ఫ్లాష్ బ్యాక్ @ 50

సారంగధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంగి ప్రభువు రాజరాజ నరేంద్రుని చారిత్రక గాథ ‘సారంగధర’. ధర్మవరం రామకృష్ణమాచార్యులు, పానుగంటి లక్ష్మీనరసింహారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీవంటి ప్రముఖ రచయితలు నాటకాలుగా వ్రాసి ఈ గాథకు ప్రాచుర్యం కలిగించారు. కూచిమంచి తిమ్మన్న కవి, ‘సారంగధర’ ద్విపద కావ్యంగానూ రచించారు.
ఈ కథను తొలుత 1930లో వైవి రావు మూకీ చిత్రంగా ‘జనరల్ కార్పొరేషన్’పై మద్రాస్‌లో రూపొందించారు. తమిళంలో 1935లో టాకీ చిత్రంగా దర్శకులు విఎస్‌కె పాథమ్, కొత్తమ్మానలయ్ చెమ్నా, టిఎం శారదాంబల్ కాంబినేషన్‌లో ‘సారంగధర’ నిర్మించారు. తమిళంలోనే మరోసారి నవీన ‘సారంగధర’ పేరిట మరోచిత్రం ఎంకె త్యాగరాజు భాగవతార్, ఎస్‌డి సుబ్బలక్ష్మిలతో రూపొందించారు.
1937లో తెలుగులో స్వామి పిళ్లై, రామయ్య అనే నిర్మాతలు స్టార్ కంబైన్స్ బ్యానర్‌పై పి పుల్లయ్య దర్శకత్వంలో బొంబాయిలో నిర్మించారు. బందా కనకలింగేశ్వరరావు (సారంగధరునిగా), పి శాంతకుమారి (చిత్రాంగి), అద్దంకి శ్రీరామమూర్తి రాజరాజనరేంద్రునిగా, పులిపాటి వెంకటేశ్వర్లు సుబుద్దిగా నటించారు. తాపీ ధర్మారావు రచన, ఆకుల నరసింహారావు సంగీతం సమకూర్చారు. తిరిగి 20ఏళ్లకు 1957లో మినర్వా పతాకంపై ఎన్‌టి రామారావు, భానుమతిల కాంబినేషన్‌తో రూపొందించిన చిత్రం ‘సారంగధర’.

కథ, మాటలు, పాటలు: సముద్రాల సీనియర్
సంగీతం: ఘంటసాల
కళ: ఎస్‌విఎస్ రామారావు
కూర్పు: విఎస్ రాజన్
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, సంపత్
ఛాయాగ్రహణం: ఎస్‌పి బాలకృష్ణన్
దర్శకత్వం: విఎస్ రాఘవన్

వేంగి రాజ్యాన్ని పాలించే చాళుక్య ప్రభువు రాజరాజనరేంద్రుడు (ఎస్‌వి రంగారావు). మహారాణి రత్నాంగి (శాంతకుమారి). యువరాజు సారంగధరుడు (ఎన్‌టి రామారావు). మహామంత్రి సింగన్న (గుమ్మడి). మంత్రి కుమారుడు సుబుద్ది (చలం), మాండవ్యుడు (రేలంగి) యువరాజు మిత్రులు. వేంగి రాజ్యానికి సామంతుడు మంగరాజు (సివివి పంతులు). అతని కుమార్తె కనకాంగి (రాజసులోచన), యువరాజు పరస్పర అనురాగబద్దులవుతారు. తండ్రి ఆదేశంపై రంపసీమ ప్రభువు రంగనాథరాజు (ఏవి సుబ్బారావు సీనియర్) వద్దకు శాంతికోసం యువరాజు రాయబారిగా వెళ్తాడు. దారిలో చిత్రాంగి (్భనుమతి) యువరాజును చూసి ప్రేమిస్తుంది. సంధి ఒప్పందం తరువాత రాజ్యానికి వెళ్లిన యువరాజుకు వివాహం కోసం రాజరాజు పంపిన చిత్రపటాల్లో సారంగధరుని చూసి చిత్రాంగి పెళ్లికి అంగీకరిస్తుంది. కాని కనకాంగిపట్ల అనురక్తుడైన యువరాజు వివాహాన్ని వ్యతిరేకిస్తాడు. అయితే మంత్రి గంగన్న (ముక్కామల) కుయుక్తివలన రాజరాజు చిత్రాంగిని (కత్తికి మాలవేయించి) వివాహం చేసుకుంటాడు. జరిగిన మోసం తెలుసుకున్న చిత్రాంగి, వ్రతం పేరుతో రాజరాజును దూరంగావుంచి చెలికత్తె మల్లిక (సురభి బాలసరస్వతి) సాయంతో పావురాల ఆట ద్వారా సారంగధరుని తన భవనానికి రప్పించి తన ప్రేమను వెల్లడిస్తుంది. తన తల్లివలెనే భావిస్తున్నానని సారంగధరుడు చెప్పి ఆమెను తిరస్కరిస్తాడు. భంగపాటుతో కోపానికి గురైన చిత్రాంగి, సారంగధరుడు తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని రాజరాజుకు చెబుతుంది. మహారాజు ఆగ్రహానికి గురై సారంగుని కాళ్లుచేతులు నరికించమని శిక్ష విధిస్తాడు. సుబుద్ధి సాయంతో నిజం తెలుసుకున్న రాజరాజు శిక్ష నిలుపుదల చేయమంటాడు. అయితే గంగన్న శిక్షను త్వరగా అమలుపర్చడంతో సారంగధరుడు మరణిస్తాడు. అదే సమయానికి అక్కడికొచ్చిన చిత్రాంగి ఆత్మత్యాగం చేసుకుంటుంది. తల్లి రత్నాంగి, ప్రియురాలు కనకాంగి, యువరాజుకై విలపిస్తుండగా ఓ సాధువు వచ్చి మంత్రజలంతో యువరాజును బతికిస్తాడు. కనకాంగిని వివాహం చేసుకున్న సారంగధరుడు వేంగి రాజ్య సింహాసనం అధిష్టించి, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో నన్నయభట్టుగా మిక్కిలినేని, పురోహితులుగా విశ్వనాథశాస్ర్తీ, సాధువుగా గౌరీపతిశాస్ర్తీ, కోయపిల్లగా ఇవి సరోజ నటించారు. కొందరు ప్రసిద్ధులు వ్రాసిన నాటకాల్లో సారంగధరుడు మరణించినట్టు వ్రాయగా, మరికొందరు తమ రచనలలో సాధువుచే సారంగధరుడు పునర్జీవుడైనట్టు చిత్రించారు. ఈ చిత్రంలోనూ రెండో రచననే ప్రామాణికంగా తీసుకున్నారు. సీనియర్ సముద్రాల రచనకు తగిన విధంగా సన్నివేశాలను రూపొందించి దర్శకులు ఆకట్టుకునేలా చిత్రీకరించారు. ఉదాహరణకు చిన్న పాత్ర అయినా నన్నయభట్టు వద్ద యువరాజు విద్యాభ్యాసం చూపటం, వారిని సభకు రప్పించి యువరాజును సంధికి పంపటం, మరోసారి యువరాజుతో వివాహానికి చిత్రాంగి చిత్రం చూపి గురువుగారి అభిప్రాయం మహారాజు అడగటంలాంటివి చిత్రంలో కనిపిస్తాయి. చిత్రాంగి అందం గురించి శ్లాఘించి, ఆమె నొసలు తీక్షణత స్ర్తికిగల పంతం, పట్టుదలను సూచిస్తాయని, రాబోయే పరిణామాలు సూచించటం ఓ ముఖ్యాంశం. సారంగధరుని శిక్షించినందుకు రాజరాజును నిందించి మహాభారత ఆంధ్రీకరణ చేయనని, మహారాజుకు అంకితమివ్వనని కోపించటం ఎంతో విపులంగా చిత్రీకరణ సాగించారు. మూలకథలో లేని అంశాలు.. కనకాంగి సారంగధరుల ప్రణయం; వారిరువురిపైనా ఓ యుగళ గీతాన్ని తోటలో ఆహ్లాదకరంగా చిత్రీకరించటం; చిత్రాంగితో సారంగధరునికి వివాహమేమోనని కనకాంగి సంశయం, యువరాజుపై అలక; యువరాజుతోనే కనకాంగి వివాహం నిశ్చయంకాగా ఆనంద గీతం; ఈ కథ రాజమహేంద్రవరానికి చెందినదిగా చెప్పటం; చివరలో చిత్రాంగి ఆత్మవిమర్శ చేసికొని సారంగధరుని శిక్షా స్థలికి వెళ్లి యువరాజుపై పడి విలపించటం; ఆ సమయానికి వచ్చి ఆమెను నిందించిన మహారాజుకు తన మనస్సు వెల్లడించి.. ఈ పాపాలకు కారణం రాజరాజేనని నిందించి ఆత్మహత్య చేసుకోవటం; రాజరాజును అంతం చేయబోయిన గంగన్నను సుబుద్ది కత్తివిసిరి వధించటం వంటివి ఎంతో వివరంగా, నిండుగా, ఉత్సుకత కలిగించేలా తీర్చిదిద్దారు. అంతేకాదు, మూలకథలోని అంశాలైన సారంగధరునికి పావురాల ఆట పట్ల మక్కువ, మిత్రులతో పందేలు చక్కని పద్యాలతో ఆకసాన పావురాల విన్యాసాలతో చూపటం; సారంగధరుడు, చిత్రాంగి మధ్య పద్య సంవాదాల; యువరాజు దృఢనిశ్చయం; మహారాజు యువరాజుకు శిక్ష విధించటం; పెళ్లి కుమారుని చేసిన రోజే యువరాజును ఖైదుచేయటం; పూలదండను గంగన్న విసిరివేయటం; మాండవ్యుని సాయంతో సుబుద్ధి మహారాజుకు నిజం వెల్లడించటం; శిక్ష ఆపటానికి వెళ్లిన సుబుద్ది గంగన్నచే గాయపడడం; సాధువు మంత్రజలంతో సారంగధరుడు జీవించటం ఎంతో విశదంగా అర్థవంతంగా, అలరించేలా సన్నివేశాలను రూపకల్పన చేసి చిత్రీకరణతో చక్కని అనుభూతులను వీక్షకులకందించి చిత్ర విజయానికి దోహదం చేశారు. ఈ సన్నివేశాలకు, భావావేశాలకు తగిన ప్రతిస్పందనలను మహానటులు యస్‌వి రంగారావు, యన్‌టి రామారావు, భానుమతి తమ నటనలో అలవోకగా ప్రదర్శించారు. సారంగధరునిగా యన్‌టిఆర్ చక్కని చిరునవ్వుతో శాంతం సహనం వంటివి ఎంతో ముచ్చటగా ప్రదర్శించారు. చివరి సన్నివేశంలో తల్లివద్ద దుఃఖం, నిజం వెల్లడిలో బాధ ఎంతో పరిణితితో ప్రకటించి మెప్పించారు. మిగిలిన వారందరూ పాత్రోచితంగా మెప్పించారు. సుబుద్దిగా చలం నటన ప్రత్యేకంగా నిలవటం ఓ విశేషాంశం. 1937లో చిత్రాంగిగా మెప్పించిన శాంతకుమారి, 1957లో రత్నాంగిగా ఆర్ధ్రతతో కూడిన నటన చూపి అలరించటం మరో విశేషంగా చెప్పుకోవాలి.
చేమకూరి వెంకటకవి రచించిన ‘సారంగధర ప్రబంధం’లోని కొన్ని పద్యాలు ఈ చిత్రంలో ఉపయోగించారు. -రాజిపుడూరలేడు (చలం, యన్‌టిఆర్, మిత్రులపై చిత్రీకరిస్తే, గానం మాధవపెద్ది చేశారు). భానుమతి, ఎన్‌టిఆర్‌లపై -అల్లన గాధిరాజసుతడల్మిని సంవాద పద్యాలు (గానం: భానుమతి, ఘంటసాల), -కావకరాజు చిత్తము (ఎన్‌టిఆర్‌పై చిత్రకరణ, గానం: ఘంటసాల), ఎన్‌టిఆర్‌పై మరో 2 పద్యాలు -జగమునాశీలము, -గగన సీమంతిని కంద హారములోన (గానం: ఘంటసాల, రచన: సముద్రాల సీనియర్) చిత్రీకరించారు. ఇక శాంతకుమారిపై భక్తిగీతం -జయజయ మంగళగౌరి (పి లీల), చిత్రాంగిపై -మనసేమో మాటలో, -ఓ నారాజా ఇటు చూడవోయి, -అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు (గానం: భానుమతి) గీతాలను చిత్రీకరించారు. మిగిలిన గీతాల్లో ఎన్‌టి రామారావు, రాజసులోచనలపై యుగళగీతం -అన్నానా భామిని ఏమని (గానం: ఘంటసాల, పి.లీల), రాజసులోచనపై -సాగేను బాలా ఈ సందెవేళ (గానం: జిక్కి), సురభి బాలసరస్వతి, రేలంగిలపై -ఓ చిన్నవాడా, ఓ చిన్నవాడా (గానం: స్వర్ణలత, పిఠాపురం), చిత్రాంగిని అత్తవారింటికి పంపినపుడు -పోయిరా మాయమ్మ (గానం: లీల, బృందం), అడవిలో రాజరాజు, గంగన్న, రాజభటుల ముందు కోయ బృంద గీతం -వనె్న చినె్న గువ్వా సన్నజాజి పువ్వా రావే (గానం: లీల, పిఠాపురం బృందం) ఉన్నాయి.
1937లో వచ్చిన సారంగధర చిత్రం వలెనే 1957లో వచ్చిన సారంగధర చిత్రం అఖండ విజయం సాధించింది. చిత్ర గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తూ మానసికోల్లాసం కలిగిస్తుండడం ఆనందించదగ్గ విషయం. మళ్లీ మరోసారి ఈ చిత్రాన్ని రూపొందించలేక పోవటమూ విశేషమే.

-సివిఆర్ మాణిక్యేశ్వరి