ఫ్లాష్ బ్యాక్ @ 50

బాటసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ బెంగాలి రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ 1907లో రచించిన నవల ‘బడా దీది’. బెంగాలి మ్యాగ్‌జైన్ భారతిలో సీరియల్‌గా ప్రచురితమైంది. ఈ నవలను రెండుమార్లు బెంగాలీలో సినిమాగానూ రూపొందించారు. తొలుత 1939లో ‘న్యూ థియేటర్స్’ వారు అమర్‌మాలిక్ దర్శకత్వంలో చిత్రం చేస్తే, దర్శకుడు, సినిమాట్రోగ్రాఫర్ అయిన అజయ్‌కారన్, ఉత్తమకుమార్, సంధ్యారాణిల కాంబినేషన్‌లో 1957లో రెండోసారి చిత్రంగా రూపొందింది. తెలుగులో భరణి సంస్థ అధినేత, దర్శకులు పి రామకృష్ణ తమ భరణి పతాకంపై ‘బాటసారి’గా రూపొందించారు. అక్కినేని, భానుమతీ రామకృష్ణ కాంబినేషన్‌లో నిర్మించిన ఈ చిత్రం 1961 జూన్ 30న విడుదలైంది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం -తమిళ వెర్షన్ కాణల్ నీర్ 1961 జూలై 21న విడుదలైంది.
మాటలు, పాటలు: సముద్రాల (సీనియర్), సంగీతం: మాస్టర్ వేణు, ఛాయాగ్రహణం: వి వెంకట్, కళ: ప్రసాదరావు, నృత్యం: గోపాలకృష్ణన్, ఎడిటింగ్: ఎం సుందరం, నిర్మాత, దర్శకుడు: రామకృష్ణ.
జమీందారు (రామన్న పంతులు) కుమారుడు సురేంద్రనాథ్ (అక్కినేని). మంచి మనసుగల సవతి తల్లి (సూర్యాకాంతం). సురేన్ ఎంఏ మేథమెటిక్స్ చదివాడు. ఇంగ్లాండు వెళ్ళి పై చదువులు చదవాలనుకుంటాడు. కాని అమాయకుడు, తనకేంకావాలో తెలిసికోలేని వ్యక్తి అయిన సురేన్ అన్య దేశంలో ఇబ్బందులు పడతాడని, వెళ్లొద్దని వారిస్తుంది పినతల్లి. దాంతో మనసు కష్టపెట్టుకున్న సురేంద్ర ఇల్లొదిలి మద్రాసు వెళ్తాడు. అక్కడ శ్రీమంతుడైన బిఆర్ పంతులు (అప్పారావు) చిన్న కూతురు ప్రమీలకు ట్యూషన్ మాస్టారుగా కుదురుతాడు. వారి పెద్దమ్మాయి మాధవి బాల వితంతువు (్భనుమతి), వారి కుమారుడు శివచంద్ర (రమణమూర్తి). సురేన్ బాగోగులు కనిపెట్టి, ఆ ఇంటి అజమాయిషీ చేసే మాధవిపట్ల సురేన్, సురేన్ పట్ల మాధవికి అభిమానం, అనురాగం కలుగుతాయి. కానీ వారిరువురూ దానిని గుర్తించరు. మాధవి స్నేహితురాలు మనోరమ (దేవిక) సూచనప్రాయంగా మాధవిని హెచ్చరిస్తుంది. ఇంటి పనివారిలో వచ్చిన మార్పులచేత మాధవి, సురేంద్రను కొద్దిగా మందలించగా, అతడు బాధతో ఇల్లొదిలి వెళ్ళిపోయి, యాక్సిడెంటుకు గురవుతాడు. తండ్రి వచ్చి అతన్ని ఇంటికి తీసుకెళ్తాడు. అదే సమయంలో సురేంద్ర తాతగారు మరణిస్తారు. దీంతో సురేంద్రకు శాంత (షావుకారు జానకి)తో వివాహం జరిపించి, తాతగారి జమీందారి వ్యవహారాలు చూడడానికి వారి ఊరిలోనే ఉంచి వెళ్తాడు తండ్రి. మాధవిని మరచిపోలేక, యాక్సిడెంటులో రొమ్ముకు తగిలిన గాయం కారణంగా భార్యను ఆదరించలేక సతమతమైన సురేంద్రకు గుండెనొప్పి ఎక్కువవుతుంది. సురేన్ జమీలోని మేనేజర్ ఆళ్వారు (లింగమూర్తి) కారణంగా మాధవికి చెందిన ఇల్లు వేలం వేస్తారు. అది ఆపాలని వచ్చిన మాధవి, ఆ పని సురేంద్ర జమీందారు చేశారని తెలిసి అతన్ని కలవకుండా వెళ్లిపోతుంది. ఈ సంగతి తెలుసుకున్న సురేంద్ర, భార్య వారింపును లెక్కచేయక గుర్రంపై బయలుదేరి వెళ్ళి మాధవిని కలుసుకొని, ఆ ఉద్వేగంలో ఆమె ఒడిలోనే మరణిస్తాడు. మాధవి, అతనికై విలపించటంతో చిత్రం ముగుస్తుంది.
ప్రమీలగా బేబీ శశికళ, మాధవి ఇంట నౌకరుగా అంజయ్య (బొడ్డపాటి), పూర్ణ (్ఛయాదేవి) వదినగా మోహన, సురేశ్ జమీలో మాధవి గ్రామానికి చెందిన వ్యక్తి పుల్లయ్యగా వంగర, నృత్య తారలుగా యల్ విజయలక్ష్మి, లక్ష్మీరాజ్యం నటించారు.
దర్శకులు రామకృష్ణ వివేచన, ఆర్ద్రత, రసానుభూతి వంటి అంశాలను మేళవించి సన్నివేశాలను సున్నితంగా, విశే్లషణాత్మకంగా, ఆకట్టుకునేలా రూపొందించారు. ఇంగ్లండుకు వెళ్లొద్దన్నందుకు ఇల్లొదిలి సురేంద్ర వెళ్ళటం, మద్రాస్‌లో అప్పారావు ఇంట ఆశ్రయం, కళ్లజోడు అద్దం విరిగిపోతే ప్రమీలే అక్కతో చెప్పి కళ్ళజోడు ఇప్పించటం, ఏ అనుభూతి లేదనుకున్న మాధవి.. సురేంద్ర మంచితనం పట్ల స్పందన లాంటి సన్నివేశాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మాస్టారికీ, ఇంట్లో అందరికీ తెలిసిరావాలని మాధవి -మేనత్త ఇంటికి సాయానికి వెళ్ళటం, ప్రమీల ఉత్తరంతో తిరిగి రావటం, దానికి పనివాళ్లలో మార్పు గమనించి సురేంద్రను ప్రమీల చదువు గురించి వాకబు చేయటంతో.. తిరిగి సురేంద్ర ఇల్లొదిలి వెళ్తూ కళ్ళజోడు వదిలివేయటంలాంటి సన్నివేశాలు కథలో లీనమయ్యేలా చేస్తాయి. అయిష్టంగా వివాహం చేసుకున్న సురేంద్ర తన భార్య పట్ల పరాకు, దానిగూర్చి భార్య శాంతకు వివరణ ఈయటంలాంటి సన్నివేశాలు కథాగమనానికి బలాన్నిచ్చాయి. భర్త అనారోగ్యం తెలిసి శాంత వైద్యం కోసం మద్రాస్ వెళ్దామంటే, తన మనసులోని ‘మాధవి’ పట్ల ఆరాధన వివరించటం. ఆమెను చూస్తే తాను తట్టుకోలేననటం.. మరోసారి భార్యను మద్రాస్ వెళ్లి మాధవిని ఇక్కడకు తీసుకురమ్మని సురేన్ కోరటం, దానిని శాంత సున్నితంగా తిరస్కరించటంలాంటి సన్నివేశాలు గుండెను బరువెక్కిస్తాయి. మాధవి కోసం భర్త బయలుదేరగా, అమ్మవారిని ప్రార్థిస్తూ శాంత మరణించటం కంట తడి పెట్టిస్తుంది. క్లైమాక్స్ బలంగా ఉండటం కోసం గుర్రంపై ఆవేశపడుతూ బాధతో సురేంద్ర పయనించే సన్నివేశాన్ని డిజైన్ చేశారు. నదిలో పడవపై మాధవిని చూసి గుర్రం పైనుంచి పడి దొర్లిన సురేంద్ర.. కళ్ళజోడు వెతుక్కుని పెట్టుకొని ‘మాధవి, మాధవీ’ అంటూ గట్టు పైనుంచి ఆమె ఒడిచేరే వరకూ 28సార్లు పిలవటంలో ఆర్ద్రత కనిపిస్తుంది. ఆమె ఒడిచేరిన సమయంలో.. బ్రతుకంతా సుఖాలు నోచుకోక, ఎండమావుల వెంటాడే బాటసారులం (ఈ చిత్రానికి తొలుత ఎండమావులు టైటిల్ అనుకున్నారుట దర్శకులు) లాంటి బలమైన, భావగర్భితమైన సంభాషణలతో సముద్రాల (సీనియర్) సన్నివేశాలకు పుష్టి కలిగించారు. రసస్పందన కలిగిన వ్యక్తుల జీవితాలకు దర్పణంగా నిలపటం విశేషం.
అక్కినేని నాగేశ్వరరావు కత్తిమీద సామువంటి సురేంద్ర పాత్రను ఎంతో నిబద్ధతతో, అతిశయం లేని సహజసిద్ధమైన, సరళమైన రీతిలో అద్భుతంగా ఆవిష్కరించారు. ట్రాజెడీ పాత్రల పోషణలో (లైలా మజ్ను, దేవదాసు) పేరుపడిన వ్యక్తే అయినా, ఇది మరింత విభిన్నం కావటం, దానికి వారు పరిపూర్ణత కలిగించటం అక్కినేనికే చెల్లింది. అంతేకాక ఆయన నటించిన చిత్రాలలో ‘బాటసారి’లోని సురేంద్రనాథ్ పాత్ర తనకెంతో ఇష్టమైనదిగా పలుసార్లు చెప్పుకున్నారు. ఒక నటునిలోని ప్రతిభను వెలికితీసే ఇటువంటి పాత్రలు ఏ నటుడికైనా సవాలే. దాన్ని విజయవంతంగా నిర్వహించిన అక్కినేని నట వైదుష్య వైచిత్రికి జోతలర్పించాల్సిందే.
డామినేటింగ్ నేచర్ స్వభావసిద్ధమైన నటీమణి భానుమతి రామకృష్ణ ఈ చిత్రంలో దానికి వైవిధ్యంగా మాధవిగా ఎంతో ఉన్నతమైన, సహజమైన నటనతో మెప్పించారు. మధ్యలో సన్నని చిరునవ్వు, చెల్లి ప్రమీలను కట్టడి చేయటంలో చిరుమందలింపు, మనోరమకు ఉత్తరం వ్రాయటంలో, తిరిగి ఆమెతో, తండ్రితో తన మనఃసంఘర్షణ తెలియచేయటం, అన్నగారివద్ద శెలవు తీసికొని అత్తావారి వూరు వెళ్లి, చివర సురేంద్రను కలుసుకునే సన్నివేశాల్లో మాధవి పాత్రలోని మరో కోణాన్ని భానుమతి ఆవిష్కరింపచేశారు. అద్భుతమైన నట కౌశలాన్ని భానుమతీ రామకృష్ణ ప్రదర్శించారని అనవచ్చు.
ఈ చిత్రంలో సురేంద్ర సతీమణి శాంతగా షావుకారు జానకి భర్త మనసెరిగిన ఇల్లాలిగా కనిపిస్తుంది. తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ, భర్త క్షేమం కోసం తపిస్తూ, ‘కథ వ్యధగా ముగిసేనా’ అని అమ్మవారిని ప్రార్థిస్తూ, విగత జీవికావటంలాంటి సన్నివేశాల్లో ఆ పాత్ర ప్రత్యేకతను జానకి తన నటనలో ఆవిష్కరించి మెప్పించారు. మిగిలిన పాత్రధారులు పాత్రోచితంగా నటించారు. ఈ చిత్రంలో సీనియర్ సముద్రాల నాలుగు పాటలు వ్రాసారు. మిగిలిన 3 పాటలు ఆయన కుమారుడు జూనియర్ సముద్రాల వ్రాసారు. దేవిక, భానుమతిలపై తోటలో చిత్రీకరించిన గీతం -కనులకు దోచి చేతికందని ఎండమావులున్నాయి (గానం: జిక్కి, భానుమతి, రచన: సీనియర్ సముద్రాల). బేబీ శశికళను ఉద్దేశించి భానుమతి పాడే గీతం (ఈ పాటకు గదిలో అక్కినేని స్పందించటంగా చిత్రీకరించారు) -లోక మెరుగనీ బాలా (గానం: భానుమతి, రచన: సీనియర్ సముద్రాల). మాధవి, సురేంద్రల గురించి పనివారు పలికిన నిందలకు ఆవేదనతో మాధవి ఆలపించే ఆవేదనా గీతం -కనేరా కామాంధులై/ మనేరా ఉన్మాదులై (గానం: భానుమతి, రచన: సీ.సముద్రాల). ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ మాధవి సురేంద్రను ఉద్దేశించి పాడుతుంది. భానుమతి ఇంట్లో, రైలులో అక్కినేనిలపై చిత్రీకరణ -ఓ బాటసారీ నను మరువకోరుూ (గానం: భానుమతి, రచన: సముద్రాల సీనియర్). అక్కినేని, లింగమూర్తి, లక్ష్మీరాజ్యంపై చిత్రీకరించిన గీతం -ఓ మహరాజా సొగసు (రచన: సముద్రాల జూనియర్). అక్కినేని, లింగమూర్తిలపై యల్ విజయలక్ష్మి నృత్యంతో మరో గీతం -వౌనములు చాలురా మది (గానం: పి సుశీల, రచన: సముద్రాల జూనియర్). షావుకారు జానకి అమ్మవారి గుడిలో పాడుతుంటే, గుర్రంపై అక్కినేని వెళ్తున్నట్టు చిత్రీకరణ -శరణము నీవే దేవీ కరుణా నాపై చూపవే (రచన: సముద్రాల జూనియర్, గానం: పి సుశీల).
‘బాటసారి’ ఓ విషాదాంశ చిత్రమే అయినా.. కథ, అందులోని సన్నివేశాలు, చిత్ర గీతాలను ఆకట్టుకునేలా రూపొందించారు. దీంతో ఆర్థిక విజయంతో సంబంధం లేకుండా మానసిక ఆనందం, స్పందనలు కలిగించే చిత్రంగా గుర్తింపు పొందింది. బాటసారి ఓ ప్రత్యేకత కలిగిన చిత్రంగా భావించాలి.

సీవీఆర్ మాణిక్యేశ్వరి