ఫ్లాష్ బ్యాక్ @ 50

బందిపోటు దొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏఎస్‌ఆర్ ఆంజనేయులు కృష్ణా జిల్లా కోలవెన్నులో 1933 సెప్టెంబర్ 3న జన్మించారు. సినీ నిర్మాణంపై అభిరుచితో మాధవీ పతాకంపై వీరు నిర్మించిన చిత్రం ‘పాండవ వనవాసం’ ద్వారా ‘హేమమాలిని’ని తెరకు పరిచయం చేశారు. తరువాత ఆమె హిందీ చిత్రసీమలో ఖ్యాతి గడించారు. వీరు 1967లో రూపొందించిన ‘స్ర్తిజన్మ’ తరువాత 1968లో రూపొందించిన చిత్రం ‘బందిపోటు దొంగలు’. ఆపైన వంశోద్ధారకుడు (1972), కురుక్షేత్రం, హిందీలో ‘సోలాసాల్’ (16ఏళ్ల వయసు), ‘సువేరా సంసార్’ (పండంటి జీవితం) వంటి పలు చిత్రాలు నిర్మించారు. ‘బందిపోటు దొంగలు’ చిత్రానికి ప్రముఖ నిర్మాత, దర్శకులైన కెఎస్ ప్రకాశరావు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ కథ, నవల, నాటక రచయిత ఎన్‌ఆర్ నంది (నంది నూకరాజు 1933లో రాజమండ్రిలో జన్మించారు). వీరు 200లకు పైగా కథలు, 25 నవలలు, కొన్ని నాటికలు, పలు నాటకాలు రచించటమేకాక -‘తాసిల్ధారుగారి అమ్మాయి’, ‘నోము’ చిత్రాలకు పని చేశారు. ఆ అనుభవంతోనే ఈ చిత్రానికీ ఎంతో అర్ధవంతమైన, భావోద్వేగాలతో కూడిన సంభాషణలు సమకూర్చారు.

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
కళ: సూరన్న
కూర్పు: మార్తాండ్
నృత్యం: చిన్ని, సంపత్
స్టంట్స్: రాఘవులు అండ్ పార్టీ
ఫొటోగ్రఫీ: ఎస్ వెంకటరత్నం
సహాయ దర్శకత్వం: కె రాఘవేంద్రరావు
నిర్మాతలు: జె సుబ్బారావు, జి రాజేంద్రప్రసాద్

యజమాని (ముక్కామల) వల్ల భార్య లక్ష్మి (జయంతి)కి అన్యాయం జరగటం, బిడ్డ మరణించటంతో సాధు స్వభావంకల మల్లయ్య (ఎస్‌వి రంగారావు) బందిపోటు దొంగ మల్లయ్యదొరగా మారతాడు. తూటా దెబ్బలు తగిలి డాక్టర్ చంద్రశేఖర్ (గుమ్మడి) వద్ద చికిత్స పొందుతాడు. అతని భార్య (రుక్మిణి) నుంచి వారి బాబును ఎత్తుకెళ్లి తన స్థానంలో తన కొడుకు కన్నయ్యగా పెంచుతాడు. మరో అనుచరుడు పాపన్న (త్యాగరాజు) కొడుకు నాగూ (జగ్గయ్య), వెంకన్న (సీతారాం) కూతురు మల్లి (కాంచన) అక్కడ పెరిగి పెద్దవారవుతారు. అంజి (రాజ్‌బాబు) కన్నయ్య (ఏఎన్నాఆర్)తో దోస్తీగా మసులుతాడు. ఒకసారి నాగూ, డాక్టర్ చంద్రశేఖర్ మేనకోడలు ఇందిర (జమున)ను అడ్డగించగా కన్నయ్య వారిస్తాడు. దయా దాక్షిణ్యాలు మనకు చేటు తెస్తాయని మల్లుదొర గతం చెప్పటంతో, కన్నయ్య మరింత రెచ్చిపోయి దోపిడీలు సాగిస్తాడు. పోలీసు కాల్పుల్లో గాయపడి డాక్టర్ చంద్రశేఖర్ వద్ద చికిత్సకు వెళ్తాడు కన్నయ్య. భుజంమీద పుట్టుమచ్చ చూసి తన కుమారుడని గ్రహించి అతనికి మానవత్వం, మంచితనం, గాంధీజీ ఆశయాలు బోధిస్తాడు. ఓ మంచి వ్యక్తిగా మార్చి పోలీస్ శిక్షణకు పంపుతాడు. పోలీస్ ఇన్‌స్పెక్టరుగా తిరిగి వచ్చిన కృష్ణ మల్లుదొరతో భేటీ అయ్యి లొంగిపొమ్మని కోరతాడు. తిరస్కరించిన మల్లుదొర అతని ముఠాతో సాగించిన పోరాటంలో నాగూ, అతని అనుచరులు మరణిస్తారు. మల్లుదొర మారిన మనసుతో పోలీసులకు లొంగిపోవడంతో సంస్కరించబడతాడు. చివరకు ఇందిర, కృష్ణల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో కృష్ణ తల్లిగా రుక్మిణి, ఆమె అన్న వరాహమూర్తిగా నాగభూషణం, సుందరమ్మగా సూర్యాకాంతం, ఆమె కొడుకుగా కెవి చలం, ఇన్‌స్పెక్టరుగా ప్రభాకర్‌రెడ్డి, ఇంకా జగ్గారావు, భీమరాజు, తదితరులు నటించారు.
సంఘ విద్రోహశక్తులైన బందిపోట్లను సంస్కరించి జన జీవితంలో భాగం చేయాలనే మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా కథ, సన్నివేశాలను రూపొందించారు దర్శకులు కెఎస్ ప్రకాశరావు. తన బిడ్డతో పారిపోయి, గాయపడి బిడ్డను పోగొట్టుకున్న మల్లయ్య బందిపోటుగా మారి డాక్టరు బిడ్డను తస్కరించి తనవద్ద పెంచటం, ‘కన్నయ్య పుట్టినరోజు’ వేడుక పాట, నృత్యం (రాజసులోచన బృందం)తో మొదలుపెట్టి (ఆడు దొర వేటాడు దొర -రచన: శ్రీశ్రీ, గానం: ఘంటసాల, సుశీల, రాఘవులు బృందం) నాగూ చరణం, ‘కాంచన’ పాట నృత్యాలతో ముగింపునిచ్చి థ్రిల్లింగ్‌గా చిత్రీకరించారు. దొంగగా పెరిగినా కన్నయ్య, ఇందిర (జమున)ను అడ్డగించిన నాగూను ఎదిరించటం, మనకు జాలి దయ వంటివి ఉండకూడదన్న మల్లుదొర గతం విని కన్నయ్య మరింతగా రెచ్చిపోయి దొంగతనాలు సాగించటం, వాటి బీభత్సం సన్నివేశాలు బిగింపుతో సాగించారు. అలా దొంగతనాలు చేసే సమయంలో పోలీసు తూటాతో గాయపడి తండ్రివద్దకు చేరి కన్నయ్య మంచివాడిగా మారటం, డాక్టరును చంపాలని వెళ్లిన మల్లుదొరను కృష్ణవారించి అతనిలో వివేచన కల్పించటం, పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా వెళ్లి బందిపోట్లను లొంగిపొమ్మని కృష్ణ కోరటం, తన ముఠాతో ధైర్యంగా పోలీసులను ఎదుర్కొంటానని మల్లుదొర నాగూతో, కృష్ణతో చెప్పే సన్నివేశాలూ మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అనుచరులందరూ మరణించి కొద్దిమందితో నిస్సహాయంగా మిగిలిన మల్లుదొర పోలీసులకు లొంగిపోయి ధైర్యంతో మార్పును కోరుకోవటంలాంటి సన్నివేశాలను సహజత్వంతో చిత్రీకరించారు. డాక్టర్ చంద్రశేఖర్ మేనకోడలు ఇందిర తమాషా మాటలు, చేష్టలు, దొంగలంటే భయంలేదనటం, నాగూ బారినుంచి కన్నయ్య రక్షించగా అతన్ని మెచ్చుకోవటం, తిరిగి కన్నయ్యవారిని (తల్లిని, ఇందిర, ఆమె తండ్రిని) నిందించటం, కృష్ణగా మారిన కన్నయ్య ఇందిరతో పియానోపై పాట -విరిసిన వెనె్నలలో (గానం: ఘంటసాల, రచన: దాశరథి), ఆ సందర్భంలో దోపిడీకి వచ్చిన నాగూ బృందం రియాక్షన్స్, ఒక ఫైట్ అర్ధవంతంగా రూపొందించారు. ‘పగ, ద్వేషం నిప్పురవ్వల వంటివి. అవి ఆ వ్యక్తినే కాదు, ఎదుటివారినీ దహింపచేస్తాయి’, ‘్ధర్యం ఒంట్లో బలం వల్ల రాదు, మనోబలం కావాలి’, ‘తానొదులుకున్నా తన్నొదులుకోని సమస్యలు ప్రతీవారి జీవితంలో వుంటాయి’, ‘ప్రేమ మనిషిని పునీతుణ్ని చేస్తుంది’ అంటూ గాంధీజీ ఆశయాలూ, నిత్యసత్యాలు కలగలిపిన రచయిత సంభాషణలు ఆలోచింపచేస్తాయి, ఆకట్టుకుంటాయి. నటీనటులంతా పాత్రోచితంగా రాణించారు. మల్లుదొరగా ఎస్‌వి రంగారావు చిత్రం చివరి పోరాటంలో లొంగిపోయిన సన్నివేశంలో ధీర గంభీర సున్నిత ప్రదర్శనతో మెప్పించారు.
ఇతర గీతాలు: కాంచన, ఏఎన్నాఆర్‌పై చిత్రీకరణ -ఉన్నాడు ఓ చక్కని చిన్నోడు (రచన: సి నారాయణ రెడ్డి, గానం: పి సుశీల). మరో సినారె గీతం, రంగుల్లో బృందావన్ గార్డెన్స్‌లో అక్కినేని, జమునలపై చిత్రీకరించిన ఆహ్లాదభరితమైన పాట -విన్నానులే ప్రియా (గానం: ఘంటసాల, పి సుశీల). ఈ చిత్రంలో ఈ పాట హిట్‌సాంగ్‌గా నిలచి ప్రత్యేకత నిలుపుకుంది. జమునను అల్లరిపెడుతూ అక్కినేని పాడిన గీతం -కిలాడి దొంగ డియోడియో (గానం: ఘంటసాల). అక్కినేనిని ఉడికిస్తూ జమున పాడిన గీతం -కిలాడి దొంగ డియోడియో (గానం: పి సుశీల, రచన: ఆరుద్ర). అక్కినేనిని బంధించిన సమయంలో జగ్గయ్య ముందు కాంచన, జమున, రాజ్‌బాబు బృందం నృత్య గీతం -గండరగండా సోగ్గాడివంటా (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, పి సుశీల, రాఘవులు బృందం, రచన: ఆరుద్ర). ఇక -గాంధీ పుట్టిన దేశమురా ఇది అంటూ సాగే సాకీని ఘంటసాల గానంలో వింటాం. ఓ మంచి సందేశంతో చక్కని సంగీతం, ఎస్వీఆర్, గుమ్మడి, ఏఎన్నాఆర్ వంటి భారీ తారాగణంతో రూపొందించిన చిత్రంగా బందిపోటు దొంగలు ప్రశంసలు అందుకుంది. -విన్నానులే ప్రియా అంటూ విరిసిన వెనె్నల గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తూ ‘బందిపోటు దొంగలు’ చిత్రాన్ని గుర్తు చేయటం విశేషం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి