ఫ్లాష్ బ్యాక్ @ 50

లక్ష్మీనివాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా జిల్లా ఊడ్పుగల్లులో 14-06-1922న జన్మించారు వీరమాచినేని మధుసూధనరావు. ప్రముఖ దర్శకులు యల్.వి.ప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు వంటి వారివద్ద సినిమాకు సంబంధించిన పలు అంశాలను అభ్యసించారు. ‘సతీ తులసి’(1959) పౌరాణిక చిత్రంతో దర్శకునిగా తొలి ప్రయత్నం మొదలుపెట్టారు. నాటినుంచి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అధిక శాతం చిత్రాలు ఘన విజయం సాధించటంతో పరిశ్రమ, పత్రికలు విక్టరీ బిరుదునిచ్చాయి. దాంతో విక్టరీ (వీరమాచినేని) మధుసూధనరావు వీరి ఇంటి పేరుగా మారిపోయింది. వీరి దర్శకత్వంలో గొప్ప అభిరుచిగల నిర్మాత టి.గోవిందరాజన్, 1968లో వీనస్ అండ్ పద్మినీ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన చిత్రం ‘లక్ష్మీనివాసం’.
(టి.గోవిందరాజన్ మద్రాస్‌కు చెందిన వ్యక్తి. తన స్నేహితులతో కలిసి వీనస్ బేనర్‌పై 50పైగా చిత్రాలు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో నిర్మించారు. ‘ఎన్నఅమ్మన్’ (ఎం.జి.ఆర్), పాతాళభూతం (జయశంకర్, కె.ఆర్.విజయ) కల్యాణ సరసు (జెమినీ గణేషన్) నజరానా (రాజ్‌కపూర్) సాధీ (రాజేంద్రకుమార్) పవిత్రబంధం, సుమంగళి, మంచివాడు (ఎ.ఎన్.ఆర్) మణిరత్నంతో ‘‘పల్లవి అనుపల్లవి’’దాకా పలు చిత్రాలు రూపొందించారు. వీరి సతీమణి ఎ.పట్టమ్మాళ్ (నటి టి.ఏ.మధురు సోదరి) ఇద్దరు కుమారులు.)
‘లక్ష్మీనివాసం’ చిత్రానికి రచన- ఆరుద్ర- సంగీతం- కె.వి.మహదేవన్, స్టంట్స్- కృష్ణారావు, నృత్యం-ఎం.సుందరం, దర్శకత్వం- వి.మధుసూధనరావు, నిర్మాత- టి.గోవిందరాజన్.
ఈ చిత్రం 19-07-1968 విడుదల.
షావుకారు సుబ్బయ్య (ఎస్.వి.రంగారావు) వెంకటేశ్వర సుప్రభాతంతో పూజ ముగించి, భార్య శారద (అంజలిదేవి)ను పిల్లలు చంద్రం, రాజు, కల్పనలను పిలవటం, వారు దానికి స్పందించక, ఎవరి పనులపైవారు బయటకు వెళ్ళిపోవడం వారిపై చిత్రం టైటిల్స్ ప్రారంభం అవుతాయి. చిన్నతనం నుంచి సుబ్బయ్య కష్టపడి పనిచేసి లక్షాధికారిగా, పారిశ్రామికవేత్తగా ఎదిగారు. కాని భార్య మహిళా సంఘంలో అని ఫ్యాషన్‌కోసం బట్టల దుకాణాలు తిరిగి కాలం, ధనం వృథా చేస్తుంటుంది. ఆమెకు సంసారం, పిల్లల గొడవ పట్టదు. భర్త చెప్పినా లక్ష్యపెట్టదు. ఇక పెద్దకొడుకు చంద్రశేఖర్ (కృష్ణ) బి.కామ్ చదివినా, స్నేహితులతో జల్సాగా కాలంగడుపుతూ, తండ్రి ఇచ్చిన డబ్బును వృథా చేస్తుంటాడు. చిన్నవాడు రాజశేఖర్ (పద్మనాభం) నాటకాల పిచ్చితో, అప్పులుచేసి, నాటకాలు ఆడుతుంటాడు. కూతురు కల్పన (్భరతి) అహంభావి, పేదవాడు, మోసగాడు అయిన గిరి (రాంమోహన్) నయవంచనకు నమ్మి అతన్ని ప్రేమిస్తుంది. సుబ్బయ్య స్నేహితుడు గోపాలం (నాగయ్య) మరొక వ్యాపారవేత్త. వారి పిల్లలు ఆనంద్ (శోభన్‌బాబు), ఆశ (వాణిశ్రీ) బుద్ధిమంతులు. పిల్లలను దారిలోపెట్టాలని సుబ్బయ్య గోపాలంతో కలిసి ప్లానువేసి, వ్యాపారంలో 16 లక్షలు నష్టంవచ్చిందని చెప్పి 1 లక్ష మిగిలిందని దాన్ని ముగ్గురు పిల్లలకు పంచి యిచ్చి భార్యతో తిరిగి ఓ పల్లెటూరు చేరి, కట్టెలుకొట్టుకోవటంతో మొదలుపెట్టి, తిరిగి భాగ్యవంతుడౌతాడు. చంద్రం, రాజు, వ్యాపారంలో ఒకరు, నాటకాల్లో ఒకరు డబ్బు పోగొట్టుకుంటారు. కల్పన నగలు, డబ్బు గిరి దొంగిలించబోగా, ఆనంద్ వాటిని, కల్పనను కాపాడి, ఆమెలో మార్పు తెస్తాడు. ఆషావల్ల చంద్రం మోసపోయానని అనుకున్నా, ఆమె వలననే డబ్బు నిలుస్తుంది. రాజు మాత్రం అంతకుముందు కనకదుర్గ (విజయలలిత) అనే యువతిని నటిగా చేర్చి, మోసం చేయటంతో ఆమె బిడ్డకు తల్లవుతుంది. పిల్లలు ముగ్గురు, గోపాలంవల్ల తాము నష్టపోయామని, చివరకు తండ్రికి చెప్పటం శారద, చంద్రంను లెంపకాయ కొట్టి నిజం చెప్పటంతో అందరికీ కనువిప్పు కలిగి, వారు గోపాలంను, తండ్రిని క్షమించమని కోరటంతోనూ, కనకదుర్గను రాజు స్వీకరించటం, చంద్రం, ఆశా, ఆనంద్, కల్పన వివాహలతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో పద్మనాభం, అసిస్టెంటు కవిరాజుగా రావికొండలరావు, బొందం రామచంద్రరావు, సీతారాం, కృష్ణ స్నేహితులుగా సారధి, చిడతల అప్పారావు, ఇంకా మోహన్, అతిథి నటిగా తిలకం, వంటవానిగా చదలవాడ, ఇంకా డా.రమేష్, బొడ్డపాటి, మద్దాలి కృష్ణమూర్తి నటించారు.
దర్శకులు వి.మధుసూధనరావు సన్నివేశాలను అర్ధవంతంగా రూపొందించారు. ‘కాలంవిలువ, పని విలువ, ధనం విలువ’ ఈ మూడు ప్రతి వ్యక్తికి ఎంత ముఖ్యమో ఇంటి పెద్ద సుబ్బయ్య పాత్ర చేత, గోపాలం చేత, పదే పదే చెప్పించటం. చంద్రం స్నేహితులతో 500రూ. ఖర్చు అన్నచోట 5000 రూ.లు విసిరి పంచటం, దాన్ని సింబాలిక్‌గా ‘ఒక వ్యక్తి కుక్కకు బిస్కట్లువేయడం’ చూపటం. ‘‘శారద పనిమనిషికి రూపాయి విసిరి కొట్టడం,’’ ఆమె లక్ష్మీదేవిని విసిరికొడితే నిలవనంటుంది. కళ్ళకద్దుకుంటే కలకాలం వుంటానంటుంది అని చెప్పించటం. మేనక, విశ్వామిత్రుల నాటకంలో రాజు విశ్వామిత్రునిగా చెప్పిన డైలాగులు, గర్భవతిని అన్న కనకదుర్గకు చెప్పి ‘కని పెంచడం ఆడదాని వంతు’ కలిగించటం మగవాని వంతు అని తప్పించుకోవటం. దీనులను ఉద్ధరిస్తాననే మహిళామండలి, ఒంటరి స్ర్తి గర్భవతిని ఆదుకోకపోవడం ధనవంతురాలు, గర్విష్టి అయిన కల్పన, ప్రేమించిన వాడితో, హద్దులు మీరకుండా, తగుజాగ్రత్తగా అతన్ని దూరం వుంచటం, కనె్నపిల్లలకు ఓ హెచ్చరికగా ‘‘ఖర్చు మనిషని పిల్లలు తల్లిని దూరం పెట్టినా, కట్టుకున్న భర్త నేను నీకున్నాను అంటూ, తిరిగి స్వయంశక్తితో ఎలా బ్రతకాలో నిరూపించటం.’’ ఇక ‘్ధనమేరా అన్నింటికీ మూలం’ గీతంలో, రచయిత వ్రాసిన ‘‘కూలివాని చెమటలో పాలికాపు కండల్లో ధనమున్నదిరా’’, శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం’అని టైటిల్ జస్ట్ఫికేషన్. చరణం మొదట యస్.వి.రంగారావు, కట్టెలుకొడుతూ ఆపైన కూలివాడు రాళ్ళు బద్దలుకొట్టడం, రైతులు సేద్యంచేయటం చూపటం ఎంతో అర్ధవంతంగా, చిత్రీకరణ, కల్పన గిరివల్ల మోసపోయినపుడు ‘‘నస్ర్తి స్వాతంత్య్రమర్హతి’’ శ్లోకం బ్యాక్‌గ్రౌండ్‌లో విన్పించడం, ఆనంద్‌చేత, ఒక స్ర్తి ఎలా మరణించాలో, చిత్రాల్లో చూపించటం, కల్పన జీవితంలో మార్పును ‘‘ఇలకోవెల చల్లని వలపే దేవత’’ పాటలో, ఆకట్టుకునేలా చిత్రీకరించటం. ఒక చక్కని కుటుంబ కథాచిత్రాన్ని జనరంజకంగా తీర్చిదిద్దారు.
నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు, సన్నివేశాలను తమ నటనతో మెప్పించారు. ఎస్.వి.రంగారావు పరిస్థితులకనుగుణమైన గంభీరమైన, హృద్యమైన నటనతో, ఆ పాత్రకు జీవంపోశారు.
ఆరుద్ర రచనతో ఈ చిత్ర గీతాలు, కె.వి.మహదేవన్ స్వరాలలో ఆకట్టుకునేలా సాగాయి. చిత్రం ప్రారంభంలో ‘‘లక్ష్మీనివాస నిరవర్జ్యగుహైన్’’ (2మార్లు) శ్లోకం ‘‘్ధనమేరా అన్నింటికి మూలం’’ (యస్.వి.రంగారావుపై చిత్రీకరణ గానం- ఘంటసాల) భారతిపై ‘ఇల్లే కోవెల’ (గానం ఎస్.జానకి) వాణిశ్రీ క్లబ్‌లోచేసే నృత్యగీతం ‘‘గువ్వలాంటి చిన్నది’’ (గానం- పి.సుశీల) కృష్ణ, వాణిశ్రీలపై చిత్రీకరించిన యుగళ గీతం ‘‘ఓహో ఊరించే అమ్మాయి’’ (గానం-పి.బి.శ్రీనివాస్, పి.సుశీల) వారిరువురిపైనా మరో యుగళగీతం ‘చెరుూ్య, చెరుూ్య కలుపు చెంపా చెక్కిలి కలపు’’ (గానం పి.బి.శ్రీనివాస్, పి.సుశీల), భారతి, రాంమ్మోహన్‌లపై యుగళగీతం రాంమ్మోహన్ ఈలతో, భారతి పాట (నవ్వు, నవ్వించు ఆ నవ్వులు పండించు- పి.సుశీల గానం) పద్మనాభంపై చిత్రీకరించిన సోడా గొప్పతనం తెలిపే తమాషా గీతం ‘సోడా సోడా జిల్‌జిల్ సోడా’ (పిఠాపురం గానం) మాధవపెద్ది, పద్మనాభం పాడిన పద్యాలు ‘‘కాలేజి జీతమ్ము కట్టమంటే’’, ‘‘్ధనమేరా అన్నిటికి మూలం’ గీతం ఈ 50 సం.లుగా చిరస్మరణీయమైన గీతంగా నిలవటం. ‘లక్ష్మీనివాసం’ చిత్రాన్ని గుర్తుచేయటం దీనికి ఘంటసాలవారి అమృతగానం తోడుగా నిలిచి శ్రోతలను అలరించటం విశేషం.
‘‘లక్ష్మీనివాసం’’ చిత్రం ఓ చక్కని సందేశాత్మక చిత్రంగా మన్నన పొంది, విజయవంతంగా నిలిచింది. మంచి కుటుంబ కథాచిత్రాల పట్ల ప్రేక్షకుల స్పందనకు రుజువుగా నిరూపించబడింది.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి