ఫ్లాష్ బ్యాక్ @ 50

బంగారు పంజరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప జిల్లా కొత్తపేటలో 1908 నవంబర్ 16న జన్మించారు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. ఆడిటింగ్‌లో డిప్లొమా పొందారు. 1936 ప్రాంతాల్లో రోహిణి సంస్థ అధినేత హెచ్‌ఎం రెడ్డి తీసిన గృహలక్ష్మి చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పర్యవేక్షించారు. మిత్రులు ఏకె శేఖర్, రామనాథ్, మూలా నారాయణస్వామిలతో కలిసి వాహిని పిక్చర్స్ స్థాపించి ‘వందేమాతరం’, ‘సుమంగళి’, ‘స్వర్గసీమ’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలు రూపొందించారు. ఆ క్రమంలో ‘రంగులరాట్నం’ చిత్రం తరువాత 1969లో వీరు నిర్మించిన చిత్రం -బంగారు పంజరం.
‘నల్లరేగడి’ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, ‘గాలివాన’ కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ కథ నవలా రచయిత పాలగుమ్మి పద్మరాజు ప్రతిభను గుర్తించిన బిఎన్ రెడ్డి తమ ‘బంగారు పాప’ (1954) చిత్రానికి సీనియర్ రచయితగా పరిచయం చేశారు. కొన్ని డబ్బింగ్ చిత్రాలు, మరికొన్ని తెలుగు చిత్రాలకు స్క్రిప్ట్‌లు వ్రాసారు. పలు రేడియో నాటికలు రచించిన వీరు ‘దేవుడిచ్చిన భర్త’ (1968) స్క్రిప్టు వ్రాసి, 1969లో వాహిని నిర్మించిన ‘బంగారు పంజరం’ చిథ్రానికి కథ, మాటలు సమకూర్చారు.
1969 మార్చి 19న ‘బంగారు పంజరం’ చిత్రం విడుదలైంది.
నంది బొమ్మలు, శివాలయాలు, వాటి శోభను, విగ్రహాలను చూపుతూ శ్రీశైల భవానీ భ్రమరాంబా రమణ మల్లిఖార్జునా’ గీతం వినిపిస్తూ, ఆలయాల విశిష్టత, ఆధునిక దేవాలయాలైన ఆనకట్టలు గురించి, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం దానికి సంబంధించిన ఓ గాథ అని మహానటులు యన్‌టి రామారావు పరిచయ వాక్యాలు పలకటం... ఆనకట్ట నిర్మాణంపై (వెనుక పాట వినిపిస్తుంటే) టైటిల్స్ ప్రారంభం.. ఈ సినిమాకు ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

కథ, మాటలు: పాలగుమ్మి పద్మరాజు
పాటలు: దేవులపల్లి కృష్ణశాస్ర్తీ
కళ: ఎకె శేఖర్
కూర్పు: ఎంఎస్ మణి
ఛాయాగ్రహణం: బిఎస్ కొండారెడ్డి, సిఎస్ మహి
నృత్యం: వెంపటి చినసత్యం
శబ్దగ్రహణం: వి శివరాం
నిర్మాత, దర్శకుడు: బిఎన్ రెడ్డి.

హైద్రాబాదులో ఇంజనీరు వేణుగోపాలరావు (శోభన్‌బాబు). అతని తల్లి (శ్రీరంజని). మేనమామ రామకోటయ్య (రావికొండలరావు), అతని భార్య గౌరి (పుష్పవల్లి), వారి కుమార్తె పద్మ (గీతాంజలి). వారింట దాసి మంధర (నవీనలక్ష్మి). ప్రాజెక్టు పనిమీద శ్రీశైలం వెళ్లిన వేణుకు అక్కడి గ్రామీణ యువతి నీల (వాణిశ్రీ) పరిచయమవుతుంది. ఆమె అందం, అమాయకత్వం చూసి ఇష్టపడిన వేణు, ఆమె తల్లిదండ్రులు త్యాగరాజు, ఉదయలక్ష్మిలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు చదువు, నాగరికత నేర్పుతాడు. వారికొక పాప బుజ్జి (బేబీరాణి). ఎలాగైనా వేణును తన అల్లుడిని చేసుకోవాలన్న రామకోటయ్య ఆశ నెరవేరకపోవటంతో, దాసి మంధర సాయంతో ఆ కార్యం సాధించాలనుకుంటాడు. ఆమె కుట్రలు, మాయోపాయాల కారణంగా నీలను వేణు నిందించటం, తూలనాడటం జరుగుతుంది. ఇదంతా పద్మపై ఇష్టంతో వేణు చేస్తున్నాడని భావించిన నీల ఇల్లు విడిచి వెళ్తుంది. తరువాత నిజం గ్రహించిన వేణు ఆమె కొరకు అనే్వషించి, రైలు ప్రమాదంలో నీల మరణించిందని భావించి మతిస్థిమితం కోల్పోతాడు. రైలు ప్రమాదం నుంచి బయటపడిన నీల నర్సుగా ఓ చోట పనిచేస్తూ, అక్కడి డాక్టరు ద్వారా భర్త గురించి తెలుసుకుంటుంది. తానెవరో తెలియనీయకుండా, అతన్ని తన సేవతో, పాటతో మామూలు మనిషిని చేస్తుంది. తల్లి, భార్య, కూతురితో వేణు దేవిని శివాలయంలో పూజించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో పిజె శర్మ, కాకరాల, వల్లభనేని శివరాం, టిజి కమలాదేవి, ఝాన్సీ, రావుగోపాలరావు, సిహెచ్ కృష్ణమూర్తి, పొట్టిప్రసాద్, అతిథిగా పండరీబాయి నటించారు.
కళాత్మక చిత్రాల దర్శకుడిగా వాసికెక్కిన బిఎన్ రెడ్డి ఈ చిత్రంలో వేణును ఓ సంస్కారవంతుడైన వ్యక్తిగా చూపించారు. సాధారణ యువతిని ప్రేమించి కుల గౌరవాలకు ప్రాధాన్యతనీయక వివాహం చేసుకోవటంలో ఆ పాత్రకు ఓ ఉన్నతత్వాన్ని చూపించారు. నీలతో ప్రేమ, పెళ్లి, తరువాత తనకనుగుణంగా విద్యా పద్ధతులు నేర్పటం, ఇద్దరి మధ్య అనురాగం చూపిస్తూ ఆ పాత్ర సంస్కారాన్ని గొప్పగా చూపించారు. నీల తన భర్తను ‘దొర’ అని పిలవటం, అలా పిలవొద్దన్న వేణును ‘రాజా’ అని పిలుచుకుంటూ ఆత్మీయతను వెల్లడించటం.. ఆ సమయంలో ఏకాంతంలో చంద్రుని చూపుతూ -పగలయితే దొరవేరా, రాతిరి నా రాజువురా’ (గానం: ఎస్ జానకి) అన్న గీతాన్ని వారివురిపై చిత్రీకరించటం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. వీరిపైనే -పచ్చని బయలు, చెట్లు పూలు మధ్య ప్రకృతిలో రమణీయంగా చిత్రీకరించిన మరో గీతం -మనిషే మారెరా రాజా మనసే మారెరా’ చివరలో ‘ఆనాటివి’ (ఎస్పీ బాలు) అంటూ హీరో గొంతు కలుపుతాడు. పనిమనిషి మంధర, నీలకు భర్తపై చాడీలు, నిందలు చెప్ప వచ్చే సన్నివేశంలో ఆపద సూచించారు. నాగస్వరం వినిపించటం, బిడ్డపై ప్రేమతో భర్త ఎన్నిసార్లు అవమానించినా సహించిన నీల, బిడ్డను భార్యవద్ద కాదని హాస్టల్‌లో వుంచటం, కూతురును చూడాలని వెళ్లిన (నీల) తల్లిని కూడా తండ్రివద్ద పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పటంతో భర్తతో గొడవపడి ఉత్తరం వ్రాసి దూరంగా వెళ్లిపోవటం, భార్యతో వాదించి బయటికెళ్లిన వేణుకు.. నీల ప్రేమ, మాటలు మదిలో కదిలి బిడ్డతో ఇంటికి రావటం, చివర మతి స్థిమితం కోల్పోయిన భర్తవద్ద నీల అతనికి ఇష్టమైన పాట పాడటం, (గీతం: గట్టుకాడ ఎవరో), వేణు ముఖంలో ఆ పాట తాలూకు సన్నివేశాలు ఇంపోజ్ చేసి చూపటం, చిత్రం చివర ఈ బంధం ఎన్నో జన్మలది అని చెప్పటం, శివాలయాలు చూపుతూ ‘ఓం నమఃశివాయ’తో చిత్రం ప్రారంభించి, తిరిగి అదేవిధంగా పంచాక్షరి మంత్రం ‘ఓం నమఃశ్శిశివాయ’ అనిపిస్తూ శివాలయాలు చూపి చిత్రం ముగించటం దర్శకుడి భావుకత, విశే్లషణ, ప్రతిభకు అద్దంపట్టేలా గోచరిస్తుంది.
మిగిలిన గీతాలు:
చిత్ర ప్రారంభంలో వాణిశ్రీపై చిత్రీకరించిన గీతం -కొండల కోనల సూరీడు (ఎస్ జానకి). -గట్టుకాడ ఎవరో/ చెట్టు నీడ ఎవరో (సంతోషం, విషాదం- గానం: ఎస్ జానకి). గీతాంజలి, పొట్టి ప్రసాద్‌పై చిత్రీకరించిన గీతం -చుక్క మెరిసెను, కుక్క మొరిగెను (గానం: బసవేశ్వర, స్వర్ణలత, రచన: శ్రీశ్రీ). వీరిపైనే మరో గీతం -తల్లిదండ్రి మాట వినరా (గానం: బసవేశ్వర్, స్వర్ణలత -రచన: దేవులపల్లి). శోభన్‌బాబు, వాణిశ్రీలపై మరో గీతం -పైరుగాలి పడుచు పైట (ఎస్.పి.బాలు). శోభన్‌బాబు ముందు వాణిశ్రీ నర్సుగా పాడిన గీతం -నీవెరిగిన కథ చెబుతా’ (ఎస్ జానకి). తల్లి శ్రీరంజని శ్రీరాముని ముందు వేడుకునే నేపథ్యంలో వచ్చే గీతం -పదములే చాలు రామా (ఏపి కోమల). తన బ్రతుకును బంగారు పంజరంతో పోలుస్తూ తన పాపకు నీల పాడే జోల -జో కొడుతూ కథ చెబుతా. చిత్రం చివర్న వచ్చే బ్యాక్‌గ్రౌండ్ గీతం -ఒకనాటిగా ఒక బోటిగా (ఏపి కోమల బృందం). చిత్రం ప్రారంభంలోని గీతం -శ్రీశైల భవానీ భ్రమరాంబ రమణా (గానం: ఘంటసాల, ఎస్ జానకి బృందం). -శ్రీ గిరిశిఖర విమాన విహారి (ఎస్‌పి బాలు, ఎస్ జానకి). బంగారు పంజరం చిత్ర గీతాలన్నీ యస్ రాజేశ్వరరావు, గోపాలం వారి సంగీతంతో దేవులపల్లి రచన (ఒక్క గీతం శ్రీశ్రీ)తో అలరించేలా రూపొందించటం, నేటికీ శ్రోతలను ఆకట్టుకోవటం విశేషం.
‘బంగారు పంజరం’ చిత్రం 1969లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే తృతీయ బహుమతి (కాంస్య నంది) నంది అవార్డు అందుకుంది. బెస్ట్ క్లాసికల్ హీరోగా శోభన్‌బాబుకు 1970 కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు లభించింది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి