ఫ్లాష్ బ్యాక్ @ 50

సత్తెకాలపు సత్తెయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1930 జూలై 9న తమిళనాడు తంజావూరులో జన్మించారు కైలాసం బాలచందర్. బీఎస్సీ చదివి మద్రాసులో అకౌంట్ జనరల్ ఆఫీసులో పని చేశారు. ఆ సమయంలోనే సర్వర్ సుందరం, మేజర్ చంద్రకాంత్ వంటి నాటకాలు రచించి ప్రదర్శించారు. అవి ప్రేక్షకుల ప్రశంసలు పొందటం, ఆ తరువాత అవి సినిమాలుగా రూపొందటం జరిగింది. వీరు కొన్ని చిత్రాలకు కథలు సమకూర్చటం, మరెన్నో (80కి పైగా) తమిళ, తెలుగు, హిందీ భాషా చిత్రాలకు దర్శకత్వం వహించటం జరిగింది.
చలం కథానాయకుడిగా కె బాలచందర్ దర్శకత్వంలో నిర్మాత వికె ప్రసాద్ నిర్మించి జూన్ 19, 1969న విడుదల చేసిన చిత్రమే -సత్తెకాలపు సత్తెయ్య.
నిర్మాణం: ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్, సంగీతం: ఎంఎస్ విశ్వనాథం, ఎడిటింగ్: ఎన్‌ఆర్ కిట్టూ, మాటలు: పినిశెట్టి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె బాలచందర్.
అయినవాళ్లు ఎవ్వరూలేని అమాయకపు ఒంటరి వ్యక్తి సత్తెయ్య. క్యారేజీలు అందిస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతనిలాగే క్యారేజీలు అందించే మరో యువతి సుబ్బులు (విజయలలిత). ఆ ఊరిలోని కోటీశ్వరుడు, వ్యాపారవేత్త, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మడి. అతని భార్య స్నేహలతాదేవి (ఎస్ వరలక్ష్మి). వారి ఏకైక సంతానం శాంతి (రోజారమణి). ఆ ఊరి పోలీస్ ఆఫీసర్ ప్రసాద్ (శోభన్‌బాబు), అతని తల్లి శాంతమ్మ (హేమలత). క్యారేజీలు మోసుకునే సత్తెయ్యను శాంతమ్మ కన్నకొడుకులా ఆదరిస్తుంటుంది. అదే వూరిలో మంచితనం, అందం కలబోసిన కాలేజీ విద్యార్థిని రాధ (రాజశ్రీ). కాలేజీ ఫీజు కట్టమని రాధ ఇచ్చిన డబ్బులు సత్తెయ్య అమాయకంగా పోగొడతాడు. ఆ సంఘటన ద్వారా రాధకు, ప్రసాద్‌కు పరిచయం కలిగి ప్రేమగా మారుతుంది. తమ తమ కార్యక్రమాలలో బిజీగా వున్న తల్లిదండ్రులతో సమయం గడిపే అవకాశం లేక, ఇంట్లో నౌకర్లు, అమ్మమ్మ (ఋషేంద్రమణి)తో ఉండే శాంతి ఒంటరిగా బాధపడుతుంటుంది. మీటింగ్‌లోవున్న తల్లిని కలుసుకోవాలని వెళ్ని శాంతి జనంలో తప్పిపోయి సత్తెయ్య గుడిసెకు చేరుకుంటుంది. అతని అమాయకత్వం చూసి అతనిపై అభిమానం పెంచుకుంటుంది. తన తల్లితండ్రులను కలిశాక కూడా సత్తెయ్య, శాంతిని ఆమె స్కూలువద్ద కలుసుకోవటం, వారి వాత్సల్యం అభివృద్ధి చెందటం జరుగుతుంది. ప్రసాద్‌కు పెళ్లి కుదిరిన సందర్భంగా శాంతమ్మ ఇచ్చిన మిఠాయిలో ఎవరో దొంగ విషం కలపటం, అది తెలియక శాంతికి సత్తెయ్య ఇవ్వటంతో.. శాంతి ఆరోగ్యం విషమిస్తుంది. దీంతో శాంతిని కలుసుకోవద్దని ఆమె తల్లితండ్రులు శాసిస్తారు. శాంతి కోరినట్టు పోలీసు అయి శాంతిని కలుసుకోవాలని సత్తెయ్య ప్రయత్నాలు చేయటం, ఒక దొంగల ముఠాను పట్టిచ్చినందుకు అతనికి పోలీసుగా ప్రభుత్వం ఉత్తర్వు ఇవ్వటం, అ డ్రెస్‌తో శాంతిని చూడటానికి వెళ్లిన సత్తెయ్య పిలుపు, పాటవిని శాంత కోలుకోవటం, సుబ్బులుతో సత్తెయ్యకు వివాహం జరగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
చిత్రంలో ఇంకా ఆనందమోహన్, సెక్రటరీగా రావికొండలరావు, వేళంగి, ఝాన్సీ, డాక్టర్ శివరామకృష్ణయ్య, అతిథి నటులుగా నాగేష్, మనోరమ నటించారు.
సున్నితమైన మానవీయ సంబంధాలను ఎంతో హృద్యంగా చిత్రీకరించి ప్రత్యేకత చూపించే దర్శకులు బాలచందర్. ఈ చిత్రంలోనూ మంచితనం, అమాయకత్వం కల ఒంటరి వ్యక్తిగా సత్తెయ్య పాత్రను చిత్రీకరించారు. మరోపక్క సంఘంలో పదవి, ఐశ్వర్యం కలిగిన తల్లిదండ్రులున్నా ఒంటరితనంతో బాధపడే తెలివిగల అమ్మాయిగా శాంతి పాత్రను చిత్రీకరించి.. వారిమధ్య అనుబంధాన్ని ఎంతో అర్ధవంతంగా తీర్చిదిద్దారు దర్శకుడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సత్తెయ్య ఇంటికి శాంతి వచ్చి ఆ ప్రయత్నాన్ని నివారించే సందర్భంలో ఆ గుడిసెలో చిత్రీకరించిన పాట ‘బుజ్జి నువ్వు’ అద్భుతంగా ఉంటుంది. శాంతిని గుడ్డ వూయల్లో, నవారు లేని మంచంలోవుంచి పాడటం, తిరిగి శాంతి.. సత్తెయ్యతో అదే పాట రిపీట్ చేయటం దర్శకుడు బాలచందర్ ప్రతిభకు అద్దంపడుతుంది. తప్పిపోయిన శాంతి తిరిగి ఇంటికి చేరిన తరువాతా.. సత్తెయ్యకు చదువునేర్పటం, అతనితో ఊరంతా తిరుగుతూ పోలీస్ ఉద్యోగం చేయమని కోరటం, పేరెంట్స్ మీటింగ్‌కు తల్లితండ్రులకు వీలుకాకపోవటంతో సత్తెయ్య తీసుకెళ్లటం, అతన్ని దండతో గౌరవింపచేయటం.. ఇలా వారిమధ్య అనుబంధాన్ని చక్కగా పద్ధతిలో నడిపించే తీరులో బాలచందర్ రూపొందించిన సన్నివేశాలు భావోద్వేగంతో సాగుతాయి. శాంతి-సత్తెయ్య మధ్య స్నేహానికి శాంతి తల్లిదండ్రులు కోపించిన సందర్భంలో సత్తెయ్య వారి ప్రవర్తనను ఎత్తిచూపటం అమాయకుడిలోని ధైర్యసాహసాలకు ప్రతీకగా సహజంగా సన్నివేశాన్ని రూపొందించారు. ఆ తరువాత శాంతికి దూరంగా ఉంటానని చెప్పటం, ఒక సందర్భంలో మిఠాయి పెట్టినపుడు శాంతి స్నేహితులు దాన్ని తినకపోవటం, శాంతి ఒక్కతే ఉక్రోషంతో తినటం, దాని పర్యవసానంగా సత్తెయ్య దోషిగా జైలుకు రావటం, తనవల్ల ప్రసాద్ పెళ్లి ఆగిపోకూడదని వాదించి.. రాధ, ప్రసాద్‌ల పెళ్లి జరిగేలా సత్తెయ్య చేయటం.. వారు జైలుకువచ్చి సత్తెయ్య చేత అక్షింతలు వేయించుకోవటం వంటి హృద్యమైన గుండె బరువెక్కే సన్నివేశాలను దర్శకుడు బాలచందర్ రూపొందించారు. శాంతి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సత్తెయ్య పోలీసు కావాలని కోరటం, చివరకు అది నెరవేరటం.. వీటికి భిన్నంగా రాధ, ప్రసాద్‌ల తొలి ప్రేమ సన్నివేశాలను దర్శకుడు సహజంగా తీర్చిదిద్దారు. రాధ, ప్రసాద్‌ల మధ్య యుగళ గీతం ‘నన్ను ఎవరో తాకిరి/ కన్ను ఎవరో కలిపిరి’ (రచన: ఆరుద్ర, గానం: ఘంటసాల, పి.సుశీల) సినిమాకు హైలెట్. చక్కని పూల తోటలో శిల్పాలు, వంతెనల మధ్య పాటను చిత్రీకరించారు. బ్యాక్‌డ్రాప్‌లో చలం, విజయలలిత రియాక్షన్స్‌ను దర్శకుడు తమాషాగా చూపించారు. అలాగే శాంతి -చలంపై చిత్రీకరించిన మరో గీతం, ఈ సినిమా పేరు చెప్పగానే గుర్తుకొచ్చే హిట్ సాంగ్ -ముద్దు ముద్దు నవ్వు (రచన: ఆత్రేయ, గానం: పిబి శ్రీనివాస్, బెంగుళూరు లత). మరో బిట్ సాంగ్ పిబి శ్రీనివాస్ పాడారు. ఈ చిత్రంలో స్కూలు వార్షికోత్సవంలో నాగేష్, మనోరమ బృందంపై చిత్రీకరించిన -స్వాగతం. ఈ గీతంలో బుద్ధుడితో మొదలుపెట్టి దేశనేతలు గాంధీ, నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్ర్తీలను చూపించారు. అంతేకాదు లాల్‌బహదూర్ శాస్ర్తీ తాష్కెంట్ ఒప్పందం, వారి అంతిమయాత్ర ఘట్టాలు వివరంగా చూపించారు. జై కిసాన్, జై జవాన్ నినాదంతో పాట పూర్తవ్వడం.. (రచన: రాజశ్రీ, గానం: ఎస్పీ బాలు, వసంత బృందం) ఎంతో ఆర్ధ్రత అనిపిస్తుంది. పాటను ప్రత్యేకంగా చిత్రీకరించి వైవిధ్యాన్ని చూపటమే కాదు, ఉత్తేజాన్ని కలిగించారు. మరో రెండు పాటలు.. చలం, రోజారమణిపై -అలాగ చూడు బలే మంచి శాంతమ్మ (రచన: శ్రీశీ, గానం: పిఠాపురం). విజయలలిత, చలంపై మరోగీతం -చిన్నోడు, చిన్నది జతకట్టాలోయ్ మామా (రచన: కొసరాజు, గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి). ఈ చిత్రంలో సత్తెయ్యగా చలం, శాంతిగా రోజారమణి ఎంతో సహజంగా తమ పాత్రలను రక్తికట్టించారు. 1967లో భక్తప్రహ్లాదలో ప్రహ్లాదునిగా రాణించిన రోజారమణి ఈ చిత్రంలో శాంతిగా మరింత వైవిధ్యాన్ని చూపించి పాత్రోచితమైన నటన అలవోకగా ప్రదర్శించింది. పోలీస్ ఆఫీసర్ ప్రసాద్‌గా శోభన్‌బాబు ఆ స్థాయిని చూపిస్తూనే, ఓ ప్రేమికునిగా రాధతో చూపులతోనే ప్రేమను, అనురాగాన్ని ఎంతో సున్నితంగా ప్రదర్శించటం, సత్తెయ్యకు సాయపడుతూ అతన్ని మందలిస్తూ కథాగమనానికి చక్కటి తోడ్పాటు అందించారు. అతని జోడీ రాధగా రాజశ్రీ పాత్రోచిత స్వభావాన్ని తన నటనలో ప్రదర్శించి మెప్పించారు. ఎస్ వరలక్ష్మి, గుమ్మడి వారి స్థాయికితగ్గ నిండుదనాన్ని ప్రదర్శించారు. ‘శాంతి మనసులో సత్తెయ్య స్థానం తనకంటే గొప్పదని, అతనే కోటీశ్వరుడని’ గుమ్మడి.. చలం, శోభన్‌బాబు ముందు వెల్లడించే సందర్భంలో ఆయన నటన ప్రేక్షకుల్లో ఆలోచనలు రేకెత్తేవిధంగా నిలవటం చెప్పుకోదగ్గ అంశం.
సత్తెయ్యను ద్వేషించే అమ్మమ్మ.. ‘అతనికిచ్చిన 1000’ పోలీసు బొమ్మ వద్దవుంచి వెళ్లిపోగా వాటిని తస్కరించే సన్నివేశంలో పెద్దవాళ్ల మనసుల్లోని చిన్న బుద్ధులుని దర్శకుడు అత్యంత సహజంగా చూపించాడు. అలాగే హాస్యంకోసం.. పోస్టుడబ్బా ద్వారా చలం తప్పించుకుంటూ దొంగల ముఠాను తమాషాగా పట్టించటం, ఈ సన్నివేశాల్లో పలువురు హాస్యనటులు పాల్గొనటం గమ్మత్తుగా ఉంటుంది. మిమ్మల్ని కవ్వించి నవ్వించే ఓ అమాయకుని కరుణామయి గాథ అని పోస్టర్‌పై ముద్రింప చేసి, దాని తగ్గట్టు చిత్రాన్ని, సన్నివేశాలని రూపొందించి చక్కని టెంపోతో ఆకట్టుకునేలా రూపొందించారు దర్శకులు.
ఈ చిత్రాన్ని తమిళంలో బాలచందర్ ‘పతమ్ పాశలీ’ పేరిట 1970లో జెమినీ గణేషన్, నాగేష్, రాజశ్రీ, మణిమాల, విజయలలిత, సచ్చు, కాంబినేషన్‌లో నిర్మించారు. ఏప్రిల్ 11, 1970న ఆ సినిమా విడుదలైంది.
1970లోనే ఈ చిత్రాన్ని హిందీలో ‘మస్తానా’ టైటిల్‌తో పద్మిని, మహమూద్, వినోద్‌ఖన్నా, భారతి, రమేష్‌దేవ్, శ్యామా, మనోరమ, టి జయశ్రీలతో రూపొందించారు. నిర్మాత ప్రేమజీ. ఈ చిత్రాన్ని ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించారు. సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సమకూర్చారు. ఆనంద్‌బక్షీ పాటలు వ్రాసిన చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడింది.
1980లో కన్నడంలో ‘మంకుతిమ్మన్న’గా హెచ్‌ఆర్ భార్గవ దర్శకత్వంలో రాజన్- నాగేంద్ర సంగీతంతో నిర్మాత ద్వారకేష్ రూపొందించి, దానిలో ఓ పాత్ర కూడా పోషించారు. శ్రీనాథ్, మంజుల, పద్మప్రియ, బేబీ లక్ష్మి నటించారు. ప్రభాకరరెడ్డి అతిథి నటుడిగా నటించారు. తెలుగు చిత్రం ఇలా మరో 3 భాషల్లో ప్రేక్షకులను అలరించటం, ‘బుజ్జి, బుజ్జి నవ్వు’’, ‘‘నన్ను ఎవరో తాకిరి’’ పాటలు నేటికీ శ్రోతలను స్వర సంగీత కార్యక్రమాల్లో అలరిస్తుండటం విశేషాంశంగా పరిగణించాలి.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి