమారి), చిదంబరం (్భనుప్రకాష్) దంపతులకు 50 రూపాయలకు మహంకాళి అమ్మేసి, తల్లీ పిల్లా ఇద్దరూ మరణించారని అందరికీ చెబుతుంది. ఇక సూర్యం, సీతలు.. మేనత్తపెట్టే కష్టాలు తట్టుకోలేక పట్నం పారిపోతారు. అక్కడ ఓ హోటలు యజమాని ఆశ్రయం పొందుతారు. కష్టపడి చదివిన సూర్యం, బిఏలో యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడు. సీత (చంద్రకళ) అన్నవద్ద నేర్చిన చదువుతో బుద్ధిమంతురాలైన యువతిగా పేరు తెచ్చుకుంటుంది. వీరిగురించి తెలుసుకున్న జగన్నాథం, తన ఇంటికి రప్పించి కొడుకు చంద్రం (చంద్రమోహన్)తో సీత పెళ్లి జరిపిస్తాడు. చిదంబరం ఇంట పెరిగిన సరోజ (విజయనిర్మల) ఆస్తి ఆడంబరాల పట్ల మోజుతో మహాలక్ష్మి కొడుకు చిట్టి (పద్మనాభం) లక్షాధికారి అని నమ్మి అతన్ని ప్రేమిస్తుంది. అది నిజంకాదని చంద్రం సరోజకు చెబుతాడు. సరోజను చంద్రం ఇష్టపడినా, బుద్ధిమంతురాలైన సీతతో పెళ్లి జరిపిస్తాడు తండ్రి. రాజారావు కుమార్తె జయ (వాణిశ్రీ) సూర్యం (అక్కినేని)ని ఇష్టపడుతుంది. అతడు పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా ఆ వూరికి డ్యూటీపై వచ్చి, సరోజ తన చెల్లెలేనని తెలుసుకుంటాడు. ఆమెను సదానందం (ప్రభాకరరెడ్డి) అల్లరి పెట్టడం గ్రహించి, సరోజకు తన క్వార్టర్స్‌లో ఆశ్రయమిస్తాడు. తానెవరో ఎవరికీ తెలియచేయ వద్దన్న సరోజ కోరికమీద సూర్యం ఆ విషయం ఎవరికీ చెప్పడు. అయితే, చిట్టి- సరోజల పెళ్లి చేయాలన్న సూర్యం ఆలోచన తెలిసిన మహంకాళి ఆమెపై హత్యాయత్నం చేస్తాడు. ఆ పని చంద్రం చేశాడేమోనని భావించిన సూర్యం, నేరాన్ని తనమీద వేసుకొని సస్పెండై జైలుకెళ్తాడు. ఆస్పత్రిలో కోలుకున్న సరోజ నిజం బయటపెట్టడంతో, సూర్యం నిర్దోషిగా విడుదలవుతాడు. జయ -సూర్యం, సరోజ -చిట్టిల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. చిత్రంలో జయ తల్లిగా రుక్మిణి, ఇంకా ఉషాబాల, సరస్వతి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
‘సతీతులసి’ పౌరాణిక చిత్ర దర్శకుడిగా, ఆపై జగపతివారి ‘అన్నపూర్ణ’తో పలు సాంఘిక చిత్రాలను విజయవంతంగా రూపొందించి.. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న మధుసూధనరావు ఈ చిత్రాన్ని సహజ సన్నివేశాలతో ఎంతో ఉన్నతంగా రూపొందించారు. అన్న కుటుంబం కోసం యజమాని ఇచ్చిన సొమ్మును మహంకాళి స్వాహా చేయటం.. పురిటిలోని ఆడపిల్లను డబ్బుకోసం అమ్మివేయటం.. సూర్యం సీత ఓ హోటల్‌లో పనికి కుదిరి, చెల్లికి చదువు చెబుతూ తానూ విద్యావంతుడు కావటం.. సర్వర్ పని కొనసాగిస్తూ జయతో భేటీ, ఆమె సూర్యపై ఆశలు పెంచుకోవటం.. అలాగే మధ్యతరగతికి చెందిన కొందరు ఆడపిల్లల్లో ఆడంబరాల పట్ల మోజుతో సరోజలాంటి అమ్మాయిలు ఎదుర్కొనే ఇబ్బందులు, అల్లరి పడటం.. నీతి తప్పకపోయినా, ఎంత మంచిగావున్నా కలిగే అనర్థాలు (నేటికి మరింత విషమంగా మారుతున్న పరిస్థితులు).. ఇలా చిన్న చిన్న సన్నివేశాలతోనే ఓ అద్భుత చిత్రంగా మలిచాడు దర్శకుడు.
ఇక -నటి విజయనిర్మల ఆ పాత్రకు తగిన అభినయాన్ని నేర్పు, ఈజ్‌తో ప్రదర్శించారు. ఆదర్శవంతమైన యువకునిగా, బాధ్యతాయుతమైన అన్నగా సూర్యం పాత్రను తీర్చిదిద్దితే, దాన్ని అక్కినేని పరిపూర్ణంగా నటనలో ఆవిష్కరించగలిగారు. ఒక దశలో అన్నను అనుమానించబోయిన సీత, సరోజను చేరదీయవద్దని హెచ్చరించినుపుడు, దానికి సూర్యం రియాక్షన్ అద్భుతంగా పలికించారు. ‘సీత పెళ్లితో వరస కలిసిందని’.. ఆనందంలో జయ, సూర్యంల యుగళగీత చిత్రీకరణ ‘చామంతీ ఏమిటే ఈ వింత’ (గానం: ఘంటసాల, పి సుశీల, రచన: సినారె), అలాగే సరోజ పుట్టినరోజు సందర్భంగా యువకుల లక్షణాలను పాటలో చిత్రీకరించి, చివర్లో ఏఎన్‌ఆర్ -చరణం ‘ఈరోజుల్లో పడుచువారు, సహనంలో కిసాన్‌లు, సమరంలో జవాన్‌లు’ అంటూ దేశ గౌరవం నిలబెట్టేలా వారిని పొగడి సందేశాత్మకంగా ముగింపు ఇవ్వటం, కాలేజీ వార్షికోత్సవంలో వాణిశ్రీ, నాగేశ్వరరావులపై గీతం ‘అమ్మబాబో నమ్మరాదు’ (గానం: ఘంటసాల, పి సుశీల)లో రచయిత కొసరాజుచే విద్యార్థులు మార్కుల కోసం తండ్రులను తీర్థయాత్ర తిప్పుతారు.. అంటూ నాటినుంచి నేటికీ మరింతగా అమలవుతున్న విధానం రంజుగా విన్పించటం.. ఇలా అర్థవంతమైన అంశాలతో చిత్రీకరణ ఉన్నతంగా సాగింది. చిత్రంలో సన్నివేశాలు.. నటీనటుల పాత్రోచితమైన అభినయంతో మరింత రాణింపు కలిగించి మెప్పించాయి. ‘నువ్వు కన్‌ప్యూజై నన్ను కన్‌ఫ్యూజ్ చేయకు’ అంటూ నాగభూషణం తమ్ముడు గుమ్మడిని, భార్యను పదే పదే హెచ్చరించటం.. ఎంతో ఉదాత్తత, అణుకువ కలిగిన తమ్ముడిగా గుమ్మడి నటన.. అక్కినేనితో జంటగా 4 గీతాల్లో, ఇతర సన్నివేశాల్లో చురుకుగా వాణిశ్రీ, చెల్లెలు సీతగా చంద్రకళ, విజయనిర్మల తమ ప్రత్యేకతను నటలో చూపారు.
చిత్రగీతాలు: అక్కినేని, చంద్రకళలపై చిత్రీకరించిన గీతం -అన్నయ్య కలలే పండెను (గానం: పి సుశీల, ఘంటసాల, రచన: సినారె). యువతకు సందేశాత్మకంగా సాగిన గీతం -ఈరోజుల్లో పడుచువారు (గానం: పి సుశీల, ఘంటసాల బృందం, రచన: సినారె). మహాకవి శ్రీశ్రీ రచించిన యుగళగీతం.. వాణిశ్రీ, అక్కినేనిలపై చిత్రీకరణ -కలలో పెళ్లిపందిరి కనబడసాగే (గానం: పి సుశీల, ఘంటసాల). చంద్రకళ, చంద్రమోహన్, విజయనిర్మలపై చిత్రీకరించిన గీతం -చిలిపి నవ్వుల నిను చూడగానే (గానం: ఎస్పీ బాలు, పి సుశీల, రచన: దాశరథి). దాశరథి మరో రచన, పి సుశీల గానం చేసిన పాట, వీణపై వాణిశ్రీ పాడుతుండగా చంద్రకళ, ఏఎన్‌ఆర్, గుమ్మడిలపై చిత్రీకరించిన గీతం -మదిలో వీణలు మ్రోగే. వాణిశ్రీ, అక్కినేనిలపై మరో గీతం -స్వాగతం, ఓహో చిలిపి నవ్వుల (గానం: పి సుశీల, రచన: ఆరుద్ర). పద్మనాభం, విజయనిర్మలపై చిత్రీకరించిన టీజింగ్ సాంగ్ -ఏం పిల్లో తత్తరబిత్తరగున్నావు (గానం: పిఠాపురం, రచన: కొసరాజు).
ఈ చిత్రంలో ఛాయాగ్రహ దర్శకుడు పి సెల్వరాజ్ సహకారంతో దర్శకులు మధుసూధనరావు ఎంతో శ్రమతో, పాటల్ని కేరళలో ట్రిచూర్ దగ్గరున్న ప్లీచిడామ్, పాల్ఘాట్‌లో మళంపుర డామ్, ఊటి మొదలైన ప్రాంతాల్లో ఎక్కువ భాగం చిత్రీకరించారు. ‘మదిలో వీణలు మ్రోగే’ వంటి మిగిలిన కొన్ని పాటల్ని సెట్స్‌లో చిత్రీకరించి, పాటల చిత్రీకరణకు ఓ ప్రత్యేకత నిలిచేలా చూపటం చిత్ర విజయంలో ఓ భాగంగా నిలిచిందనుకోవాలి.
ఆత్మీయులు చిత్రం చక్కని కుటుంబ కథాచిత్రంగా ప్రశంసలు పొందింది. 1969 సంవత్సరానికిగాను ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వెండి నందిని అందుకుంది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి