ఫ్లాష్ బ్యాక్ @ 50

బొమ్మలు చెప్పిన కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శత చిత్ర నిర్మాతగా గిన్నీస్‌బుక్ వరల్డ్ రికార్డు సాధించిన వ్యక్తి దగ్గుబాటి రామానాయుడు. కారంచేడు గ్రామానికి చెందిన ఈయన చిత్ర నిర్మాణంపట్ల ఆసక్తితో తొలుత ‘కాంభోజరాజు కథ’ నిర్మాత భాస్కర్‌రావుతో కలిసి ‘అనురూప ఫిలిమ్స్’ పతాకంపై ‘అనురాగం’ చిత్రం రూపొందించారు. ఆ చిత్రం ఆర్థికంగా అంత విజయం సాధించలేదు. అయినా మరో ప్రయత్నం చేయాలని తమ మిత్రులు జి రాజేంద్రప్రసాద్, సుబ్బారావులు భాగస్తులుగా, పెద్ద కుమారుడు సురేష్ పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘రాముడు- భీముడు’ చిత్రం నిర్మించారు. ఆ చిత్రం విజయవంతమైంది. ఆర్థికంగా లాభాలను కలిగించింది. తరువాత ఈ బ్యానరుపై ‘ప్రతిజ్ఞాపాలన’ (1965), ‘శ్రీకృష్ణ తులాభారం’ (1966), ‘స్ర్తిజన్మ’ (1967) రూపొందించారు. అటు పిమ్మట, విజయా అధినేత బి నాగిరెడ్డి కుమారులు, రామానాయుడు కలిసి ‘విజయా సురేష్ కంబైన్స్’ ‘సురేష్ మూవీస్’ పేరిట చిత్ర నిర్మాణ సంస్థలు స్థాపించారు. వాటిపై డి రామానాయుడు ‘పాపకోసం’ (1968). బొమ్మలు చెప్పిన కథ (1969), సిపాయి చిన్నయ్య (1969), ద్రోహి (1970) చిత్రాలు నిర్మించారు.
సురేష్ మూవీస్ బానర్‌పై జి విశ్వనాథం దర్శకత్వంలో వీరు రూపొందించిన జానపద చిత్రం -బొమ్మలు చెప్పిన కథ.

సంగీతం: మాస్టర్ వేణు
కళ: రాజేంద్రకుమార్
నృత్యం: కెఎస్ రెడ్డి
ఎడిటింగ్: కెఎ మార్తాండ్
ఫొటోగ్రఫీ: పి భాస్కర్‌రావు
అసోసియేట్ దర్శకులు: కె బాపయ్య
దర్శకత్వం: జి విశ్వనాథం
నిర్మాత: డి రామానాయుడు

దేవకన్యలు అనూరాధ, రమాప్రభ మొదలైనవారు మునికుమారుల శాపంవలన కాళికాలయం బొమ్మలుగా మారతారు. వారు చెప్పిన కథ, పరిష్కారంతో రూపొందిన చిత్రం, విధి వ్రాతను విధాత కూడా తప్పించలేడని చెప్పిన కథే ఈ చిత్రం. అమరావతి నగర మహారాజు ధూళిపాళ. అతని బావమరిది వీరసేనుడు (ప్రభాకర్‌రెడ్డి). అతని భార్య హేమలత. వారికిద్దరు కుమార్తెలు లక్ష్మీ, సుజాత. పిల్లలతో కాళికాలయం చేరిన వీరసేనుకి.. ఈ పిల్లల్లో ఒకరి మరణానికి మరొకరు హేతువవుతారని తెలిసి, చిన్న కుమార్తెను ఆలయంలో వదిలివెళ్తాడు. ఆ బిడ్డ ఓ గొర్రెలకాపరి ఎల్లయ్య (మిక్కిలినేని) వద్ద చంపగా పెరుగుతుంది. కోటలో యువరాజు ప్రతాప్ (కాంతారావు)ను, సుజాత (విజయలలిత) ప్రేమిస్తుంది. రాజ్యంలో బందిపోట్లును అణచివేయాలని వెళ్లిన ప్రతాప్‌ను, వారి యువనాయకుడు మంగు (కృష్ణ) గాయపరుస్తాడు. ఆ అడవిలో పరిచయమైన చంప (విజయనిర్మల) అతణ్ణి సేద తీరుస్తుంది. ఆమెను ప్రేమించిన ప్రతాప్ అక్కడే వివాహం చేసికొని రాజ్యానికి తిరిగి వస్తాడు. తనను పెంచి పెద్దచేసి నాయకుడు (వి శివరాం) వల్ల తాను వీరసేనుడి కుమారుడనని మంగు తెలుసుకుంటాడు. తన అనుచరులను ప్రతాప్ బంధించాడని, అతన్ని చంపాలని రాజభవనానికి వెళ్లిన మంగును చంప తన అన్నయ్యగా గుర్తిస్తుంది. పోరాటంలో గాయపడిన మంగు ఎల్లన్నవలన చంప తన చెల్లెలని తెలుసుకుంటాడు. ‘బొమ్మలవలన ఆమెకు, ప్రతాప్‌కు కలిగే అపాయం నివారించటానికి.. గర్భవతియైన చంప తన భర్తను గాయపరచి ఆ రక్తం నుదుట తిలకంగా దిద్దుకోవాలని తెలుసుకొని, రాజభవనంలో ఆమెను ప్రోత్సహించి ఆ పని చేయిస్తాడు. సుజాత.. మంగూ, చంపల కుట్ర అని చెప్పటం, న్యాయసభలో చంప నిజం చెప్పడంవల్ల ప్రతాప్ శిలగా మారిపోతాడు. మంత్రి (సత్యనారాయణ) సింహాసనం ఆక్రమించుకుని.. మహారాజును, వీరసేనుని బంధిస్తాడు. మంత్రి కుమారుడు సుందరనందుడు (రాజ్‌బాబు) మంగులు సాయం, సాహసం బొమ్మలు చెప్పిన పరిష్కారంతో ప్రతాపుడు నిజరూపుడిగా మారి చంపను కలిసి ఆనందిస్తాడు. చంపపై కుట్రలు జరిపిన సుజాత, తన చెల్లిని మన్నింపుకోరి మరణించడంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో రాజ్‌బాబు జంటగా సంధ్యారాణి, ఇంకా సేనాధిపతిగా రామదాసు, గీతాంజలి (మంగు ప్రేయసి దుర్గ) ఇంకా ఇతరులు నటించారు.
దర్శకులు జి విశ్వనాథం రూపొందించిన సన్నివేశాలు మనసును హత్తుకుంటాయి. ఆకలికి తాళలేనివారు దోపిడీ దొంగలు, విప్లవకారులు అవుతారని వి శివరాం చేత మహరాజు ముందు సభలో చెప్పించటం దర్శకుడి ఆలోచనకు అద్దం పడుతుంది. వీరసేనుడి కుమారుడిని తెచ్చి దొంగల నాయకునిగా మార్చటం, మంగుకు గతం చెప్పటం, దొంగల నాయకుడిగా యువరాజుతో పోరాటంలో చంప తన చెల్లెలని తెలిసి, ఆమె సుఖంకోసం బావను గాయపర్చమని మంగు చెప్పటంలాంటి సన్నివేశాలు కథను లౌక్యంగా నడిపే ప్రతిభకు తార్కాణమైంది. చంపను దోషిగా బండిపై ఎక్కించి యోధులచే లాగించటాన్ని ఎంతో దయనీయంగా చూపించారు దర్శకులు. శిలగా మారిన యువరాజు విగ్రహాన్ని మంగూ రాజభవనం నుంచి కదిలించి అడవికి తీసుకెళ్లటం, చెరనుండి వచ్చిన చంప 108 బిందెలతో నీళ్లు భర్త విగ్రహంపై అతి ప్రయాసతో తెచ్చిపోయటం, రాజ్‌బాబు లెక్కించటంలాంటి సన్నివేశాలు హృదయాన్ని కదిలించాయి. చివరి బిందెను కథ ప్రకారం మంత్రి సైన్యం అడ్డుకోవటం, అంతవరకూ మంగూ పోరాటం, ఆపైన నిజరూపుడైన ప్రతాపుడు మంత్రిని, సైన్యాన్ని ఎదుర్కోవటం, తిరిగి కోటలో ప్రతాపుని వీరం.. ఇలా ఇద్దరు హీరోల పోరాటాలను వైవిధ్యంగా రూపొందించి, దానికి సెంటిమెంట్‌ను జతచేసి చూపటం చిత్రానికి నిండుదనం తెచ్చింది.
‘మంచి మిత్రులు’ (జనవరి) తరువాత ‘బొమ్మలు చెప్పిన కథ’, ‘ముహూర్తబలం’ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల అన్నా చెల్లెళ్ళుగా నటించారు. దాన్ని వారు ఎంతో సహజంగా నటనలో చూపించారు. కత్తియుద్ధాలకు కాంతారావు పెట్టింది పేరుగా ఈ చిత్రంలోనూ అదే ధోరణిలో మెప్పించారు. కృష్ణ దొంగల నాయకునిగా, అడవిలో తొలుత సైన్యంతో, తరువాత రాజ్‌మహల్‌లో, చివర క్లైమాక్స్‌లో ఎంతో వీరోచితంగా నటించి మెప్పించారు. ఆ తరువాత వీరు నటించిన పలు జానపద, చారిత్రక చిత్రాలకు ఈ చిత్రం దోహదపడడం ఓ విశేషం.
చిత్ర గీతాలు:
అంతఃపురంలో విజయలలిత, కాంతారావు, ధూళిపాళ, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, హేమలతల ముందు చేసే నృత్య గీతం -ఊర్వశి చేరగా ప్రేయసి కోరగా (గానం: పి సుశీల, రచన: శ్రీశ్రీ). విజయనిర్మల, కాంతారావులపై చిత్రీకరించిన గీతం -గండు తుమ్మెద రమ్మంటుంది కొండ మల్లె రానంటుంది (గానం: పి సుశీల, ఘంటసాల, రచన: దాశరథి). విజయనిర్మల మేకలమందతో పాడే హుషారు గీతం -మెమేమే మేకలన్నీ కలిసే ఉంటాయే. రెండుసార్లు వస్తుంది ఈ గీతం (గానం: పి సుశీల, రచన: సముద్రాల జూనియర్). రాజభవనంలో విజయనిర్మల, కాంతారావుతో పాడే గీతం -జోడు నీవని తోడు రమ్మని అంటే పలకవు (గానం: పి సుశీల, రచన: సముద్రాల జూనియర్).
ఓ చందమామ కథల లాగ -బొమ్మలు చెప్పిన కథ జానపద చిత్రం కాలక్షేప సినిమాగా, బాలలకు వినోద భరిత చిత్రంగా నిలిచిందనాలి.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి