ఫ్లాష్ బ్యాక్ @ 50

గండికోట రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో డిసెంబర్ 13, 1928న జన్మించారు దాట్ల వెంకట సూర్యనారాయణరాజు (డివిఎస్ రాజు). 1950లో మద్రాస్ చేరి సినీరంగంలో పలువురితో పరిచయాలు పెంచుకున్నారు. ముఖ్యంగా నందమూరి సోదరులు (యన్‌టి రామారావు, త్రివిక్రమరావుల)తో ఏర్పడిన స్నేహంతో 1953లో వారి నిర్మాణ సంస్థ ‘నేషనల్ ఆర్ట్స్ థియేటర్స్‌లో ‘తోడుదొంగలు’ చిత్రం నుంచి భాగస్వామ్యం మొదలెట్టి గులేబకావళి (1962) వరకూ సాగించారు. సొంతంగా నిర్మాతగా మారాలని ఉద్దేశంతో తొలుత సాహిణివారి ‘పెంకి పెళ్లాం’ చిత్రాన్ని తమిళంలో ‘కణ్ణియినకడమై’గా డబ్బింగ్ చిత్రం నిర్మించారు. తరువాత తాతినేని ప్రకాశరావుతో కలిసి తెలుగులో మాబాబు (1961), తమిళంలో ‘అన్బుమగనే’గా రూపొందించారు. 1964లో డీవీఎస్ ప్రొడక్షన్స్ స్థాపించి తొలి చిత్రంగా ‘మంగమ్మ శపథం’ (యన్‌టిఆర్, జమున), రెండో చిత్రంగా యన్‌టిఆర్, రాజశ్రీతో ‘పిడుగురాముడు’ (1966), మూడో చిత్రంగా యన్‌టిఆర్, కృష్ణకుమారి, జయలలితతో ‘తిక్కశంకరయ్య నిర్మించారు. ఈ సంస్థ 1969లో యన్‌టి రామారావు ద్విపాత్రాభినయంగా దేవిక, జయలలిత కాంబినేషన్‌లో రూపొందించిన నాల్గవ చిత్రమే -గండికోట రహస్యం. 1961 మే 1న ఈ సినిమా విడుదలైంది. ‘తిక్కశంకరయ్య’కు యోగానంద్ దర్శకత్వం వహిస్తే, మిగిలిన మూడు చిత్రాలకూ దర్శకులు బి విఠలాచార్య, గీత రచయిత సి నారాయణరెడ్డి, సంగీత దర్శకుడు టీవీ రాజు కావటం ఓ విశేషం.
కథ, మాటలు: జికె మూర్తి
కళ: నాగరాజన్
స్టంట్స్: శివయ్య
కూర్పు: గోవిందరాజన్
సంగీతం: టీవీ రాజు
అసోసియేట్: విజయాకృష్ణమూర్తి
నృత్యం: చిన్ని, సంపత్
ఫొటోగ్రఫీ: ఎస్‌ఎస్ లాల్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి విఠలాచార్య.
గండికోట రాజ్యానికి యువరాజు జయంత్ (యన్‌టి రామరావు). అతని తల్లి మహారాణి హైమావతిదేవి (హేమలత), భార్య లలితాదేవి (దేవిక). అతని పినతండ్రి కుమారుడు ప్రతాప్‌సింగ్ (రాజనాల) మహారాజు కావాలనే దురాశకలవాడు. అందుకు ప్రజల దృష్టిలో జయంత్‌ను చెడ్డవాడిగా చిత్రీకరించాలని పన్నాగం పన్నుతాడు. జయంత్‌ను స్ర్తిల నృత్య గానాలకు ఆనందించేలా అలవాటు చేస్తాడు. అదే సమయంలో మహారాజుగా జయంత్‌కి పట్ట్భాషేకం చేయాలని తల్లి నిశ్చయిస్తుంది. ఈ సమయంలో ప్రజల నుంచి అధికంగా పన్నులు వసూలుచేయించి జయంత్ పట్ల ద్వేషం పెంచుతాడు ప్రతాప్. ఆ రాజ్యంలో ఓ గ్రామానికి చెందిన సాహస యువకుడు రాజా (యన్‌టిఆర్). దోపిడి దొంగలను ఎదిరించి తన వాళ్లను రక్షించుకుంటాడు. ఈసారి పన్నులు పెంచినందుకు జయంత్‌ను ఎదిరించాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో రాజా మరదలు రాధ (జయలలిత), ఆమె అన్న వజ్రాలు (రాజ్‌బాబు) అతనికి దూరమవుతారు. రాజమందిరానికి వెళ్లిన రాజా, జయంత్‌ను కలుసుకొని అతని మంచితనం తెలుసుకుంటాడు. ఆక్రమంలో రాజ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తాడు. రాజుగా తాను ప్రజలకు మంచి చేస్తానని జయంత్ వాగ్దానం చేయటంతో వారిరువురూ స్నేహంగా గడుపుతారు. అంతకుముందు జయంత్‌కు విషమివ్వాలని ప్రతాప్ కుట్ర పన్ని, పట్ట్భాషేకం ముందురోజు రాత్రి విష ప్రయోగం తలపెట్టడంతో జయంత్ అస్వస్థుడవుతాడు. వైద్యుల సాయంతో జయంత్‌ను విషప్రభావం నుంచి మహామంత్రి (మిక్కిలినేని) రక్షిస్తాడు. కాకపోతే, అతనికి స్పృహ రావటానికి కొన్ని రోజులు పట్టొచ్చని తెలుస్తుంది. ఈలోగా ప్రతాపుని కుట్ర భగ్నం చేయటానికి జయంత్ స్థానంలోకి రాజాను తీసుకొస్తాడు మహామంత్రి. మహారాజుగా ఉండమని కోరటంతో, ప్రజాక్షేమంకోసం జయంత్ స్థానంలోకి వస్తాడు రాజా. మహారాజు పాత్రలో ప్రజలకు ఉపయోగపడే శాసనాలు చేయటంతో ప్రతాప్‌కు సందేహం కలుగుతుంది. జయంత్‌ను బంధించి మరణశిక్ష అమలు చేసేటంతలో రాధ, ఆమె అన్న వజ్రాలు సాయంతో రాజా వాళ్ల స్థావరం తెలుసుకుంటాడు. దళపతి (ప్రభాకర్‌రెడ్డి) ప్రతాపుని, జగ్గారావును అంతం చేసి మహారాజును రాజ్యానికి చేర్చి తన బాధ్యత, వాగ్ధానం నిలబెట్టుకుంటాడు. దీంతో జయంత్ అతన్ని సర్వ సైన్యాధిపతిని చేయటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ప్రతాప్ అనుచరుడు అవధానిగా అల్లు రామలింగయ్య, గ్రామాధికారి భూషయ్యగా త్యాగరాజు, ఉద్యోగి కనకయ్యగా రావి కొండలరావు, అతని సహాయకునిగా సారథి, ఇంకా నల్ల రామ్మూర్తి అతని కూతురు సుబ్బులుగా రమాప్రభ, టిజి కమలాదేవి, డా శివరామకృష్ణయ్య ఈ చిత్రంలో నటించారు.
ఏవిఎం వారి ‘సదారమ’ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసారు రచయిత జికె మూర్తి(జి కృష్ణమూర్తి). విఠలాచార్య దర్శకునిగా పనిచేసిన చిత్రాలు (పెళ్లిమీద పెళ్లి, అగ్గిపిడుగు, అగ్గిదొర, అందంకోసం పందెం, కనకదుర్గా పూజమహిమ వంటివి) కొన్నింటికి మాటలు, కొన్నింటికి గీతాలు వ్రాసారు. ‘అడవి మనుషులు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. వీరు ఈ గండికోట రహస్యానికి కథతోపాటు పసందైన పలు శక్తివంతమైన మాటలు వ్రాసి పటుత్వం కలిగించటం, రకరకాల పన్నుల గురించి ఎంతో వివరంగా రచన సాగించటం ఎన్నదగిన అంశంగా, చిత్ర విజయానికి ఓ కారణమైంది.
ఇక జానపద బ్రహ్మగా పేరుగాంచి, మంత్రాలు, మాయలు, తంత్రాలువంటి పలు అంశాలు కలిగిన చిత్రాలను వైవిధ్యంగా తీర్చిదిద్దగల దర్శకులు బి విఠలాచార్య ఈ చిత్రంలో మాయలు, మంత్రాలులేకుండా రాజుల కుయుక్తులు, దానికి చక్కని పరిష్కారాలతో, కథకు తగ్గ సన్నివేశాలను నైపుణ్యంతో ఆకట్టుకునేలా చిత్రీకరించారు. గ్రామాధికారి భూషయ్య శిస్తు సొమ్మును దొంగల వేషంలో దోచుకోబోవటం, దాన్ని రాజా ఒక్కడే తుపాకీతో ఎదుర్కోవటంలో చూపిన చాకచక్యం అబ్బురపరుస్తుంది. మరోసారి రాజా ప్రజలపై పన్నుల గురించి భూషయ్యతో వాదిస్తాడు. రాజాను బంధించిన వారికి 10వేల వరహాలని భూషయ్య ప్రకటించటంతో, ప్రజలంతా రాజాను వెంటాడటంలాంటి సన్నివేశాన్ని కొండలమీద ఎంతో థ్రిల్లింగ్‌గా చూపించారు దర్శకుడు విఠలాచార్య. రాధ ముసుగుమనిషి వేషంలో ప్రజలను తుపాకీతో ఎదుర్కొని రాజాను కాపాడటం, వారిరువురిమధ్య ఓ చక్కని గీతం -తెలిసింది, తెలిసింది అబ్బాయిగారు’ (రచన: సినారె, గానం: పి సుశీల, ఘంటసాల) తమాషాగా చిత్రీకరించారు. మహరాజు విధించిన పన్నులను జగ్గారావు ప్రజల నుంచి వసూలు చేసే సన్నివేశం, దాని కారణంగా ఓ పేదరాలు (టిజి కమాలాదేవి) వేదన, దీనికి బాధ్యత తనదని సభలో రాజా దళపతిచే కొరడాదెబ్బలు తినే సన్నివేశం, దానికి యువరాణి, రాజమాత, రాజనాల, ప్రభాకర్‌రెడ్డిల స్పందన భావోద్వేగం, కరుణరసాన్ని మేళవించి చిత్రీకరించారు.

తన భర్త జయంత్ అని యువరాణి రాజావద్ద చనువు చూపటం, రాజా ఎంతో సహనంతో సంయమనం పాంచటం, మహరాజు జయంత్‌ను స్పృహలేని స్థితిలో బంధించి అశ్వదళంతో లోహదుర్గం తరలించటం లాంటి సన్నివేశాలు దర్శకత్వంపై విఠలాచార్యకున్న పట్టు చూపిస్తుంది. ఇక క్లయిమాక్స్‌లో మరోసారి బందీ అయిన జయంత్‌ను విడిపించేందుకు రాజా, రాధ, వజ్రాలు తొలుత చెట్లరూపంలో తమాషాగా సైనికులను వంచించటం, జయంత్‌ను లోన స్తంభానికి బంధించగా విడిపించటం, క్రింద అగ్నికీలలు, పైన వంతెనలు, అగ్నిబంతులు వంతెనపైకి పంపడం; రాధా, రాజా, జయంత్, ప్రతాప్, దళపతిలతో పోరు.. ఎంతో ఉత్సుకత కలిగించేలా సంక్లిష్టంగా చూపించి మెప్పించారు. ఈ చిత్రంలోని నటీనటులంతా ప్రతిభావంతంగా తమ పాత్రలను పోషించి మెప్పించారు.
సినారె వ్రాసిన ఈ చిత్రంలోని మరికొన్ని గీతాల్లో రాజా, రాధలపై చిత్రీకరించిన గీతం -మరదలు పిల్లా ఉలికిపడకు (ఘంటసాల). వీరిరువురిపై మరో గీతం చల్లని వెనె్నలలో ఆహ్లాదకరంగా సాగుతుంది. అది -నీలాల నింగి మెరిసి పడే (గానం: పి సుశీల, ఘంటసాల) దేవికపై రాజభవనంలో చిత్రీకరించిన -నవ్వెను నాలో జాజిమల్లె’ (పి సుశీల). రాజనాల ముందు జయలలిత పాడిన గీతం -పాడనా మనసు పాడని పాట (పి.సుశీల). ప్రభాకర్‌రెడ్డి ముందు జయలలిత, లంబాడి బృందం నృత్యగీతం -వయ్యారి, వయ్యారి అందాల బొమ్మ (గానం: పి సుశీల బృందం, రచన: కొసరాజు). కొసరాజు రచించిన మరో గీతం రమాప్రభ, రాజ్‌బాబులపై చిత్రీకరణ -తగులుకుంటే వదలడేమి’ (గానం: పిఠాపురం, ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం). మహరాజు జయంత్, రాజనాలల ముందు రాజభవనంలో కన్యలు చేసే నృత్యగీతం -కనె్నలోయి కనె్నలు’ (పి సుశీల, ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం, రచన: సినారె).
ఈ చిత్రంలో గీతాలు విజయవంతమై ప్రజాదరణ పొందాయి. ‘గండికోట రహస్యం’ చిత్రం అఖండ విజయం సాధించింది. యన్‌టిఆర్ నటప్రస్థానంలో డివిఎస్.ప్రొడక్షన్స్ రూపొందిన మూడు చిత్రాల్లో యన్‌టిఆర్ ద్విపాత్రాభినయం చేయటం, ఆ మూడూ విజయం సాధించటం ఓ విశేషంగా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కూడా డివిఎస్ ప్రొడక్షన్స్ ‘చిన్ననాటి స్నేహితులు’, ‘్ధనమా దైవమా’ చిత్రంలో యన్‌టిఆరే హీరోగా నటించారు. ‘గండికోట రహస్యం’ చిత్రంలోని ‘నీలాల నింగి, ‘మరదలు పిల్లా’ పాటలు నేటికీ పలు ‘స్వరలహరి’ సభల్లో శ్రోతలను అలరిస్తూనే ఉండటం ఆనందదాయకం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి