ఫ్లాష్ బ్యాక్ @ 50

పేదరాశి పెద్దమ్మకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నానికి చెందిన నిర్మాత పింజల సుబ్బారావు. 1957లో మద్రాస్‌కు వచ్చి కొన్ని చిత్రాల్లో నటించారు. తరువాత శ్రీ కృష్ణా ఫిలిమ్స్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా ‘రామాంజనేయ యుద్ధం’, ‘సతీ సుకన్య’ చిత్రాలకు పనిచేశారు. తరువాత వేస్ట్ ఫిల్మ్ కొనుగోలు, అమ్మకం వ్యాపారం నిర్వహించారు. సినీ నిర్మాణంపట్ల అభిరుచితో ఓ తమిళ చిత్రాన్నికొని, ‘రాజద్రోహి’గా డబ్బింగ్ చేశారు. 1966లో ఓ తమిళ చిత్రం ఆధారంగా తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘హంతకులొస్తున్నారు జాగ్రత్త’ నిర్మించారు. తరువాత ‘రణభేరి’ (1968), ‘పేదరాశి పెద్దమ్మకథ’ (1968), లక్ష్మీకటాక్షం (1970), సుగుణసుందరి కథ (1970), విక్రమార్క విజయం (1971), రౌడీలకు రౌడీలు (1971) వంటివి 25 చిత్రాలకు పైగా నిర్మించారు. కొన్ని చిత్రాలు పియస్‌ఆర్ బ్యానర్‌పై, కొన్ని తమ పిల్లల పేర్లమీద పియస్‌ఆర్ ఆనందలక్ష్మి, బాలాజీ పేర్లమీద రూపొందించారు.
‘రణభేరి’ చిత్రానికి దర్శకత్వం వహించిన గిడుతూరి సూర్యమే ‘పేదరాశి పెద్దమ్మ కథ’ చిత్రానికి సారథ్యం వహించారు.
కమ్యూనిజం, సాహిత్యం, లలిత కళలపట్ల అభిరుచిగల సూర్య, వివిధ నాట్యరీతులపై పరిశోధన చేశారు. రష్యాలో చిన్నారులకు నృత్య విద్య నేర్పుతూ, చలనచిత్ర నిర్మాణాన్ని అధ్యయనం చేసిన వీరు -తొలుత ‘సంగీత లక్ష్మి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. రణభేరి తరువాత పిఎస్‌ఆర్ పిక్చర్స్‌కి వీరు పనిచేసిన చిత్రం ‘పేదరాశి పెద్దమ్మ కథ’
చిత్ర ప్రారంభంలో ఆకాశాన చందమామలో పేదరాశి పెద్దమ్మ (నిర్మల) చిన్న పిల్లలకు చెప్పే నీతి కథతో మొదలవుతుంది. మాళవరాజు విజయసింహుడు (ప్రభాకరరెడ్డి), మహారాణి చంద్రావతి (ఉదయలక్ష్మి). సంతానం కోసం విలపిస్తూ పరమేశ్వరుని ప్రార్థిస్తారు. జంగమదేవరగా వచ్చిన ఈశ్వరుడు, జంట సంతాన ఫలాన్ని మహారాజుకు, మహామంత్రికి అందచేస్తాడు. మరోచోట ఆత్మత్యాగంతో దేవీ ప్రసన్నం పొంది మరణం లేని వరం కోరుకుంటాడు మాంత్రికుడు (రాజనాల). వరమిస్తూనే, నడవడిక సరిగా లేకుంటే మాళవ రాజకుమారుని చేతిలో మరణం తప్పదని దేవి హెచ్చరిస్తుంది. కాపాలికను ప్రయోగించి మహారాజు, మహారాణి, మహామంత్రిని కష్టాల పాల్జేసి, యువరాజును చంపించానన్న భ్రమలో ఉంటాడు మాంత్రికుడు. మహామంత్రి యుక్తి, త్యాగంతో యువరాజు విక్రముడు (కాంతారావు), మంత్రి కుమారుడు విద్యాపతి (రామకృష్ణ) పెరిగి, యుక్త వయస్కులై సకల విద్యలు అభ్యసిస్తారు. జంగమదేవర ఆశీస్సు, ఆదేశాలతో నాగలోకంలోని నాగమణి సాధించటానికి విక్రముడు, విద్యాపతి బయలుదేరతారు. పలు ప్రయాసలకోర్చి నాగమణిని సాధించుకుని తిరిగి వస్తారు. దాంతో మహారాణి చంద్రవతికి దృష్టి తెప్పించి, మహారాజును చెర విడిపిస్తారు. రుద్రసింహుని అంతం చేసి, విక్రముడు మాళవ రాజ్యాన్ని రక్షించుకుంటాడు. విద్యాపతి, మాలతి, విక్రముడు, మణిమాల, తల్లిదండ్రులతో కలయటం, పేదరాశి పెద్దమ్మ చంద్రునిలో నిలవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఎస్‌ఎం సంతానం ఈ కథను పలు ఆసక్తికర అంశాలతో పొందుపరిస్తే, దర్శకులు మరింత ఆసక్తికరంగా, అర్ధవంతంగా తీర్చిదిద్దారు. మాంత్రికుడు జటవల్లభుడు పంపిన కాపాలిక, కనకాంగి (రాజసులోచన)గా కుట్ర చేసి మహారాజును, మహారాణిని ఖైదు చేయించటం, రాకుమారుని పురిటిలో చంపించే ప్రయత్నంలో, అతని బదులు మంత్రి కవల పుత్రుల్లో ఒకరు బలికావటం లాంటి సన్నివేశాల చిత్రీకరణతో కథపై ఆసక్తిని పెంచారు. యుక్తవయస్కులైన విక్రముడు, విద్యాపతి.. తల్లికి చూపు తెప్పించటానికై నాగమణి కోసం యత్నించే సన్నివేశం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. మణి ప్రయత్నంలో విక్రముడు దేవకన్యను కలవటం, నాగలోకంలో నాగకన్య మణిమాల (కృష్ణకుమారి)తో ప్రణయం, పక్షిరాజుతో యుద్ధం, మణిమాలతో వివాహంలాంటి సన్నివేశాల పేర్పు స్క్రీన్‌ప్లే ప్రతిభను తేటతెల్లం చేస్తుంది. మణిమాలను భూలోకంలో మాంత్రికుడు జటవల్లభుడు చిలకగా మార్చి అపహరించటం, అలాగే పేదరాశి పెద్దమ్మ పెంపుడు కూతుళ్లు మాలతి (విజయలలిత), సంపెంగిలను విద్యాపతి కలుసుకోవటం, మాలతితో ప్రేమ, ఆమెకు మునిశాపం, పాడుబడిన గుడిలో గంధర్వ కన్య శాపవసాన వీణగామారగా, తన గంధర్వ గానం, వీణావాదనను ఆమె సోదరి నృత్యానికి ధీటుగా వాయించి విద్యాపతి శాప విమోచనం కలిగించటంలాంటి సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. కంకాళుడనే బేతాళుని ద్వారా మాంత్రికుడు మాలతిని గుహకు రప్పించుకోవటం, శాపంవల్ల ముసలిదానిగా మారిన మణిమాలను వశం చేసుకోయత్నించటం, మాలతి తెలివిగా ఆమెను అక్కడనుంచి తప్పించటం, దేవకన్య సాయంతో విక్రముడు, విద్యాపతి మాంత్రికుని గుహవద్దకు వచ్చి అతనితో పోరాటాలు అద్భుతం అనిపిస్తాయి. విక్రమునికి కలగబోయే కష్టాలు విద్యాపతికి తెలిసినా వాటిని వెల్లడిస్తే కలిగే దుష్ఫలితాల వల్ల ఆగిపోవడం, చివర్లో విక్రముని రక్షించి, కర్కోటకుని విషంబారినుంచి మణిమాల బిడ్డనుకాపాడి, విక్రముని ఒత్తిడి కారణంగా నిజం వెల్లడించి విద్యాపతి తల పగిలి మరణించటం సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. విద్యాపతి బ్రతకాలంటే విక్రముడే పసిబిడ్డను బలి ఇవ్వాలని దేవకన్య ద్వారా తెలుసుకుని బాలుని చంపబోవటం, పేదరాశి పెద్దమ్మ కత్తికి అడ్డంవెళ్లటం, అక్కడికే వచ్చిన రుద్రసింహుని, ప్రహస్తుని మాంత్రికుని.. విక్రముడు, విద్యాపతి, తమ బృందంతో అంతం చేయటం.. ఇలా పలు అంశాలను పద్ధతిగా తీర్చిదిద్ది, చిత్రీకరించి మెప్పించారు. ఓ జానపద చిత్రానికి కావాల్సిన సందర్భానుసార, సన్నివేశపరమైన భావయుక్త, బరువైన, సరసమైన సంభాణలను ఎంతో అర్థవంతంగా రచయత చిల్లర భావనారాయణ సమకూర్చి ఆకట్టుకున్నారు. వారిని ప్రత్యేకంగా అభినందించాలి. జానపద చిత్రంలో హిట్ పెయిర్‌గా పేరుపొందిన కాంతారావు (విక్రముడు), కృష్ణకుమారి (మణిమాల) అదేస్థాయి నటనను ఈ చిత్రంలోనూ ప్రదర్శించి అలరించారు. మరో కథానాయకుడు రామకృష్ణ తన పాత్రను పరిణితితో పోషించి గుర్తింపుపొందారు. వీరి సరసన విజయలలిత ధీటుగా మెప్పించటం విశేషం. నాగరాజుగా వల్లభనేని శివరాం, దేవకన్యగా సచ్చు, విక్రముని స్నేహితులు మేతల రాజుగా రామచంద్రరావు, కోతలరాజుగా బాలకృష్ణ, నాగలోకంలో మోదుకూరి సత్యం, గంధర్వ కన్యగా శ్రీవిద్య నటించారు.
వై శివయ్య వివిధ ఆయుధాలతో సమకూర్చిన -మాంత్రికుని గుహలో విక్రమునికి పక్షిరాజుకు.. విద్యాపతికి, సైనికులకు.. రుద్రసింహునికి విక్రమునికి పోరాటాలు.. క్లైమాక్స్‌లో సాహస ఘట్టాలు ఎంతో వివరంగా వైవిధ్యంగా సాగి ఆకట్టుకున్నాయి.
ఎస్‌పి కోదండపాణి తన సంగీతానుభవంతో చిత్ర గీతాలతో అలరించారు. తొలుత రాజసులోచన (కనకాంగిగా) ప్రభాకర్‌రెడ్డితో తోటలో పాడే శృంగార గీతం -గులాబి బుగ్గలున్న వనె్నలాడి నేనే (రచన: సినారె, గానం: యల్‌ఆర్ ఈశ్వరి). దేవకన్యలు జలకాలాడుతుంటే, కాంతారావు సచ్చుల రియాక్షన్‌తో సాగే మరో గీతం -ఓ జలకాల లోన పులకించి పోనా (గానం: పి సుశీల, రచన: సినారె) అలరించేలా సాగుతుంది. కాంతారావు, కృష్ణకుమారిని వర్ణిస్తూ నాగలోకంలో ఘంటసాల బృందం ఆలాపనతో సాగే హుషారు గీతం -ఓ కులుకు నడకల చినదానా (రచన: శ్రీశీ), భూలోక అందాలను వీక్షిస్తూ కాంతారావు కృష్ణకుమారిలపై చిత్రీకరించిన మరో ప్రణయ గీతం -ఇదియే అందాల మానవసీమ (గానం: ఘంటసాల, పి సుశీల, రచన: ఆరుద్ర). విజయలలిత, రామకృష్ణలపై చిత్రీకరించిన మధుర గీతం -ఓహో హో జవరాలా/ నా సుమమాల (గానం: ఎస్పీ బాలు, ఎస్ జానకి, రచన: జి విజయరత్నం). జూ. భానుమతి, రామచంద్రరావు, బాలకృష్ణలపై చిత్రీకరించిన హాస్య గీతం -వీరులమంటే వీరులం (గానం: పిఠాపురం, మాధవపెద్ది, కౌసల్య, రచన: కొసరాజు). ఈ చిత్రంలోని మరో శ్రావ్యమైన, మధుర గీతం -శివమనోరంజని వరపాణి/ స్వరరాణి (గానం: ఎం బాలమురళీకృష్ణ, రచన: చిల్లర భావనారాయణ). రామకృష్ణ, శ్రీవిద్యలపై చిత్రీకరించారు. వీణాగానం, నృత్య భంగిమలు చూపుతూ వైవిధ్యంగా సాగుతుంది. చిత్రీకరణలో ప్రత్యేక గీతంగా, రచన, స్వర, లయబద్ధ నృత్య విశేషాలతో నిలవటం హర్షణీయం. ఈ చిత్రంలో మరో అంశం జంగమదేవర తనకూ, విక్రమునికి మహిమగల ఉంగరాలిచ్చినా, విద్యాపతి దానిని ఉపయోగించటం, విక్రముడు దాన్నికాక దేవకన్య (సచ్చు) ఇచ్చిన ఉంగరం ఉపయోగించటం, దాని సాయంతో వివరాలు గ్రహించటం ఓ తమాషా అంశంగా పరిగణించాలి.
‘పేదరాశి పెద్దమ్మ కథ’ చిత్రం పిల్లలకు వినోదాన్ని (్భతాలు మనిషి రూపంలో బాలకృష్ణ, రామచంద్రరావు వేళ్లు తినటంవంటివి, అస్థిపంజరం, మాంత్రికుని గుహలో అశ్వని పిశాచం) పంచగా, పెద్దలకు ఓ కాలక్షేప చిత్రంగా చక్కని గీతాలతో అలరించేదిగా నిలవటం ఆనందదాయకం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి