ఫ్లాష్ బ్యాక్ @ 50

సప్తస్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నిర్మాత హెచ్‌ఎం రెడ్డి తీసిన ‘నిర్దోషి’ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయమై, అదే నిర్మాత తీసిన జానపద చిత్రం ‘ప్రతిజ్ఞ’లో హీరోగా నటించారు తాడేపల్లి లక్ష్మీకాంతారావు (టియల్ కాంతారావు). అలా పలు జానపద, సాంఘిక, చారిత్రక, పౌరాణిక చిత్రాల్లో కథానాయకుడిగా విభిన్న పాత్రలతో మెప్పించి -జానపద హీరోగా, కత్తివీరునిగా, నారద పాత్ర పోషణలో ప్రత్యేకత ప్రదర్శించిన విలక్షణ నటుడు ఆయన. ఆయన తొలిసారి తన భార్యపేరిట హైమా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాతగా రూపొందించిన చిత్రం -సప్తస్వరాలు. తనను చిత్ర రంగానికి పరిచయం చేసిన హెచ్‌ఎం రెడ్డికి ఈ సినిమా అంకితం చేయటం విశేషం. కాంతారావు ఎప్పుడో చదివిన ఓ నవల ఆధారంగా ప్రముఖ రచయిత వీటూరితో కథ, మాటలు సిద్ధం చేయించుకుని, సంగీత నృత్య ప్రధానాంశాలతో ఈ చిత్రం నిర్మించారు. ఫిబ్రవరి 20, 1969లో చిత్రం విడుదలైంది.
‘రైతుబిడ్డ’కు నృత్య దర్శకత్వం వహించటంతో చిత్రరంగంలో ప్రవేశించిన ప్రముఖ నృత్య కళాకారుడు ‘వేదాంతం రాఘవయ్య’. నృత్య దర్శకత్వంతోపాటు, దర్శకత్వ మెళుకువలూ నేర్చి వినోదా పిక్చర్స్ బ్యానర్‌పై ‘స్ర్తి సాహసం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆపైన దేవదాసు, చిరంజీవులువంటి విషాదాంత ప్రేమకథా చిత్రాలు.. అనార్కలి, సువర్ణ సుందరి వంటి నృత్య ప్రధానాంశాలు కలిగిన చిత్ర దర్శకునిగా అనుభవం సంపాదించారు. అలాంటి అనుభవజ్ఞుడైన వేదాంతాన్ని తన చిత్రానికి దర్శకులుగా ఎన్నుకున్నారు కాంతారావు.

కథ-మాటలు: వీటూరి
కళ: బిఎన్ కృష్ణ
ఎడిటింగ్: కోటగిరి గోపాలరావు
ఫొటోగ్రఫీ: అన్నయ్య
నృత్యం: వెంపటి సత్యం, కెఎస్ రెడ్డి
ట్రిక్ ఫొటోగ్రఫీ: ఎస్‌ఎస్ లాల్
స్టంట్లు: మాధవన్
సంగీతం: టీవీ రాజు
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య

నారద మహర్షి (రామకృష్ణ) విశ్వగంధర్వుడు (కాంతారావు)తో కలిసి దేవలోకంలో సరస్వతీ దేవి (విజయనిర్మల)ని ప్రార్థించి భూలోకవాసుల కష్టాలను తీర్చమని వేడుకుంటారు. దేవి వారిని అనుగ్రహించి శారదా పీఠాన్నిచ్చి, దానిని భూలోకంలో ప్రతిష్టించమని ఆనతిస్తుంది. శారదాపీఠంతో భూలోకానికి వస్తున్న గంధర్వుని అతని ప్రేయసి (విజయలలిత) ప్రణయ వాక్కులతో చలింప చేయటంతో, శారదా పీఠం భూలోంలోని మందాకిని నదిలో పడిపోతుంది. దానికి ఆగ్రహించిన నారదుడు -వారిరువురూ భూలోకంలో జన్మించి అతకని బ్రతుకులు గడపమని శపిస్తాడు. అందువల్ల గంధర్వుడు ఒక ముత్యపు చిప్పలో బాలినిగా విద్యానంద స్వామి (నాగయ్య)కి, మరొక ముత్యపు చిప్పలో బాలికగా విద్యానగర ప్రభువు(్ధళిపాళ)కు లభిస్తారు. విద్యానందుడు ఆ బాలునికి సారంగుడు అని పేరుపెట్టి, సకల సంగీత శాస్త్రాన్ని బోధిస్తాడు. రాకుమారి దేవమనోహరిగా నృత్య ప్రావీణ్యత సాధిస్తుంది. సారంగుడు తన తోటి సహధ్యాయుడైన సావేరి (రాజ్‌బాబు) సోదరి జయంతి (రాజశ్రీ) పట్ల అనురక్తుడౌతాడు. విద్యానగరంలో జరిగే పోటీలలో అరాచకం చేస్తున్న సేనాని దుర్జయుడు (జగ్గారావు)ను ఎదిరించి రాకుమారి అభిమానం పొందుతాడు సారంగుడు. సారంగుని ప్రేమించిన దేవమనోహరి తన ప్రేమనతనికి వివరించగా, అతడు తిరస్కరిస్తాడు. జయంతిని వివాహం చేసుకోవాలన్న సారంగుని కోర్కెను, విద్యానందస్వామి వ్యతిరేకించి, తొలుత అతడు శారదా పీఠాన్ని సాధించాలనే లక్ష్యం తెలియపరుస్తాడు. ఆ శారదా పీఠం కోసం అభేరి (సత్యనారాయణ) అనే మాంత్రికుడు ప్రయత్నిస్తూ, కాలభైరవుని ద్వారా అయోనిజుడైన వానిద్వారా అది సాధించవచ్చని గ్రహించి కపట సన్యాసి వేషంలో దేవమనోహరిని, ఆమె తండ్రిని నమ్మిస్తాడు. వారి ద్వారా సారంగుని ప్రేరేపించి శారదా పీఠం కోసం ప్రయత్నించేలా చేస్తాడు. సారంగుడు పలు కష్టాలు అధిగమించి శారదా పీఠాన్ని సంపాదించి గురువుకు అందిస్తాడు. జయంతిని వివాహం చేసుకోవటంతో రాకుమారి, మహారాజు సంతసిస్తారు. ఈ క్రమంలోనే మాంత్రికుడు కూడా అంతంకావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో మీనాకుమారి, ధనశ్రీ, బాలకృష్ణ, జ్యోతిలక్ష్మి ఆయా పాత్రల్లో కనిపిస్తారు.
తొలుత వీణపై చిత్రం టైటిల్ వస్తుంది. సంగీత, నృత్య ప్రాధాన్యతకు అనుగుణంగా సారంగుడు సంగీతం, రాకుమారి నృత్యం అభ్యసించటాన్ని చూపించారు. హీరోను సంగీతజ్ఞ పాండిత్యంతోపాటు శౌర్యవంతునిగా సేనానితో పోరాటంలో చూపించటంలో దర్శకుడి నైపుణ్యం కనిపిస్తుంది. శౌర్యంతోపాటు ప్రేయసితో ప్రణయం, ఆలయ ప్రవేశం నిషేధించినా కృష్ణ భక్తునిగా తన గానంతో స్వామి సాక్షాత్కారం పొందటంలాంటి దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరించారు. పాతాళ లోకంలోని ఆనందభైరవి ఆలయంలో శారదా పీఠం సప్తస్వర రాగబద్ధంగా ఉందని, దాన్ని చేరుకోవాలంటే రిషభరి, గాంధార గిరులనుదాటి జలపాతంలో శిలను ఛేదించి కామసుందరీదేవి అనుగ్రహం పొందాలన్న అంశాలను కథలో పొందుపర్చి ఆసక్తిని పెంచారు. శారదా పీఠాన్ని సాధించే వ్యక్తి అయోనిజుడు (తల్లి గర్భంనుంచి జన్మించనివాడు) అయి ఉండాలి. అందుకు సారంగుడే తగిన వాడని మాంత్రికుడు భావిస్తాడు. దేవమనోహరి కూడా అయోనిజయే అయినా ఆమెవల్ల ఈ కార్యం సాధ్యం కాదు. కనుక ఆమెను సాధనంగా చేసుకుంటాడు మాంత్రికుడు. జయంతి మరణించిందన్న సమాచారంతో పిచ్చివానిగా మారిన సారంగుని వద్దకు జయంతి ప్రేతాత్మగా దేవమనోహరి వెళ్లి అతన్ని లక్ష్యంవైపు మళ్లిస్తుంది. జయంతి మారువేషంలో అనుసరించటం, ఆత్మాహుతి నృత్యంతో శారదాపీఠం సాధించటానికి దేవమనోహరి నృత్యం -ఇలా పలు అంశాలను కథలో పొందుపర్చి వాటిని అర్ధవంతంగా తీర్చిదిద్దారు దర్శకులు వేదాంతం రాఘవయ్య. జలపాతంలో శిల, దానిపై బాలుడు, ముసలి అవ్వరూపం, చివరలో అభేరి, సారంగుని పోరాటం వంటి చిత్ర విచిత్రాలతో దర్శకులు రాఘవయ్య, ట్రిక్ ఫొటోగ్రాఫర్ ఎస్‌ఎస్ లాల్‌తో కలిసి ఉత్సుకత నిండేలా రూపొందించారు. సమర్ధులైన నటులు కాంతారావు, సత్యనారాయణ, నాగయ్య వంటివారు తమ నటనతో మెప్పించారు.

చిత్ర గీతాలు:

కాంతారావు, రాజశ్రీలపై చిత్రీకరించిన సి నారాయణ రెడ్డి గీతాలు. -అదే నీవంటివి/ అదే నేవింటిని, -కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా (గానం: ఘంటసాల, పి సుశీల), జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించిన నృత్యగీతం ఛమ్ ఛమ్ చమ్మచెక్క (విజయలక్ష్మి కన్నారావు బృందం), కాంతారావు ఆలాపన, రాజశ్రీ, విజయలలిత నృత్యంతో సాగే గీతం -డెందము దోచిన నందకిశోరుడు (గానం: ఘంటసాల), మరోగీతం -నినుగన్న కనులే కనులు. విజయలలిత నృత్యంతో పిచ్చివానిగావున్న కాంతారావు ముందు సాగే మధురగీతం (గానం: పి సుశీల). -నాదమే వేదము (ఎవిఎన్ మూర్తి, ఎస్ జానకి, ఘంటసాల (ఆలాపన), సప్తస్వరాలపై వ్రాసిన -సాసకల ధర్మ పద్యాలు (విజయలక్ష్మీ కన్నారావు, ఘంటసాల), కాంతారావు, సత్యనారాయణల గీతం ‘హాయిగా పాడనా, జగములు’ (పిబి శ్రీనివాస్, ఘంటసాల), కృష్ణునిపై భక్తిగీతం -యదుబాల శ్రీతజనపాల’ (ఘంటసాల బృందం), ‘జయజయ మహారుద్ర’ దండకం- ఇవి వీటూరి రచన, సరస్వతి ప్రార్థన ‘యాకుందేందు’ (పిబి శ్రీనివాస్), ‘కస్తూరి తిలకం’ (ఘంటసాల) ఈ చక్కని గీతాలకుతోడు చిత్రంలో కాంతారావు వీణావాదన, దానికి తగ్గట్టు విజయలలిత నృత్యంతో దేవిని ఆరాధించటం ఎంతో అర్ధవంతంగా గీతాలను, గీత సన్నివేశాలను రూపొందించారు.
సాంకేతికంగా సప్తస్వరాల అధినేతలను చూపటం, వారిని విడివిడిగా హీరో స్తుతించడం, తెలంగాణాలో ప్రసిద్ధమైన పిల్లలమర్రి చెట్టు స్ఫూర్తిగా, సెట్లో వటవృక్షం ఊడలు నాటుకున్నట్టు చూపటం, ఎంతో శ్రద్ధతో, అన్ని విభాగాలవారూ సమన్వయంతో చిత్రాన్ని రూపొందించారు. చిత్రం సంతృప్తికలిగించేలా రూపొందినా కాంతారావుగారికి ఆర్థికంగా లాభించలేదు. మొదటి చిత్రం కావటం, పంపిణిదారుల సమస్య, ప్రత్యేక తెలంగాణా ఉద్యమ ప్రభావం, ఎంతో కష్టపడి విడుదలచేసినా ప్రజాదరణకు నోచుకోకపోవటం విచారం.
సంగీత, నృత్య ప్రాధాన్యతతో పిల్లలను, పెద్దలను అలరించే చక్కని చిత్రంగా మనోల్లాసాన్ని కలిగించే పాటలతో గుర్తింపుపొందిన చిత్రంగా ‘సప్తస్వరాలు’ నేటికి నిలవటం ఆనందదాయకం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి